Lal Bahadur College
-
ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని..
రామన్నపేట: నగరంలోని ములుగు రోడ్డు సమీపంలోని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అదే కళాశాలలోని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ శుక్రవారం కళాశాల భవనం ఎదుట నిరసన తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కళాశాలలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్‌రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల సమస్యలు తీర్చాలని అడిగినందుకు తనకు కళాశాల యాజమాన్యం నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో, కళాశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా కళాశాలలో ఫిలాసఫీ సబ్జెక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ కింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపాల్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపాల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కళాశాలలో అధ్యాపకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపాల్‌కి భయపడి ఎవరూ బయటికి చెప్పుకోవడంలేదని వివరించారు. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలపై ఉస్మానియా గ్యాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. -
‘సాక్షి’ ఎరీనా స్కూల్ ఫెస్ట్‌కు విశేష స్పందన
వివిధ పోటీల్లో పాల్గొన్న పలువురు విద్యార్థులు వరంగల్: ‘సాక్షి’ మీడియా గ్రూపు ఆధ్వర్యంలో ములుగు రోడ్‌లోని లాల్ బహదూర్ కాలేజీ (ఎల్బీ)లో శనివారం నిర్వహించిన ‘సాక్షి’ఎరీనా స్కూల్ ఫెస్ట్‌లో భాగంగా చిత్రలేఖనం, పోస్టర్ పేయింగ్, హ్యాండ్ రైటింగ్, క్యారమ్స్, డిబేట్లపై నిర్వహించిన పోటీల్లో పలు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. సుమారు వందకు పైగా విద్యార్థులు ఈపోటీల్లో పాల్గొని వారిలో ఉన్న ప్రతిభను ప్రదర్శించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈపోటీలు జరిగాయి. ఈ పోటీలను నగరంలోని ప్రశాంతి హాస్పిటల్ డైరెక్టర్ మోహన్‌రావు, ఎల్బీ కాలేజీ ప్రిన్సిపాల్ డా. కె.సత్యపరమేశ్వర్‌లు ప్రారంభించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ‘సాక్షి’ దినపత్రికల వార్తల సేకరణతోనే కాకుండా విద్యార్థుల కోసం ఎరీనా ఫెస్ట్ లాంటి పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈపోటీల వల్ల విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలుగు చూస్తుందన్నారు. కార్యక్రమంలో ‘సాక్షి’ రీజినల్ మేనేజర్ ఆర్. రామచంద్రారెడ్డి, బ్యూరో ఇన్చార్జ్ పి.గోపాల్, ఎల్బీ కాలేజీ ఫిజికల్ డైరెక్టర్ బి.ప్రభాకర్, ‘సాక్షి’ ఈవెంట్ ఎగ్జిక్యూటివ్ సుమన్, ప్రతినిధులు సంపెట వెంకటేశ్వర్లు, ఎ.సదాశివుడు, ఆర్గనైజర్లు భరత్, హేమనందినీ, సాయిశ్రీ, మహేష్, చత్రపతి, విష్ణుమూర్తి, శ్యాం, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.