breaking news
kondapi Mla
-
కొండపి ఎమ్మెల్యేపై పోలీసులకు ఫిర్యాదు
సాక్షి, కొండపి: కొండపిలోని కామేపల్లి రోడ్డులో సోమవారం ప్రభుత్వం నిర్వహించిన వైఎస్సార్ రైతు దినోత్సవం కార్యక్రమాన్ని అబాసుపాలు చేయటానికి కొండపి ఎమ్మెల్యే డీఎస్‌బీవీఎన్ స్వామి తన అనుచరులతో ప్రయత్నించాడని కొండపి వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ డాక్టర్ వెంకయ్య అన్నారు. రైతు దినోత్సవం సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే స్వామి తన అనుచరులతో వచ్చి సృష్టించిన గలాటాపై మంగళవారం ఆదర్శరైతు దివి శ్రీనివాసులు కొండపి ఎస్ఐ ప్రసాద్‌కి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొండపి వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ వెంకయ్య విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం రైతుల కోసం చేపట్టిన మంచి కార్యక్రమాన్ని సజావుగా సాగకుండా చేయటం కోసం స్వామి తన అనుచరులతో వచ్చారని ఆరోపించారు. రైతు దినోత్సవం వద్ద సీఎం జగన్మోహన్రెడ్డిని ఎమ్మెల్యే స్వామి పరుషపదజాలంతో దూషించారని అన్నారు. ఇది తగదని చెప్పిన రైతుల మీదకు సైతం ఆయన అనుచరులు పైకి దూకారన్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండి సంయమనం పాటించకుండా అల్లరిమూకతో వచ్చి నానాయాగి చేయటం తగదన్నారు. జిల్లా మంత్రి బాలినేని సైతం స్వామిని రైతుదినోత్సవంలొ పాల్గొనేలా చూడాలని చెప్పగా తాను పిలవటానికి వెళ్లానని, అప్పటికే గందరగోళం చేసి వెళ్లిపోయాడన్నారు. స్వామి గతంలో గ్రామాల్లో రైతుల మీద ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టించగా ఆరైతులు స్వామిని చూసి ఆందోళన చేశారన్నారు. ఏ ప్రోటోకాల్‌తో దామచర్ల సత్యను ముందు సీట్లో కూర్చొబెట్టుకుని వెనుక సీట్లో ఎమ్మెల్యే స్వామి కూర్చున్నారని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యే స్వామి ఒక బాధ్యతగల ప్రజాప్రతినిధిగా వ్యవహరించకుండా ప్రభుత్వ కార్యక్రమాలను అబాసుపాలు చేయటానికి ఇటువంటి దౌర్జన్యాలకు పాల్పడటం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదన్నారు. స్వామి తన పద్ధతి మార్చుకోకుంటే ప్రజలే తగిన బుద్ది చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్ సీపీ కన్వినర్ గోగినేని వెంకటేశ్వరరావుతో పాటు పలు గ్రామాల నుంచి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. -
కొండపి ఎమ్మెల్యే స్వామికి త్రుటిలో తప్పిన ప్రమాదం
ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఎమ్మెల్యే కారు స్వల్ప గాయాలతో బయటపడిన ఎమ్మెల్యే కారులో ఎమ్మెల్యేతో పాటు మరో ముగ్గురు ఒంగోలు క్రైం : కొండపి ఎమ్మెల్యే, టీటీడీ పాలక మండలి సభ్యుడు డాక్టర్ డోలా బాలవీరాంజనేయ స్వామికి నగరానికి సమీపంలోని చెర్వుకొమ్ముపాలెం జంక్షన్ జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి ప్రమాదం త్రుటిలో తప్పింది. వేగంగా వస్తున్న ఎమ్మెల్యే కారు ముందు వెళ్తున్న లారీని బలంగా ఢీకొంది. కారులోని బెలూన్లు ఓపెన్ కావటంతో పెను ప్రమాదం నుంచి ఎమ్మెల్యే బయట పడగలిగారు. ఎమ్మెల్యే స్వామికి స్వల్ప గాయాలయ్యాయి. ముఖం మీద దవడ ఎముక స్వల్పంగా దెబ్బతింది. హుటాహుటిన మరో కారులో చికిత్స కోసం ఓ ప్రైవేటు వైద్యశాలలో చేర్చారు. టంగుటూరు నుంచి రాత్రి 9 గంటల సమయంలో ఒంగోలు వస్తుండగా ప్రమాదం జరిగింది. వంద కిలోమీటర్లకు పైగా వేగంగా వస్తున్న ఎమ్మెల్యే కారు బలంగా లారీని ఢీకొంది. చెరువుకొమ్ముపాలెం జంక్షన్ వద్ద ముందు వెళ్తున్న లారీకి ఓ ఆటో అడ్డం వచ్చింది. దీంతో లారీ డ్రైవర్ సడన్‌గా బ్రేక్ వేశాడు. ఆ వెనుకే వస్తున్న ఎమ్మెల్యే కారు లారీని ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగినప్పుడు కారులో ఎమ్మెల్యే స్వామి ముందు సీట్లో కూర్చొని ఉన్నారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు గన్మన్లు ఉన్నారు. కారులో ఉన్న మరెవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఒంగోలు తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పలువురు అధికారులు, నాయకులు వైద్యశాలకు వెళ్లి ఎమ్మెల్యేను పరామర్శించారు.