breaking news
land invaders
-
కబ్జాలపై ఉక్కుపాదం
భూ ఆక్రమణదారులపై కఠిన చర్యలకు కేసీఆర్ ఆదేశం రాజకీయాలతో సంబంధం లేకుండా చర్య తీసుకోవాలన్న సీఎం ముందుగా టీఆర్ఎస్ వారిపైనే కేసులు పెట్టండి కఠిన శిక్షలు విధించేలా చట్టాన్ని రూపొందించాలి.. ఇదివరకే నిర్మాణం చేసుకుంటే చివరి అవకాశంగా క్రమబద్ధీకరించండి గడువులోగా ముందుకురాకపోతే స్థలాలు స్వాధీనం చేసుకోవాలి వెంటనే మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులకు ఆదేశం ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాల పంపిణీకి నిర్ణయం శ్రీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికీ భయపడేది లేదు. ప్రభుత్వ భూములు ప్రజలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి. - కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: భూ కబ్జాలపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేసే వారిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. పార్టీలతో సంబంధం లేకుండా కబ్జాదారులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. అధికార పార్టీకి చెందిన వారినైనా వదిలిపెట్టకూడదని చెప్పారు. కబ్జాలకు పాల్పడే వారిలో ముందుగా టీఆర్ఎస్కు చెందిన వారిపైనే కేసులు నమోదు చేసి ప్రభుత్వ ఉద్దేశాన్ని స్పష్టం చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ భూము ల్లో ఇప్పటికే నిర్మాణాలు జరిగి ఉంటే ఆ స్థలాలను, భవనాలను క్రమబద్ధీకరించాలని, అనధికారిక లే అవుట్ల క్రమబద్ధీకరణకు వెంటనే మార్గదర్శకాలను రూపొందించాలని కేసీఆర్ పేర్కొన్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తులను స్వీకరించి, విచారణ అనంతరం నిర్ణయం తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఇందుకు నిర్ణీత గడువు విధించాలని, ఇదే చివరి అవకాశంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు. నిర్ణీత గడువులోగా క్రమబద్ధీకరణ చేసుకోని వారి నుంచి స్థలాలను స్వాధీనం చేసుకుంటామని కేసీఆర్ హెచ్చరించారు. హైదరాబాద్‌లో ప్రభుత్వ భూముల కబ్జాపై గురువారం ఆయన సచివాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రాజీవ్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శి బీఆర్ మీనా, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు ముఖేష్‌కుమార్ మీనా, శ్రీధర్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేసుకుని రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటున్నారని సీఎం ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఓపక్క ప్రభుత్వ అవసరాల కోసం స్థలాలు కరువైపోగా.. మరోపక్క వేలాది ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి పోతున్నాయంటూ విస్మయం వ్యక్తం చేశారు. కబ్జాదారులు ఎంతటి వారైనా విడిచిపెట్టవద్దని అధికారులకు నొక్కిచెప్పారు. ఇందుకు ప్రస్తుతమున్న చట్టాలు సరిపోవని, కబ్జాదారులకు కఠిన శిక్షలు పడేలా కొత్త చట్టాలను రూపొందించాల్సిన అవసరముందని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. సీఎస్ రాజీవ్‌శర్మ అధ్యక్షతన గతంలో ఏర్పాటైన కార్యదర్శుల స్థాయి కమిటీకే ఈ బాధ్యతను అప్పగిస్తున్నట్లు చెప్పారు. సర్కారు భూముల పరిరక్షణ, ఆక్రమణదారులపై కఠిన చర్యలు, లీజుదారులు, అసైన్డ్ భూముల వ్యవహరాల్లో అనుసరించాల్సిన విధి విధానాలను కమిటీ రూపొందించాలని సూచించారు. దీనిపై ఈ నెల 9న కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పూర్తిస్థాయి సమావేశం నిర్వహించాలని సీఎస్‌ను ఆదేశించారు. కార్యదర్శుల కమిటీ రూపొందించే చట్టానికి సంబంధించి ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నారు. ఇక మురికివాడల్లో నివసించే పేదలకు గౌరవప్రదమైన నివాసాలు కట్టించాలని, ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు పట్టాలివ్వాలని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. నగరానికి వలస వచ్చి గుడిసెలు వేసుకున్న వారిపట్ల ప్రభుత్వం అత్యంత ఉదారంగా వ్యవహరిస్తుందని చెప్పారు. గుడిసెల్లో నివాసముంటున్న రెండు లక్షల మందికి నీడ కల్పిస్తామన్నారు. అభాగ్యుల కోసం 50 నైట్ షెల్టర్లు నిర్మించాలని, నాలాలకు అడ్డంగా ఉన్న నివాసాలను తొలగించి వారికి మరోచోట స్థలం కేటాయించాలని అధికారులకు