breaking news
Krishna Delta range
-
డెల్టా ఆధునీకరణపై నిపుణుల కమిటీ!
* 14న గుంటూరులో ఉన్నతస్థాయి సమీక్ష * 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు రాక * రద్దుకానున్న పనులు.. మరికొన్నింటికి టెండర్లు సాక్షి ప్రతినిధి, గుంటూరు: కృష్ణాడెల్టా ఆధునీకరణ పనులపై ప్రభుత్వం నిపుణుల కమిటీని నియమించే యోచనలో ఉంది. ఆరేళ్ల నుంచి పనులు ఆలస్యంగా జరగడానికి గల కారణాలను తెలుసుకుని ఈ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వ నిర్ణయాలు ఉంటాయని ఇరిగేషన్‌శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే వైఎస్ చేపట్టిన జలయజ్ఞంపై చర్యలు తీసుకుంటే రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండటంతో డెల్టాల వారీగా సమీక్షలకు కొత్త ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దీనిలో భాగంగా, ఈనెల 14న గుంటూరులోని జిల్లాపరిషత్ సమావేశ హాలులో సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేస్తోంది. భారీ నీటిపారుదల శాఖమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరగే ఈ సమావేశానికి పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు ఎంపీలు, ఆయా జిల్లాల కలెక్టర్లు, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు హాజరుకానున్నారు. ఆరేళ్ల కిందట నిర్మాణ సంస్థలు ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాల ప్రకారం పనులు జరిగి ఉంటే 20 టీఎంసీల నీరు మిగులు ఉండేది. కొన్ని పనులు ఆలస్యం కావడానికి ప్రభుత్వం, మరికొన్నింటికి నిర్మాణ సంస్థలు కారణంగా తెలుస్తోంది. ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు వేయకపోవడంతో పేరు ప్రఖ్యాతులు, సమర్థత కలిగిన నిర్మాణ సంస్థలు కూడా కొన్ని పనులను ప్రారంభించలేదు. ఏడాది పొడవునా నీరు ప్రవహించే కాలువలకు మరమ్మతులు చేయాలని, నల్లరేగడి కలిగిన కాలువలకు సిమెంట్ లైనింగ్ చేయాలని కొందరు ఇంజనీర్లు హడావుడిగా అంచనాలు తయారు చేశారు. ఈ కాలువలకు సిమెంట్ లైనింగ్ చేస్తే బీటలు వారే అవకాశాలు ఎక్కువ. ఈ విషయంలో కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా అంచనాలు తయారుచేయాలి. అప్పట్లో ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరగడంతో కొందరు ఇంజనీర్లు సక్రమంగా అంచనాలు తయారు చేయలేకపోయారు. దీంతో నిర్మాణ సంస్థలు పనులు ప్రారంభించలేదు. భూసేకరణ, డిజైన్ల అనుమతిలో జాప్యం వల్ల కూడా నిర్మాణ సంస్థలు పనులు చేయలేకపోయాయి. దీనికి తాము బాధ్యులం కాబోమని ఆ సంస్థలు చెబుతున్నాయి. కొన్ని నిర్మాణ సంస్థలు మొబిలైజేషన్ అడ్వాన్సులు తీసుకుని పనులు ప్రారంభించలేదు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా ఆ సంస్థల అధిపతులు ప్రముఖ రాజకీయ పార్టీలకు చెందినవారు కావడంతో అధికారులు మిన్నకుండి పోయారు. ఈ కారణాలతో కృష్ణాడెల్టాలోని 13.35 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణకు ప్రభుత్వం రూ. 4,573 కోట్లను ఆధునీకరణ పనులకు కేటాయిస్తే రూ. 