breaking news
Jitanram Manjhi
-
సీఎం, మాజీల మధ్య ‘మ్యాంగోఫైట్’
బీహార్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ మధ్య గిల్లికజ్జాలు మొదలయ్యాయి. ఆనీ వన్ మార్గ్‌లో ఉన్న బీహార్ ముఖ్యమంత్రి అధికార నివాసంలోనే ఉంటున్న వీరిద్దరికీ ఒకరి పొడ ఒకరికి గిట్టడం లేదు. నితీష్ కుమార్ పుణ్యమా అని ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చి, మళ్లీ ఆయన కారణంగానే గత ఫిబ్రవరిలో అర్ధంతరంగా పదవిని కోల్పోయిన మాంఝీ.. ఖాళీ చేయమన్నా అధికార నివాసాన్ని మాత్రం వదిలి పెట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య ‘మ్యాంగో ఫైట్’ మొదలైంది. సీఎం బంగ్లా ప్రాంగణంలో మామిడి చెట్లకు విరగకాసిన కాయలను తాను, తమవారు తెంపుకోనీయకుండా నితీష్ కుమార్ 24 మంది పోలీసులను కాపలా పెట్టారంటూ మాంఝీ విచిత్ర ఆరోపణలు చేశారు. బీసీ వర్గానికి చెందిన తన వద్దకు బీసీ ప్రజలు, నాయకులు వస్తుంటారని, వారు అప్పుడప్పుడు మామిడికాయలు, తోటలోని ఇతర పండ్లను తెంపుకుంటారని, అది చూసి ఓర్వలేకనే నితీష్ కుమార్ పోలీసుల కాపలా పెట్టారని ఆరోపించారు. నగరంలో చోరీలను అరికట్టేందుకు అవసరమైన పోలీసు సిబ్బంది లేక సతమతమవుతుంటే మామిడి చెట్లకు పోలీసుల కాపలా పెట్టడం ఎంతమేరకు సమంజసమని మాంఝీ ప్రశ్నించారు. ఈ ఆరోపణలను నితీష్ కుమార్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకెళ్లగా, ఆయన పగలబడి నవ్వుతూ...‘నిజంగా ఈ విషయం నాకు తెలియదు. మామిడి చెట్ల వద్ద పోలీసు కాపలానా... సీఎం భద్రత కోసం ఏర్పాటుచేశారా, మామిడి పండ్ల కోసం పెట్టారా? అన్న విషయాన్ని ఉన్నతాధికారులను అడిగి చెబుతాను’ అని చెప్పారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మళ్లీ మాట్లాడుతూ ‘బంగళాలో మామిడి చెట్లకు పోలీసు భద్రత గురించి పోలీసు ఇంచార్జి అధికారికి కూడా తెలియదట. మాంఝీకి నిజంగా మామిడి కాయలు, పండ్లు కావాలని కబురంపితే నేనే స్వయంగా వాటిని తెంపించి పంపించేవాణ్ణి కదా! చెట్ల నుంచి కాయలు, పండ్లు తెంపినందుకు ఏమైనా డబ్బు చెల్లించాల్సి ఉంటే కూడా నా జీతం డబ్బులతోనే చెల్లిస్తా కదా !’ అని వ్యాఖ్యానించారు. అనీ మార్గ్ బంగళాలో 2006 నుంచి నితీష్ కుమార్ ఉంటున్నారు. అంతకుముందు 15 ఏళ్లపాటు లాలూ ప్రసాద్ తన కుటుంబ సభ్యులతో అందులో ఉన్నారు. బంగళాలోని ఐదెకరాల స్థలంలో వంద ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల పెంపకానికి నితీష్ కుమార్ ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఇప్పుడా తోటలో వాటితోపాటు 35 మామిడి చెట్లు, పదుల సంఖ్యలో పనస, అల్ల నేరేడు, జామ చెట్లు ఉన్నాయి. పెద్ద రావి చెట్టు కూడా ఉంది. ఇంటి ఆవరణలో రావిచెట్టు ఉండడం మంచిది కాదని భావించిన నితీష్ కుమార్, 2013, జనవరి 4వ తేదీన దలైలామాను పిలిపించి ఆయన చేత రావి చెట్టుకు ‘పవిత్ర’తను ఆపాదింపచేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1948 నుంచి 1952 వరకు బీహార్ గవర్నర్‌గా పనిచేసిన మాధవ్ శ్రీహరి ఆనీ పేరిట సీఎం బంగళాను అనీ మార్గ్ వన్ అని పిలుస్తున్నారు. -
మంఝికి పదవీ గండం?
