breaking news
local representatives
-
ఎన్నికల హామీలు.. మేనిఫెస్టో అమలే హీరోయిజం: వైఎస్ జగన్
మన ప్రభుత్వ హయాంలో రెండేళ్లకు పైగా కోవిడ్‌తో ఇబ్బందులు ఎదురైనా సాకులు చెప్పలేదు. మేనిఫెస్టోలో చెప్పిన 99% హామీలను అమలు చేసి చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. కానీ, చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ హామీనీ అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. ⇒ మా పాలనలో ప్రతి ఇంటికీ మంచి చేశాం.. అది ప్రతి ఇంట్లో ఇంకా బతికే ఉంది ⇒ ఇవాళ్టికీ ప్రతి గడపకూ మా కార్యకర్తలు, నేతలు తలెత్తుకుని గర్వంగా వెళ్లగలరు.. ప్రజల ఆశీర్వాదం పొందగలరు ⇒ కోవిడ్ విపత్తులోనూ సాకులు వెతుక్కోకుండా ప్రతి హామీని నెరవేర్చాం.. ⇒ ప్రశ్నించే గొంతులను నొక్కేసేందుకే రెడ్‌బుక్ బెదిరింపులు.. జగన్ 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యంసాక్షి, అమరావతి: మహానాడు కార్యక్రమం ఒక పెద్ద డ్రామా అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. తెలుగు డ్రామా పార్టీ (టీడీపీ) కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడులో సీఎం చంద్రబాబు ఫోజులిస్తూ.. బిల్డప్ ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. హీరోయిజం అంటే.. కడప జిల్లాలో మహానాడు నిర్వహించడం కాదు..! హీరోయిజం అంటే.. ఇచ్చిన హామీలను నెరవేర్చడం అని చంద్రబాబుకు చురకలంటించారు. ‘‘సత్తా అంటే కడపలో మహానాడు నిర్వహించడం కాదు.. ఆ కార్యక్రమంలో జగన్‌ను తిట్టడం హీరోయిజం ఎలా అవుతుంది?’’ అని నిలదీశారు. ‘ఇదిగో మా మేనిఫెస్టో.. వీటిని నెరవేర్చామని రాష్ట్రంలో ఏ ఇంటికైనా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి ఆశీర్వాదం కోరే ధైర్యం ఉందా చంద్రబాబూ? గడప గడపకూ తిరిగే సాహసం చేయగలరా?’ అని సూటిగా ప్రశ్నించారు. ఇవాళ టీడీపీ నేతలు, కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా మాకు ఇవ్వాల్సిన తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పెన్షన్లు, అన్నదాతా సుఖీభవ, నిరుద్యోగ భృతి ఏమయ్యాయని చిన్న పిల్లలు, చిన్నమ్మలు, అత్తమ్మలు, రైతన్నలు, నిరుద్యోగులు నిలదీస్తారని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ హయాంలో కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ సాకులు వెతుక్కోకుండా చిత్తశుద్ధితో 99 శాతం హామీలను అమలు చేశామని గుర్తు చేశారు. ఇవాళ్టికీ తమ పార్టీ కార్యకర్తలకు రాష్ట్రంలో ఏ ఇంటికైనా వెళ్లి మేం వైఎస్సార్సీపీ వాళ్లం అని తలెత్తుకుని గర్వంగా చెప్పే ధైర్యం ఉందని స్పష్టం చేశారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట, అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీలు, కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు నగర పంచాయతీ, శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ మండలం వైఎస్సార్సీపీ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, జరుగుతున్న పరిమాణాలపై చర్చించి పార్టీని మరింతగా బలోపేతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏమన్నారంటే.. మనం చేసిన మంచి ప్రతి ఇంట్లోనూ బతికే ఉంది..ప్రజలకు మనం చేసిన మంచి ఎక్కడకూ పోలేదు. ప్రతి ఇంట్లోనూ మనం చేసిన మంచి బతికే ఉంది. ప్రజలకు మంచి చేశామన్న తృప్తి మనకు ఉంది. చంద్రబాబు పాలనకు, మన పాలనకు తేడా స్పష్టంగా కనిపిస్తోంది. రాత్రి తర్వాత పగలు రాక తప్పదు. రెండు ప్రభుత్వాల మధ్య తేడాను ఇప్పుడు ప్రజలు గమనిస్తున్నారు. చిన్న హామీలనూ ఎగ్గొట్టారు..చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని అమలు చేయడం లేదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ గాలికొదిలేశారు. 143 హామీలను పూర్తిగా పక్కన పెట్టారు. చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేయడం లేదు. కడపలో మహిళలు చంద్రబాబు ఎప్పుడు ఉచిత బస్సు అని చెబుతారా..! విశాఖ వెళ్లి వద్దామా..! అని ఎదురు చూస్తున్నారు. మరో చిన్న హామీ ఉచిత గ్యాస్. కనీసం ఆ గ్యాస్ సిలిండర్లు కూడా సరిగా ఇవ్వలేకపోయారు. రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నారు..ఈరోజు రాష్ట్రం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, కలియగ రాజకీయాలు ఎలా ఉన్నాయో సాక్షులుగా ఉన్న మీరే నా కన్నా బాగా చెబుతారు. రాజకీయాల్లో విలువలుండాలి. విశ్వసనీయతకు అర్ధం తెలుసుండాలి. అప్పుడే రాజకీయ వ్యవస్ధలో తులసి మొక్కలా నిలబడతాం. చంద్రబాబు తన పాలనలో రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు సహా అనేక పదవుల్లో ఉన్న ప్రజా ప్రతినిధులను చంద్రబాబు తనకు బలం లేకపోయినా, తన పార్టీ గుర్తు మీద గెలిపించుకునే పరిస్థితి లేకపోయినా.. వారంతా వేరే పార్టీ గుర్తు మీద గెలిచిన వ్యక్తులని తెలిసినా.. ముఖ్యమంత్రిగా తాను ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ఉందని తెలిసినా.. తానే దగ్గరుండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. రాష్ట్రంలో దౌర్భాగ్య పాలనకు ఇది నిదర్శనం.కోవిడ్ ఇబ్బందుల్లోనూ..అప్పుడు మన ప్రభుత్వం జూన్‌లో ప్రమాణ స్వీకారం చేస్తే.. కొద్ది నెలలకే మార్చి కల్లా కోవిడ్‌ను చూశాం. రాష్ట్ర చరిత్రలో అలాంటి విపత్తు ఎప్పుడూ చూడలేదు. రాష్ట్ర ఆదాయాలు తగ్గాయి. మరోవైపు అనుకోని ఖర్చులు పెరిగాయి. అన్ని రకాలుగా ఇబ్బందికర పరిస్థితులున్నా ఏ రోజూ సాకులు చెప్పలేదు. ప్రజలకు చేయాల్సిన మేలు చేయకుండా పక్కన పెట్టలేదు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాం. సీఎంవో మొదలు ప్రతి కార్యాలయంలోనూ హామీలను డిస్ప్లే చేశాం. ప్రతి రోజూ వాటిని అమలు చేసేలా చర్యలు తీసుకున్నాం. అలా మేనిఫెస్టోలో చెప్పిన వాటిలో 99 శాతం హామీలను అమలు చేసిన పాలన వైఎస్సార్సీపీ హయాంలోనే జరిగింది. పాలన ఎలా ఉండాలో చూపాం..అంత గొప్పగా ప్రజలకు మేలు చేశాం కాబట్టే అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేశాం. 