ఆస్పత్రుల పెద్దమనసు
పాత నోట్లు రద్దు చేయడం, కొత్త నోట్లు గానీ, వంద రూపాయల నోట్లు గానీ ఇంకా పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాకపోవడంతో రోగులు, వాళ్ల బంధువులు ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో కోల్‌కతా ఆస్పత్రులు పెద్దమనసు చేసుకున్నాయి. బిల్లులు చెల్లించేందుకు చెక్కులు, డెబిట్ లేదా క్రెడిట్ కార్డులను కూడా తాము ఆమోదిస్తామని ప్రకటించాయి. అత్యవసర కేసుల విషయంలో అయితే.. తర్వాత చెల్లిస్తామన్న ఒప్పందం మీద కూడా కొన్ని ఆస్పత్రులలో చికిత్సలు అందిస్తున్నారు. నగరంలోని చాలావరకు ఆస్పత్రులలో చెక్కులను కూడా ఆమోదిస్తున్నారు. స్థానికులతో పాటు బంగ్లాదేశ్, నేపాల్ దేశాల నుంచి వచ్చిన రోగుల వద్ద కూడా చెక్కులు తీసుకుంటున్నారు.
రోగులకు చికిత్స అందించడం తమ బాధ్యత అని, అందుకే పేషెంట్లు తమను సంప్రదించేందుకు వీలుగా ఒక హెల్ప్‌లైన్ కూడా ఏర్పాటుచేశామని మెడికా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వైస్ చైర్మన్, కార్డియాక్ సర్జన్ డాక్టర్ కునాల్ సర్కార్ తెలిపారు. మరీ అత్యవసరమైతే రోగుల నుంచి తర్వాత చెల్లిస్తామన్న అండర్‌టేకింగ్ కూడా తీసుకుంటున్నామన్నారు. స్థానిక గ్యారంటర్ ఒకరిని తీసుకురావాలని బయటి వారికి చెబుతున్నామన్నారు.
తమ ఆస్పత్రిలో చెక్కులు, డెబిట్, క్రెడిట్ కార్డులన్నింటినీ ఆమోదిస్తున్నట్లు ఏఎంఆర్ఐ గ్రూపు ఆస్పత్రుల సీఈఓ రూపక్ బారువా తెలిపారు. ఆపరేషన్లు ఉంటే దానికి రెండు మూడు రోజుల ముందే చెక్కులు అడుగుతున్నామని, దానివల్ల ఆ సమయానికి చెక్కు చెల్లిందో లేదో తెలిసిపోతుందని ఆయన చెప్పారు. కేంద్రప్రభుత్వం పెద్దనోట్లను రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన తర్వాత ప్రజలకు వీలైనంతగా సాయం చేయడానికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆస్పత్రులన్నీ ప్రయత్నిస్తున్నాయని నారాయణ హెల్త్ నెట్వర్క్ జోనల్ డైరెక్టర్ ఆర్. వెంకటేశ్ తెలిపారు. అపోలో ఆస్పత్రులలో కూడా చెక్కులు అంగీకరిస్తున్నారు. చాలావరకు పేషెంట్లు డెబిట్ లేదా క్రెడిట్ కార్డులతోనే చెల్లింపులు చేస్తున్నందున పెద్దగా ఇబ్బంది ఏమీ లేదని, అవి లేనివాళ్లు చెక్కులు ఇస్తామన్నా తాము సరేనంటున్నామని ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి.