breaking news
International record
-
ఒక్క రోజులో 81కోర్సులు
గంట సేపు స్థిరంగా కంప్యూటర్ ముందు కూర్చోవడమే కష్టం... కానీ 24గంటలు కూర్చొని 81 కోర్సులను పూర్తి చేయడం. ‘ఇంపాజిబుల్!’ అనుకుంటున్నారా. కానీ సాధించి చూపించింది రెహనా షాజహాన్. కేరళలోని కొట్టాయమ్‌కు చెందిన ఈ 25 ఏళ్ల మహిళ... అత్యధిక ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసిన వ్యక్తిగా అంతర్జాతీయ రికార్డు సాధించింది. రికార్డు కోసం బహ్రైన్ వెళ్లిన రెహనా... ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, సిస్కో.. ఇలా అనేక కంపెనీల నుంచి ఆన్లైన్ సర్టిఫికెట్లు పొందింది. ఉదయం 8 గంటలకు మొదలుపెడితే.. రాత్రి 11 గంటలకల్లా 66 సర్టిఫికెట్లు వచ్చాయి. వరల్డ్‌రికార్డు నెలకొల్పాలంటే ఇంకోగంటలో 9 కోర్సులు పూర్తి చేయాలి. ఒకానొక దశలో వదిలేద్దామా? అనుకుంది. వెంటనే ఆ ఆలోచన విరమించుకుని.. గంటలో తొమ్మిది కోర్సులు పూర్తి చేసింది. సర్టిఫికెట్ రావాలంటే.. ఒక్కో కోర్సులో 70శాతం మార్కులు రావాలి. అన్ని మార్కులూ సాధించింది. దుబయ్‌లోని ఓ కంపెనీ హెచ్ఆర్గా పనిచేస్తున్న రెహనా.. తండ్రి ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీకోసం ఉద్యోగానికి రిజైన్ చేసి ఇటీవలే ఇండియా వచ్చింది. ఇక్కడా ఖాళీగా లేదు. విద్యార్థులకు కెరీర్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కోచ్‌గా పనిచేస్తోంది. ఆన్లైన్ కోర్సులెలా చేయాలో గైడ్ చేస్తోంది. ఈ స్ఫూర్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే... రెహనా వాళ్ల చెల్లి ఢిల్లీ యూనివర్సిటీలో చదువుతోంది. సో చెల్లిలా ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీలో చదవాలన్నది ఆమె కల. జామియా మిల్లియా ఇస్లామియాలో ఎంకామ్ ఎంట్రన్స్ రాసి... హాఫ్ మార్కుతో అడ్మిషన్ కోల్పోయింది. ఆ యూనివర్సిటీలో చేరాలంటే మరో ఏడాది ఆగాలి. వేస్ట్ చేయడమెందుకని ఎమ్‌ఎస్‌డబ్ల్యూ, పీజీ డిప్లొమా డిస్టెన్స్ కోర్సుల్లో చేరింది. ఆ తరువాత ఏడాదికే జామియాలో ఎంబీఏ సీటొచ్చింది. ఆ ఏడాది కేరళ నుంచి సీటు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి రెహనా. కోవిడ్ టైమ్‌లోనే ఆమె ఎంబీఏ అయిపోయింది. ఇంటర్వ్యూలకు వెళ్తే... కోవిడ్ టైమ్‌ను ఎలా ఉపయోగించుకున్నావని అడుగుతారు. అప్పుడు గుంపులో ఒకరిగా మిగిలిపోగూడదని.. ఎంబీఏ పూర్తవ్వగానే... ఒక రోజు 24 గంటల్లో 55 ఆన్లైన్ కోర్సులు పూర్తి చేసింది. అదే విషయాన్ని ఆమె పనిచేసిన ఎన్జీవో సీఈఓతో చెబితే... వరల్డ్ రికార్డ్‌కు ఎందుకు ట్రై చేయకూడదని ఓ సలహా ఇచ్చారు. అలా 24 గంటల్లో 81 కోర్సులు పూర్తి చేసి ఇలా స్ఫూర్తిగా నిలిచిందన్నమాట! -
ఆర్టీసీ చేజారనున్న గిన్నిస్ రికార్డు
