breaking news
ITDA officials
-
మొదలకంటా ‘గంజాయి’ నరికివేత
సాక్షి, విశాఖపట్నం/జి.మాడుగుల: విశాఖ ఏజెన్సీలో గంజాయి పంట నిర్మూలన కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతోంది. గంజాయి ఎక్కడ సాగవుతుందో తెలుసుకొని.. ఆ ప్రాంతాల్లోని ప్రజలకు పోలీసులు అవగాహన కలిగిస్తున్నారు. స్థానికులు కూడా స్వచ్చందంగా ముందుకు వచ్చి గంజాయి నిర్మూలనలో పాల్గొంటున్నారు. డీజీపీ గౌతమ్ సవాంగ్ ఆదేశాల మేరకు రెవెన్యూ, అటవీ, ఐటీడీఏ అధికారులతో కలిసి పోలీసులు గంజాయి నిర్మూలనకు ‘పరివర్తన’ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా జి.మాడుగుల మండలం ఏడుసావళ్లు, చీకుంబంద గ్రామాల సమీపంలో శనివారం ఒక్కరోజే దాదాపు 80 ఎకరాల్లోని గంజాయి తోటలను పోలీసులు, స్థానికులు ధ్వంసం చేశారు. విశాఖ ఎస్పీ బొడ్డేపల్లి కృష్ణారావు, ఎస్ఈబీ జాయింట్ డైరెక్టర్ సతీష్‌కుమార్, స్థానిక ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది కత్తి చేతపట్టి గంజాయి మొక్కలను నరికేశారు. గూడెం కొత్తవీధి మండలం నేలజర్త, బొరుకుగొంది, కనుసుమెట్ట, కిల్లోగూడా, కాకునూరు, గుమ్మిరేవుల సమీప ప్రాంతాల్లో సుమారు 25 ఎకరాల్లో ఉన్న గంజాయి తోటలను కూడా శనివారం ధ్వంసం చేశారు. -
గొంతెండుతోంది..!
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలో ఒక్కసారిగా ఉషోగ్రతలు పెరిగిపోవడంతో గ్రామాలు, పట్టణాలు దాహంతో కేకలు వేస్తున్నాయి. దప్పికతో ప్రజల గొంతెండుతోంది. భూగర్భ జలాలు అడుగంటడం, రక్షిత మంచినీటి పథకాలు విఫలమవడంతో తాగునీరు లభించక ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాలు, గ్రామాలు, తండాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. చెలమల్లో, కుంటల్లో అపరిశుభ్ర నీరే దిక్కవడంతో ప్రజలు వ్యాధులబారినపడుతున్నారు. ఇక పట్టణాలు, నగరాల్లో తాగునీటిని సరఫరా చేయలేక అధికారులు చేతులెత్తేయడంతో దాహం తీరే దారి లేక ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. వేసవి మరింత ముదరనున్న నేపథ్యంలో తాగునీటి ఎద్దడి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. మన్యంలో పరిస్థితి తీవ్రం శ్రీకాకుళం జిల్లాలో వేసవి తీవ్రతతో మంచినీటికి కటకటగా ఉంది. ఏజెన్సీలో గెడ్డలు ఎండిపోయి గిరిజనులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. సీతంపేట అటవీ ప్రాంతంలో పలు గెడ్డలు అడుగంటాయి. ఎత్తయిన కొండలపై నివసిస్తున్న కొన్ని గ్రామాల గిరిజనులు తాగునీటి కోసం గెడ్డలపై ఆధారపడతారు. వీరు నీరు కరువై అల్లాడుతున్నారు. విశాఖ మన్యంలో మంచి నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. రక్షిత మంచి నీటి పథకాలు అలంకారప్రాయంగా మిగలడంతో పలు గ్రామాల్లో తాగునీటి కోసం గిరిజనులు ఊటగెడ్డలను ఆశ్రయిస్తున్నారు. పాడేరులో ఇటీవల నీరు కలుషితమై సుమారు 18 మంది డయేరియా బారినపడ్డారు. లంబసింగి, మేడూరు, అన్నవరంలో కూడా