breaking news
Kalyana mantapa
-
కాకతీయుల తర్వాత మళ్లీ ఇప్పుడే!
ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు ఏడు శతాబ్దాల విరామం తర్వాత వేయి స్తంభాల దేవాలయంలో అంతర్భాగంగా ఉన్న కళ్యాణ మంటపంలో శివపార్వతుల కళ్యాణం జరగబోతోంది. కాకతీయుల హయాం తర్వాత మళ్లీ ఇంతకాలానికి కళ్యాణ మంటపం కళకళలాడబోతోంది. విఖ్యాత వేయి స్తంభాల దేవాలయ కళ్యాణ మంటపం పునర్నిర్మాణ పనులు పూర్తి కావచ్చిన నేపథ్యంలో, సెప్టెంబరులో దాన్ని ఘనంగా ప్రారంభించేందుకు కేంద్రప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఆ తర్వాత వచ్చే శివరాత్రి వేడుకలను అందులోనే నిర్వహించాలని భావిస్తోంది. సాక్షి, హైదరాబాద్ : కాకతీయ చక్రవర్తి రుద్రదేవుడి హయాంలో వేయి స్తంభాలతో రుద్రేశ్వరస్వామి దేవస్థానాన్ని నిర్మించారు. ఓవైపు దేవాలయం, దానికి మరోవైపు కళ్యాణమంటపాన్ని అద్భుత శిల్పకళా వైభవంతో రూపొందించారు. కాకతీయుల ఇలవేల్పుగా భాసిల్లిన పరమశివుడికి ఈ ఆలయంలో నిత్యాభిషేకాలు జరిగేవి. డెక్కన్ ప్రాంతాన్ని వశం చేసుకునే సమయంలో తుగ్లక్ సేనలు దీన్ని పాక్షికంగా ధ్వంసం చేశాయని చరిత్రకారులు చెబుతారు. అప్పట్లో కళ్యాణమంటపం పైకప్పు 40 శాతం కూలిపోయింది. దాంతో ఆ శిథిల మంటపంలో ఇక వేడుకలు నిర్వహించటం ఆపేశారు. అంతే.. మళ్లీ ఇప్పటి వరకు నిర్వహించలేదు. ఇప్పుడు ఆ మంటపాన్ని పునర్నిర్మించటంతో తిరిగి వేడుకల నిర్వహణ ప్రారంభించాలని అధికారులు నిర్ణయించారు. చివరి దశలో పనులు.. దాదాపు 18 ఏళ్ల క్రితం కళ్యాణ మంటపాన్ని పునర్నిర్మించాలన్న ఉద్దేశంతో పూర్తిగా విప్పదీశారు. అందులోని రాళ్లకు నంబర్లు వేసి పద్మాక్షి గుట్ట వద్ద ఉంచారు. కానీ పనులు ముందుకు సాగలేదు.మూడేళ్ల క్రితం కేంద్రప్రభుత్వం దృష్టి సారించి వేగంగా పనుల నిర్వహణ ప్రారంభించింది. ఇప్పుడు ప్రధాన నిర్మాణ పనులు పూర్తికాగా, వారం రోజులుగా పైకప్పు పనులు చేస్తున్నారు. ఆగస్టు చివరి నాటికి ఆ పనులు కొలిక్కి తెచ్చి సెప్టెంబరులో మంటపాన్ని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నాటి క్వారీ నుంచే ఇప్పుడూ రాళ్ల వినియోగం.. హనుమకొండకు చేరువగా ఉన్న అమ్మవారి పేట క్వారీ నుంచి మంటప పునర్నిర్మాణ పనులకు రాళ్లను తెచ్చి వాడుతున్నారు. అప్పట్లో కాకతీయ రాజులు నిర్మించిన దేవాలయాలకు ఈ గుట్ట రాయినే వాడేవారు. నాడు రాళ్లను తొలిచేందుకు చేసిన రంధ్రాలు ఇప్పటికీ కనిపిస్తున్నాయి. దాదాపు 60 టన్నుల బరువున్న ఓ భారీ బండరాయిని ఇటీవలే మంటపం వద్దకు తరలించారు. దాన్ని పైకప్పుపై అమర్చనున్నారు. ఆ గుండుపై 800 ఏళ్ల కింద తొలిచినప్పటి రంధ్రాల జాడలు ఇంకా ఉండటం విశేషం. అదే రాయి భాగాన్ని ఇప్పుడు మళ్లీ వేయిస్తంభాల కళ్యాణ మంటపానికి వినియోగిస్తుండటం యాదృచ్ఛికం. ఈ మంటపానికి సంబంధించి 163 బీమ్‌లకు గానూ 28 జాడ లేకుండా పోయాయి. కూలిన తర్వాత ప్రజలు వాటి ముక్కలను తరలించుకుపోయారు. ఇప్పుడు వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తున్నారు. మధ్యలో ఒక్కోటి 8 అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పు, 30 టన్నుల బరువుండే 8 