breaking news
leprosy victims
-
కుష్టు వ్యాధి నియంత్రణ యూనిట్ల ఎత్తివేత
సాక్షి, హైదరాబాద్: వైద్య ఆరోగ్యశాఖలో హేతుబద్దీకరణ ప్రారంభమైంది. రాష్ట్ర క్యాబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు వైద్యాధికారులు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ప్రజారోగ్య సంచాలకుల పరిధిలో కుష్టు వ్యాధి నియంత్రణ, మెటర్నరీ హెల్త్, టెంపరరీ హాస్పిటలైజేషన్ తదితర సేవలు ఉన్నాయి. అయితే కాలక్రమేణా ఆయా సేవలన్నీ ఆసుపత్రుల్లో సాధారణ సేవలుగా ప్రధాన స్రవంతిలో కలిసిపోయాయి. దాంతో ఈ యూనిట్లు నిరుపయోగంగా మారాయని వైద్య ఆరోగ్యశాఖ భావించింది. అలాగే చిన్న జిల్లాల ఏర్పాటుతో సబ్–డివిజనల్ స్థాయిలో ఉన్న డిప్యూటీ డీఎంహెచ్‌వో కార్యాలయాలు కూడా నిరుపయోగంగా మారాయి. ఈ నేపథ్యంలో వాటిని కూడా ఎత్తివేసి అందులోని సిబ్బందిని ఇతర చోట్ల సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. రాష్ట్రంలో 235 యూపీహెచ్‌సీల్లో వైద్యులు, నర్సులు, ఫార్మసిస్ట్ పోస్టులను కాంట్రాక్ట్ సిబ్బందితో భర్తీ చేసి నడిపిస్తున్నారు. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్, వ్యాక్సినేషన్, అంటువ్యాధుల సమయంలో పర్యవేక్షించడం తదితర సేవల్లో యూపీహెచ్సీల సిబ్బంది కీలకం. దీంతో.. ఎత్తివేసే యూనిట్ల నుంచి సిబ్బందిని వీటిల్లో సర్దుబాటు చేయాలని నిర్ణయించారు. 40 మండలాల్లో పీహెచ్‌సీలు, 6 డీఎంహెచ్వోలు ప్రాథమిక ఆరోగ్యం కేంద్రం (పీహెచ్సీ) లేని మండలాలు రాష్ట్రంలో 40 ఉన్నాయి. సిబ్బందిని హేతుబద్దీకరించడం, పునర్విభజించడం వల్ల ఆ 40 మండలాల్లోనూ పీహెచ్‌సీలను ప్రారంభించడానికి వీలు కలుగుతుందని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు వెల్లడించాయి. రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల సంఖ్య 10 నుంచి 33కి పెరిగింది. కొత్తగా రూపొందించిన 23 జిల్లాల్లోని డీఎంహెచ్‌వో కార్యాలయాలు కాంట్రాక్టు సిబ్బందితో నడుస్తున్నాయి. ఈ కార్యాలయాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు పూర్తి స్థాయిలో సిబ్బందిని డీఎంహెచ్‌వో కార్యాలయాలకు తిరిగి పంపిస్తారు. జీహెచ్ఎంసీ జనాభా పెరుగుదలతో ప్రజారోగ్య పరిపాలనను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఆరు డీఎంహెచ్వోలను కొత్తగా నియమిస్తారు. 80 శాతం డాక్టర్లు ఇతర ప్రాంతాల్లోనే నివాసం గ్రామాల్లో వైద్య సేవలు అందించాల్సిన డాక్టర్లు పట్టణాలకే పరిమితమవుతున్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రభుత్వానికి గతంలో ఓ నివేదిక సమరి్పంచింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బందిలో 80 శాతం మంది ఇతర ప్రాంతాలు, పట్టణాల్లో నివాసం ఉంటున్నారని ఆ నివేదిక వెల్లడించింది. దీంతో వారు పనిచేసే ఆసుపత్రికి వెళ్లి రావడానికే ఎక్కువ సేపు ప్రయాణం చేయాల్సి వస్తోందని పేర్కొంది. ఎక్కువమంది విధులకు డుమ్మా కొడుతున్నారని, 40% గైర్హాజరు ఉంటోందని నివేదిక స్పష్టం చేసింది. దీంతో ప్రజలకు ప్రభుత్వ వైద్యం అందించడం ప్రధాన సవాల్‌గా మారిందని ఆ నివేదిక అభిప్రాయపడింది. అధికంగా ఉన్న చోట నుంచి లేని చోటకు సిబ్బంది ఇక రాష్ట్రంలో కొన్ని ఆసుపత్రుల్లో ఎక్కువ మంది, కొన్నిచోట్ల మరీ తక్కువ సిబ్బంది పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రాంతం, అక్కడి జనాభా అవసరాలకు అనుగుణంగా వైద్యులు, ఇతర సిబ్బందిని సర్దుబాటు చేయాలని ఆ నివేదిక సర్కారుకు ప్రతిపాదించింది. ఆ ప్రకారమే ఇప్పుడు వైద్య ఆరోగ్యశాఖ రంగం సిద్ధం చేసింది. ఎంతమంది సిబ్బందిని ఒకచోట నుంచి మరో చోటకు మార్చాలన్న దానిపై వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కసరత్తు ప్రారంభించాయి. త్వరలోనే సిబ్బందిని గుర్తించి వారిని అవసరమైనచోటకు పంపిస్తారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సహా పలు జిల్లా కేంద్రాల్లోనే ఏళ్లుగా పాతుకుపోయిన వారికి స్థానచలనం తప్పకపోవచ్చన్న వాదనలు వినిపిస్తున్నాయి. -
పట్టాలిచ్చి ఆరేళ్లు... భూమి ఇవ్వక కన్నీళ్లు !