తాగునీటి పథకాలు సక్రమంగా పనిచేయడం లేదు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా ప్రత్యేక బృందాలతో సర్వే చేయించి చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ అధికారులు చెబుతున్నా ఆచరణకు మాత్రం నోచుకోవడం లేదు. చింతపల్లి మండలం కొత్తపాలెం పంచాయతీ జున్నుల ప్రాంత గిరిజనులకు దశాబ్దాల తరబడి ఊటగెడ్డలే దిక్కు. డుంబ్రిగుడ మండలంలో దాహం కేకలతో గిరిజనులు అల్లాడుతున్నారు. కృష్ణా జిల్లాలో ఎండలు ముదరకముందే తాగునీటి కష్టాలు తారస్థాయికి చేరుకున్నాయి. కైకలూరు నియోజకవర్గం కలిదిండి మండలం పోతుమర్రు గ్రామ ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం నానా అవస్థలు పడుతున్నారు. ఈ గ్రామంలో 4000 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో తాగునీటి అవసరాలు తీర్చడం కోసం ఏడు ఎకరాల విస్తీర్ణంలో తాగునీటి చెరువు ఉంది. ఈ చెరువుకు గుడ్లవల్లేరు లాకుల నుంచి క్వాంప్‌బెల్ ఛానల్ ద్వారా నీటిని సరఫరా చేయాల్సి ఉంది. అయితే ఇంకా నీటిని సరఫరా చేయలేదు. మరోవైపు తాగునీటి చెరువులో ఉప్పునీటి శాతం అధికంగా పెరిగిపోయింది. దీంతో చేపలు సైతం మృత్యువాత పడుతున్నాయి. రాయలసీమ క‘న్నీటి’ కష్టాలు దేశంలోనే కరువు జిల్లాల్లో ఒకటైన అనంతపురంలో ఏటా కరువే. తీవ్ర వర్షాభావంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. దీంతో జిల్లావ్యాప్తంగా తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. చాలా గ్రామాల్లో తాగునీటి సరఫరా మార్చి నాటికే బంద్ కాగా జనం సమీప ప్రాంతాల్లోని పొలాల వద్దకు వెళ్లి నీళ్లు తెచ్చుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో తాగునీటి సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలివీడు మండలంలో 17 గ్రామ పంచాయతీల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ప్రభుత్వ స్కీమ్ బోర్లలో భూగర్భజలాలు అడుగంటడంతో గుక్కెడునీటికి ప్రజలు గుటకలు వేయాల్సిన దుస్థితి. గ్రామాల్లో అరకొరగా నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసినప్పటికి అవి చాలక, ప్రజలు నీరు పట్టుకునే సమయంలో ఘర్షణ కూడా పడుతున్నారు. కర్నూలు జిల్లా దొర్నిపాడు మండలం క్రిష్టిపాడులో దాదాపు 1,600 ఇళ్లు ఉన్నాయి. పక్కనే కుందూ నది ఉంది. నది నుంచి నీటిని ఓవర్‌హెడ్ ట్యాంకుకు తీసుకెళ్లి.. అక్కడి నుంచి గ్రామస్తులకు సరఫరా చేసేవారు. ప్రస్తుతం నది ఎండిపోవడంతో గ్రామంలో తీవ్ర నీటి సమస్య నెలకొంది. విధిలేని పరిస్థితుల్లో గ్రామస్తులు నదిలో చెలమలు తవ్వుకుని నీటిని పట్టుకుంటున్నారు. నీళ్ల కోసం పైపులను నోటిలో పెట్టుకొని పీల్చుతున్న మహిళలు గోదావరి చెంత.. తాగునీటికి చింత గోదావరి చెంతనే ఉన్న రాజమహేంద్రవరంలోని పలు ప్రాంతాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. దీంతో ఆయా ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. చాలాచోట్ల రోజుకు ఒక్క