బీమ్ల ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. వాటిపై 32 పైకప్పు సల్పలను పరచనున్నారు. ఈ సల్ప రాళ్లు ఒక్కోటి 15 అడుగుల వెడల్పుతో ఉండనున్నాయి. పనుల్లో తమిళనాడు శిల్పులు తమిళనాడుకు చెందిన శివకుమార్ స్థపతి ఆధ్వ ర్యంలో అదే రాష్ట్రానికి చెందిన 28 మంది శిల్పులు ఈ పనుల్లో నిమగ్నమయ్యారు. కేంద్రప్రభుత్వం రూ.19 కోట్లు విడుదల చేసింది. ఇప్పటికే రూ.10 కోట్లు ఖర్చు కాగా, నిర్మాణ పనులు పూర్తయ్యే నాటికి మరో రూ.3 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఆ తర్వాత దాని చుట్టూ సుందరీకరణ, ఇతర పనులకు మిగతావి ఖర్చు చేయనున్నారు. ఏఎస్ఐ తెలంగాణ సూపరింటెండెంట్ ఆర్కియాలజిస్టు స్మిత ఎస్ కుమార్, కన్జర్వేషన్ అసిస్టెంట్ మడిపల్లి మల్లేశం ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. అలనాటి శైలికి తేడా రానివ్వం ‘కాకతీయుల కాలంలో ఏ శైలిని వినియోగించారో ఆ శైలికి ఏమాత్రం తేడా రాకుండా రాళ్లను కళాత్మకంగా తీర్చిదిద్దుతున్నాం. అలనాటి నిర్మాణం మళ్లీ కళ్ల ముందుంచేందుకు అహరహం శ్రమిస్తున్నాం. ఆగస్టు చివరి నాటికి కళ్యాణ మంటపం సిద్ధమవుతుంది’ –శివకుమార్, స్థపతి -
కెరీర్ గోల్స్.. వయా హల్స్.. మాల్స్
కల్యాణ మంటపం అనగానే.. మంగళవాద్యాలు, వేద మంత్రాలు వినిపిస్తుంటాయి. షాపింగ్ మాల్స్.. కొనుగోలుదారులతో నిండి ఉంటాయి. ఇప్పుడు ఈ రెండింట్లోనూ చేతిలో పుస్తకాలతో కుస్తీ పడుతున్న సీరియస్ యంగ్ పీపుల్ కనపడుతున్నారు. హైదరాబాద్‌కు ఏమైందబ్బా అని ఆందోళనలో పడిపోకండి. టీఎస్పీఎస్సీ పుణ్యమా అని కల్యాణ మంటపాలు, షాపింగ్ మాల్స్ కోచింగ్ సెంటర్స్‌గా మారిపోయాయి. త్వరలో ప్రభుత్వోద్యోగాల నోటిఫికేషన్స్ వెలువడనుండటంతో... బంధుమిత్ర సపరివార సందడి తో కళకళలాడే ఫంక్షన్ హాల్స్ విద్యార్థుల అధ్యయన, అభ్యాసాలకు కేంద్రాలయ్యాయి. నిత్యం జనం రద్దీతో లక్ష్మీకళ ఉట్టిపడాల్సిన షాపింగ్ మాల్స్‌లో... విద్యార్థులతో సరస్వతీ వైభవం కనిపిస్తోంది. - వాంకె శ్రీనివాస్ అశోక్‌నగర్.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్.. సాధారణంగా గ్రూప్స్, సివిల్స్ కోచింగ్ సెంటర్స్‌కు అడ్డాలు. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటు కావడం, త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉండటంతో హైదరాబాద్ నగరానికి ప్రభుత్వ ఉద్యోగాల ఫీవర్ పట్టుకుంది. పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీ ఉంటుందన్న ఆశతో జిల్లాల నుంచి విద్యార్థులంతా నగరబాట పట్టారు. ఖాళీలు భారీగా ఉంటాయన్న నమ్మకంతో ఈసారి సర్కారీ నౌకరీ కచ్చితంగా కొట్టాలన్న పట్టుదల తో ఉన్నారు. ఆలసించిన ఆశాభంగం అనుకుని కోచింగ్ సెంటర్లకు క్యూ కట్టారు. ఉద్యోగార్థుల తాకిడి వందలు దాటి వేలకు చేరడంతో.. కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్‌ను క్లాస్ రూమ్స్‌గా మార్చేశారు. ఫలితంగా శుభకార్యాలతో సందడిగా కనిపించాల్సిన కల్యాణ మంటపాలు ఉద్యోగార్థులతో కిటకిటలాడుతున్నాయి. ఆరు నెలల అద్దె ఒకేసారి.. ఆర్టీసీ క్రాస్ రోడ్డు, ఆశోక్ నగర్లోనే