breaking news
indiramma amrutha hastham
-
అమృతహస్తం అభాసుపాలు
=ఆరు నెలలుగా అందని బిల్లులు =ఐసీడీఎస్ నుంచి సక్రమంగా అందని వస్తువులు =అప్పులు చేసి భోజనం పెడుతున్న వర్కర్లు =పట్టించుకోని వీవో లీడర్లు =కొరవడిన అధికారుల పర్యవేక్షణ పలమనేరు, న్యూస్‌లైన్: జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ఇందిరమ్మ అమృతహస్తం పథకం అభాసుపాలవుతోంది. ఐసీడీఎస్, ఐకేపీ శాఖల మధ్య సమన్వయం లోపించడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. ఆరు నెలలుగా బిల్లులు సక్రమంగా అందకపోవడంతో పలుచోట్ల పథకం ఆగిపోయింది. మరి కొన్ని చోట్ల తూతూ మంత్రంగా నడుస్తోంది. అంగన్వాడీ వర్కర్ల బాధలను ఐకేపీ వీవో లీడర్లు పట్టించుకోకపోవడం, అసలు వీవోలకు సక్రమంగా నిధులు అందకపోవడం వంటి పలు సమస్యలతో నేడోరేపో ఈ పథకం ఆగి పోయే సూచనలు కనిపిస్తున్నాయి. అప్పోసప్పో చేసి బాలింతలు, గర్భిణులకు భోజనం వండుతున్న అంగన్వాడీ వర్కర్లు ఇకపై ఈ భారాన్ని మోయలేమని తేల్చేస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రారంభ దశ నుంచే ఈ పథకానికి ప్రసవ నొప్పులు తప్పడం లేదు. పథకం ముఖ్య ఉద్దేశ్యం గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో ఓ పూట ఉచితంగా సంపూర్ణ భోజనం అందివ్వడం ద్వా రా గర్భిణులు, బాలింతల్లో ఆరోగ్య స్థాయిని పెంచాలన్నదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ్యం. అలాగే గర్భిణుల్లో రక్తహీనతను అరికట్టి శిశు మరణాలను తగ్గించడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆమేరకు అంగన్వాడీ కేంద్రా ల్లో అన్నం, పప్పు, ప్రతి రోజు గుడ్డు, పాలు, కూరగాయలు, ఆకుకూరలతో భోజనం ఏర్పా టు చేయాల్సి ఉంది. పెలైట్ ప్రాజెక్టుగా చిత్తూరు జిల్లా గత ఏడాది జనవరిలో జిల్లాలోని పలమనేరు, కుప్పం, తంబళ్లపల్లె, జీడీనెల్లూరులో పెలైట్ ప్రాజెక్టుగా ‘ఇందిరమ్మ అమృతహస్తం’ ప్రారంభమైంది. జిల్లాలో 960 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 20 వేల మంది గర్భిణులు, బాలింతలు సభ్యురాళ్లుగా ఉన్నారు. అయితే ఈ పథకం తొలి నుంచే సక్రమంగా అమలు కావ డం లేదు. అంగన్వాడీ సంఘాలు సైతం నిరసనలు తెలుపుతూనే ఉన్నాయి. మరోపక్క వాయల్పాడు, మదనపల్లె, పిచ్చాటూరు, శ్రీకాళహస్తి, తొట్టంబేడు, చిన్నగొట్టిగల్లులో ఈనెల పథకం ప్రారంభమైంది. పథకం నీరుగారిందిలా.. గర్భిణులు, బాలింతలకు మెనూ ప్రకారం ఒక్కొక్కరికీ రోజుకు రూ. 11 ప్రభుత్వం కేటాయించింది. బియ్యం, పప్పు, నూనెను ఐసీడీఎస్ అంగన్వాడీ కేంద్రాలకు అందిస్తోంది. కూరగాయలు, గుడ్డు, పాలు, ఆకుకూరలు తదితరాలను ఐకేపీలోని వీవో లీడర్లు అందించాల్సి ఉంది. అయితే వీవోలకు ఐసీడీఎస్ నుం చి నిధులు సక్రమంగా అందడం లేదు. ఫలి తంగా వారు అంగన్వాడీ కేంద్రాలకు సరుకుల ను ఇవ్వడం లేదు. ఇక ఐసీడీఎస్ నుంచి నేరుగా అందే బియ్యం, నూనెలు, పప్పు తదితరాలు కూడా సక్రమంగా రావడం లేదు. దీంతో చాలాచోట్ల ఈ పథకం కొండెక్కింది. ఇబ్బందులు పడుతున్న వర్కర్లు అంగన్వాడీ వర్కర్లు అప్పోసప్పో చేసి పథకాన్ని నిర్వహిస్తున్నారు. ఆరు నెలలుగా వీరికి బిల్లులు మంజూరు కాలేదు. చేసిన అప్పులు తీర్చలేక ఇబ్బందులు పడుతున్నారు. పలమనేరు ప్రాజెక్టు పరిధిలో ఆరు నెలల నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులు రూ. 