పూట మాత్రమే నీటిని అందిస్తున్నారు. మామూలు రోజుల్లో 1 నుంచి 44వ డివిజన్ వరకూ రోజుకు రెండుసార్లు, 45వ డివిజన్ నుంచి 50వ డివిజన్ వరకూ రోజుకు ఒక్కసారి నీటిని సరఫరా చేస్తారు. కానీ, ప్రస్తుత వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉండటంతో రోజుకు ఒక్కసారి నీటిని అందించడమే కష్టంగా ఉంది. నగర శివారు ప్రాంతాలైన 44, 45, 46, 47, 48, 49, 50 డివిజన్లలో కొన్నిసార్లు రోజులో ఒకసారి కూడా మంచినీటి సరఫరా జరగడం లేదు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేటలోని రాజగోపాలపురంలో ట్యాంకర్ వద్ద గుమికూడి నీళ్లు పట్టుకుంటున్న ప్రజలు పట్టణాల్లో దాహం కేకలు రాష్ట్రంలో వివిధ పట్టణాల్లోని ప్రజలు గుక్కెడు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. రెండేళ్లుగా కొనసాగుతున్న వర్షాభావ పరిస్థితులు, రిజర్వాయర్లలో నీటిమట్టం పడిపోవడం, రక్షిత మంచినీటి పథకాల నిర్మాణాల్లో జాప్యం, పెరిగిన విలీన గ్రామాల కారణంగా నీటిఎద్దడి రోజురోజుకీ పెరుగుతోంది. గత అనుభవాలను పరిగణనలోకి తీసుకుని మున్సిపల్ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోకపోవడంతో ఏప్రిల్‌లోనే తాగునీటి కష్టాలు ప్రారంభమయ్యాయి. 30 మున్సిపాల్టీల్లో రెండు రోజులకు ఒకసారి, 12 మున్సిపాల్టీల్లో నాలుగు రోజులకు ఒకసారి, 68 మున్సిపాల్టీల్లో రోజుకు ఒకసారి మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని పట్టణాల్లో రాత్రి సమయాల్లో నీటిని సరఫరా చేస్తుండటంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. తాగునీటి సరఫరాకు కష్టాలెన్నో.. రాష్ట్రంలోని 110 మున్సిపాల్టీలు, కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిలో 40 మున్సిపాల్టీల్లో అమృత్ పథకం పనులను రెండేళ్ల క్రితం ప్రారంభించారు. వాస్తవానికి గత డిసెంబర్లోనే వీటి నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. అయితే పనులు ఆలస్యం కావడంతో అ పథకాలేవీ అందుబాటులోకి రాలేదు. విలీన గ్రామాలు కలిగిన విజయవాడ, విశాఖ, గుంటూరు, తిరుపతి నగరాల్లో కొత్తగా రక్షిత మంచినీటి పథకాలు నిర్మించలేదు. ప్రకాశం, వైఎస్సార్ కడప జిల్లాలతోపాటు గుంటూరు జిల్లా పల్నాడులో భూగర్భ జలాలు అడుగంటడంతో బోరుబావులు కూడా పనిచేయడం లేదు. మున్సిపాల్టీల్లో 41,615 బోరుబావుల్లో 3 వేలు పూర్తిగా ఎండిపోయాయి. పాత పంపుసెట్లు, పంపిణీ పైపులైన్లు, వాల్వులు, మోటార్ల మరమ్మతులు, కొత్తవి కొనుగోలుకు ఈ ఏడాది ఇప్పటివరకు నిధులు విడుదల కాలేదు. నీటి సరఫరాకు సంబంధించి సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఫిట్టరు, ఎలక్ట్రీషియన్, మెకానిక్, కాపలాదారులను తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే అవకాశం కల్పించాలని అధికారులు పంపిన ప్రతిపాదనల పట్ల ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదు. రాష్ట్రంలోని దాదాపు 2,500 డివిజన్లలో