breaking news
Iran Nuclear Programme
-
ఇరాన్‌పై ఐరాస మళ్లీ ఆంక్షలు
దుబాయ్: ఇరాన్ అణు కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి మళ్లీ ఆ దేశంపై పూర్తి స్థాయి ఆంక్షలను విధించింది. ఇప్పటికే ఆ దేశ ప్రజలు సంపాదించిందంతా ఆహారం కోసమే ఖర్చు పెడుతూ, భవిష్యత్తుపై ఆందోళన చెందుతుండగా వారిపై ఆంక్షల వల మళ్లీ పడింది. అణు కార్యక్రమాన్ని వదిలేయాలంటూ చిట్టచివరి నిమిషంలో ఐరాసలో జరిగిన దౌత్య చర్చలు విఫలం కావడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయం నుంచి ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దీనిఫలితంగా, విదేశాల్లో ఉన్న ఇరాన్ ఆస్తులు ఫ్రీజ్ అవుతాయి. ఇరాన్ కుదుర్చుకున్న ఆయుధ ఒప్పందాలూ ఆగిపోతాయి. ఇరాన్ తన బాలిస్టిక్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమాన్ని కొనసాగించాలని చూస్తే మరిన్ని ఆంక్షలు మోపే ప్రమాదముంది. ఈ ఆంక్షలు ‘స్నాప్‌బ్యాక్’గా (స్వయంచాలికంగా–ఆటోమేటిక్)గా అమల్లోకి వస్తాయి. దీనివల్ల, ఇరాన్‌పై విధించిన ఇతర ఆంక్షల మాదిరిగా చైనా, రష్యాలు భద్రతామండలిలో వీటిని వీటో చేయడం కుదరదు. అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, యూకేలతో ఇరాన్ 2015లో కుదుర్చుకున్న అణు ఒప్పందంలో ఈ షర తులన్నీ ఉన్నాయి. జూన్‌లో ఇజ్రాయెల్‌తోపాటు అమెరికా తమ అణు కేంద్రాలపై దాడి చేసిన నేపథ్యంలో ఇరాన్ అంతర్జాతీయ అణుశక్తి సంస్థ(ఐఏఈఏ)నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పటికీ ఆ దేశం వద్ద 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలున్నాయి. 90% శుద్ధి చేసిన యురేనియంతో బాంబులను తయారు చేసే సామర్థ్యం ఇరాన్ సొంతమవుతుంది. తమ అణు కార్యక్రమం శాంతియుత అవసరాలకేనంటూ ఇరాన్ చెబుతున్నా అమెరికా, పశి్చమదేశాలు అనుమానిస్తున్నాయి. నెల రోజుల క్రితమే స్నాప్బ్యాక్ను ప్రయోగిస్తామంటూ ఫ్రాన్స్, జర్మనీ, యూకేలు హెచ్చరించాయి. అయినప్పటి కీ ఇరాన్ ఐఏఈఏ పరిశీలకులను అణు కేంద్రాల్లో తనిఖీలకు అనుమతించేందుకు అంగీకరించలేదు. శుద్ధి చేసిన యురేనియం నిల్వల గురించిన సవివర నివేదికను ఐఏఈఏకు పంపలేదు. దీంతో ఆంక్షలు అనివార్యమయ్యాయని పశ్చిమ దేశాలంటున్నాయి. శాంతియుత ప్రయోజనాల కోసమైతే యురే నియంను 60 శాతం వరకు శుద్ధి చేయాల్సిన అవసరం లేదు కదా అని ప్రశి్నస్తున్నాయి.ఎన్పీటీ నుంచి వైదొలిగే యోచన ఐరాస ఆంక్షలు అమల్లోకి రావడంతో ఇరాన్ ప్రతీకార చర్యలపై తీవ్ర సమాలోచనలు చేస్తోంది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక ఒప్పందం(ఎన్పీటీ) నుంచి వైదొలిగే ప్రతిపాదనను ఇరాన్ పార్లమెంట్ పరిశీలించే అవకాశాలున్నాయని ఎక్కువగా ఉన్నాయని స్పీకర్ మహ్మద్ బఘెర్ కలిబాఫ్ తెలిపారు. ఆంక్షలను ఆయన అన్యాయమన్నారు. ఎన్పీటీ నుంచి వైదొలగడం ద్వారా అణు బాంబును తయారు చేసే అవకాశాలున్నాయన్న వార్తలను ఆయన కొట్టిపారేశారు. అమెరికా ట్రంప్ హయాంలో 2018లో అణు ఒప్పందం నుంచి ఏకపక్షంగా వైదొలిగినందున యూరప్ దేశాలైన యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌లకు స్నాప్‌బ్యాక్ అమలు చేసే అర్హత లేదని ఆయన తెలిపారు. అయితే, ఇరాన్‌కు దౌత్య మార్గాలు తెరిచే ఉన్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో తెలిపారు. ఇందుకోసం ముందుగా ఇరాన్ తమతో నేరుగా చర్చలకు రావాలని ఆయన స్పష్టం చేశారు. ఐఏఈఏ నుంచి వైదొలగడం ఇరాన్ తీవ్రమైన తప్పిదమని, ఇదే సాకుతో అమెరికా, ఇజ్రాయెల్‌లు ఆ దేశంపై మళ్లీ దాడులకు దిగే ప్రమాదముందని విశ్లేషకులు అంటున్నారు. -
రూపాయి 37 పైసలు అప్
ముంబై: ప్రపంచవ్యాప్తంగా ముడిచమురు ధరలు దిగిరావడంతో.. దేశీ కరెన్సీపై కూడా ఇది సానుకూల ప్రభావం చూపింది. ఇరాన్‌తో అమెరికా సహా ఇతర అగ్రదేశాలు కుదుర్చుకున్న అణు ఒప్పందం ప్రభావంతో ఇరాన్ ముడిచమురు ఎగుమతులపై ఇక ఆంక్షలు ఎత్తివేయొచ్చనే అంచనాలు దీనికి కారణంగా నిలిచాయి. డీల్‌లో భాగంగా అణు కార్యకలాపాలను తగ్గించుకోవడానికి ఇరాన్ అంగీకరించింది. అణు వివాదాదానికి తెరపడటంతో ఆ దేశంపై పాశ్చాత్య అగ్రరాజ్యాలు విధించిన ఆంక్షలు క్రమంగా తొలగే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో డాలరుతో రూపాయి మారకం విలువ 37 పైసలు బలపడింది. క్రితం ముగింపు 62.87తో పోలిస్తే... 62.50 వద్ద స్థిరపడింది. ముడిచమురు ధరలు దిగొస్తుండటంతో దేశ క్రూడ్ దిగుమతుల బిల్లు శాంతించడంతోపాటు కరెంట్ అకౌంట్ లోటు(క్యాడ్)కు కూడా కళ్లెం పడొచ్చనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఇది అంతిమంగా రూపాయిపై సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేసినట్లు ఫారెక్స్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. దేశ క్రూడ్ అవసరాల్లో 80 శాతం మేర విదేశీ దిగుమతులే కావడం, ఇందులోకూడా ఇరాన్ నుంచి అత్యధికంగా క్రూడ్‌పై ఆధారపడుతోంది. మరోపక్క దేశీ స్టాక్ మార్కెట్లు సైతం భారీగా పుంజుకోవడం(సెన్సెక్స్ 388 పాయింట్లు లాభపడింది) కూడా రూపాయికి చేదోడుగా నిలిచింది.


