breaking news
Left partie
-
అంచనాలు తలకిందులు.. హంగ్ దిశగా ఫ్రాన్స్ ఫలితాలు!
పారిస్: ఫ్రాన్స్ పార్లమెంట్ ఎన్నికల రెండో దశ పోలింగ్ ముగిసింది. ఆదివారం సాయంత్రం 5 గంటల వరకు 59.7 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 577 స్థానాలకుగాను మూడు పార్టీల కూటములకు స్పష్టమైన తీర్పు రాలేదు. అంచనాలు తలకిందులై ఫ్రాన్స్‌లో ఏ పార్టీకి స్పష్టమైన తీర్పు రాకుండా హంగ్ ఏర్పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 289 ఎంపీ సీట్లు గెలవాలి.ఇక మొదటి దశ పోలింగ్‌లో అతివాద కూటమి నేషనల్ ర్యాలీ (ఆర్ఎన్) 33 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. లెఫ్ట్ వింగ్ న్యూ పాపులర్ ఫ్రంట్(ఎన్‌ఎఫ్‌పీ) కూటమి 28 శాతం పాపులర్ ఓటు షేర్ సాధించింది. అయితే అధికార ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కేవలం 21 శాతం ఓటు షేర్‌తో మూడోస్థానానికి పరిమితమైంది. ఇక.. ఆదివారం జరిగిన రెండో దశ పోలింగ్‌లో లెఫ్ట్ పార్టీ న్యూ పాపులర్ ఫ్రంట్ అనూహ్యంగా 182 స్థానాలు గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 289 సీట్లు రావాల్సింది ఉంది. మొదటి రౌండ్ పోలింగ్‌లో అత్యధిక పాపులర్ ఓటు షేర్ సంపాధించిన రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ రెండో దశ పోలింగ్ అనంతరం 143 స్థానాలు మాత్రమే గెలచుకొని మూడో స్థానంలోకి వెళ్లింది. ఇక అధికార మేక్రాన్ సెంట్రిక్ పార్టీ కూటమి 163 ఎంపీ స్థానాలు గెలచుకొని రెండో స్థానంతో సరిపెట్టుకుంది. అయితే మొదటి నుంచి ఈసారి ఎన్నికలల్లో రైట్ వింగ్ నేషనల్ ర్యాలీ పార్టీ అధిక సీట్లు గెలచుకొని అధికారంలోకి వస్తుందని పలు సర్వేలు జోస్యం చెప్పాయి. అంచనాలను తలకిందులు చేస్తూ.. అనూహ్యంగా లెఫ్ట్ పార్టీ అధిక సీట్లు గెలుచుకొని మొదటి స్థానంలోకి రాగా.. రైట్ వింగ్ పార్టీ మూడో స్థానంలోకి వెళ్లింది. ఈ అనూహ్య ఫలితాలతో ఫ్రాన్స్‌లో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడనుందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి.ఐరోపా ఎన్నికల్లో మధ్యేవాదుల పరాజయం తర్వాత అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ జూన్ 9న పార్లమెంట్‌ను రద్దు చేసి ఎన్నికలకు పిలుపునిచ్చారు. అయితే.. మాక్రాన్ అధ్యక్ష పదవీ కాలం ఇంకా మూడేళ్లు ఉండగానే ముందస్తు ఎన్నికలకు వచ్చారు. ప్రస్తుతం ఫలితాలతో ఏ పార్టీ కూటమి అధికారంలోకి వస్తుందనే ఆసక్తి నెలకొంది. -
రాష్ట్రానికి బీజేపీ, టీడీపీ ద్రోహం
పది వామపక్ష పార్టీల ధ్వజం సాక్షి, విజయవాడ బ్యూరో: కేంద్రంలోను, రాష్ట్రంలోను మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీ, టీడీపీ రెండూ ఆంధ్రప్రదేశ్‌కు ద్రోహం చేస్తున్నాయని పది వామపక్ష పార్టీలు తీవ్రంగా ధ్వజమెత్తాయి. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేదిలేదని కేంద్రప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో విభజన హామీల సాధనలో వైఖరేమిటో స్పష్టం చేయాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేశాయి. ఆదివారం పది వామపక్ష పార్టీల సమావేశాన్ని విజయవాడలో నిర్వహించారు. సమావేశ వివరాల్ని సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు పి.మధు, కె.రామకృష్ణ మీడియాకు వివరించారు. రాష్ట్రానికి పదేళ్లపాటు ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలు, లోటు బడ్జెట్ భర్తీ వంటి విభజన హామీలు రెండేళ్లవుతున్నా అమలుకు నోచుకోలేదని విమర్శించారు. విభజన హామీల అమలులో రాష్ట్రానికి బీజేపీ ప్రభుత్వం ద్రోహంచేస్తుంటే ఇంకా కేంద్రంలో మిత్రపక్షంగా కొనసాగాలా? పోరాడి సాధించుకోవాలా? అనేది చంద్రబాబు తేల్చుకోవాలని వారు సూచించారు. రాష్ట్రంలో అన్ని పార్టీల్ని కలుపుకుని విభజన హామీల అమలుకు టీడీపీ ప్రభుత్వం ముందుకు రావాలని, లేకుంటే ఏపీని దగా చేసినట్టేనని స్పష్టం చేశారు. మేడే జరిపే నైతిక హక్కు బాబు సర్కారుకు లేదు.. రాష్ట్రంలో కార్మిక హక్కులను అత్యంత దారుణంగా హరించివేస్తున్న చంద్రబాబు ప్రభుత్వం కార్మిక దినోత్సవాన్ని(మేడే) నిర్వహించడం విడ్డూరమని వారు ఎద్దేవా చేశారు. అధికారపార్టీగా పోటీ సంఘాలు పెడుతూ కార్మికుల ఐక్యతను దెబ్బతీస్తున్న టీడీపీ ప్రభుత్వానికి మేడేను నిర్వహించే నైతిక హక్కులేదని విమర్శించారు. ఇటీవల అనేక సమస్యలపై ఉద్యమించిన కార్మికులను అరెస్టులు చేయించడం, ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించడం వంటి చర్యలకు చంద్రబాబు ప్రభుత్వం పాల్పడడాన్ని గుర్తుచేశారు. విశాఖ జిల్లాలోని బ్రాండిక్స్ పరిశ్రమలో 12 వేలమంది కార్మికుల్ని తొలగించి రోడ్డున పడేశారని, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గంలోని పరిగిలో రావతార్ ప్రైవేటు లిమిటెడ్ పరిశ్రమలో 182 మంది కార్మికుల్ని తొలగించారని తెలిపారు. ప్రభుత్వం పోలీసు బలం ప్రయోగించినా, ఎన్ని అడ్డంకులు కల్పించినా ఈనెల 4న విశాఖ జిల్లా బ్రాండిక్స్ కార్మికులకు మద్దతుగా, అలాగే 14న పరిగిలో పది వామపక్షాల ఆధ్వర్యంలో సభ జరిపి తీరుతామని వారు ప్రకటించారు. మీడియా సమావేశంలో ఫార్వర్డ్‌బ్లాక్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుందరరామరాజు, ఆర్ఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జానకిరాములు, జల్లి విల్సన్(సీపీఐ), వి.ఉమామహేశ్వరరావు(సీపీఎం) పాల్గొన్నారు.