breaking news
Khadijah
-
కాబా పునర్ నిర్మాణంలో ముహమ్మద్ (స)
ముహమ్మద్ కుటుంబ బాధ్యతల నుండి తప్పించుకోలేదు. అర్ధాంగి హక్కులను విస్మరించలేదు. భార్యగా ఖదీజా హక్కులన్నింటినీ ఆయన నెరవేర్చేవారు. ఆమె ఇష్టాయిష్టాలను, మనోభావాలను గౌరవించేవారు. ఆమె సంపద సంరక్షించేవారు. ముహమ్మద్ గారి సహచర్యంలో ఖదీజా ఎంతో ఆనందంగా గడిపేవారు. ఆయన తోడు ఆమెకు సంతోషంతోపాటు, శాంతిని, సంతృప్తిని ప్రసాదించేది. ముహమ్మద్ (స) ఏకాంతాన్నే ఇష్టపడేవారు కాని, ప్రజలందరితో సత్సంబంధాలు కలిగి ఉండేవారు. వారి కష్టసుఖాలను విచారించేవారు. ఎక్కువశాతం మౌనంగానే ఉండేవారు. అవసరమనుకుంటే సంక్షిప్తంగా, మనోహరంగా మాట్లాడేవారు. ఇతరులు చెప్పేది చాలా శ్రద్ధ్ధగా వినేవారు. వాదించేవారు కాదు. ఎప్పుడూ చిరునవ్వు పెదాలపైనే ఉండేది. ఇతరుల అవసరాల్ని కూడా తన అవసరాలుగానే భావించేవారు. ఎవరికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సిద్ధంగా ఉండేవారు. ఇలాంటి అనేక సుగుణాల కారణంగా ప్రజలు ఆయన్ని అమితంగా అభిమానించేవారు. ఎంతగానో గౌరవించేవారు. ఆయన మాటకు ఎంతో విలువ ఇచ్చేవారు. ఏ విషయమైనా, ఆయనగారి సలహా తీకునేవారు. ఒకసారి మక్కాలో తీవ్రమైన ముసురు పట్టింది. ముసురు కాస్తా కుండపోతగా మారింది. రోజుల తరబడి ఒకటే వర్షం. మంచిమంచి కట్టడాలు కూలిపోయాయి. కాబా గృహం కూడా ప్రభావితమైంది. దాని పునాదులు బలహీనపడ్డాయి. ఇది చూసి మక్కావాసుల్లో తీవ్రమైన ఆందోళన ప్రారంభమైంది. తమ ఆరాధనాలయానికి ఏమవుతుందో, ఎలాంటి అపచారం జరిగిందోనని ఆవేదన చెందసాగారు. వెంటనే మక్కా పెద్ద, ఇతర తెగల నాయకులందరు సమావేశమై చర్చించారు. మరమ్మతులు చేపట్టాలని తీర్మానించుకున్నారు. మక్కా ప్రజలకు కాబాయే సర్వస్వం. అది వారి పవిత్ర ఆరాధనాలయం. దూరతీరాల నుండి కూడా ప్రజలు కాబా దర్శనానికి వస్తుంటారు. దాని కారణంగా అక్కడ వ్యాపారం విస్తరించింది. ఎక్కడెక్కడి ప్రజలో అక్కడికి రావడం మూలాన అదొక వాణిజ్య కూడలిగా విరాజిల్లుతోంది. కాబా కారణంగా మక్కా నగర కీర్తిప్రతిష్టలు దశదిశలా వ్యాపించాయి. మక్కావాసుల గౌరవోన్నతులకూ అదే కారణం. ఇప్పుడు కాబాకు ఏమైనా జరిగితే..? ఈ ఆలోచనే వారిని కలచివేస్తోంది. ఒకవేళ కట్టడాన్ని పూర్తిగా కూల్చేసి పునర్ నిర్మాణం చేపడితే..? బాగానే ఉంటుంది. కాని ఎవరు ముందుకు రావాలి? కాబాపై పలుగో పారో ఎవరెత్తాలి? అంత ధైర్యం ఎవరికుంది? దీర్ఘచర్చల అనంతరం, పాతకట్టడాన్ని కూల్చి నూతనంగా