యడ్లపాడు : వారంతా విధి వంచితులు. కుష్ఠువ్యాధిగ్రస్తులు. ఏ పనీ చేసుకోలే రని జాలిపడిన ప్రభుత్వం ఆరేళ్ల కిందట సాగుభూమి పట్టాలు పంపిణీ చేసింది. అయితే నేటికీ ఆ భూములు ఎక్కడ ఉన్నాయో తెలియడం లేదు. సాక్షాత్తూ జిల్లా కలెక్టర్ ఆదేశించినా వారి భూములు అప్పగించిందీ లేదు సాగు చేపట్టిందీ లేదు. మండలంలోని సంగంగోపాలపురం- చెంఘీజ్‌ఖాన్‌పేట గ్రామాల మధ్య కొండపక్కన బున్నీనగర్‌లో 65 కుటుంబాలు. సుమారు 100 మంది జనాభా ఉంటున్నారు. చిన్ని చిన్ని గుడిసెల్లో బతుకుతున్నారు. వారంతా కుష్ఠువ్యాధిగ్రస్తులు. తమకు నివేశన స్థలాలు కావాలని 2009లో అప్పటి కలెక్టర్‌ను కలసి విన్నవించుకున్నారు. స్పందించిన కలెక్టర్ జయేష్ రంజన్ అదే ఏడాది జూన్ 27న ఒక్కో కుటుంబానికి సెంటుంబాతిక నివేశన స్థలం, అరెకరం సాగుభూమి వంతున ఇస్తూ బీ ఫారాలను పంపిణీ చేశారు. దాంతో వారంతా ఇందిరమ్మ పథకంలో ఇళ్ల నిర్మాణం చేసుకున్నారు. సాగు భూమి మాత్రం చేతికి రాక అప్పటి నుంచి ఇప్పటివరకు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. స్వయంగా కలెక్టర్ ఆదేశించినా .... అప్పటి కలెక్టర్ జయేష్‌రంజన్ కేవలం నివేశన స్థలాలు ఇవ్వడమే కాకుండా వారికి ఇళ్లకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.ఆ భూమిని సాగుకు యోగ్యంగా మార్చాల్సిన బాధ్యతను అధికారులకు అప్పగించారు. ఆ తరువాత జరిగిన మార్పుల్లో కలెక్టర్ ఇక్కడి నుంచి బదిలీ అయ్యారు. ఇక వీరిగోడు పట్టించుకున్న అధికారి లేడు. ఇప్పటికీ ఆరుగురు తహశీల్దారులు మారినా వారికి సాగు భూమి చూపించలేదు. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు... గతనెల 19న గోపాలపురంలో ‘నీరు-చెట్టు’ కార్యక్రమం ప్రారంభానికి వచ్చిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు కాన్వాయ్‌ను వారంతా అడ్డుకుని తమ సమస్యను వివరించారు. అధికారులతో మాట్లాడతానంటూ మంత్రి చెప్పి వెళ్లారు. అయినా నేటికీ ఏ అధికారి వారి వద్దకు రాలేదు. ఆ భూములను పెద్దలు ఆక్రమించుకొని ఉండటంతో కుష్ఠు వ్యాధిగ్రస్తులకు న్యాయం చేసేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారని సమాచారం.