రోజుకు ఒకసారి, 612 డివిజన్లలో రెండు రోజులకు ఒకసారి నీటి సరఫరా జరుగుతోంది. శివారు ప్రాంతాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. తిరుపతికి ఇబ్బందులు తప్పవా? చిత్తూరు జిల్లాలోని రెండు కార్పొరేషన్లు, ఆరు మున్సిపాలిటీల్లోని కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులకొకసారి నీరు సరఫరా అవుతోంది. రిజర్వాయర్లలో మరో 25–30 రోజులకు సరిపడా నీరు మాత్రమే ఉంది. ఈ లోపు వర్షాలు పడకపోతే సమస్య మరింత తీవ్ర రూపం దాల్చే ప్రమాదం ఉంది. తిరుపతికి నీరు సరఫరా చేసే కల్యాణి డ్యామ్, కైలాసగిరి రిజర్వాయర్లలో నీరు దాదాపు అడుగంటింది. తిరుపతిలో నీటి సరఫరాపై అధికారులు ఆంక్షలు అమలు చేస్తున్నారు. అక్కడక్కడ నాలుగు, 7 రోజులకు ఒకసారి సరఫరా చేస్తున్నారు. మరి కొన్ని ప్రాంతాల్లో గంట పాటు కూడా సరఫరా చేయడంలేదు. నీటి కొరతతో నగర వాసులు ఇబ్బందులు పడుతున్నారు. కడప కార్పొరేషన్లో మూడు రోజులకొకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. కొన్ని డివిజన్లలో ఐదారు రోజులకు ఒకసారి సరఫరా జరుగుతోంది. మచిలీపట్నం మున్సిపాల్టీ, గుంటూరు కార్పొరేషన్లలోని శివారు ప్రాంతాలకు నాలుగు రోజులకు ఒకసారి నీటిని సరఫరా చేస్తున్నారు. గుంటూరు జిల్లా వినుకొండ మున్సిపాల్టీ పరిధిలోని ప్రజలను నాలుగేళ్లగా నీటిఎద్దడి సమస్య వెంటాడుతోంది. పట్టణానికి నీటిని సరఫరా చేసే సింగరకొండ చెరువులో నీటిమట్టం పడిపోవడంతో నాలుగు రోజులకు ఒకసారి మంచినీటి సరఫరా జరుగుతోంది. మరో పదిరోజుల్లో చెరువుల్లోని నీటిమట్టం పూర్తిగా అడుగంటే పరిస్థితి నెలకొంది. గతేడాది వినుకొండ పట్టణ ప్రజలు ఒక్కో ట్యాంకరు నీటిని రూ.500 నుంచి రూ.600 వరకు కొనుగోలు చేశారు. ఈ ఏడాది అదే పరిస్థితి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. నగరాల్లో నీటికొరతతోప్రైవేట్ ట్యాంకర్లకు డిమాండ్ పెరిగింది. ట్యాంకరు నీరు కావాలంటే రూ.450 నుంచి రూ.500 వరకు చెల్లించాల్సి వస్తోంది. వివాహాలు, రిసెప్షన్లకు ట్యాంకర్ నీటిని రూ.1000 వరకు అమ్ముతున్నారు. దుకాణాన్ని మూయాల్సి వస్తోంది మాది శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట. చిన్నపాటి దుకాణం పెట్టుకుని కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. కొద్దిరోజులుగా మున్సిపాలిటీ కుళాయిల ద్వారా తాగునీరు సరఫరా కావడం లేదు. దీంతో ట్యాంకర్ల వద్ద నీరు పట్టుకునేందుకు దుకాణాన్ని మూసివేసి పడిగాపులు కాసి తాగునీరు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఉంది. – ఎస్కే నిజాం, నాయుడుపేట, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బోర్ల నుంచి తెచ్చుకుంటున్నాం మాది ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కల్లూరివారిపాలెం. ఊళ్లో నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాం. కుళాయిలు, చేతిపంపుల్లో సరిగా నీళ్లు రాకపోవడంతో గ్రామానికి