సూచించారు. కొందరికి గిట్టదు.. అయినా భయపడను పేదలు వేసుకునే గుడిసెలను వెంటనే తొలగిస్తున్న అధికారులు.. అక్రమంగా వెలసిన భవనాలను మాత్రం పట్టించుకోవడం లేదని సీఎం అన్నారు. ప్రభుత్వం, అధికారులు పేదల పక్షపాతిగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ భూముల్లో ఇప్పటికే నిర్మాణాలు చేసుకుని ఉంటే వాటిని క్రమబద్ధీకరించాలని, అందుకోసం ముందుకు రాని వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకోవాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రజోపయోగం పేరిట భూములను తీసుకుని వ్యాపారం చేసుకుంటున్న వారిపైనా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. అసైన్డ్ భూముల సంగతి కూడా తేల్చాలని ఉన్నతాధికారులకు నిర్దేశించారు. నకిలీ పత్రాలను సృష్టించి స్థలాలు కాజేస్తున్న వారి కేసుల విషయంలో అధికారులు సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరగడంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారి విషయంలో గత ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించాయని, కులం, ప్రాంతం, రాజకీయాల ఆధారంగా ప్రేమ చూపించాయని వ్యాఖ్యానించారు. ఇప్పుడు అలాంటి వారిని ఉపేక్షించాల్సిన అవసరం లేదన్నారు. తప్పు చేసిన వారెవరైనా శిక్షపడాల్సిందేనని పేర్కొన్నారు. ‘ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారి విషయంలో నేను కఠినంగా ఉంటే కొందరికి గిట్టదు. నన్ను బద్నాం చేయాలని చూస్తారు. అయినా దేనికి భయపడేది లేదు. నాకు స్వప్రయోజనాలు లేవు. కచ్చితంగా ఉంటా. వెనక్కి తగ్గను. నన్నెవరూ ఒత్తిడికి గురిచేయలేరు. ప్రభుత్వ భూములు ప్రజోపయోగాలకు ఉపయోగపడాలి. పేదలకు మేలు జరగాలి. అదే నా లక్ష్యం. ప్రభుత్వ ఉద్దేశాన్ని, చిత్తశుద్ధిని అర్థం చేసుకోండి. నగరానికి సోకిన ఈ జబ్బును వదిలించే బాధ్యత మీపై పెడుతున్నాను. ప్రభుత్వ భూమిని ముట్టుకోవాలంటేనే భయపడాలి’ అని అధికారులతో సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. -
భూ బకాసురుల పలాయనం
కాచవరంలో రూ. 20కోట్ల విలువైన భూమి ఆక్రమణకు యత్నం అడ్డుకున్న గ్రామస్తులు పొక్లయిన్లు, జేసీబీలతో సహా వెనుదిరిగిన ఆక్రమణదారులు కృష్ణానదికి అవతలివైపు రాజధాని నేపథ్యంలో వాగుపోరంబోకు పెరిగిన డిమాండ్ కాచవరం,(ఇబ్రహీంపట్నం రూరల్) : రాజధాని నిర్మాణం నేపథ్యంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భూ ఆక్రమణదారులు పెరిగిపోయారు. ఎక్కడ ప్రభుత్వ భూములున్నా వాలిపోతున్నారు. కృష్ణానదికి అవతల వైపు రాజధాని నిర్మాణం నేపథ్యంలో... ఇవతలి వైపు ఉన్న ఇబ్రహీంపట్నం మండలం కాచవరంలో సుమారు రూ.20కోట్ల విలువైన తొమ్మిది ఎకరాల భూమి కబ్జాకు కొందరు యత్నించారు. సర్వే నంబర్లు 8/5, 8/6, 8/7, 8/8, 8/9లో ఈ భూమి ఉంది. దీని విలువ ఎకరం రెండు కోట్లపైమాటే. మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రెండు పొక్లయిన్లు, రెండు జేసీబీలతో 9ఎకరాల భూమిని చదును చేస్తుండగా ఎంపీటీసీ సభ్యుడు కందుల భాస్కరరావు, కొందరు యువకులు అడ్డుకున్నారు. పత్రాలు చూపాలని నిలదీశారు. లక్ష్మీపార్వతి భర్త రామరావు పేరుతో అడంగళ్ కాపీలో నమోదైన పత్రాలను వారు చూపారు. వారి నుంచి గొల్లపూడికి చెందిన శివకుమార్ అనే వ్యక్తి కొనుగోలు చేసినట్లు అడంగళ్ కాపీలున్నాయి. పట్టా చూపాలని పట్టుబట్టడంతో కంగారు పడిన ఆక్రమణదారులు పత్రాలు రేపు చూపుతామని పలాయనం చిత్తంగించారు. వారి సామగ్రీని తరలించారు. 2005లో ఇక్కడున్న 9.50 ఎకరాల్లో ఇందిరమ్మ కాలనీ ఏర్పాటుకు నిర్ణయించారు. పట్టాలు, పాస్ పుస్తకాలు అందచేశారు. అప్పట్లో వారు అమ్మేసినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. ఈ ఉదంతం వెలుగు చూడటంతో గతంలో పట్టాలు పొందిన వ్యక్తులు మేల్కొన్నారు. భూమిని దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం వల్లే కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని ఎంపీటీసీ భాస్కరరావు చెప్పారు. ఈ విషయాన్ని మంత్రి దేవినేని ఉమా దృష్టికి తీసుకెళ్లనున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొండవాగు పోరంబోకు భూమి కొండవాగు పోరంబోకని కాచవరం వీఆర్వో సయ్యద్ ఖాశీం చెప్పారు. అడంగళ్‌లో ఎవరి పేర్లూ లేవన్నారు. విషయం తహశీల్దార్‌కు తెలియజేస్తానని చెప్పారు. -
కబ్జాదారులపై కన్ను!
