breaking news
Junk Food Day
-
‘జంక్’తో జాగ్రత్త!
పిజ్జాలు, బర్గర్లతో అధిక కొవ్వు తగ్గించకుంటే ఆరోగ్యసమస్యలు తప్పవు నేడు ప్రపంచ జంక్‌ఫుడ్ డే మహబూబ్‌నగర్ క్రైం: ఆహార పదార్థాలను తినేముందు వాటి రుచి, ధరలు ఎంత అని మాత్రమే చూస్తాం. ధరకే పరిమితం కాకుండా అందులో కేలరీలను చూడమంటున్నారు వైద్యులు. విదేశాల్లో హోటళ్లలో వంటకంతో పాటు ఎన్ని కేలరీలు అనే విషయం కూడా మెనూలో ఉంటుంది. మన పట్టణాల్లోనూ హోటళ్లలో వీటిని పొందపరిస్తే మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు. రోజువారీ తీసుకునే ఆహారంలో మనకు కావాల్సిన కేలరీల కంటే పట్టణవాసుల్లో చాలామంది అదనంగానే తీసుకుంటున్నారు. వీటిని ఏ రోజుకారోజు కరిగించాల్సిందే. కానీ ఆ పని చేయకుండా మరిన్ని అదనపు కేటరీలను ఒంట్లోకి చేర్చుకుంటున్నారు. జంక్ అంటే చెత్త. జంక్ ఫుడ్ అంటే చెత్తతిండి. పిజ్జాలు, బర్గర్లు, కేకులు, ఫ్రైడ్ రైస్, ఫ్రైడ్ చికెన్, ఐస్‌క్రీమ్‌లు, కూల్‌డ్రింక్స్, తదితర వాటిని జంక్‌ఫుడ్ అంటారు. ఇష్టం వచ్చినట్లు చెత్తతిండి తిని, దానికి తగ్గ వ్యాయామం చేస్తున్నామా అంటే చాలా మంది వద్ద సమాధానం ఉండదు. కేలరీల రూపంలో ఒంట్లో కొవ్వు పెరిగిన తర్వాత చింతించే బదులుగా మూడు పదుల వయస్సు నుంచే ఎదురుదాడి చేస్తే మధుమేహం, రక్తపోటు, ఒత్తిడి వంటి సమస్యలను నిత్యం వ్యాయామం చేయడంతో తరిమికొట్టవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో ప్రధాన పట్టణాల్లో అధిక సంఖ్యలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలిశాయి. క్షణాల్లో తయారయ్యే వంటకంతో వచ్చే రుచికి అలవాటు పడి ఆరోగ్యం క్షీణించే విధంగా చేసుకుంటున్నారు. ముఖ్యంగా 13నుంచి 40ఏళ్ల వయస్సువారు ఇలాంటి ఫుడ్‌కు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఫాస్ట్‌పుడ్ సెంటర్స్‌తో పాటు బేకరీలలో పిజ్జా, బర్గర్లలో అధిక రసాయనాలు కలపడం వల్ల తక్కువ కాలంలో ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింటుంది. జీర్ణం కాదు.. జంక్‌ఫుడ్‌లో ఎక్కువ కేటరీలు ఉండటం వల్ల త్వరగా జీర్ణం కాదు. దానికి తోడు ప్రస్తుతం ఉన్న బిజీ జీవితంలో ఎవరూ కూడా కొవ్వును తగ్గించుకోవడానికి వ్యాయామం చేయడం లేదు. దీనివల్ల పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు చేరుతుంది. ఆ తర్వాత రక్తపోటు, మధుమేహం, షుగర్, ఇతర వ్యాధులు రావడానికి అవకాశం ఉంటుంది. వారంలో రెండుమూడుసార్లు జంక్‌ఫుడ్ తీసుకునే వారిలో ఎక్కువ మొత్తంలో కొవ్వు తయారవుతుంది. ముఖ్యంగా ఫాస్ట్‌ఫుడ్‌లో అయిల్ ఎక్కువ మోతాదులో ఉపయోగిస్తారు. దానివల్ల కొత్త రోగాలు వస్తాయి. నెల రోజులు క్రమం తప్పకుండా బేకరి, ఫాస్ట్‌ఫుడ్ తింటే మనిషి శరీరంలో చాలా మార్పులొస్తాయి. ముఖ్యంగా పొట్ట దగ్గర కొవ్వు పెరిగి దానివల్ల గుండెపై ప్రభావం చూపుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌లో ఉప్పు, కారంతో పాటు రసాయనాలు ఎక్కువగా వాడటం వల్ల ఆరోగ్యంపై తీవ్రంగా చూపిస్తుంది. – డాక్టర్ వనం శ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్, జిల్లాసుపత్రి -
