breaking news
kodela Srinivasa Rao
-
కేసీఆర్‌కు ధన్యవాదాలు: బాలకృష్ణ
హైదరాబాద్: కేన్సర్ వ్యాధిగ్రస్తులకు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రభుత్వానికి ఆస్పత్రి చెల్లించాల్సిన రుసుమును మాఫీ చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ప్రముఖ నటుడు, బసవతారకం ఇండో అమెరికన్ ఆస్పత్రి చైర్మన్ బాలకృష్ణ పేర్కొన్నారు. బుధవారం ఆస్పత్రి 16వ వార్షికోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేశారు. కేన్సర్ వ్యాధిపై పోరాడి అజేయులుగా నిలిచిన పలువురిని సత్కరించారు. కుల, మత, ప్రాంత తారతమ్యం లేకుండా అందరికీ అంతర్జాతీయస్థాయి వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన క్రీడల్లో విజేతలకు ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు బహుమతులు అందజేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సీఈవో ఆర్పీ సింగ్, ట్రస్ట్ సభ్యులు నామా నాగేశ్వరరావు, ఎంవీఎస్ఎస్ మూర్తి, జేఎస్ఆర్ ప్రసాద్, మెడికల్ డెరైక్టర్ టీఎస్ రావు, మెడికల్ సూపరింటెండెంట్ సత్యనారాయణ, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. -
నా కుమారుడిని కిడ్నాప్ చేశారు
హైకోర్టులో ఏపీ స్పీకర్ కోడెల కోడలు హెబియస్ కార్పస్ హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు కుమారుడు కె.శివరామకృష్ణ తన నాలుగేళ్ల కుమారుడిని అపహరించారని, తన కుమారుడిని కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ శివప్రసాదరావు కో డలు పద్మప్రియ బుధవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో తెలంగాణ ప్రభుత్వ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, కోడెల కుమారుడు కె.శివరామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ ముఖ్య కార్యదర్శి, విశాఖపట్నం ఎస్పీ, విశాఖపట్నం త్రీటౌన్ సీఐలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ‘నా భర్త శివరామకృష్ణకు ఇంతకు ముందే పెళ్లైందని, హింస భరించలేకే మొదటి భార్య విడాకులు తీసుకుని వెళ్లిపోయిందని తెలిసింది. వీరి హింస, బాధలు భరించలేక నాలుగు నెలల గర్భిణిగా ఉన్న సమయంలో నేను నా తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయాను. 2010 అక్టోబర్ 18న నేను మగబిడ్డకు జన్మనిచ్చాను. ఈ నెల 17న నా తండ్రి ఇంటిలో లేని సమయంలో శివరామకృష్ణ, జయలక్ష్మీ సీఫుడ్స్ అధినేత కె.రమేష్, వికాస్ కాన్సెప్ట్ స్కూల్ చైర్మన్ సూరపనేని కోటేశ్వరరావు, వైజాగ్‌కు చెందిన కోనేరు సురేష్, ఇండో అమెరికన్ ఆసుపత్రికి చెందిన డాక్టర్ సుమతి, ఏపీ సూపర్ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రికి చెందిన జితేంద్ర కలిసి మా ఇంటికి వచ్చి నా కుమారుడిని బలవంతంగా ఎత్తుకెళ్లారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.’ అని ఆమె తన హెబియస్ కార్పస్ పిటిషన్లో పేర్కొన్నారు.