86 నుంచి 88 శాతం స్ధానాలను మనమే గెలిచాం. దాదాపు 120 చోట్ల క్లీన్ స్వీప్ చేయగా తాడిపత్రి, దర్శి రెండు చోట్ల మాత్రమే మనకు తక్కువ వచ్చాయి. తాడిపత్రిలో వాళ్లకు 18, మనకు 16 రావడంతో మన ఎమ్మెల్యే వాళ్లను లాగుదామన్నారు. కానీ నేను స్వయంగా మన ఎమ్మెల్యేను హౌస్ అరెస్టు చేయించి అక్కడ ఎన్నిక సవ్యంగా జరిపించా. వైఎస్సార్ సీపీ హయాంలో అంతగా ప్రజాస్వామ్యానికి కట్టుబడ్డాం. ప్రజాస్వామ్యానికి పరిరక్షకులుగా ఉన్న ముఖ్యమంత్రి స్ధానంలో వ్యక్తి పాలన ఎలా చేయాలో చూపించాం. మీ అందరికీ హ్యాట్సాఫ్..ఇవాళ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న కుప్పం నుంచే చంద్రబాబు అరాచకాలు చేస్తూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిచోటా ఇదే చేయమని తన ఎమ్మెల్యేలను ప్రోత్సహిస్తున్నారు. ఇలాంటి చెడిపోయిన రాజకీయ వ్యవస్థలో.. విలువలు, విశ్వసనీయత అనే పదానికి అర్థం చెబుతూ మన పార్టీలో చిన్న పదవుల్లో ఉన్నవారైనా.. ఏకంగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు లాంటి వ్యక్తికి గట్టి గుణపాఠం నేర్పారు. రాజకీయాలంటే నీ మాదిరిగా కాదు.. మమ్మల్ని చూసి నేర్చుకో..! అని చంద్రబాబుకు గుణపాఠం చెప్పారు. అందుకు మీ అందరికీ నా హ్యాట్సాఫ్.విద్య, వైద్యం, వ్యవసాయం నిర్వీర్యం...⇒ ఈ ప్రభుత్వంలో వ్యవస్థలన్నీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయాయి. ప్రభుత్వ స్కూళ్లలో చదువులు అటకెక్కాయి. ఇంగ్లీషు మీడియం పడకేసింది. గోరుముద్ద నాసిరకంగా మారి తినలేని పరిస్థితిలో ఉంది. మూడో తరగతి నుంచి పిల్లలకు టోఫెల్ శిక్షణ ఇప్పిస్తూ ఒక పీరియడ్‌గా ఏర్పాటు చేస్తే వీళ్లు వస్తూనే దాన్ని ఎత్తేశారు. సీబీఎస్ఈ, నాడు–నేడు, 8వ తరగతి పిల్లలకు ట్యాబ్‌లు.. అన్నీ ఆగిపోయాయి. అమ్మ ఒడికి పంగనామాలు పెట్టారు. మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన లేదు. ఏడాది కావస్తోంది. పిల్లలకు ఇవ్వాల్సిన ఫీజులు సున్నా. మన హయాంలో క్రమం తప్పకుండా ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చాం. ఇవాళ ఫీజులు గురించి పట్టించుకునే నాథుడు లేడు. పిల్లలను చదివించలేక తల్లిదండ్రులు మానిపిస్తున్న దుస్థితి నెలకొంది. ⇒ ఆరోగ్యశ్రీని పూర్తిగా నిర్వీర్యం చేశారు. 1,000 ప్రొసీజర్లను మన హయాంలో 3,000కు తీసుకుని పోయి ఏకంగా రూ.25 లక్షల వరకు ఉచితంగా వైద్యం అందించాం. గ్రామాల్లో విలేజ్ క్లినిక్స్ ఏర్పాటు చేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ అందుబాటులోకి తెచ్చాం. గవర్నమెంట్ ఆస్పత్రుల్లో జీరో వేకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. అలాంటి పాలన మనం అందిస్తే.. ఇవాళ పేషెంట్లకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం అందని పరిస్థితి నెలకొంది. ప్రతి నెలా రూ.300 కోట్లు చొప్పున ఏడాదిగా దాదాపు రూ.3,600 కోట్లు బకాయిలు పెట్టారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ పేషెంట్లను చూడటం ఆపేశారు. ఇవాళ పేదలు వైద్యం కోసం అప్పుల పాలు అవుతున్నారు.⇒ ఇక రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. ఆర్బీకేలు, ఈ–క్రాపింగ్, ఉచిత పంటల బీమాను గాలికి వదిలేశారు. ఇన్పుట్ సబ్సిడీ కింద సీజన్ ముగిసేలోగా రైతులకు తోడుగా నిలిచి సాయం చేసే కార్యక్రమం నిలిచిపోయింది. ఏడాదిగా రైతు భరోసా ఎగ్గొట్టారు. ధాన్యం సహా ఏ పంటకూ కనీస మద్దతు ధరలు లభించడం లేదు. మన హయాంలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) మాత్రమే కాదు.. జీఎల్టీ రూపంలో ప్రతి ఎకరాకు రూ.10 వేలు అదనంగా రైతుకు వచ్చేది. మిరప, పత్తి, చీనీ, టమోటో, పొగాకు.. ఇలా ఏ పంట తీసుకున్నా ఇవాళ రైతులకు గిట్టుబాటు ధరలు రావడం లేదు. రైతుల కష్టం దళారీల పాలవుతోంది.వాళ్లు ఏ ఇంటికి వెళ్లినా నిలదీస్తారు..ఇవాళ టీడీపీ కార్యకర్తలు ఏ ఇంటికి వెళ్లినా వాళ్లు ఇచ్చిన మేనిఫెస్టోలు, బాండ్లు, కరపత్రాలు ఇప్పటికీ ఉన్నాయి. ప్రతి ఇంటికి వెళ్లి వీళ్లు చెప్పిన మాటలు ఇవాళ్టికీ ప్రజలకు గుర్తున్నాయి. అందుకే వాళ్లు ఏ ఇంటికైనా వెళ్లి ఆశీర్వదించమని కోరితే.. చిన్న పిల్లల నుంచి ప్రశ్నించడం మొదలవుతుంది. తల్లికి వందనం కింద ఇవ్వాల్సిన రూ.15 వేలు ఏమయ్యాయని పిల్లలు అడుగుతారు. అదే ఇంట్లో నుంచి వాళ్ల అమ్మ, చిన్నమ్మ వచ్చి ఆడబిడ్డ నిధి కింద నాకు ఇస్తామన్న రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నిస్తారు. 50 ఏళ్లకు పెన్షన్ అన్నావ్.. మరి మా రూ.48 వేల సంగతేంటని ఆ తల్లుల అమ్మలు, అత్తలు నిలదీస్తారు. కండువా కప్పుకున్న ప్రతి రైతూ ఎన్నికలప్పుడు మాకు అన్నదాతా సుఖీభవ కింద రూ.26 వేలు ఇస్తానన్నావ్.. వాటి సంగతేంటని ప్రశ్నిస్తారు. అదే ఇంట్లో నుంచి ఉద్యోగం కోసం వేచి చూస్తున్న 20 ఏళ్ల యువకుడు నిరుద్యోగ భృతి కింద నాకు ఇస్తానన్న రూ.36 వేలు పరిస్థితి ఏమిటని నిలదీస్తాడు.వడ్డీతో సహా చెల్లిస్తాం...మన హయాంలో నిర్వహించిన ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమం ద్వారా సమస్యలు చెప్పి ఎక్కువ పరిష్కారాలు పొందిన వాళ్లు టీడీపీ వారే! నాడు ఎమ్మెల్యేలు వద్దన్నా.. వారికి మనం మంచి చేశాం. స్పందనలో అత్యధికంగా ఫిర్యాదులు చేసిందీ వాళ్లే. కానీ ఈరోజు చంద్రబాబు అన్యాయాలు చేస్తున్నారు. దీనికి వడ్డీతో సహా చెల్లిస్తాం. అప్పుడే మరోసారి ఇలాంటి తప్పులు చేయడానికి భయపడతారు. రాష్ట్రం కూడా బాగు పడుతుంది.జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీటఈసారి జగన్ 2.0లో కార్యకర్తలకు అధిక ప్రాధాన్యం ఉంటుంది. నాడు మనం అధికారంలోకి వస్తూనే కోవిడ్ వచ్చింది. రెండేళ్లు పూర్తిగా ప్రజల ఆరోగ్యం, వారికి మంచి చేయడంపైనే దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది. ఈసారి జగన్ 2.0లో అలా ఉండదు. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం మాత్రమే కాదు.. కార్యకర్తలకూ ప్రాధాన్యం ఉంటుంది. కార్యకర్తలు అన్నింటికన్నా పైస్థాయిలో ఉంటారు. ఆ విధంగా వారి బాగోగులన్నీ చూసుకుంటాం.వారెక్కడున్నా చట్టం ముందు నిలబెడతాం..ఇప్పుడు మన పార్టీ కార్యకర్తల ప్రతి కష్టం, వారికి జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని గమనిస్తున్నా. మీ అందరికీ ఒకటే చెబుతున్నా. మనం ప్రతిపక్షంలో ఉన్నాం. వాళ్లు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు. అన్యాయం ఎవరు చేసినా.. మీకు ఇష్టం వచ్చిన పుస్తకంలో వారి పేర్లు రాసుకోండి. మనం వచ్చిన తర్వాత కచ్చితంగా వడ్డీతో సహా రిటర్న్ గిఫ్ట్‌లు ఇస్తాం. చేసిన వాళ్లే కాదు... వీళ్లతో కుట్రలు పన్నుతూ చేయించిన వారినీ వదిలిపెట్టం. వారు సప్త సముద్రాల అవతల ఉన్నా, రిటైర్ అయినా సరే తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం. అన్యాయాలు చేయడానికి వీరికి యూనిఫాం ఇవ్వలేదు. న్యాయంగా, ధర్మంగా విధులు నిర్వర్తించడానికే యూనిఫాం ఇచ్చారు. ప్రశ్నించే గొంతులు నొక్కేందుకే అక్రమ కేసులు..రాష్ట్రంలో లా ఆండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది. రెడ్‌బుక్ రాజ్యాంగం అమలవుతోంది. చంద్రబాబు పాలనా వైఫల్యాలు, అన్యాయాలను ప్రశ్నిస్తే చాలు.. ఆ గొంతు వినపడకుండా భయోత్పాతం సృష్టిస్తూ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. తప్పుడు కేసులు పెడుతున్నారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారు. పల్నాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయి. హత్యకు ఉపయోగించిన వాహనం ఎవరిదో తెలుసు. చంపిన వాళ్లు ఎవరో కూడా తెలుసు. టీడీపీలో గ్రూపు తగాదాలే దీనికి కారణమని ఎస్పీ స్వయంగా చెప్పారు. కానీ రెండు రోజుల తర్వాత మన పార్టీ ఇన్ఛార్జ్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి మీద అక్రమంగా కేసులు పెట్టారు. మరోవైపు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్టు చేసేందుకు ఏ మాత్రం బేస్‌లేని పాత కేసు బయటకు తీశారు. గతంలో ఇల్లీగల్ మైనింగ్ లేదని అధికారులు రిపోర్టు ఇస్తే అదే అధికారులతో తప్పుడు ఫిర్యాదు చేయించి, తప్పుడు సెక్షన్లతో కేసు పెట్టి అరెస్టు చేశారు. 2023లో టీడీపీ కార్యాలయం వద్ద చోటుచేసుకున్న ఘటన విషయంలో ఇప్పుడు 127వ ముద్దాయి కింద మంగళగిరి మాజీ ఎమ్మెల్యే ఆర్కే మీద కేసు పెట్టారు. ఇలా చట్టం, రాజ్యాంగం దారుణ ఉల్లంఘనకు గురవుతోంది. గతంలో జరిగిన ఘటనల్లో మనవాళ్లను ఇరికించి జైల్లో పెట్టే కార్యక్రమం రెడ్ బుక్ రాజ్యాంగంలో జరుగుతోంది.3 లక్షల ఉద్యోగాలు ఊడగొట్టారుఈ రోజు రాష్ట్రంలో ఏ వర్గమూ చంద్రబాబు ప్రభుత్వంపై సంతృప్తిగా లేదు. చంద్రబాబు ఏడాది పాలనలో ఒక్కటంటే ఒక్క ఉద్యోగమూ రాకపోగా ఉన్న వాటినే ఊడగొడుతున్నారు. చంద్రబాబు అధికారంలోకి వస్తూనే 2.6 లక్షల మంది వలంటీర్లు, 15 వేల మంది బెవరేజెస్ కార్పొరేషన్ ఉద్యోగులు, 9,800 రేషన్ వాహనాల (ఎండీయూ) మీద ఆధారపడ్డ 20 వేల మందితో కలిపి మొత్తంగా 3 లక్షల ఉద్యోగాలను ఊడగొట్టారు. మనం అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఉద్యోగస్తుల్లో విషం నింపి, ఇవాళ వారినీ మోసం చేశాడు. వారికి మధ్యంతర భృతి (ఐఆర్) ఇచ్చిన పాపాన పోలేదు. వేతనాల సవరణ (పీఆర్సీ) ప్రస్తావన లేదు. మూడు డీఏలు పెండింగ్. అందుకే ఇవాళ ఉద్యోగులు చంద్రబాబును ఎందుకు తెచ్చుకున్నామా అని తల పట్టుకుంటున్నారు.