breaking news
key projects
-
ఆంధ్రా తీరం.. ఆర్థికంగా ఊతం
సాక్షి, అమరావతి: రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ సముద్ర తీరాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ప్రాజెక్టులను చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి 50 కి.మీకు ఒక్క పోర్టు లేదా ఫిషింగ్ హార్బరు (మినీ పోర్టు)లను నిర్మిస్తోంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకేసారి నాలుగు పోర్టులతో పాటు పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్ల నిర్మాణాన్ని చేపట్టి రికార్డు సృష్టించింది. ఇందుకోసం సుమారు రూ.20,000 కోట్లు వ్యయం చేస్తుండటం గమనార్హం. తొలి దశలో జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ల పనులు దాదాపు పూర్తయ్యి ప్రారంభానికి సిద్ధం కానున్నాయి. ఎగుమతులను ప్రోత్స హించే విధంగా తీర ప్రాంత అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను నీతి ఆయోగ్ కూడా ప్రశంసించింది. 2022 సంవత్సరానికి నీతి ఆయోగ్ ప్రకటించిన ఎగుమతి సన్నద్ధత రాష్ట్రాల్లో రాష్ట్రం 59.27 పాయింట్లతో 8వ స్థానంలో నిలిచింది. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు గుజరాత్, తమిళనాడు, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన అవసరం ఉండదు. మరో వైపు పోర్టులను ఆధారంగా చేసుకుని చుట్టుపక్కలా పారిశ్రామిక ప్రగతిని వెదజల్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. సుమారు 8,000 ఎకరాల విస్తీర్ణంలో పారిశ్రామిక పార్కుతో పాటు తెట్టు వద్ద కార్గొ ఎయిర్‌పోర్టును అభివృద్ధి చేస్తున్నారు. ఫిషింగ్ హార్బర్ల సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతుల్లో 10 శాతం వాటా లక్ష్యం దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఎగుమతుల్లో 10 శాతం వాటాను చేజిక్కించుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారులకు లక్ష్యాన్ని నిర్దేశించారు. 2030 నాటికి 10 శాతం మార్కెట్ వాటాతో టాప్ 3 రాష్ట్రాల్లో ఒకటిగా నిలవాలన్న లక్ష్యానికి అనుగుణంగా ప్రభుత్వం పలు కీలక చర్యలు తీసుకుంటోంది. ఫలితంగా గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది ఆరు నెలల కాలంలో రాష్ట్ర వాణిజ్య ఎగుమతుల విలువ రూ. 82,732.65 కోట్ల నుంచి రూ.85,021.74 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా ఎగుమతుల విలువ రూ. 18,17,640.99 కోట్ల నుంచి రూ. 17,42,429.99 కోట్లకు పడిపోవడం గమనార్హం. 2022–23 ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రాష్ట్రం రూ.1,59,368.02 కోట్ల ఎగుమతులు చేయడం ద్వారా 4.40 శాతం వాటాతో ఆరో స్థానంలో నిలవగా, ఈ ఏడాది మొదటి ఆరు నెలల కాలంలో రూ. 85,021.74 కోట్ల ఎగుమతులతో దేశ ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను 4.88 శాతంకు పెంచుకొని ఐదో స్థానానికి ఎగబాకింది. ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు ♦ విశాఖపట్నం జిల్లా భీమిలి ♦ అనకాపల్లి జిల్లా రాజయ్యపేట, దొండవాక ♦ విజయనగరం జిల్లా చింతపల్లి ♦ తిరుపతి జిల్లా రాయదరువు ♦ కాకినాడ జిల్లా ఉప్పలంక -
కీలక ప్రాజెక్టులపై కేంద్రమంత్రి గడ్కరీతో సీఎం జగన్ చర్చ
సాక్షి, అమరావతి: పూర్తయిన పలు జాతీయ రహదారుల ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనల తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ నేరుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నివాసానికి చేరుకున్నారు. కేంద్ర మంత్రి గౌరవార్ధం ఆయనకు సీఎం విందు ఇచ్చారు. భోజనం తర్వాత రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, ప్రతిపాదనలపై నితిన్ గడ్కరీతో సీఎం చర్చించారు. ఈ సమావేశంలో కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహాదారుల శాఖకు చెందిన అధికారులు, రాష్ట్రానికి చెందిన కీలక అధికారులు హాజరయ్యారు. చదవండి: డైనమిక్ సీఎం వైఎస్ జగన్.. కేంద్రమంత్రి గడ్కరీ ప్రశంసలు రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని గొప్పస్థాయికి తీసుకెళ్లగలిగే విశాఖపట్నం-భీమిలి-భోగాపురం (బీచ్ కారిడార్) రోడ్డుపై విస్తృత చర్చజరిగింది. రాష్ట్రాభివృద్ధిలో ఈ రోడ్డు కీలక పాత్ర పోషిస్తుందని, టూరిజం రంగం బాగుపడ్డమే కాకుండా చాలామందికి ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ముఖ్యమంత్రి.. కేంద్రమంత్రికి వివరించారు. విశాఖ నగరం నుంచి త్వరలో నిర్మాణం కానున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి త్వరగా చేరుకోవాలన్నా ఈ రహదారి అత్యంత కీలకమని సీఎం వివరించారు. ఈ ప్రాజెక్టుపై సానుకూలత వ్యక్తం చేసిన కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ప్రఖ్యాత అంతర్జాతీయ కన్సల్టెన్సీతో ప్రతిపాదనలు తయారు చేయించాలని సూచించారు. దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకుంటామని సీఎం వైఎస్ జగన్, గడ్కరీతో అన్నారు. విజయవాడలో ట్రాఫిక్ కష్టాలను తగ్గించడానికి ఇప్పుడు నిర్మాణం అవుతున్న పశ్చిమ బైపాస్‌తో పాటు తూర్పున మరో బైపాస్ నిర్మాణం కూడా చేయాలని ముఖ్యమంత్రి చేసిన విజ్ఞప్తిపై కేంద్రమంత్రి అంగీకారం తెలిపారు. ఈ ప్రాజెక్టును మంజూరు చేస్తున్నట్టుగా వెల్లడించారు. కృష్ణానదిపై బ్రిడ్జితోపాటు 40కి.మీ మేర బైపాస్ రానుంది. అలాగే రాష్ట్ర రహదారులపై 33 ఆర్వోబీల నిర్మాణంపై కూడా సీఎం.. కేంద్ర మంత్రితో చర్చించారు. వీటన్నింటికీ ఆమోదం తెలుపుతున్నట్టు కేంద్రమంత్రి వివరించారు. తమ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపినందుకు సీఎం జగన్.. కేంద్రమంత్రికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఆర్అండ్బీ మంత్రి ఎం.శంకరనారాయణ, ముఖ్యమంత్రి కార్యదర్శులతో పాటు రాష్ట్ర, రవాణా, ఆర్ అండ్ బీ ముఖ్యకార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, ఎం.ఒ.ఆర్.టి.హెచ్. ఆర్వో ఎస్.కె.సింగ్, ఎన్ఏఐ అధికారులు మహబిర్ సింగ్, ఆర్.కె.సింగ్ హాజరయ్యారు. -
ఈ సారైనా ఈ సార్లైనా సాధిస్తారా!
రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన ప్రతిసారీ ఆశగా ఎదురుచూడటం, ఆనక నిరాశకు గురికావడం జిల్లావాసులకు పరిపాటైపోయింది. దాదాపు మూడు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది. ఎన్డీఏ ప్రభుత్వం గురువారం రైల్వే బడ్జెట్ ప్రవేశపెడుతోంది. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో దాని మిత్రపక్షం తెలుగుదేశం అధికారంలో ఉన్నాయి. ఈ తరుణంలో ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ జిల్లావాసుల ఆశలనుచిగురింపజేస్తోంది. నేడు రైల్వే బడ్జెట్ సాక్షి ప్రతినిధి, కాకినాడ : జిల్లాకు సంబంధించి ప్రధానంగా రెండు కీలక ప్రాజెక్టులు దశాబ్దాల కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. కాకినాడను మెయిన్ లైన్‌తో అనుసంధానం చేసేందుకు కాకినాడ నుంచి పిఠాపురానికి 21 కిలోమీటర్ల బ్రాడ్‌గేజ్ లైన్ నిర్మించాలని నాలుగు దశాబ్దాల క్రితమే ప్రతిపాదించారు. సుమారు రూ.120 కోట్ల ఈ ప్రాజెక్టు పాలకుల్లో చిత్తశుద్ధి లేక ఎప్పటికప్పుడు అటకెక్కుతూ వస్తోంది. 2012 రైల్వే బడ్జెట్లో రూ.12 కోట్లు, 2013లో రూ.5 కోట్లు, 2014లో రూ.కోటి కేటాయించారు. ఇటీవల పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై రైల్వే ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు హైదరాబాద్‌లో జరిపిన సమీక్ష అనంతరం జిల్లావాసుల్లో ఆశలు చిగురించాయి. సమీక్షలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పట్ల రైల్వేశాఖ ఉన్నతాధికారులు సానుకూలంగా స్పందించారన్న కబురు కార్యరూపంలో కనిపిస్తుందో, లేదో బడ్జెట్లో కేటాయింపులను బట్టి తేలిపోనుంది. కృష్ణాజీ కృషి ఫలిస్తుందా? రైల్వే ప్రాజెక్టులు సాధిస్తామంటూ ఎన్నికల్లో లబ్ధి పొందడం, ఆనక మరిచిపోవడం జిల్లాలో ఎంపీలకు పరిపాటిగా మారింది. ‘ఇదివరకు ఎంపీలుగా ఉన్న వారు చేసింది లేదు. ఇప్పుడు టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ తోట నరసింహం కాకినాడ మెయిన్ లైన్ కోసం చిత్తశుద్ధితో కృషి జరిపి ఉంటే బడ్జెట్లో తగిన నిధులు వస్తాయి’ అని జిల్లావాసులు ఎదురుచూస్తున్నారు. ఈ లైన్ కోసం మూడుదశాబ్దాలు ఆందోళనలు చేసి, ఆశయం నెరవేరకుండానే కన్నుమూసిన ప్రయాణికుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.కృష్ణాజీ కృషి ఈ బడ్జెట్లోనైనా ఫలిస్తుందో, లేదో తేలిపోనుంది. దశాబ్దిన్నర నాటి పునాదిరాయికి కదలిక వచ్చేనా? ఇక కోనసీమవాసులు తమకు ఈ సారైనా రైలు కూత వినిపిస్తారా అని ఎదురుచూస్తున్నారు. లోక్‌సభ దివంగత స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి కృషితో 2000 నవంబరు 16న కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైన్ నిర్మాణానికి అమలాపురంలో పునాదిరాయి పడింది. అప్పటి రైల్వేమంత్రి మమతాబెనర్జీ, అప్పటి సీఎం చంద్రబాబు కూడా నాటి భూమిపూజ కార్యక్రమంలో పాల్గొని ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు. బాలయోగి ఆకస్మిక మరణం తరువాత కోటిపల్లి-నర్సాపురం రైల్వే లైను వైపు కన్నెత్తి చూసే నాథుడే లేకుండా పోయాడు. కోటిపల్లి నుంచి కోనసీమ మీదుగా నర్సాపురానికి రైల్వే లైను నిర్మించాలంటే మూడు గోదావరి నదీ పాయలపై బ్రిడ్జిలను నిర్మించాలి. ఈ ప్రాజెక్టు వ్యయం రూ.329 కోట్లు. మూడు వంతెనల నిర్మాణానికి కేటాయించింది రూ.170 కోట్లు. 