breaking news
kaushal vikas yojana
-
భారత్‌లో ఓ కొరియా వాసి ఆవేదన
లక్నో : భారతదేశ సంస్కృతి , సంప్రదాయాలు నచ్చి, ఇక్కడే ఏదైనా వ్యాపారం చేయాలనుకున్న కొరియా వాసికి ఎదురుదెబ్బ తగిలింది. మార్చి 15 లోపు దేశం విడిచి పోవాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. అయితే దీనికి గల ప్రధాన కారణం ఆయన తన డాక్యుమెంట్లో భారతీయ పౌరుడిగా పేర్కొనడమే. కానీ తానేమీ తప్పు చేయలేదని, భాష సరిగ్గా తెలియక పోవడం వల్ల అధికారులే ఈ తప్పుకు ఒడిగట్టారని, తాను ఈ తప్పు సరిదిద్దుకోవడానికి చాలా కాలం నుంచే ప్రయత్నిస్తున్నానని కొరియా వాసి చెబుతున్నాడు. వివరాల్లోకి వెళ్తే.. కొరియా వ్యక్తి బియ్యుంగ్ కిల్ కొన్నేళ్ల క్రితం భారత్‌కు వచ్చాడు. కొంతకాలం పాటు చెన్నైలో పనిచేశాడు. అతనికి భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో నచ్చాయి. ఇక ఇక్కడే ఉండి ఏదైనా వ్యాపారం చేయాలని నిశ్చయించుకున్నాడు. లక్నోను తన వ్యాపార ప్రదేశంగా ఎంచుకున్నాడు. దీనికోసం 2012లో బిజినెస్ వీసా కూడా పొందాడు. బారాబంకి జిల్లా ఫతేపుర్ మండలంలో కొంత భూమిని కొనుగోలు చేశాడు. అయితే భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కొరియా వాసిని అధికారులు, భారతీయ పౌరుడిగా పేర్కొన్నారు. ఒక కొరియా వాసిని భారతీయ పౌరుడిగా ఎలా నమోదుచేస్తారంటూ.. ఈ భూమిని అతను అక్రమంగా పొందాడని ఆ ప్రాంత వాసులు ఫిర్యాదుచేశారు. వారి ఫిర్యాదు మేరకు బారాబంకి ఎస్పీ అనిల్ కుమార్ సింగ్ నోటీసులు జారీచేశారు. అయితే అది అక్కడ పనిచేసే సిబ్బంది వల్ల జరిగిన తప్పిదమని, భాష తెలియక వారు అలాచేశారని కొరియా వాసి చెబుతున్నాడు. దాన్ని సరిదిద్దడానికి చాలా కాలం నుంచి ప్రయత్నిస్తున్నట్టు తెలిపాడు. కొరియా వాసి తాను కొన్న ఆ ప్రాపర్టీలో పాఠశాలను నిర్మించాడు. తన సంపదంతా ధారపోసి దాన్ని ఏర్పాటుచేశాడు. కానీ ఆ భూమి ఇప్పుడు ఇరకాటంలో పడింది. స్కూల్ నిర్మించిన ఆ ప్రాపర్టీలోనే కొరియా వాసి, ప్రధాన మంత్రి కౌశల్య యోజనలో భాగమైన స్కిల్ ఇండియా తరగతులు నిర్వహించాలని బియ్యుంగ్ కిల్ నిర్ణయించాడు. వెంటనే అక్కడి యువకులకు అనేక రంగాల్లో శిక్షణను ఇవ్వడం ప్రారంభించాడు. దీని ద్వారా భారత్‌లో నైపుణ్యాలను పెంపొందించాలనే అతని ఆశయాన్ని సాకారం చేసుకుంటున్నాడు. యువతకు రిటైల్, ఎలక్ట్రిక్ రంగాల్లో శిక్షణనిస్తున్నాడు. అయితే అధికారులు తప్పుగా చేసిన నమోదు వల్ల కొరియా వాసికి ఇబ్బందులు ఎదురవుతూనే ఉన్నాయి. తాజాగా అతన్ని దేశం విడిచి వెళ్లమని నోటీసులే అందాయి. ''నాకు ఇండియా అంటే ఇష్టం. ఇక్కడి ప్రజలంటే ఎంతో ఇష్టం. ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం యోగి కలలను నిజం చేసేందుకు నేను ఇక్కడ ఉన్నాను. ఇక్కడి యువత స్వతంత్రంగా బతికేలా వారికి శిక్షణ ఇవ్వాలనేది నాకు ఇష్టం. ఇక్కడ కమ్యూనికేషన్ వల్ల నాకు చాలా కష్టాలు వచ్చాయి. నా తరపునుంచి ఆలోచించకుండా, నా వాదన వినకుండా నాకు ఎలా నోటీసులు ఇస్తారు? ఇక్కడి న్యాయవ్యవస్థపై నాకు పూర్తి నమ్మకం ఉంది. నా వాదన వినిపించుకోవడానికి నాకు ఒక అవకాశం వస్తుంది'' అని బియ్యుంగ్ ఓ ఆంగ్ల ఛానెల్‌కు తెలిపారు. 2015 నుంచి బియ్యుంగ్తో కలిసి పనిచేస్తున్న మనోజ్‌వర్మ మాట్లాడుతూ... ''సిబ్బంది ఎవరో తప్పుగా టైప్ చేసి ఉంటారు. తరువాత మేము ఎన్నిసార్లు చెప్పినా దాన్ని సరిదిద్దలేదు. మేము లాయర్‌ను కలిస్తే.. నోటీసులు వచ్చే వరకు చూడండి అన్నారు. లోకల్ ఛానల్ బియ్యుంగ్ని కొరియన్ గూఢచారి అని ప్రచారం చేస్తోంది. ఇది చాలా బాధాకరం. అతను భారత యువత కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. మన కోసం ఇంత చేస్తే మనం ఆయనకు ఇచ్చేది ఇదేనా?'' అని ప్రశ్నించారు. జిల్లా మేజిస్ట్రేట్ అఖిలేశ్ తివారి ఈ విషయంపై స్పందిస్తూ.. బియ్యుంగ్ అక్కడి యువతకు శిక్షణనిస్తూ, ఎంతో మంచి పేరు సంపాదించారు. అతని కేసు వివరాలు, సర్టిఫికేట్లను పరిశీలించమని ముగ్గురు సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశానని తెలిపారు. -
ఏడాదిలో 24 లక్షల మందికి నైపుణ్య శిక్ష
హైదరాబాద్ : దేశ యువతను నిపుణులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకానికి రూపకల్పన చేసిందని కేంద్ర నైపుణ్య అభివృద్ధి శాఖ మంత్రి రాజీవ్ ప్రతాప్‌రూడీ వెల్లడించారు. శుక్రవారం రామంతాపూర్‌లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఎలక్ట్రానిక్స్ ప్రాసెస్ ఇన్స్ట్రుమెంటేషన్ శిక్షణా సంస్థను స్థానిక ఎమ్మెల్యే ఎన్ వి వి ఎస్ ప్రభాకర్‌తో కలసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ రూడీ మాట్లాడుతూ... ఈ పథకం ద్వారా వృత్తి విద్యలో పది లక్షల మంది యువతకు శిక్షణతో పాటు, ఏడాదిలో 24 లక్షల మందికి నైపుణ్యతలో శిక్షణ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందని వెల్లడించారు. శిక్షణ పూర్తి చేసిన వారికి రుణాలు అందేలా కేంద్రం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. 2022 నాటికి దేశ వ్యాప్తంగా 40.20 కోట్ల మందికి నైపుణ్య అభివృద్ది శిక్షణ లక్ష్యం దిశగా ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పని చేస్తుందన్నారు.