ల్యాండ్ మాఫియా పీచమణచడానికి సైబరాబాద్ పోలీసులు పావులు కదుపుతున్నారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తూ భూములను లాక్కుంటున్న వారిని ఓ పట్టుపట్టడానికి సిద్ధమవుతున్నారు. నగరంతోపాటు చుట్టుపక్కల గ్రామాల భూముల ధరలు ఆకాశాన్నం టిన తరుణంలో, జంట నగరాల్లో ల్యాండ్‌మాఫియా విపరీతంగా పెరి గింది. ‘సివిల్ కేసుల్లో పోలీసులు జోక్యం చేసుకోరు’ అంటూ పోలీస్స్టేషన్ల గోడలపై రాసి ఉన్న వాక్యాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని మాఫియా రెచ్చిపోతోంది. నగరంలో కొందరు రాజకీయం, రౌడీయిజం, పెద్దమనుషుల ముసుగులో పాల్పడుతున్న ఈ అరాచకాలకు అడ్డుకట్టవేయడానికి సైబరాబాద్ పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పోలీసుల గుప్పిట్లో చిట్టా.. భూకబ్జాలకు పాల్పడే వ్యక్తుల ప్రొఫైల్‌ను తయారుచేసే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం వారి చిట్టా పోలీస్ డైరీలో ఉంది. పూర్తిస్థాయిలో వివరాలు సేకరించిన తర్వాత చర్యలు తీసుకునే విషయమై దృష్టి సారించే అవకాశం ఉంది. కబ్జాలకు పాల్పడేవారితోపాటు, వారికి సహకరించే వారిపై కూడా నిఘా పెట్టారు. కబ్జాలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదంటున్న పోలీసులు ఆ దిశగా చర్యలకు శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమాయక ప్రజలు కష్టపడి కూడబెట్టుకున్నదంతా ఎగురేసుకుపోతున్న ల్యాండ్ మాఫియాను ఎట్టి పరిస్థితుల్లోనూ వదలద్దని, వారిపై రౌడీషీట్లు తెరవాలని పలువురు బాధితులు పోలీసులను వేడుకుంటున్నారు. ప్రాంతాలవారీగా వివరాల సేకరణ నగరం చుట్టుపక్కల భూముల ధరలు విపరీతంగా పెరిగాయి. గతంలో భూమి అమ్మిన భూ యజమానులతో కుమ్మక్కవుతున్న ల్యాండ్ మాఫియా తమకు అమ్మినట్లు వారితో పాత తేదీలతో కాగితాలు రాయించి భూమి కొనుగోలు చేసిన వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. వంద గజాలకు మించి ఖాళీ స్ధలం కనిపిస్తే అక్కడ దస్తీవేసే పనిలో ఉన్నారు. జవహర్‌నగర్‌లో కొంతమంది కబ్జాదారులు, మాజీ సైనికుల దగ్గర భూమిని కొనుగోలు చేసినట్లు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి వందలాది ఎకరాల ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్న వారి వివరాలను ఆరాతీస్తున్నారు. కబ్జాదారులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటే నగరంలో భూఆక్రమణలు చేయడానికి ఎవ రూ సాహసించరని పలువురు అభిప్రాయపడుతున్నారు. నిశిత పరిశీలన.. మార్పునకు శ్రీకారం ఓ వ్యక్తి భూమిని ఆక్రమించుకునేందుకు దోహదపడుతున్న అంశాలను కూడా పోలీసులు నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇక ముందు అలాంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా ఉండేలా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. బాధితులకు న్యాయం జరిగే దిశగా కబ్జాలను వెలికితీసి అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేయాలనే దిశగా పోలీసులు ముందుకు సాగుతున్నారు. ఈ మేరకు ఆక్రమణదారుల ఆస్తులపై నిఘా పెట్టారు. ఇక పోలీసుల విచారణలో భూములు కబ్జాలకు గురైనట్లు తేలితే.. వాటి ని బాధితులకు తిరిగి ఇచ్చే అవకాశాలను కల్పిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ సదరు భూమిని మరొకరికి అమ్మిన పక్షంలో బాధితులకు ఎలా న్యాయం చేయాలనే దిశగా కూడా ఆలోచిస్తున్నట్లు తెలిసింది. కబ్జాదారుల్లో భయం.. భయం నకిలీ డాక్యుమెంట్లను పోలీసు శాఖ సేకరిస్తోందనే సమాచారం అందుకున్న కబ్జాదారులు భయాందోళనకు గుర వుతున్నారు. చేసిన తప్పులకు మూల్యం చె ల్లించాల్సి వస్తుందని భావిస్తున్న కొందరు కబ్జాదారులు తమ ఇళ్లలోంచి నకిలీ డాక్యుమెంట్లను ఇతర ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం.