breaking news
Kaushik Basu
-
రూపాయి విలువ 71 ఉంటే బెటర్
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ 71 వద్ద ఉండడమే భారత్ ఆర్థిక వ్యవస్థకు ప్రస్తుతం మంచిదని మాజీ చీఫ్ ఎకనమిక్ ఎడ్వైజర్ కౌశిక్ బసు అభిప్రాయపడ్డారు. ఎగుమతులకు ఇది మంచి పరిణామం అవుతుందని అన్నారు. అమెరికా డాలర్ మారకంలో రూపాయి విలువ ఈ ఏడాది 7 శాతం పతనమై ఇటీవల 69 కిందకు జారి, కొంత కోలుకుని ప్రస్తుతం 69–68.50 స్థాయిలో తిరుగుతోంది. అంతర్జాతీయ కోణంలో ప్రస్తుతం భారత్ కరెంట్ అకౌంట్లోటు, ద్రవ్యలోటు అంశాలపై దృష్టి పెట్టాలని, ఎగుమతుల పెంపునకు చర్యలు తీసుకోవాలని బసు సూచించారు. భారత్ ఆర్థికవ్యవస్థ స్థిరంగానే ఉందని ఆయన ఈసందర్భంగా పేర్కొన్నారు. ప్రస్తుత వాణిజ్య యుద్ధ భయాలు క్రమంగా సమసిపోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా భారత అవినీతి నిరోధక చట్టంలో ఇటీవల జరిగిన సవరణలు ఈ సమస్య పరిష్కారంలో పూర్తి స్థాయిలో ఉపయోగపడవని న్యూఢిల్లీలో మంగళవారం జరిగిన ఒక సమావేశంలో బసు పేర్కొన్నారు. -
12 స్థానాలు ఎగబాకిన భారత్
వాషింగ్టన్ : వ్యాపార అనుకూల దేశాల జాబితాలో భారత్ 12 స్థానాలు ఎగబాకింది. 189 దేశాలకు గానూ భారత్ ప్రస్తుతం 130 స్థానాన్ని ఆక్రమించింది. ఈ విషయాన్ని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది. గతేడాది 140వ స్థానంలో ఉన్న భారత్ 12 స్థానాలు మెరుగు పరుచుకోవడం ఆ దేశానికి బాగా కలిసొస్తుందని ప్రపంచ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ కౌశిక్ బసు అన్నారు. ప్రపంచ బ్యాంక్ తాజా రిపోర్ట్ 'బిజినెస్ 2016' నిమిత్తం జాబితాను విడుదల చేసింది. ఈ నివేదిక ఫలితాలు భారత్లో వ్యాపార పెట్టుబడులకు అనుకూలంగా మారనున్నాయి. అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశాల్లో ఒకటైన భారత్లో బిజినెస్ ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు దోహద పడుతుందని ప్రపంచ బ్యాంక్ అధికారి, గ్లోబల్ ఇండికేటర్స్ గ్రూప్ డైరెక్టర్ లోపేజ్ కార్లోస్ పేర్కొన్నారు. ఈ జాబితాలో సింగపూర్ అగ్రస్థానంలో ఉండగా, న్యూజిలాండ్, డెన్మార్క్, దక్షిణ కొరియా, హాంకాంగ్ ఆ తర్వాతి స్థానాల్లో నిలిచాయి. భారత్ పొరుగు దేశాలైన చైనా 84, పాక్ 138 స్థానాల్లో ఉన్నాయి. గతేడాది నివేదికలో చైనా 90, పాక్ 128 స్థానాల్లో ఉన్న విషయం విదితమే.