సమీపంలోని వ్యవసాయ బోర్ల నుంచి నీళ్లు తెచ్చుకుంటున్నాం. పక్క గ్రామాలకు వెళ్లి 20 లీటర్ల నీటిని రూ.10కి కొనుగోలు చేస్తున్నాం. – ఈశ్వరమ్మ, కల్లూరివారిపాలెం, ప్రకాశం జిల్లా మంచినీటికి ఇబ్బంది పడుతున్నాం రాజమహేంద్రవరంలో రోజుకు ఒక్క పూటే మంచినీటిని వదులుతున్నారు. దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నాం. మిగిలిన అవసరాల కోసం దూరం వెళ్లి బిందెలతో నీటిని పట్టుకొని వస్తున్నాం. – గొప్పిశెట్టి విజయ, రాజమహేంద్రవరం ఈమె పేరు.. సోనీ. ఊరు.. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు తండా. కుళాయి నీరు అప్పుడప్పుడు మాత్రమే వస్తుండటంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదని వాపోతోంది. పంపుల్లో వచ్చే నీళ్లు చాలక పొలాలకు వెళ్లి డబ్బులు ఇచ్చి మంచినీరు తెచ్చుకుంటున్నామని చెబుతోంది. ట్యాంకు నుంచి వచ్చే నీళ్లు తాగితే కీళ్లనొప్పులొస్తున్నాయని, కిడ్నీ వ్యాధులతో తండాలో చాలామంది మంచాన పడ్డారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఆందోళన చెందుతోంది. ఈయన పేరు గౌడపేర ఏసోబు. ఊరు ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం ముక్తేశ్వరం. తమ గ్రామానికి పది రోజులకొకసారి మాత్రమే మంచినీరు వస్తోందని వాపోతున్నాడు. ఉన్న ఒక్క చేతిపంపు కూడా భూగర్భ జలాలు అడుగంటి సక్రమంగా పనిచేయడం లేదని చెబుతున్నాడు. పశువులకు తాపడానికి నీళ్లు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆందోళన చెందుతున్నాడు. -
కష్టాలకు ఎదురొడ్డి.. విజేతలుగా నిలిచి!
ఐఐటీలో సీటు పొందడమంటే ఆషామాషీ వ్యవహారం కాదు. ఎంతో కఠిన శ్రమ చేసి, జేఈఈ మెయిన్స్, జేఈఈ అడ్వాన్స్డ్ వంటి పరీక్షల్లో గట్టి పోటీ ఇస్తే తప్ప ప్రవేశం సాధ్యం కాదు. అలాంటి పోటీని అధిగమించి ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు ఐటీడీఏ ప్రాంతంలోని ఆదివాసీ, గిరిపుత్రులు మెరుగైన ర్యాంకులు సాధించారు. వ్యవసాయమే జీవనాధారం, పేదరికం ఇలా ఎన్నో కష్టాలు ఎదుర్కొని జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఫలితాల్లో ఆరుగురు విద్యార్థులు మెరిశారు. కాలేజీల ఎంపికలో బిజీగా ఉన్న ర్యాంకులు పొందిన విద్యార్థులను పలకరించగా వారి ఆనందాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. – సాక్షి, హైదరాబాద్ ఐటీడీఏ సహకారంతో ఈ స్థాయికి ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కోరంపాడ్రి తండా మాది. ఆర్థిక స్థోమత లేకపోవడాన్ని ఐటీడీఏ అధికారులు గుర్తించారు. వారి సహకారంతో స్థానిక కృష్ణవేణి పాఠశాలలో పదోతరగతి వరకు చదివా. టీటీడబ్ల్యూఆర్‌జేసీ– ఆదిలాబాద్‌లో సీటొచ్చింది. జేఈఈ అడ్వాన్స్‌లో 1,061 ర్యాంకు సాధించా. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తా. – పుర్క చిత్రు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతా వ్యవసాయ నేపథ్యమున్న కుటుంబం మాది. ముదూర్ మండలం ఎడ్బిడ్ తండా మా సొంతూరు. పదోతరగతి వరకు ముదూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నా. ఆ తర్వాత ఆదిలాబాద్‌లోని టీటీడ బ్ల్యూఆర్‌జేసీలో సీటు సాధించా. అక్కడ ఇంజనీరింగ్ విద్యపై అవగాహన కల్పించి ప్రోత్సహించారు. కష్టపడి చదివి జేఈఈ అడ్వాన్స్‌లో 1,133 ర్యాంకు సాధించా. కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్ చదివి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలనేది నా లక్ష్యం. – బదావత్ రాజేందర్ సివిల్ ఇంజనీరే నా లక్ష్యం ఆదిలాబాద్ జిల్లా సొంతూరు ఉశెగాన్, జైనూరు మండలం. నాన్న వ్యవసాయం చేస్తారు. పదోతరగతి వరకు ఉట్నూ రులోని శిశు మందిర్‌లో చదువుకున్నా. ఆ తర్వాత ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో చేరా. పట్టుదలతో చదివి పరీక్షలు రాశా. ప్రిన్సిపాల్ ప్రోత్సాహంతో జేఈఈ అడ్వాన్స్‌లో 1,618 ర్యాంకు వచ్చింది. ఇంజనీరింగ్‌లో సివిల్ బ్రాంచ్‌ను ఎంచుకుని సివిల్ ఇంజనీర్ అవుతా. – కేరం నాగమణి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా మంచిర్యాల జిల్లా రెబ్బన మండలం నంబాల గ్రామం మాది. నాన్న వ్యవసాయ కూలి. ఫీజులు చెల్లించి చదువుకునే స్తోమత లేదు. పదోతరగతి వరకు నంబాల జెడ్పీ పాఠశాలలో చదివా. 7.7 మార్కులు వచ్చాయి. తర్వాత ఉట్నూరు టీటీడబ్ల్యూఆర్‌జేసీలో సీటు సాధించా. ఉపాధ్యాయుల ప్రోత్సాహం నాలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. జేఈఈ అడ్వాన్స్‌లో 2,315 ర్యాంకు వచ్చింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటా. – పూదరి శ్రీనివాస్ ఆస్ట్రోనాట్ అవుతా.. ఆదిలాబాద్ జిల్లా సీహెచ్. ఖానాపూర్ మా సొంతూరు. ఉట్నూరు ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నా. ఆదిలాబాద్‌లోని టీటీ డబ్ల్యూఆర్జేసీ లో చేరా. అక్కడే నాకు ఐఐటీపై అవగాహన కల్పించారు. పట్టుదలతో చదివి 2,509 ర్యాంకు సాధించా. ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివి ఆస్ట్రోనాట్ అవుతా. – జాదవ్ నిరంజన్ రూ.50 వేల నగదు, ల్యాప్‌టాప్.. ఐఐటీలో సీటు సాధించి న గిరిజన, ఆదివాసీ విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ప్రకటిం చింది. ఒక్కో విద్యార్థికి రూ.50 వేల నగదు, బ్రాండెడ్ ల్యాప్‌టాప్ ఇవ్వనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ప్రకటించారు. – మంత్రి చందూలాల్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆదిలాబాద్ జిల్లా కౌటాల మం డలం ఇప్పలగూడ సొంతూరు. గిరిజన సంక్షేమ శాఖ సహ కారంతో ఆసిఫాబాద్‌లోని పీటీజీ స్కూల్లో పదోతరగతి వరకు చదు వుకున్నా. ఆదిలాబాద్‌లోని టీటీడ బ్ల్యూఆర్‌జేసీలో సీటొచ్చింది. అక్కడ జేఈఈ పరీక్షలకు శిక్షణ ఇచ్చారు. కష్టపడి జేఈఈ అడ్వాన్స్‌లో 2,594 ర్యాంకు సాధించా. సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేస్తా. – పూదరి ఆదర్శ్ -
డిజిటల్ బోధనపై మొగ్గు!
జిల్లాలోని అన్ని ఆశ్రమ పాఠశా–లల్లో డిజిటల్ బోధనకు రంగం సిద్ధం చేస్తున్నారు. పాఠ్యాంశాల బోధన కంటే దృశ్య రూపంలోనే విద్యార్థులకు మరింత మేలు జరుగుతుందని నిర్ణయించిన ఐటీడీఏ అధికారులు తగు చర్యలు చేపట్టారు. ఇప్పటికే కొన్ని ఆశ్రమాల్లో ఈ బోధన జరుగుతుండగా మిగిలిన వాటిలో కూడా ఈ తరగతులను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీతంపేట : జిల్లాలో ఆశ్రమ పాఠశాలల్లో పూర్తి స్థాయిలో డిజిటల్ బోధనకు శ్రీకారం చుడుతున్నారు. దీనిలో భాగంగా ఆ దిశగా ఐటీడీఏ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే ఎర్నెట్ సంస్థ ద్వారా 20 ఆశ్రమ పాఠశాలల్లో బోధన జరుగుతుండగా మరో నాలుగు గురుకులాల్లో డిజిటల్ బోధన చేస్తున్నారు. అయితే 27 పాఠశాలల్లో నూతనంగా డిజిటల్ బోధన చేయడానికి కేయాన్ సంస్థ ద్వారా విద్యను అందించనున్నారు. ఇప్పటికే కంప్యూటర్లను అమర్చేందుకు రంగం చేస్తున్నారు. ఐటీడీఏ పీవో ఎల్.శివశంకర్ ఇటీవల స్థానిక గిరిజన గురుకుల పాఠశాలను సందర్శించి అక్కడ డిజిటల్ బోధన చూసిన అనంతరం అన్ని పాఠశాలల్లో దీన్ని అమలు చేస్తామని తెలిపారు. ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. దృశ్య రూపంలో పాఠ్య బోధన.. పదిసార్లు విన్న దాని కంటే ఒక్కసారి చూస్తే ఆ దృశ్యం మెదడులో నిక్షిప్తమై ఉంటుంది. ప్రతీ రోజూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విన్న అనంతరం విద్యార్థులు దానిని మననం చేసుకుంటారు. అదే పాఠాన్ని దృశ్య రూపంలో విద్యార్థులకు చూపిస్తే ఎన్నటికీ గుర్తుండిపోతుంది. పరీక్షల్లో జవాబులనూ జ్ఞాపకశక్తి, అవగాహనతో రాయగలుగుతారు. పాఠాలను దృశ్య రూపంలో చూపించే యత్నమే డిజిటల్ విద్యా తరగతులు. పాఠ్యాంశాల్లో ఉన్న అంశాలను ప్రాజెక్టర్ ద్వారా దృశ్య రూపంలో విద్యార్థులు తెరపైన చూస్తారు. ప్రతీ పాఠానికి సంబంధించిన సీడీల ద్వారా దృశ్య బోధన ఉంటుంది. సాధారణ బోధనలో విజ్ఞాన పాఠాలు, అంతరిక్షం, వివిధ ప్రయోగాలు చూడడం ద్వారా విద్యార్థి మదిలో ఆ విషయాలు నిక్షిప్తమౌతాయి. అనుమానాల నివృత్తికి అవకాశం ఉంటుంది. వెనుకబడిన విద్యార్థులకు ఈ బోధన ఎంతో ప్రయోజనం.