breaking news
Land administration section
-
భూ పరిపాలనా రంగంలో అతిపెద్ద సంస్కరణ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత భూపరిపాలనా రంగంలో వచ్చిన అతి పెద్ద సంస్కరణ ధరణి అని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ధరణి పోర్టల్ ప్రారంభించి ఏడాది పూర్తయిన సందర్భంగా శుక్రవారం సచివాలయంలో పలు శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు, రెవెన్యూ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ దృఢ సంకల్పంతోనే ధరణి సాధ్యమైందని, ఈ సాహసాన్ని కేసీఆర్ తప్ప ఎవరూ చేయలేరని కొనియాడారు. సంవత్సర కాలంలో ఊహించినదాని కన్నా విజయవంతమైందని, 5.14 కోట్ల మంది ధరణి పోర్టల్‌ను చూడటం, 10 లక్షలకు పైగా లావాదేవీలు జరగడం ఇందుకు నిదర్శనమని చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో అమలవుతున్న విప్లవాత్మక పథకాల కారణంగా రాష్ట్రంలోని భూముల ధరలు నాలుగైదు రెట్లు పెరిగాయని, ఈ పరిస్థితుల్లో ధరణి పోర్టల్ కారణంగా భూ రికార్డులు పటిష్టంగా మారాయని, రికార్డులను తారుమారు చేసే పరిస్థితి లేకుండా భూములు సురక్షితంగా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో 141 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు జరిగేవని, ఇప్పుడు 574 తహసీల్దార్ కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్లు ప్రారంభించినట్లు చెప్పారు. ధరణి విజయవంతం కావడంలో సీనియర్ అధికారులు, ఐటీ నిపుణుల శ్రమ ఉందని, రెవెన్యూ ఉద్యోగులు కూడా ఈ విజయంలో కీలక భూమిక పోషించారని ప్రశంసించారు. ఏడాది కాలంలో ధరణి సాధించిన విజయాలతో కూడిన పుస్తకాన్ని సీఎస్ సోమేశ్‌కుమార్ ఆవిష్కరించారు. సమావేశంలో పలు శాఖల కార్యదర్శులు సందీప్‌కుమార్ సుల్తానియా, ఎస్.ఎం.రిజ్వీ, రాహుల్ బొజ్జా, శేషాద్రి, రఘునందన్‌రావు, ఎక్సైజ్ శాఖ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, పంచాయతీరాజ్ కమిషనర్ శరత్, సీసీఎల్ఏ ప్రత్యేక అధికారి సత్యశారద తదితరులు పాల్గొన్నారు. -
ఈ-పాస్‌బుక్‌లు రెడీ
* డిజైన్లను ఆమోదించిన రాష్ట్ర ప్రభుత్వం * స్థానికంగానే ముద్రించి పంపిణీ * జిల్లా కలెక్టర్లకు సీసీఎల్ఏ ఆదేశం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ త్వరలోనే ఎలక్ట్రానిక్ (ఈ)పట్టాదార్ పాసు పుస్తకాలు, ఈ-యాజమాన్యపు హక్కు (టైటిల్ డీడ్) పత్రాలు అందనున్నాయి. ఈ మేరకు భూపరిపాలన విభాగం గత రెణ్ణెల్లుగా కసరత్తు చేసి రూపొందించిన డిజైన్లకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. రెండున్నర దశాబ్దాల అనంతరం పట్టాదారు పాస్‌పుస్తకాల రూపాన్ని మార్చుతుండడం, కొత్త రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ప్రభుత్వం పేరిట పాస్‌బుక్స్, టైటిల్ డీడ్లు వస్తుండటం పట్ల రెవెన్యూ వర్గాల్లో ఎంతగానో ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలోని తొమ్మిది జిల్లాల్లో ప్రస్తుతం సుమారు 25 లక్షల పాస్పుస్తకాలున్నట్లు సమాచారం. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక కొత్తగా పాస్బుక్ల పంపిణీని ప్రభుత్వం నిలిపివేయడంతో మరో ఐదులక్షల మంది రైతులు పాస్బుక్ల కోసం దరఖాస్తు చేసుకొని వాటికోసం ఎదురుచూస్తున్నారు. ఇంతకు ముందున్న పాస్‌పుస్తకాలను కూడా సమూలంగా మార్చాలని సర్కారు నిర్ణయించింది. ఎక్కడికక్కడే ముద్రణకు ఆదేశాలు ప్రభుత్వం ఆమోదించిన కొత్త డిజైన్ల (రంగులు, స్లోగన్లు, ఎంబ్లమ్)లోనే ఎలక్ట్రానిక్ పాస్‌బుక్‌లు, టైటిల్ డీడ్లను స్థానికంగానే ముద్రించుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు భూపరిపాలన విభాగం కమిషనర్ నుంచి ఆదేశాలందాయి. పట్టాదారు పాసుపుస్తకానికి, యాజమాన్యపు హక్కు పత్రానికి ప్రత్యేకమైన కోడ్, నెంబరు, రెవెన్యూ డివిజనల్ అధికారి (ఆర్డీవో) సంతకం తప్పనిసరిగా ఉండాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. పాస్‌బుక్, టైటిల్డీడ్ల మొదటి పేజీకి వాటర్ మార్క్డ్ మ్యాప్‌లిథో పేపరునే వినియోగించాలని, రైతు ఫొటోను అతికించి, ఆర్డీవో సంతకం చేశాక ఆ పేజీని భద్రతరీత్యా లామినేషన్ చేయించాలని సూచించారు. రంగుల్లో మరింత ఆకర్షణీయంగా.. పుస్తకం కవర్‌పేజీపై రైతు, రైతుకూలీల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, చివరి పేజీపై బంగారు తెలంగాణకు బాటలు వేయండని స్లోగన్లు ఉన్నాయి. వెనుక పేజీలో అరక దున్నుతున్న రైతు దంపతుల ఫొటోను రంగుల్లో ఆకర్షణీయంగా ముద్రించారు. అన్ని పుస్తకాలు ఒకేవిధమైన సైజు, రూపం ఉండేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. పాస్‌బుక్, టైటిల్ డీడ్ల మొదటి పేజీలో రైతు పేరు, చిరునామా, భూమి ఉన్న గ్రామం.. తదితర వివరాలుంటాయి. వీటిని ధ్రువీకరిస్తూ వ్యవసాయదారుడు, తహశీల్దారు, ఆర్డీవోలు సంతకం చేయాలని పుస్తకంలో పేర్కొన్నారు. అయితే.. వ్యవసాయదారుని వివరాలను ధ్రువీకరించాల్సిన వీఆర్వో స్థానంలో గ్రామ సహాయకుని(వీఏ) సంతకం ఉండాలని పేర్కొనడం విడ్డూరంగా ఉంది. వీఏ వ్యవస్థ పోయి వీఆర్వో వ్యవస్థ వచ్చి ఎన్నో ఏళ్లయినా కొత్తగా డిజైన్ చేసిన పుస్తకాల్లో అధికారులు మార్చకపోవడం గమనార్హం.