1,178 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. ఇప్పటికే నిర్మాణ సంస్థల పనితీరు, పనులు జరగకపోవడానికి గల కారణాలపై ఒక అవగాహన వచ్చిన ఇరిగేషన్ ఇంజనీర్లు కొన్నింటిని రద్దు చేసేందుకు నివేదికలు రూపొందించినట్టు తెలుస్తోంది. ఏకపక్ష నిర్ణయాలు తీసుకునేకంటే పనుల పరిశీలన, నివేదిక ఇవ్వడానికి ఒక నిపుణుల కమిటీ ఏర్పాటుచేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. పదవీ విరమణ చేసిన చీఫ్ ఇంజనీర్లు, కృష్ణాడెల్టా చీఫ్ ఇంజనీర్ ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. వీరు ప్రభుత్వానికి ఇచ్చే నివేదికను ఆధారంగా చేసుకుని అవసరంలేని పనులను రద్దు చేసే అవకాశం ఉంది. పనులు చేయని నిర్మాణ సంస్థల ఒప్పందాన్ని రద్దు చేసి, చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు చెబుతున్నారు. రద్దు కానున్న పనుల్లో రైతులకు అవసరమైనవి ఉంటే వాటికి టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. -
ప్రమాద ఘంటికలు
చీరాల : కృష్ణా డెల్టా పరిధిలో ఈ ఏడాది ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఒకవైపు పొలాలు బీళ్లను తలపిస్తుండగా.. డెల్టా కాలువ పరిధిలోని కారంచేడు, పర్చూరు మండలాల్లోని తాగునీటి చెరువులు ఎండి నోళ్లు తెరుచుకున్నాయి. దీంతో ఊళ్లకు ఊళ్లే అలమటిస్తున్నాయి. అతివృష్టి, అనావృష్టిలతో ఏటా డెల్టా రైతులు నిండా మునిగిపోతున్నారు. ఈ ఏడాదైనా ఏరువాక సవ్యంగా సాగి అప్పుల బాధల నుంచి గట్టెక్కుతామని ఆశించిన రైతన్న పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. కేంద్ర జలసంఘం మంగళవారం తీసుకున్న నిర్ణయం ప్రకా రం నీరు వస్తే కనీసం తాగునీటి సమస్య కొంతైనా తీరుతుంది. వివరాల్లోకెళ్తే... వరుణుడు కరుణించకపోవడం, రెండు నెలలుగా ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం నిలిచిపోవడంతో తెలుగు రాష్ట్రాలకు వరదాయిని అయిన నాగార్జునసాగర్‌లో నీటి మట్టం అడుగంటింది. ఎగువ ప్రాంతం నుంచి తుంగభద్ర, నారాయణపూర్, జూరాల ప్రాజెక్టుల నుంచి ప్రవాహం నిలిచిపోవడంతో సాగర్‌లో నీటి సామర్థ్యం రోజురోజుకూ గణనీయంగా తగ్గింది. నాలుగు నెలల తర్జనభర్జనల అనంతరం కేంద్ర జలసంఘం జోక్యంతో కృష్ణా డెల్టాకు 10 టీఎంసీల నీటిని విడుదల చేయాలని మధ్యంతర కమిటీ జూన్ 11న తీర్మానించింది. దీనికి తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేయడంతో చివరకు 3.6 టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు విడుదల చేయాలని నిర్ణయించింది. ఆ మేరకు కృష్ణా, ప్రకాశం జిల్లాల తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసినప్పటికీ జిల్లాలోని కొమ్మమూరు కాలువకు నీటి బొట్టు కూడా రాలేదు.మూడు రోజుల్లో నీళ్లు వస్తాయని అధికారులు చెబుతున్నారు. నాగార్జునసాగర్‌కు నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా డెడ్ స్టోరేజి 510 అడుగులు. ప్రస్తుతం 517 అడుగులకు పడిపోయింది. 517 అడుగుల నీటి సామర్థ్యం ఉంటేనే సాగర్ నుంచి నీటిని విడుదల చేయాలనే నిబంధన ఉంది. దీనిని బట్టి కృష్ణా డెల్టా పరిధిలో ఆఖరున ఉన్న కొమ్మమూరు కాలువకు తాగు, సాగునీటి సమస్య పొంచి ఉంది. కొమ్మమూరు కాలువ కింద లక్ష ఎకరాలు సాగు అవుతుంది. వందలాది మంచినీటి చెరువులు ఉన్నాయి. రుతుపవనాలు ప్రారంభమైనా వానల జాడేలేదు. ఎగువ ప్రాంతా ల్లో విస్తారంగా వర్షాలు కురిసి నాగార్జునసాగర్‌కు నీరు వస్తేనే డెల్టా పరిధిలోని కొమ్మమూరు కాలువ ఆయకట్టు సాగవుతుంది. దాంతోపాటు తాగునీటి చెరువులూ నిండుతాయి. లేకుంటే పరిస్థితి అత్యంత దుర్భిక్షంగా ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.