జంక్జబ్బు
జూలై 21 జంక్‌ఫుడ్ డే ‘జంక్‌ఫుడ్ తింటే జబ్బులొస్తాయి...’ అని ఎవరైనా సలహాగా చెప్పబోతే ‘మాకు తెలీదేంటి’ అని వెంటనే బదులిస్తారు చాలామంది. జంక్‌ఫుడ్ తినడం వల్ల వచ్చే జబ్బులు, ఆ జబ్బులు కలిగించే తిప్పలు, ముప్పుల గురించి వైద్య నిపుణులు పత్రికల్లో రాసే వ్యాసాలను మాత్రం ఇలాంటి జనాలు శ్రద్ధగా చదువుతారు. అదంతా చదివేసి పత్రికను పక్కన పడేశాక మళ్లీ జంక్‌ఫుడ్ కోసం ఆవురావురుమంటూ అర్రులు చాస్తారు. జంక్‌ఫుడ్ తింటే వచ్చే జబ్బుల సంగతి అలా ఉంచితే, ఇటీవలి కాలంలో జంక్‌ఫుడ్ తినడమే పెద్ద జబ్బుగా మారిపోయింది. అగ్రరాజ్యాలు ‘జంక్’తున్నాయి జంక్‌ఫుడ్ అనర్థాలను గుర్తించిన అగ్రరాజ్యాలు ఇప్పుడిప్పుడే మేలుకొంటున్నాయి. ‘జంక్’జబ్బును వదలగొట్టుకోవడానికి నడుం బిగిస్తున్నాయి. పిల్లలను ఇలాంటి పనికిమాలిన ఆహారానికి దూరంగా ఉంచడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఆర్థిక సరళీకరణల తర్వాత ‘అప్రాచ్య’దేశాల ‘జంక్’జబ్బు మన దేశాన్నీ పట్టుకుంది. మొదట్లో మహానగరాల్లోకి దిగుమతైన ‘జంక్’జబ్బు ఇప్పుడు చిన్న పట్టణాలకూ విస్తరించింది. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడ్డ పిల్లలు వయసుకు మించిన సైజుకు పెరిగిపోతున్నారు. అసలే ఆటలకు అవకాశం లేని చదువుల భారం... ఆట మైదానాలే లేని ప్రైవేటు స్కూళ్లు... ఇక ఇళ్లకొచ్చాక టీవీలతో లేదా కంప్యూటర్లలో వీడియోగేమ్‌లతో కాలక్షేపం. కదలకుండా కానిచ్చే ఈ కాలక్షేపానికి తోడు నోటికి పనిచెప్పడానికి ప్లేటులో జంక్‌ఫుడ్, చేతిలో కూల్‌డ్రింక్ సీసా... ఇదీ పరిస్థితి. భావి భారత పౌరులు కాస్తా భావి భారత భారీకాయులుగా ‘ఎదుగు’తున్నారు. పొగాకు ఉత్పత్తుల మీద భయంకరమైన బొమ్మలు ముద్రించేలా చర్యలు తీసుకున్న మన ప్రభుత్వం ఫాస్ట్‌ఫుడ్ ప్యాకేజీలపై ఆరోగ్య హెచ్చరికలు ముద్రించేలా చర్యలు తీసుకోవలసిన అవసరాన్ని మాత్రం గుర్తించడం లేదు. ఆ పేరు ఎలా వచ్చిందంటే..? ‘జంక్’ అంటే చెత్త. మరి ‘జంక్‌ఫుడ్’ అంటే చెత్తతిండి. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అని ఆహారాన్ని పవిత్రంగా పూజించే దేశం మనది. అలాంటి దేశంలో తిండికి చెత్త విశేషణాన్ని తగిలించడం తగునా! అయితే, నానా అనర్థాలను కొని తెచ్చే ‘అప్రాచ్య ఆహారాన్ని’... అదేనండీ! పడమటి దేశాల తిండిని చెత్తతిండి ఉరఫ్ జంక్‌ఫుడ్ అనడంలో తప్పేమీ లేదని వాదించేవారు లేకపోలేదు. ఆవిరి కుడుములు, దిబ్బరొట్టెల దగ్గరే ఆగిపోయిన అలాంటి సనాతనుల టేస్టు ఈనాటి పిజ్జా, బర్గర్ల హైటెక్కుటమార తరానికి రుచించదనుకోండి. అది వేరే విషయం. నాలుకకు రుచి తప్ప పదార్థంలో పనికొచ్చే పోషకాలేవీ లేకపోగా, ఒంటికి హాని చేసే ఉప్పు, చక్కెర, కొవ్వులు వంటివి మితిమీరి ఉండే ఆహార పదార్థాలనే స్థూలంగా జంక్‌ఫుడ్ అని ముద్దుగా పిలుచుకుంటున్నాం. ఇంతకీ ఆ పేరు ఎలా వచ్చిందంటే..? పడమటి దేశాల్లో 