విచ్చలవిడిగా అవినీతిమరోవైపు ఈ ప్రభుత్వంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ఇసుక, మట్టి, లిక్కర్ మాఫియా, సిలికా, క్వార్జ్ట్ అక్రమ తవ్వకాలు, రాజధాని పనులు.. ఇలా దేన్నీ వదల కుండా దోచేస్తున్నారు. కొత్త కొత్త పద్ధతుల్లో స్కామ్‌లు చేస్తున్నారు. ఇలాంటివి మన హయాంలో లేవు కాబట్టే బటన్ నొక్కి ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)తో రూ.2.73 లక్షల కోట్లు ప్రజలకు పారదర్శకంగా అందించాం. ఆరోజు జగన్ చేశాడు... ఇప్పుడు చంద్రబాబు ఎందుకు చేయలేకపోతున్నాడు? అంటే కారణం ఇదే! నేను ఆశపడింది ఒక్కటే... నా మరణం తర్వాత కూడా ప్రతి ఇంట్లో బతికే ఉండాలని ఆశ పడ్డా. అందుకే ఎక్కడా రాజీ పడలేదు. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకున్నా. ఇవాళ చంద్రబాబు ఎందుకు బటన్ నొక్కడం లేదంటే.. ప్రతి దాంట్లోనూ దోచుకోవడం, దోచుకున్నది పంచుకోవడం చేస్తున్నాడు కాబట్టే. అందుకే రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు కూడా తగ్గిపోయాయి. దేశం మొత్తం 13 శాతం ఆదాయాలు పెరిగితే.. మనకు కేవలం 3 శాతమే పెరిగాయి. అలా ఎందుకు జరుగుతోందంటే.. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం టీడీపీ గజదొంగల ముఠా జేబుల్లోకి పోతోంది. ఏ మంచి చేయని, అన్నీ అబద్ధాలు, మోసాలు చేసిన చంద్రబాబుకు ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా వారికి డిపాజిట్లు రాని పరిస్థితులు ఖాయం. -
పుణ్యక్షేత్రాలు.. పర్యాటక కేంద్రాలు
- విహారయాత్రలో స్థానిక ప్రతినిధులు - అన్ని పార్టీలదీ క్యాంప్‌ల బాటే కరీంనగర్ సిటీ : పరోక్ష ఎన్నికలకు మరో మూడురోజులు గడువుండటంతో స్థానిక ప్రతినిధులంతా క్యాంప్‌ల బాటపట్టారు. చైర్మన్ పీఠం కైవసం చేసుకోవడానికి, తమ మద్దతుదారులను కాపాడుకోవడానికి శిబిరాలకు తరలివెళ్లారు. మెజారిటీ మండలాల నుంచి ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఆది, సోమవారాల్లో క్యాంప్‌లకు పయనమయ్యారు. సిరిసిల్ల మినహా జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, మెజారిటీ మండలాల, కార్పొరేషన్ల నుంచి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు క్యాంప్‌లకు వెళ్లారు. చైర్మన్ అభ్యర్థులు, ఆశావాహులు స్వకార్యం, స్వామి కార్యం సిద్ధిస్తుందని పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాల్లో క్యాంప్‌లు నిర్వహిస్తున్నారు. రామగుండం నగరపాలక సంస్థ పీఠాన్ని కైవసం చేసుకోవడానికి తీవ్రస్థాయిలో ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీఆర్ఎస్లు తమ క్యాంప్‌లను కొనసాగిస్తున్నాయి. కాంగ్రెస్ ఉత్తర భారతంలో ఉండగా, టీఆర్ఎస్ తమ కార్పొరేటర్లను షిర్డీ దర్శనానికి తీసుకెళ్లింది. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్పొరేటర్లను హైదరాబాద్‌కు తీసుకెళ్లేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. కోరుట్ల మున్సిపల్ కౌన్సిలర్లతో టీఆర్ఎస్, కాంగ్రెస్ హైదరాబాద్‌లో వేర్వేరుగా క్యాంప్ వేశాయి. మెట్పల్లి చైర్మన్ పీఠాన్ని దక్కించుకొనేందుకు ప్రయత్నిస్తున్న టీఆర్ఎస్ తమ కౌన్సిలర్లను షిర్డీకి తీసుకెళ్లగా, కాంగ్రెస్ హైదరాబాద్‌లో మకాం వేసింది. వేములవాడ నగరపంచాయతీపై కన్నేసిన బీజేపీ తన సభ్యులతో పాటు మద్దతిస్తున్న కౌన్సిలర్లతో హైదరాబాద్‌లో క్యాంప్ నిర్వహిస్తోంది. పెద్దపల్లి నగరపంచాయతీకి సంబంధించి టీఆర్ఎస్, కాంగ్రెస్ హైదరాబాద్‌లో వేర్వేరు క్యాంపులు కొనసాగిస్తున్నాయి. జమ్మికుంట నగరపంచాయతీ చైర్మన్ స్థానాన్ని దక్కించుకొనేందుకు టీఆర్ఎస్ తన కౌన్సిలర్లతో హైదరాబాద్‌లో మకాం వేసింది. హుజూరాబాద్ నగరపంచాయతీ కౌన్సిలర్లతో టీఆర్ఎస్ యనాం చేరుకుంది. జగిత్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్‌కు సంపూర్ణ మెజారిటీ సీట్లు రావడం, స్థానిక ఎమ్మెల్యే టి.జీవన్‌రెడ్డి సమీప బంధువు చైర్పర్సన్ కానుండటంతో అక్కడ క్యాంప్ జాడ లేదు. అయితే జగిత్యాల ఎంపీపీ కోసం కాంగ్రెస్ ఎంపీటీసీలంతా సోమవారం క్యాంప్‌నకు ప్రయాణమయ్యారు. ఈ క్యాంపులో మహిళా ఎంపీటీసీల స్థానంలో వారి భర్తలు షిర్డీకి తరలివెళ్లడం విశేషం. హుజూరాబాద్, రాయికల్ , కాల్వశ్రీరాంపూర్ ఎంపీటీసీలు వైజాగ్‌లో ఉండగా, జూలపల్లి, ధర్మపురి ఎంపీటీసీలు తిరుపతిలో మకాం వేశారు. కమాన్‌పూర్ ఎంపీటీసీలు ఊటీ, బెంగుళూరులో పర్యటిస్తున్నారు. మిగిలిన మండలాలకు చెందిన ఎంపీటీసీలు ఎక్కువగా హైదరాబాద్‌లో క్యాంప్‌లు వేయగా, మరికొంతమంది కరీంనగర్‌లోని వివిధ లాడ్జీల్లో మకాం వేశారు. క్యాంప్‌నకు దూరంగా సిరిసిల్ల సిరిసిల్ల నియోజకవర్గం క్యాంప్‌లకు దూరంగా ఉంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్థానికంగా ప్రాతినిథ్యం వహిస్తుండడమే కారణ ం. నియోజకవర్గంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించిన ఆయన పరోక్ష ఎన్నికను తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. ఆయన మాటే వేదం కావడంతో ఇక్కడి కౌన్సిలర్లు, ఎంపీటీసీలు క్యాంప్ ఊసెత్తడం లేదు. ఎన్నికకు ముందు కేటీఆర్ ఎవరి పేరు చెబితే వారు మున్సిపల్ చైర్మన్, ఎంపీపీలు కానున్నారు. జెడ్పీటీసీలతో టీఆర్ఎస్ క్యాంప్? జిల్లా పరిషత్‌లో సంపూర్ణ మెజారిటీ సాధించినప్పటికీ జెడ్పీటీసీలతో క్యాంప్ వేయాలని టీఆర్ఎస్ యోచిస్తున్నట్లు సమాచారం. 57 జెడ్పీటీసీలకు 41 స్థానాల్లో విజయం సాధించిన టీఆర్ఎస్ చైర్‌పర్సన్‌తో పాటు అన్ని పదవులు సొంతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. 5న ఎన్నిక జరగనుండగా, కనీసం రెండు, మూడు రోజులైనా క్యాంప్ వేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. సోమవారం తిమ్మాపూర్‌లోని ఎల్ఎండీ అతిథిగృహంలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్, పార్టీ నేతలు తుల ఉమ తదితరులతో మంతనాలు జరిపినట్లు విశ్వసనీయ సమాచారం. చర్చల్లో క్యాంప్‌నకు తీసుకెళ్లేందుకే మొగ్గుచూపినట్లు తెలిసింది. ఇద్దరు కో-ఆప్షన్ సభ్యులపై కూడా చర్చించారు. ఇద్దరిలో ఒకరిని జగిత్యాల నుంచి ఎంపిక చేయాలని ప్రాథమికంగా నిర్ణయించినట్టు వచ్చినట్లు సమాచారం. జగిత్యాలలో పార్టీ ప్రాతినిథ్యం లేనందున కో-ఆప్షన్ అయినా ఇవ్వాలని అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.