breaking news
Kriti Bharti
-
పుట్టినరోజే వివాహ బంధనం నుంచి రేఖకు విముక్తి
ఆ అమ్మాయి వయసు 21 ఏళ్లు. బాగా చదువుతుంది. నర్సు కావాలన్నది ఆమె కల. కానీ, ఊహ తెలియని వయసులో పెద్దలు చేసిన పనికి.. నరకంలో పడింది. మానసికంగా కుమిలిపోయింది. చివరికి.. ఓ ఉద్యమకారిణి సహకారం, కోర్టు తీర్పుతో మొత్తానికి ఆటంకాలు తొలగి ఆమెకు ఇష్టంలేని వివాహ బంధనం నుంచి విముక్తి లభించింది. రాజస్థాన్ జోధ్పూర్కు చెందిన రేఖ(21).. విచిత్రమైన పరిస్థితుల నడుమ జోధ్పూర్ ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. 2002లో అంటే.. ఏడాది వయసున్నప్పుడు రేఖను అదే ఊరికి చెందిన ఓ పిలగాడికి ఇచ్చి వివాహం చేశారు ఆమె తల్లిదండ్రులు. ఇంటి పెద్ద అనారోగ్యంతో.. బంధువుల ఒత్తిడి మేరకు ఈ చర్యకు ఉపక్రమించారు. అయితే.. ఆ తర్వాత ఆ పసికందు జీవితం సాఫీగానే సాగింది. ఈమధ్య.. కొన్నాళ్ల కిందట అత్తింటి వాళ్లమంటూ కొందరు రేఖ ఇంటికి రావడంతో.. ఆమె షాక్ తింది. ఇన్నాళ్లూ విషయం తెలియకుండానే పెంచారు ఆమెను. దీంతో తల్లిదండ్రులు, చుట్టాల ఒత్తిడి మేరకు ఆమె బలవంతంగానే మెడలో తాళిబొట్టు వేసుకుని.. ఆ ఇంట కోడలిగా అడుగుపెట్టింది. అయితే.. అక్కడికి వెళ్లాక చదువుకోనీయకుండా భర్త, అతని తల్లిదండ్రులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో మానసికంగా కుమిలిపోయింది. మరోవైపు ఇన్నాళ్లపాటు వివాహం అయ్యిందనే విషయం దాచినందుకు.. తమ దగ్గరికి పంపనందుకు కుల పరిహారం పేరిట రేఖ తల్లిదండ్రుల నుంచి రూ.10 లక్షలు డిమాండ్ చేయసాగారు. ఈ పరిస్థితుల్లో.. రేఖకు ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కృతి భారతి గురించి తెలిసింది. కృతి భారతి.. ప్రముఖ ఉద్యమకారణి. అంతేకాదు.. బీబీసీ అత్యంత స్ఫూర్తిదాయకమైన 100 మహిళల్లో ఒకరిగా చోటు సంపాదించుకున్న వ్యక్తి కూడా. ఆమె సాయంతో జోధ్పూర్ ఫ్యామిలీకోర్టులో వివాహ రద్దు కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది రేఖ. ఆ కుటుంబం నుంచి విముక్తి కలిగిస్తూ.. చదువుకోవాలనే తన ఆశయానికి సాయపడాలంటూ కోర్టును వేడుకుంది. దీంతో.. బాల్యవివాహంగా పరిగణిస్తూ.. నేరంగా పేర్కొంటూ న్యాయమూర్తి ప్రదీప్ కుమార్ మోదీ వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్పు ఇచ్చారు. విశేషం ఏంటంటే.. ఆమె పుట్టినరోజు నాడే తీర్పు రావడం. దీంతో ఇష్టం లేకుండా.. అదీ తనకు ఊహతెలియని వయసులో జరిగిన వివాహ రద్దు తీర్పు కాపీలను ఆమె కానుకగా కృతి నుంచి అందుకుంది. ఇదీ చదవండి: ఇది కథ కాదు.. 75 ఏళ్లకు కలిసిన రక్తసంబంధం -
ఆమె నిజంగా ఒక హీరో
