breaking news
ISDS
-
పెరుగుతున్న నిరుద్యోగం: ‘ఆయా పోస్టు కూడా మేం చేస్తామయ్యా..’
సత్తుపల్లి టౌన్ : చిన్నపిల్లలను ఇంటి నుంచి తీసుకురావడం.. వారి ఆలనాపాలనా చూస్తూనే పౌష్టికాహారం వండిపెట్టడం.. ఆ తర్వాత ఇంటి వద్ద వదలడం.. ఇవీ అంగన్వాడీ కేంద్రాల్లో ఆయాల విధులు. ఈ పోస్టుకు కనీస విద్యార్హత పదో తరగతి ఉత్తీర్ణత సాధించి ఉండాలి. కానీ ఇటీవల జిల్లాలోని కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తే పెద్దసంఖ్యలో దరఖాస్తులు రాగా.. ఇందులో ఉన్నత విద్యావంతులు కూడా ఉండడం అధికారులను ఆశ్చర్యానికి గురిచేసింది. చదవండి: టీఆర్ఎస్ మీటింగ్‌ల్లో పస లేదు.. నాకే బ్రహ్మరథం ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడం.. ఒకవేళ వచ్చినా కుటుంబాన్ని వదిలి ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి లేని కారణంగా ఉన్న ఊరిలోనే పనిచేయొచ్చనే భావనతో ఈ పోస్టుకు పోటీపడుతున్నట్లు దరఖాస్తులు చెబుతున్నారు. అసలు ఈపోస్టుకు అర్హత ఏమిటంటే.. అంగన్వాడీ ఆయా పోస్టుకు పదో తరగతి ఉత్తీర్ణులైన మహిళలు మాత్రమే అర్హులు, అంగన్వాడీ కేంద్రం పరిధిలోని చిన్నారులను కేంద్రానికి తీసుకురావటం, ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా వంట సిద్ధం చేసి చిన్నారులతో పాటు బాలింతలు, గర్భిణులకు వడ్డించడం వీరి విధి. ఆ తర్వాత కేంద్రాన్ని శుభ్రం చేయటం, పనివేళలు ముగిశాక పిల్లలను ఇంటివద్దకు పంపించి రావాల్సి ఉంటుంది. గతంలో ఆయాలకు నెలకు రూ.6వేల వేతనం ఇస్తుండగా, పీఆర్సీ అమలుతో ఈ వేతనం రూ.7,800కు పెరగనుంది. ఫలితంగా చిన్న పోస్టులో పని ఎలా ఉంటుందనే భావన పక్కన పెట్టి ఉన్నత విద్యావంతులు దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. 120 పోస్టుల భర్తీకి దరఖాస్తులు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 120 పోస్టులు భర్తీ చేసేందుకు అధికారులు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించారు. ప్రాజెక్టుల వారీగా దరఖాస్తుల పరిశీలన, అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలించాక జాబితా తయారీలో నిమగ్నమయ్యారు. దరఖాస్తుదారుల్లో అర్హులను కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈనెల మొదటి వారంలో ఎంపిక చేయనుంది. అయితే, పరిశీలన సందర్భంగా అధికారులు కొందరి దరఖాస్తులు, సర్టిఫికెట్లను చూసి విస్తుపోయారు. దరఖాస్తుదారుల్లో పలువురు డిగ్రీ, పీజీ పూర్తిచేసి ఉండడంతో ఆశ్చర్యపోయిన వారు వివరాలు ఆరా తీశారు. వేతనం తక్కువైనా సరే.. సొంతూరిలో పనిచేసే అవకాశం ఉండడానికి తోడు కేంద్రంలోని ఇతర పిల్లలతో పాటు తమ పిల్లల ఆలనాపాలనా కూడా చూసుకోవచ్చనే భావనతో ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నట్లు పలువురు చెప్పారని సమాచారం. అంతేకాకుండా ఇతర ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రాకపోవడం, ఒకవేళ నోటిఫికేషన్ వచ్చి ఎంపికైనా పోస్టింగ్ ఎక్కడ వస్తుందోనన్న భావనతో వెనుకడుగు వేస్తున్నారని తెలుస్తోంది. ఇలా రకరకాల కారణాలతో అంగన్వాడీ కేంద్రాల్లో గరిటె తిప్పేందుకు ఉన్నత విద్యావంతులు సిద్ధమైనట్లు చెబుతున్నారు. చదవండి: యువ రైతు కన్నీటి వ్యథ: 13 ఎకరాల్లో పంట నీట మునక.. తట్టుకోలేక కుటుంబాన్ని వదిలి వెళ్లలేక.. నేను ఎంబీఏ పూర్తి చేసి ఆరేళ్లు అయింది. నా భర్త సురేష్ వ్యవసాయం చేస్తాడు. ఇద్దరు పిల్లలు ఉన్నారు. కూలి పనులు చేయలేను. అలాగని కుటుంబానికి దూరంగా ఉద్యోగానికి వెళ్లలేను. అందుకే అందుబాటులో ఉన్న ఆయా పోస్టుకు దరఖాస్తు చేసుకున్నా. ఇక్కడైతే నా పిల్లలతో పాటు కేంద్రానికి వచ్చే పిల్లల ఆలనాపాలనా చూసుకునే అవకాశం లభిస్తుంది. ఈ పోస్టు వస్తే అదృష్టంగా భావిస్తా. - హెచ్చు కల్పన, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం సొంతూరిలో ఉండొచ్చని... ఎమ్మెస్సీ కెమిస్ట్రీ పూర్తిచేశా. నా భర్త వీరబాబు ఉపాధిహామీ పథకంలో టెక్నికల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. మాకు ఇద్ద రు కుమారులు. మాది పేద కుటుంబమైనందున ఆయా పోస్టు చిన్నదా, పెద్దదా అని చూడలేదు. సొంత ఊళ్లో ఉపాధి లభిస్తుందని మాత్రమే ఆలోచించా. - నడ్డి కృష్ణవేణి, కాకర్లపల్లి, సత్తుపల్లి మండలం ఏర్పాట్లు చేస్తున్నాం.. శనివారం నుండి బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని ఆదేశాలు అందాయి. కలెక్టర్ గౌతమ్, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్ ఆదేశాలతో మండల కేంద్రాలకు చీరలు పంపించాం. అక్కడి నుంచి తహసీల్దార్ల పర్యవేక్షణలో గ్రామపంచాయతీలకు పంపిస్తాం. ఆహారభద్రత కార్డులో పేరు ఉండి 18 ఏళ్లు పైబడిన మహిళలందరికీ చీరలు అందిస్తాం. - ఎం.విద్యాచందన, డీఆర్డీఓ శుభ పరిణామం.. ఆయా పోస్టులకు ఉన్నత విద్యావంతులు కూడా దరఖాస్తు చేసుకోవటం శుభపరిణా మం. యూజీ, పీజీ పూర్తిచేసిన వారు ఎంపికైతే చిన్నారులకు ప్రీ స్కూల్ కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం అందించడానికి ఉపయోగపడుతుంది. అలాగే, వర్క్‌బుక్స్ కూడా చదివించడం, రాయించడం, మెరుగైన విద్య అందించేందుకు దోహదం చేస్తాయి. - సీహెచ్ సంధ్యారాణి, ఐసీడీఎస్ పీడీ, ఖమ్మం -
ఎవరబ్బాయో!
సుమారు రెండేళ్ల బాలుడు తప్పిపోయాడు. నాటకీయ పరిణామంలో వీరబల్లి పోలీసులకు చిక్కాడు. ఆ అబ్బాయిని ఐసీడీఎస్‌కు అప్పగించారు. ఆ అబ్బాయి తమ బిడ్డేనంటూ హైదరాబాదు నుంచి దంపతులు వచ్చారు. తమ బాబు పేరు అరుణ్ అని చెబుతున్నారు. కాదు ఆ పిల్లోడు తమ పిల్లోడేనంటూ తిరుపతి నుంచి భార్య, భర్త వచ్చారు. తమ బిడ్డ పేరు దీపక్ అని చెప్పారు. దిక్కుతోచని ఐసీడీఎస్ సిబ్బంది ఆ బాలున్ని బాలసదన్‌కు అప్పగించారు. బాలసదన్ సిబ్బంది ఆ పిల్లవాడికి సాయి చరణ్ అని నామకరణం చేశారు. ఇంతకీ ఆ పిల్లోడు ఎవరబ్బాయి అనేది ప్రశ్నార్థకంగా మారింది. కడప రూరల్ : ఓ బాలుడి ఉదంతం మిస్టరీగా మారింది. ఆ బాలుడు తప్పిపోయాడా.. లేక కిడ్నాపర్లు తీసుకొచ్చి ఇక్కడ వదిలేశారా.. అనేది తెలియాల్సి ఉంది. నాటకీయ పరిణామాల నేపథ్యంలో గురువారం బాలుడిని పోలీసులు స్వాధీనం చేసుకోగా, శుక్రవారం కడప ఐసీడీఎస్ చెంతకు చేర్చారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్ఆర్ జిల్లా వీరబల్లిలో ఈశ్వరయ్య, ప్రభావతి దంపతులకు పిల్లలు లేరు. వైద్య పరీక్షల నిమిత్తం గత ఆదివారం తిరుపతికి వెళ్లారు. అక్కడి నుంచి ఆ బాలుడిని వెంట తెచ్చుకున్నారు. ఈ సంఘటన వీరబల్లిలో చర్చనీయాంశమైంది. ఆ బాలుడిని కొని తెచ్చుకున్నారని ఆ నోటా, ఈనోటా పోలీసుస్టేషన్ వరకు చేరింది. దీంతో పోలీసులు గురువారం రంగప్రవేశం చేసి బాలుడిని స్వాధీనం చేసుకున్నారు. ఆ బాలుడిని కడపకు తెచ్చి శుక్రవారం ఐసీడీఎస్‌కు అప్పజెప్పారు. కాగా, ఆ దంపతులు తాము తిరుపతికి వెళ్లినపుడు రుయా హాస్పిటల్ గేటు వద్ద ఒక వృద్దుని వద్ద బాలుడు ఉండగా, ఆ వృద్దునికి రూ.10 వేలు డబ్బులు ఇచ్చి తెచ్చుకున్నామని చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఆ బాలుడు తమ బాలుడే అంటూ హైదరాబాదు నుంచి వచ్చిన వడ్డె వెంకటయ్య, మణెమ్మ దంపతులు కడప ఐసీడీఎస్ వద్దకు వచ్చారు. వెంకటయ్య మాట్లాడుతూ తమది హైదరాబాద్‌లోని సంసల ప్రాంతమని, తాను డ్రైవర్‌గా పనిచేస్తున్నట్లు తెలిపారు. తనకు అనిత, సునీత, అరుణ్ సంతానమని తెలిపారు. అరుణ్ గత జనవరి 5వ తేదిన పిల్లలతో బయట ఆటలాడుకుంటుండగా అపహరణకు గురయ్యాడన్నారు. ఈ విషయమై స్థానిక నార్సింగ్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామన్నారు. ఈ బిడ్డ తమ బిడ్డేనని అన్నారు. మరోవైపు తిరుపతి నుంచి వచ్చిన లక్ష్మి, చందు అలియాస్ భాష దంపతులు ఈ పిల్లాడు తమ పిల్లాడే అని, పేరు దీపక్ అని తెలిపారు. భాష మాట్లాడుతూ తాము తిరుపతిలో ఉంటున్నామని, తానూ బండల పని చేస్తున్నట్లు తెలిపారు. తమకు దీపక్ ఒక్కడే సంతానమన్నారు. తన భార్యకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యం కోసం ఆదివారం తిరుపతి రుయా ఆస్పత్రికి వచ్చామన్నారు. బయట ఉన్న ఓ వృద్ధుడి వద్ద పిల్లాడిని వదిలి లోపలికి పోయామన్నారు. అప్పటి నుంచి పిల్లాడు కనిపించక వెదుకుతున్నామని చెప్పారు. కడపలో ఉన్నాడని తెలుసుకుని వచ్చామన్నారు. బాలుడికి మాటలు రావు. ఎవరినీ పెద్దగా గుర్తించలేకపోతున్నాడు. విచారణ తర్వాత అప్పగింత రెండు ప్రాంతాల నుంచి ఆ బాలుడు తమ పిల్లోడేనంటూ దంపతులు వచ్చారు. దీంతో ఆ బాలుడిని బాలసదన్‌కు అప్పగించాము. సంఘటనను చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దృష్టికి తీసుకెళ్లాము. వారు కూడా నిర్దారించలేకపోతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగిస్తాము. - రాఘవరావు, ఐసీడీఎస్ పీడీ విచారిస్తాం బాలుడి విషయమై సమగ్రంగా విచారణ చేపడతాం. అవసరమైతే డీఎన్ఏ పరీక్షలు నిర్వహిస్తాం. అనంతరం బాలుడిని నిజమైన తల్లిదండ్రులకు అప్పగిస్తాం. అంతవరకు బాలుడిని బాలసదన్‌లో ఉంచుతాం. - శారదమ్మ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్