నిర్మించాలని తీర్మానించుకున్నారు. అయితే పునర్ నిర్మాణానికి కావలసిన సామగ్రి, నిష్ణాతులైన పనివాళ్ళను సమకూర్చుకోవడం ఎలా అన్న ప్రశ్న మరలా ఉత్పన్నమైంది. కాని అదృష్టవశాత్తూ, వెతకబోయిన తీగ కాలికే చుట్టుకున్నట్టు, అప్పుడే రోమ్ నుండి అబీసీనియాకు నిర్మాణ సామగ్రితో వెళుతున్న ఒక నౌక సౌదీ అరేబియాలోని జిద్దా ఓడరేవుకు ఢీకొని శిధిలమైపోయింది. దాంతో నిర్మాణ సామగ్రినంతా ఒడ్డుకు చేర్పించి, అబీసీనియా నౌక కోసం ఎదురు చూస్తున్నాడు యజమాని. ఈ విషయం తెలుసుకున్న మక్కా పెద్ద జిద్దా రేవుకు చేరుకొని, అతనికి విషయమంతా పూసగుచ్చినట్టు వివరించారు. దైవకార్యానికి సహకరించమని అభ్యర్ధించారు. కాబా గృహానికి సేవలందించడం కంటే మహాభాగ్యమేముందని భావించిన నిర్మాణ సామగ్రి యజమాని పరమసంతోషంగా అంగీకరించాడు. మరొక విశేషమేమిటంటే, ఆ వ్యక్తి ఆలయాల నిర్మాణంలో కూడా నిష్ణాతుడు. నిర్ణీత రోజు రానేవచ్చింది. ఇక కాబా గోడ పడగొట్టాలి. మరోసారి అందరినీ భయం ఆవహించింది. తమ సంకల్పం ఆలయ పునర్ నిర్మాణమేగాని, దాన్ని నాశనం చెయ్యాలన్నది కాదు గదా అన్న ఆలోచన కొంత ధైర్యాన్నిచ్చింది. పాతకట్టడం పడగొట్టడానికి ముందు వారు రకరకాల పూజలు నిర్వహించారు. అనంతరం అందరూ ఊపిరి బిగబట్టి చూస్తుండగా, వలీద్ అనే వ్యక్తి వణుకుతున్న చేతులతోనే గడ్డపలుగుతో వేటువేశాడు. అంతా నిశ్శబ్దం. ఏ ఆపద విరుచుకుపడుతుందోనని, కొన్ని క్షణాలు గడిచిపోయాయి. ఎవరికీ ఏమీ కాలేదు. తరువాత అందరూ కలిసి కాబా గోడ పడగొట్టాలి. పని శరవేగంతో జరుగుతోంది. పునర్ నిర్మాణ పనిలో ముహమ్మద్ (స), అతాలిబ్ కూడా చురుగ్గా పాల్గొన్నారు. గోడల నిర్మాణం పూర్తయి ‘హజెఅవ్వద్ ’ (నల్లనిరాయి) అమర్చే సమయం వచ్చింది. హజెఅవ్వద్కు చాలా ప్రాముఖ్యం ఉంది. అందుకని ఈ పవిత్ర శిల కాబా గోడలో ఎవరు అమర్చాలి? అన్న సమస్య తలెత్తింది. ప్రతి పెద్దమనిషీ తనకే ఆ పుణ్యం దక్కాలని కోరుకున్నాడు. ప్రతి తెగా ఆ పుణ్యకార్యం చేసే హక్కు తమకే ఉందని భావించింది. ఎవరికి వారు పట్ట్టుదలకు పోవడంతో అదొక పెద్ద సమస్యగా మారి, చినికి చినికి గాలివాన అయ్యింది. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ -
ముహమ్మద్ మనసులో మొగ్గ తొడిగిన ప్రేమ