జైపూర్: బాల్య వివాహాలతో బతుకు వెల్లమారిన పిల్లలకు, అనాథలకు, అభాగ్యులకు, ఇంట్లో ఆశ్రయం దొరక్క రోడ్డునపడ్డ మహిళలకు ఆమె నిజంగా ఓ హీరో. ముఖ్యంగా దేశంలో బాల్య వివాహాలను అరికట్టేందుకు ఆమె తన జీవితాన్ని అంకితం చేశారు. అందుకోసం క్షణం తీరికలేకుండా అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు. అందుకనే ఆమెకు ఎన్నో అవార్డులు లభించాయి. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన ఆమె పేరు కృతీ భారతి. 29 ఏళ్లు. గడచిన నాలుగేళ్ల కాలంలో 29 బాల్య వివాహాలను కోర్టుల ద్వారా రద్దు చేయించారు. ఏకంగా 900 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. బాల్య వివాహాలకు బద్దులైన పెద్దల నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా ఆమె భయపడడం లేదు. తన జీవితం బాల్య వివాహాలను అరికట్టేందుకే అంకితమని చెబుతున్నారు. ఆమె ఇటీవల రాజస్థాన్లోని పాచిపడ్రా గ్రామానికి చెందిన ఓ 17 ఏళ్ల బాల్య వివాహ బాధితురాలిని రక్షించడంతో మళ్లీ వార్తల్లోకి ఎక్కారు. ఆ 17 ఏళ్ల బాలిక భాండియావాస్ కమ్యూనిటీకి చెందినది. వారి కమ్యూనిటీలో బాల్య వివాహాలు సర్వసాధారణమే. అందుకనే ఆ అమ్మాయికి 12 ఏళ్ల వయస్సులోనే పెళ్లి చేశారు. 21 ఏళ్ల నిరుద్యోగి, తాగుబోతు అయిన భర్త వద్దకు ఆ అమ్మాయిని కాపురానికి పంపేందుకు తల్లిదండ్రులు ఇటీవల ఒత్తిడి చేశారు. తాను కాపురానికి వెళ్లనని, చదుకుంటానని ఆ అమ్మాయి ఎంత మొత్తుకున్నా తల్లిదండ్రులు వినిపించుకోకుండా రోజూ చిత్ర హింసలకు గురి చేయడం ప్రారంభించారు. దాంతో ఆ అమ్మాయి ఒకరోజు ఇంటి నుంచి సమీపంలో ఉన్న ఎడారిలోకి తెల్లవారు జామున పారిపోయింది. ఈ విషయం తెలిసిన కృతి భారతి ఆమెను వెతుక్కుంటూ వెళ్లారు. ఎడారి మొదట్లోనున్న చెట్టువెనక దాక్కొని విలపిస్తున్న ఆ అమ్మాయిని కృతి కష్టపడి కనుక్కున్నారు. ఆమెకేమీ భయంలేదని, అన్ని విధాల ఆదుకుంటానని నచ్చ చెప్పి ఆ అమ్మాయిని బర్మర్ తీసుకెళ్లి అక్కడి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. ఆ అమ్మాయి తల్లిదండ్రులకు నచ్చ చెప్పేందుకు ప్రస్తుతం ప్రయత్నిస్తున్నారు. వారితో ఓ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. మంచి మాటలతో తల్లిదండ్రులను ఒప్పించి, ఆ తర్వాత అత్తా మామలను ఒప్పించి పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకునేల చేస్తానని కృతీ భారతి మీడియాకు తెలిపారు. సాధ్యంకాని పక్షంలో కోర్టులో న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు. కృతీ చేస్తున్న కృషికిగాను ఆమెను ‘ఫాస్టెస్ట్ లీగల్లీ అనల్డ్ మ్యారేజెస్’, ‘ఫస్ట్ ఎవర్ చైల్డ్ మ్యారేజ్ అనల్మెంట్’ అనే టైటిళ్లు వరించాయి. ప్రపంచంలో జరుగుతున్న బాల్య వివాహాల్లో 40 శాతం భారత్లోనే జరుగుతున్నాయని ఐక్యరాజ్యసమితి లెక్కలు తెలియజేస్తున్నాయి.