1960ల కాలంలోనే ఇలాంటి పనికిమాలిన తిండిని జంక్‌ఫుడ్ అనడం మొదలైంది. పాప్ హోరుకు కుర్రకారు ఉర్రూతలూగే కాలంలో ‘జంక్‌ఫుడ్ జంకీ’ అనే పాట 1976లో విపరీతంగా జనాదరణ పొందింది. అప్పటి నుంచి పిజ్జాలు, బర్గర్లు, హాట్‌డాగ్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్, ఐస్‌క్రీములు, కార్బొనేటెడ్ కూల్డ్రింకులు వంటి సమస్త పదార్థాలను జంక్‌ఫుడ్ అనడం ప్రాచుర్యంలోకి వచ్చింది. దిల్మాంగే మోర్ ≈ జంక్‌ఫుడ్‌లో మోతాదుకు మించి ఉండే కొవ్వులు నేరుగా మెదడుపై విపరీత ప్రభావాన్ని చూపుతాయి. ఒకసారి తింటే ఆ ప్రభావం రోజుల తరబడి ఉంటుంది. దానివల్ల మరింతగా తినాలనే కోరిక రేకెత్తుతుంది. ఆ కోరికను అదుపు చేసుకోవడం అంత తేలిక కాదు. దాంతో ఆకలితో నిమిత్తం లేకుండానే అతిగా తినేయడం జరుగుతుంది. ≈ జంక్‌ఫుడ్ తయారీ సంస్థల వ్యాపార వ్యూహాలు పిల్లలను ఈ ఉచ్చులో చిక్కుకునేలా చేస్తున్నాయి. ‘క్యాచ్ దెమ్ యంగ్’ అనేదే జంక్ ఫుడ్ తయారీ సంస్థల వ్యాపార సూత్రం. ఈ సంస్థలు తమ ప్రకటనల్లో 80 శాతం ప్రకటనలను వారాంతం రోజైన శనివారమే టీవీల్లో పిల్లల కార్యక్రమాలు వచ్చేటప్పుడు ప్రసారం చేస్తున్నాయి. టీవీల్లో వాటిని చూసిన పిల్లలు మారాం చేయడం, సముదాయించలేని తల్లిదండ్రులు కొనివ్వడం అసంకల్పితంగానే జరిగిపోతున్నాయి. ≈ జంక్‌ఫుడ్ తినే అలవాటు అమెరికాలో 1920ల నాటికే మొదలైంది. అయితే, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత టీవీ ప్రకటనలు పెరగడంతో అమెరికాలో జంక్‌ఫుడ్‌పై జనాలకు వేలంవెర్రి పెరిగింది. ≈ జంక్‌ఫుడ్ తయారీలో వాడే ప్రమాదకర రసాయనాలు నానా అనర్థాలను కలిగిస్తాయి. ఉదాహరణకు జంక్‌ఫుడ్‌లో ఎక్కువగా వాడే సోడియం బెంజోయేట్ పిల్లల్లో అతి చురుకుదనం (హైపర్ యాక్టివిటీ) వంటి మానసిక సమస్యలకు దారితీస్తుంది. ఇవీ అనర్థాలు స్థూలకాయం జంక్‌ఫుడ్‌లో అతిగా ఉండే కొవ్వుల వల్ల ఒంటి బరువు విపరీతంగా పెరుగుతుంది. ఆ తర్వాత వచ్చే తిప్పలు షరా మామూలే! రక్తపోటు జంక్‌ఫుడ్‌లో ఉప్పుతో పాటు సోడియం రసాయనాలు ఎక్కువగా వాడతారు. వీటి వల్ల రక్తపోటు పెరుగుతుంది. మధుమేహం జంక్‌ఫుడ్‌లో అతిగా వాడే చక్కెర, పిండి పదార్థాల వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు తలెత్తుతుంది. గుండెజబ్బులు జంక్‌ఫుడ్‌లో రుచి కోసం అతిగా వాడే కొవ్వులు రక్తనాళాల్లో పేరుకుపోయి గుండెజబ్బులకు దారి తీస్తాయి. అతిగా ఉండే పదార్థాలు ఉప్పు మితంగా తింటేనే హితవు చేసే పదార్థం ఇది. జంక్‌ఫుడ్ నిల్వ ఉండేందుకు ఉప్పును మితిమీరి ఉపయోగిస్తారు. చక్కెర రుచికి తీపిగానే ఉంటుంది. అతిగా తింటే బతుకే చేదెక్కిపోతుంది. కూల్డ్రింకులు, ఐస్‌క్రీముల్లో మోతాదుకు మించి వాడతారు. కొవ్వులు జంక్‌ఫుడ్ పదార్థాలను ఎక్కువగా నూనెలో వేపుతారు. అందువల్ల అవి తింటే ఒంట్లోకి అనవసరపు కొవ్వులు చేరుతాయి. పిండిపదార్థాలు - అనవసర రసాయనాలు జంక్‌ఫుడ్‌లో ముఖ్యమైన ముడిసరుకు పిండి పదార్థాలే. రంగు, రుచి కోసం అనవసర రసాయనాలనూ వాడతారు.