కాదు.. వీఎస్టీ, అమీర్‌పేట్, కూకట్పల్లి, దిల్షుక్నగర్ ఏరియాల్లోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్‌లో ఒకేసారి వెయ్యి మందికిపైగా విద్యార్థులను అకామిడేట్ చేసే అవకాశం ఉండటంతో కోచింగ్ సెంటర్ నిర్వాహకులు కూడా వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఆరు నెలల అద్దె ఒకేసారి చెల్లించి వీటిని బుక్ చేసుకుంటున్నారు. ‘నెలలో మహా అయితే నాలుగు, ఐదు పెళ్లిళ్లుంటాయి. అది కూడా సీజన్లోనే. అలాంటిది ఆరేడునెలలు, ఎలాంటి ఆటంకం లేకుండా డబ్బు రావడంతో మారుమాట చెప్పకుండా ఇచ్చేశాం’ అంటున్నాడు వీఎస్టీలోని ఓ కల్యాణ మంటపం యజమాని. ఆర్‌పార్.. కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వోద్యోగాల్లో ఖాళీలు భారీగా ఉన్నాయని, రానున్న రెండేళ్లలో వీటిని భర్తీ చేస్తారని విద్యార్థుల అంచనా. కొద్ది నెలల్లో నోటిఫికేషన్లు జారీ కావొచ్చనే అంచనాలు నిరుద్యోగులకు ఆశ కల్పిస్తోంది. ఇప్పుడు ఉద్యోగం పొందలేకపోతే.. భవిష్యత్తులో అసాధ్యమని చాలామంది డిసైడ్ అయ్యారు. అందుకే డిగ్రీలు పూర్తి చేసిన వారు సైతం పీజీల ఊసెత్తకుండా పోటీపరీక్షలకు సిద్ధం సుమతి అంటున్నారు. జంటనగరాలతో పాటు.. తెలంగాణ జిల్లాల్లోని ఉద్యోగార్థులంతా కోచింగ్ సెంటర్లకు క్యూ కడుతున్నారు. పీజీలు, పీహెచ్‌డీలు పూర్తి చేసిన వారు సైతం.. ప్రభుత్వోద్యోగం పొందడమే లక్ష్యంగా కోచింగ్ తీసుకుంటున్నారు. గతంతో పోలిస్తే కోచింగ్ సెంటర్లలో విద్యార్థుల సంఖ్య మూడింతల వరకూ పెరిగిందని చెబుతున్నారు విశ్లేషకులు. దీంతో పెరిగిన విద్యార్థులకు సరిపడా క్లాస్‌రూమ్‌లు లేకపోవడంతో ఇలా ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్స్‌ను కోచింగ్ అడ్డాలుగా మార్చేశారు నిర్వాహకులు. ఫర్వా నై.. ‘ప్రత్యేక రాష్ట్రంలో పబ్లిక్ కమిషన్ ఏర్పాటుతో చాలా ఉద్యోగ ప్రకటనలు వస్తాయన్న ఆశతో ఎదురుచూస్తున్నాం. పెద్ద ఎత్తున పోస్టులుండే అవకాశం ఉంది కాబట్టి... ప్రభుత్వోద్యోగం ఇప్పుడు రాకపోతే ఇంకెప్పుడూ రాదు. అందుకే సీరియస్‌గా చదువుతున్నా’ అని అంటున్నాడు వరంగల్‌కు చెందిన వీరన్న. మరి ఫంక్షన్ హాల్స్‌లో క్లాస్ రూమ్ వాతావరణం కనిపిస్తుందా అని అడిగితే.. ‘డిమాండ్‌ను బట్టి సప్లై అన్నట్టుగా.. విద్యార్థులను బట్టి తరగతి గదులు మారుతున్నాయి. హాల్స్‌లో అయినా స్పీకర్స్ గట్రా ఉంటుండటంతో ఎలాంటి ఇబ్బంది ఉండటం లేదు’ అని చెబుతున్నాడు ఖమ్మం విద్యార్థి నర్సింహ నాయక్. ‘ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధి ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలు. అందుకే శిక్షణ తీసుకుంటున్నా. ఫంక్షన్ హాలా, షాపింగ్ మాలా అనేది ముఖ్యంకాదు... మాకు చెబుతున్న ఇన్స్ట్రక్టర్స్ ఎలాంటివారన్నదే చూస్తున్నాం’ అని అంటున్నారు కరీంనగర్‌కు చెందిన చైతన్య, రంగారెడ్డి విద్యార్థి శిరీష. ఎలాగైనా ఉద్యోగం పొందాలని కసిగా ఉన్న విద్యార్థులు.. పాఠాలను తప్ప.. అవి ఎక్కడ చెబుతున్నారన్న విషయాన్ని పక్కనపెట్టేస్తున్నారు. వెరసి భవిష్యత్ ఉద్యోగులకు ఫంక్షన్ హాల్స్, షాపింగ్ మాల్సే కెరీర్ టర్నింగ్ పాయింట్స్‌గా నిలుస్తున్నాయి.