పట్నా: వివాదాస్పద వ్యాఖ్యలతో జేడీయూను ఇబ్బందుల్లో పడేస్తున్న ఆ పార్టీ నేత, బిహార్ ముఖ్యమంత్రి జితన్‌రాం మంఝిని పదవి నుంచి తొలగించే అవకాశాలున్నట్లు గురువారం మీడియాలో ఊహాగానాలు వెల్లువెత్తాయి. మంఝి నలుగురు పార్టీ రెబెల్స్‌కు వత్తాసు పలకడం, పార్టీ నేత నితీశ్ కుమార్‌కు సన్నిహితులైన పలువురు అధికారులను బదిలీ చేయడం, నక్సల్స్‌ల లెవీ వసూళ్లను సమర్థించడం, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు రానుండడం నేపథ్యంలో ఆయనకు పదవీ గండం తప్పకపోవచ్చని కథనాలు వచ్చాయి. మంఝిని సీఎం పదవిలో కూర్చోబెట్టిన నితీశ్ గురువారం ఢిల్లీకి వెళ్లడంతో ఊహాగానాలు ఊపందుకున్నాయి. మంఝి భవితవ్యాన్ని తేల్చడానికి పార్టీ చీఫ్ శరద్ యాదవ్, ఆర్జేడీ, సమాజ్‌వాదీ పార్టీ నేతలతో చర్చించేందుకు ఆయన హస్తిన బాట పట్టారని వార్తలొచ్చాయి. అయితే వీటిని నితీశ్ తోసిపుచ్చారు. మంఝి సీఎం పదవిలో కొనసాగుతారో, లే దో నిర్ణయించడానికి తానెవరినని పట్నాలో విలేకర్లతో అన్నారు. బిహార్ అంశాన్ని ఢిల్లీలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. ఢిల్లీలో శరద్‌ను కలిసిన అనంతరమూ ఇదే విధంగా స్పందించారు. మంఝిని పదవి నుంచి తప్పించే అవకాశం లేదని, శరద్‌తో జరిపిన చర్చల్లో ఈ అంశం రాలేదని అన్నారు. ఎన్డీఏ సర్కారుపై పోరాడ్డానికి జనతా పరివార్ పార్టీలను విలీనం చేయడంపై శరద్‌తో చర్చించానని తెలిపారు. మంఝిని తొలగిస్తారన్న వార్తలు మీడియా సృష్టేనని శరద్ కూడా అన్నారు. కాగా, తాను తెలివైన వాడిని కానని, సుదీర్ఘ అనుభవం ఆధారంగా మాట్లాడుతున్నాని, దురదృష్ట వశాత్తూ అవి పతాకశీర్షికలకు ఎక్కుతున్నాయని మంఝి పేర్కొన్నారు. మరోపక్క.. మంఝిని సీఎం పదవి నుంచి తప్పుకునేలా చేసి ఆ పదవి చేపట్టేందుకు నితీశ్ ఒత్తిడి తెస్తున్నారని బీజేపీ నేత సుశీల్ కుమార్ షిండే ఆరోపించారు. నితీశ్ వర్గం నేతల నుంచి అవమానాలు పడేబదులు మంఝీ రాజీనామా చేయాలని కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ సూచించారు.