ప్రవక్త జీవితం అంతకు మునుపే ముహమ్మద్ వ్యక్తిత్వాన్ని గురించి, నీతి, నిజాయితీ, సచ్ఛీలతల గురించి కొద్దోగొప్పో విని ఉన్న ఖతీజా ఇప్పుడు స్వయంగా తన మనుషులే దానికి సాక్ష్యంగా నిలవడంతో చాలా సంతోషించారు. మానవత్వం మూర్తీభవించిన అలాంటి మచ్చలేని మనిషి తన వ్యాపారానికి లభించినందుకు ఎంతో సంబరపడ్డారు. ఇలాంటి సచ్చీలుడు తనకు జీవిత భాగస్వామి కూడా అయితే బావుండునన్న భావన ఆమెకు కలిగింది. భర్తచనిపోయిన తరువాత, యావత్తూ అరేబియా దేశంలోని ఎందరో గొప్పింటిబిడ్డలు, మహామహులు, సంపన్నులు వివాహ సంబంధాలు పంపినా ఆమె వాటన్నిటినీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కాని ఇప్పుడామె మనసులో ప్రేమ కుసుమాలు మొగ్గతొడుగుతున్నాయి. మనసులో సంఘర్షణ మొదలైంది. ఎలా? తన మనసులోని మాట ముహమ్మద్ బాబాయి అబూతాలిబ్‌కు తెలియజేయడం ఎలా? అంతకు ముందు ముహమ్మద్ అభిప్రాయం తెలుసుకోవడం ముఖ్యం. ఇప్పుడు ఏమిటి చేయడం? దీర్ఘాలోచనలో మునిగిపోయారామె. అంతలో ‘‘ఏంటమ్మా అంతలా ఆలోచిస్తూ కూర్చున్నారూ?’’ అంటూ వచ్చింది స్నేహితురాలు నఫీసా. ‘‘ఏం లేదు నఫీసా. నేనొక విచిత్రమైన పరిస్థితిలో పడిపోయాను. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు’’ ‘‘అంతటి దీర్ఘాలోచనలో పడేసిన విషయం ఏమిటీ ఇంతకీ?’’ ప్రశ్నించింది నఫీసా. మనసులో ఉన్న విషయం స్నేహితురాలితో చెప్పారు ఖతీజా. ‘‘ఓస్! ఇంతేనా?’’ ‘‘అంటే?’’ ‘‘ఏముంది? అంతటి సుగుణాల పోగు, సత్యసంధుడు అయిన వ్యక్తిని వివాహమాడేందుకు వెనుకా ముందూ ఆలోచించాల్సిన అవసరమే లేదు’’ తన అభిప్రాయం చెప్పింది నఫీసా. అంతటితో ఆగకుండా వెంటనే నఫీసా ముహమ్మద్ దగ్గరకు వెళ్లింది. ఆ మాటా ఈ మాటా మాట్లాడి, మరి పెళ్లెప్పుడు చేసుకుంటారు?’’ అని అడిగింది. ‘‘ఏమో! ఇంతవరకు పెళ్లి ఆలోచన రాలేదు. ఎవరైనా ఉన్నారా ఏమిటి నీ దృష్టిలో?’’ ‘‘అవును.’’‘‘ఎవరేమిటి?’’ ‘‘ఖదీజా.’’ ఈ పేరు వింటూనే ముహమ్మద్ అవాక్కయ్యారు. ఖతీజా గుణగణాలను గురించి, ఆమె వ్యక్తిత్వాన్ని గురించి ఆయన ఏది విన్నారో ఆమెలో అదే చూశారు. ఆమె సత్ప్రవర్తన, సచ్ఛీలతల కారణంగా ప్రజలు ఆమెను ‘తాహి రా’ అని పిలుచుకునేవారు. ఖదీజాతో వివాహమన్న విషయం కనీసం ఆయన కలలో కూడా ఊహించలేదు. గొప్ప గొప్ప సంబంధాలను ఆమె కాలిగోటితో తిరస్కరించారు. అరేబియాలోని ఎందరో మహానుభావులు ఆమె వద్దకు వివాహ సందేశాలు పంపి భంగపడ్డారు. అందుకే ఆయన, ‘‘ఏమిటి నువ్వంటున్నది?’’ అని ఆశ్చర్యంగా ప్రశ్నించారు. ‘‘అవును, నేను నిజమే చెబుతున్నాను’’ ‘‘మరి ఇది ఎలా సాధ్యం?’’ నఫీజా ఖదీజాకు చెప్పిన సమాధానమే ఇక్కడా చెప్పింది. ఆ విషయం నాకొదిలేయండి’’ అన్నదామె. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)