breaking news
kartika reddy
-
తనయుల గెలుపు కోసం
సాక్షి, రంగారెడ్డి జిల్లా: చేవెళ్ల లోక్‌సభ పోరు ఆసక్తికరంగా మారింది. ఈ నియోజకవర్గంలో ప్రధాన పార్టీల నుంచి పోటీచేస్తున్న అభ్యర్థులంతా కొత్తవారవడం, వీరు ప్రముఖుల వారసులు కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి మాజీ హోంమంత్రి సబితారెడ్డి తనయుడు కార్తీక్‌రెడ్డి పోటీ పడుతుండగా.. టీడీపీ నుంచి మాజీ హోంమంత్రి తూళ్ల దేవేందర్‌గౌడ్ తనయుడు వీరేందర్ బరిలో నిలిచారు. ఇద్దరు మాజీ హోంమంత్రులకు తనయుల గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. గెలుపు కోసం ఎవరికి వారు ప్రత్యేక వ్యూహాలు రచిస్తూ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యూహాత్మక ప్రచారాలు.. పల్లె, పట్టణ వాతావరణం కలయిక చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం. ఈ నియోజకవర్గంలో ఎన్నికల హడావుడి జోరుగా సాగుతోంది. కార్తీక్‌రెడ్డి, వీరేందర్‌గౌడ్‌ల బంధువర్గం సైతం ప్రచారంలో పాల్గొంటోంది. వీరేందర్‌కు అండగా దేవేందర్‌గౌడ్ కూడా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వీరేందర్ తన మిత్రవర్గంతోనూ కలిసి ప్రచార కార్యక్రమాల్లో మునిగితేలుతున్నారు. ఈ ప్రచార కార్యక్రమాల నిర్వహణ అంతా వీరేందర్ సోదరుడు దగ్గరుండి చూసుకుంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు పట్టణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారం చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కార్తీక్‌రెడ్డి కూడా వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. చేవెళ్ల సొంత ప్రాంతం కావడంతో ఇక్కడినుంచే అన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు. కార్తీక్‌రెడ్డికి అండగా సబితారెడ్డి ప్రత్యేకంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె ఇప్పటికే ఆ నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలను సన్నద్ధం చేయగా.. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోనూ ప్రచారం నిర్వహిస్తున్నారు. కార్తీక్ సోదరులు ప్రచార కార్యక్రమాల నిర్వహణను చూసుకుంటున్నారు. మరోవైపు కార్తీక్ చిన్నమ్మ, సోదరి కూడా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. -
మాట తప్పిన కేసీఆర్‌ను ప్రజలు నమ్మరు
ధారూరు, న్యూస్‌లైన్: మాట మీద నిలబడని టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు... తెలంగాణ అభివృద్ధి తనతోనే సాధ్యమవుతుందంటే ప్రజలు ఎంతమాత్రం నమ్మరని మాజీ మంత్రి, కాంగ్రెస్ వికారాబాద్ అసెంబ్లీ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్ అన్నారు. ఆదివారం ధారూరులోని రైస్‌మిల్లులో జరిగిన కాంగ్రెస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో పార్టీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి పి.కార్తీక్‌రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. ప్రసాద్‌కుమార్ మాట్లాడుతూ మాట తప్పడం కేసీఆర్‌కు అలవాటనీ, ముఖ్యమంత్రి పదవి కోసమే కాంగ్రెస్‌లో విలీనాన్ని, పొత్తును వ్యతిరేకించారని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమనీ, ప్రభుత్వం ఏర్పాటు కాగానే లక్ష ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తామని పేర్కొన్నారు. కార్తీక్‌ను గెలిపించి సబితారెడ్డి రుణం తీర్చుకుంటా... గతంలో తన గెలుపు కోసం కృషి చేసిన మాజీ హోం మంత్రి సబితారెడ్డి రుణం తీర్చుకునేందుకు ఈ ఎన్నికల్లో ఆమె తనయుడు కార్తీక్‌రెడ్డిని ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించేందుకు కృషి చేస్తానని ప్రసాద్‌కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ రూపురేఖలు మారుస్తాం : కార్తీక్‌రెడ్డి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ప్రసాద్‌కుమార్‌ను, ఎంపీగా తనను గెలిపిస్తే ఇద్దరం కలిసి వికారాబాద్ నియోజకవర్గ రూపురేఖలను మారుస్తామని కార్తీక్‌రెడ్డి అన్నారు. వికారాబాద్‌ను జిల్లా కేంద్రం చేస్తామని, ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టు, జూరాల ఎత్తిపోతల ద్వారా జిల్లాకు సాగు, తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రఘువీరారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎండీ హఫీజ్, ధారూరు, హరిదాస్‌పల్లి పీఏసీఎస్‌ల చైర్మన్లు హన్మంత్‌రెడ్డి, అంజయ్య, ఏఎంసీ చైర్మన్ సంగమేశ్వర్రావు, డీసీసీ అధికార ప్రతినిధి రాజశేఖర్, పీసీసీ నాయకుడు సత్యనారాయణ, కాంగ్రెస్ ఎస్సీ సెల్ రాష్ట్ర కో ఆర్డినేటర్ పెండ్యాల అనంతయ్య, మండల సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు కన్నె బిచ్చన్న, మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల రాములు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సిద్దులూర్ మాజీ సర్పంచ్ దామోదర్ రెడ్డి, ధారూరు టీడీపీ, జేఏసీలకు చెందిన 12మంది యువకులు మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.