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే అత్యుత్తవు రోడ్డు రవాణా సంస్థగా ఎన్నో అవార్డులు సొంతం చేసుకున్న అంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డురవాణా సంస్థ ఇప్పుడు ఓ ప్రతిష్టాత్మక అంతర్జాతీయ రికార్డును దూరం చేసుకోబోతోంది. దేశంలో మరే రోడ్డు రవాణా సంస్థకు సాధ్యం కాని ఈ రికార్డు పదిహేనేళ్లపాటు పదిలంగా ఉండి... మరికొద్ది రోజుల్లో చేజారబోతోంది. ప్రపంచంలోనే అత్యధిక సంఖ్యలో బస్సులను సమర్థవంతంగా నడుపుతున్న ఏకైక సంస్థగా ఏపీఎస్ ఆర్టీసీ చరిత్రపుటల్లో నిలిచింది. సరిగ్గా పదిహేనేళ్ల క్రితం ప్రతిష్టాత్మక ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ దీన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రభుత్వ సంస్థలకుగాని, ప్రైవేటు సంస్థలకుకాని ఇలా ప్రపంచంలో ఎక్కడా ఏపీఎస్ ఆర్టీసీకి ఉన్నన్ని బస్సులు లేవు. 1999 అక్టోబర్ 31న ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ దీన్ని తన పుస్తకంలో నమోదు చేసి ఏపీఎస్ ఆర్టీసీకి అధికారికంగా ఆహోదాను ఇచ్చింది. ఆ సమయంలో ఏపీఎస్ ఆర్టీసీకి 18397 బస్సులున్నాయి. ఇన్ని బస్సులను ఒకే సంస్థ సమర్థవంతంగా నిర్వహించటం ఓ అరుదైన అంశమని అప్పట్లో ‘గిన్నిస్’ కితాబిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ ఘనత మన ఆర్టీసీ పేరనే కొనసాగుతూ వస్తోంది. ప్రస్తుతం 22459 బస్సులతో అది మరింత ఉన్నతంగా ఎదిగింది. రాష్ట్ర విభజనతో రెండు ముక్కలు... రాష్ట్ర విభజనతో ఆర్టీసీని రెండు రాష్ట్రాలు పంచుకుంటున్నారుు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్‌కు 12 వేల బస్సులు, తెలంగాణకు 10 వేల బస్సులు దక్కనున్నాయి. దీంతో అత్యధిక బస్సులు నడుపుతున్న సంస్థ రెండు ముక్కలు కానుండటంతో గిన్నిస్ రికార్డు చేజారనుంది. కొద్ది రోజుల్లో ఆర్టీసీ విభజన జరిగిన క్షణం గిన్నిస్ రికార్డు చేజారిపోతుంది. పోటీలో మహారాష్ట్ర... ప్రస్తుతం దేశంలో ఏపీఎస్ ఆర్టీసీ తర్వాత మహారాష్ట్ర ఆర్టీసీ అత్యధిక బస్సులు నడుపుతోంది. అక్కడ దాదాపు 17 వేల వరకు బస్సులున్నాయి. గిన్నిస్ నుంచి ఏపీఎస్ ఆర్టీసీ పేరు తొలగిపోగానే దాన్ని మహారాష్ట్ర ఆక్రమించే అవకాశం ఉంది. ఇదీ ఆర్టీసీ స్వరూపం... * నిజాం స్టేట్ రైల్వే-రోడ్ ట్రాన్స్‌పోర్టు డిపార్టుమెంట్ పేరుతో 1932లో 27 బస్సులు.. 166 మంది సిబ్బందితో మొదలైంది. దేశంలో తొలుత జాతీయమైన రవాణా సంస్థ ఇదే. * 1958లో ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థగా ఆవిర్భవించింది. ప్రస్తుతం 22459 బస్సులు, 1.22 లక్షల మంది సిబ్బంది ఉన్నారు. * డిపోలు: 216, స్టేషన్లు 777 * వెన్నెల స్లీపర్ బస్సులు, గరుడ ప్లస్, గరుడ, ఇంద్ర, శీతల్ పేరుతో ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, ఆర్డీనరీ పేరుతో నాన్ ఏసీ బస్సులు నడుపుతోంది.