84 లక్షలు. ఇక మిగిలిన ప్రాజెక్టుల్లో 2 కోట్ల దాకా బిల్లులు అందాల్సి ఉంది. మరోవైపు ఐసీడీఎస్ నుంచి అందాల్సిన బియ్యం, నూనె, పప్పు తదితరాలు సకాలంలో అందడం లేదు. ఈ విషయమై పలమనేరు సీడీపీవో రాజేశ్వరిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా జూలై వరకు ఐకేపీ వీవోల ఖాతాలోకి బిల్లులు జమ చేశామన్నారు. మిగి లింది ఇవ్వాల్సి ఉందన్నారు. ఇక బియ్యం తది తరాలకు ఆర్వోలు సిద్ధం చేశామని, రెండు మూడు రోజుల్లో సెంటర్లకు పంపిణీ చేస్తామన్నారు. ఐకేపీ వీవోల కారణంగా కొంత ఇబ్బం దులు ఉన్నాయని, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. -
డిసెంబర్ నుంచి ఇందిరమ్మ హస్తం ప్రారంభం
జోగిపేట, న్యూస్‌లైన్: జిల్లాలో కొత్తగా మూడు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని డిసెంబర్ 1నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ శైలజ తెలిపారు. శుక్రవారం జోగిపేటలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో ఐదు ప్రాజె క్టుల పరిధిలో ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండో విడతగా జోగిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాజెక్టుల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సిద్దిపేట, పటాన్చెరు, సదాశివపేట ప్రాజెక్టుల్లో ఈ పథకం ప్రారంభం కాలేదన్నారు. గతంలో బాలింతలు, గర్భిణుల ఇళ్లకు వెళ్లి పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేవారమని, అలా పంపిణీ చేయడం వల్ల పారదర్శకత లోపిస్తోందని భావించి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే వారికి వండి పెడతామని నెలకు 25 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తారన్నారు. ఐకేపీ వారు పాలు, కూరగాయలు, పోపు సామాన్లు సరఫరా చేస్తారని వీటికి గాను ఐసీడీఎస్ తరఫున డబ్బులను వారి ఖాతాల్లో వేస్తామన్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్, గుడ్లు ఐసీడీఎస్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. శిశుమరణాలు తగ్గించేందుకు పుట్టిన బిడ్డ బరువు పెంచేందుకు, రక్త హీనతను తగ్గించేందుకు ఈ పథకం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ప్రాజెక్టు పరిధిలో బాలామృతం పథకం ఏడు నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతినెల బాలామృతం పథకం క్రింద రెండున్నర కిలోల పోషక పదార్థాల పాకెట్‌ను పంపిణీ చేస్తామని ప్రాజెక్టు అధికారి ఎల్లయ్య తెలిపారు. ప్రతి రోజు 20 గ్రాముల చొప్పున దీనిని పిల్లలకు పట్టించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఫుడ్ పంపిణీ చేసే మాడిఫైడ్ థెరఫ్యూటిక్ ఫుడ్‌ను డిసెంబర్ 1నుంచి ప్రాజెక్టు పరిధిలోని పిల్లలకు అందించనున్నట్లు తెలిపారు.