55 కిలోమీటర్ల రైల్వే లైను నిర్మాణంలో వంతెనలే కీలకం. వశిష్ట గోదావరిపై సఖినేటిపల్లి- నర్సాపురం మధ్య 1.02 కిలోమీటర మేర రోడ్ కం రైలు వంతెన, వైనతేయ నదిపై బోడసకుర్రు-పాశర్లపూడి మధ్య 1.11 కిలోమీటర్ల మేర రైల్వే వంతెన, గౌతమీ నదీపాయపై కోటిపల్లి- ముక్తేశ్వరం మధ్య 1.42 కిలోమీటర్ల మేర రోడ్ కం రైలు వంతెన ప్రతిపాదించారు. మొత్తం ప్రాజెక్టు వ్యయం 2013 నాటికి రూ.వెయ్యి కోట్లు దాటిపోయింది. ఈ వెయ్యి కోట్ల పైబడి అంచనా బడ్జెట్లో 25 శాతం చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చినా జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన ఎంపీల్లో చిత్తశుద్ధి లేక ముందడుగు పడలేదు. రైల్వేలైను లక్ష్యంతో కోనసీమ రైల్వే సాధనసమితి ఏర్పాటైంది. అప్పటి నుంచి ఈ సమితి లైను నిర్మాణం, నిధుల కోసం శక్తి మేరకు ఆందోళనలు చేస్తోంది. అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ పదవీ కాలమంతటా దీనిని సాధిస్తానని ఆర్భాటంగా చెప్పుకుంటూ వచ్చారు. పదవీ కాలం ముగిసినా ప్రాజెక్టుకు ఆశించిన బడ్జెట్ సాధించలేకపోయారు. ప్రస్తుత ఎంపీ పండుల రవీంద్రబాబు కూడా ఎన్నికల్లో ఈ ప్రాజెక్టు పేరు చెప్పి ఓట్లు పొందారు. ఆయనైనా ఈ రైల్వేబడ్జెట్‌లో ఎంతోకొంత ముందడుగు వేయించాలని ప్రజలు ఆశపడుతున్నారు. నిధులివ్వకుంటే ఉద్యమం ఉధృతం.. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైను కోసం గత 10 ఏళ్లుగా శాంతియుతంగా ఉద్యమిస్తున్నాం. అయినా ఇప్పటి వరకు కొంచెమైనా కద లిక లేదు. టీడీపీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎన్నికల్లో హామీలు గుప్పించారు. రేపటి రైల్వే బడ్జెట్లో ఈ లైనుకు తగిన నిధులు కేటాయిస్తేనే ఆ హామీలకు విలువ ఉంటుంది. ఎప్పటిలాగే నిధుల విషయంలో మొండిచేయి చూపిస్తే ప్రజల భాగస్వామ్యంతో ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. - డాక్టర్ ఇ.ఆర్.సుబ్రహ్మణ్యం, కోనసీమ రైల్వేలైను సాధన సమితి కన్వీనర్ కనీసం రూ.100 కోట్లు కేటాయించాలి.. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైనుకు భారీగా నిధులు పట్టుకొస్తానని అమలాపురం ఎంపీ రవీంద్రబాబు హామీలు గుప్పించారు. ఈ బడ్జెట్లో కనీసం రూ.100 కోట్లు కేటాయిస్తే పనులు ప్రాథమికంగా ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. ఏమైనప్పటికీ నిధుల కేటాయింపులో ఈసారి కూడా అన్యాయం జరిగితే గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మా పోరాటం తీవ్రంగా ఉంటుంది. - కల్వకొలను తాతాజీ, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు, అమలాపురం కాకినాడ నుంచి కొత్త రైళ్లు వేయాలి.. కాకినాడ- ఢిల్లీ, కాకినాడ-కోల్‌కతా, కాకినాడ-బికనీర్, కాకినాడ-వారణాసిలకు కొత్తరైళ్లు వేయాలని గతం నుంచీ కోరుతున్నాం. కోటిపల్లి నుంచి రాయఘడ్కు ఒక పాసింజర్ రైలును, కాకినాడ నుంచి పలాసకు ఇంటర్సిటీ రైలును ప్రవేశపెడితే బాగుంటుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేక రైల్వే జోన్ ఏర్పాటుపై కూడా ఆశలు ఉన్నాయి. - వై.డి.రామారావు,జెడ్ఆర్యూసీసీ సభ్యుడు