breaking news
Indias growth rate
-
తలసరి ఆదాయం పెరిగితేనే...
భారత్, చైనా సమవుజ్జీలేనా? డాలర్లలో చూసినపుడు, 1990 ప్రాంతంలో భారత్, చైనా ఇంచుమించుగా ఒకే ఆర్థిక పరిమాణంలో, ఒకే రకమైన తలసరి ఆదాయంతో ఉన్నాయి. నిజానికి, అప్పట్లో చైనాలో తల సరి ఆదాయం మనకన్నా తక్కువగా ఉండేది. సుమారు 190 దేశాల జాబితాలో రెండు దేశాలు 140 నుంచి 145 మధ్య స్థానాల్లో ఉండేవి. చైనాలో ఆర్థిక సంస్కర ణలు 1978లో మొదలయ్యాయి. వారి వృద్ధి వెంటనే ఏమీ వేగం పుంజుకోలేదు. తర్వాత, పదమూడేళ్ళకి, అంటే 1991లో భారత్ సంస్కరణల బాటపట్టింది. ఇపుడు ప్రపంచంలో చైనాది రెండవ పెద్ద ఆర్థిక వ్యవస్థ. అది 2010లోనే ఆ స్థితికి చేరింది. అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ (ఐఎంఎఫ్) ప్రకారం, భారత్ కొద్ది రోజుల క్రితం, నాల్గవ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. వచ్చే మూడేళ్ళలో జర్మ నీని దాటి, భారత్ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలవనుంది.ఎంతో ఎదిగినా... ఇంకా వెనకే!భారత్, చైనా గత మూడు దశాబ్దాల్లో సాధించిన ప్రగతి అద్భుతం, చారిత్రకం, అసాధారణం. ఆసియాలోని ఈ రెండు దిగ్గ జాల జనాభా ప్రపంచ జనాభాలో నలభై శాతం మేరకు ఉంటుంది. ప్రస్తుతం భారత్ ఆర్థిక వ్యవస్థ సైజు సుమారు 4.1 ట్రిలియన్ల డాల ర్లుగా ఉంది. దానికన్నా ఐదింతలు ఎక్కువగా చైనాది 19 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. భారత సంఖ్యామానం ప్రకారం ఒక ట్రిలియన్ అంటే లక్ష కోట్లతో సమానం.భారత్ 2000 నుంచి 2024 వరకు 6.3 శాతం వార్షిక వృద్ధిని కనబరచిందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. పెద్ద ఆర్థిక వ్యవస్థలలో ఇది వేగవంతమైన వృద్ధి రేటు. ఇటీవలి సంవత్సరాల్లో, భారత్ వృద్ధి రేటు సుమారు 7.3 శాతానికి పెరిగింది. ఇక 1990 నాటి స్థితితో పోలిస్తే, భారత్ ఆర్థిక వ్యవస్థ ఇపుడు 11.5 రెట్లు పెద్దదిగా ఉంది. జనాభా 1.6 రెట్లు మాత్రమే పెరిగింది. మరో విధంగా చెప్పాలంటే, 1990లో సుమారు 360 డాలర్లుగా ఉన్న తలసరి ఆదాయం 2025 నాటికి 2,700 డాలర్లకు పెరిగింది. అయినా చైనాతో వైరుధ్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.రెండు దేశాలు 1990లో ఒకే విధమైన తలసరి ఆదాయంతో ఉన్నాయి. చైనాలో తలసరి ఆదాయం 2025లో భారత్ కన్నా దాదాపు ఐదు రెట్లు ఎక్కువగా 13,000 డాలర్లకు దూసుకొచ్చింది. చైనా ఆర్థిక వ్యవస్థ గత 35 ఏళ్ళలో 51 రెట్లకు పైగా విస్తరించింది. చైనా మూడు దశాబ్దాలపాటు 10 శాతం వృద్ధి రేటును కొనసాగించగలిగింది. మొత్తం 197 దేశాల్లో నేడు భారత్ 141వ స్థానంలో ఉండగా, చైనా 70వ ర్యాంకునకు ఎగబాకింది. ప్రపంచ బ్యాంక్ ప్రకారం, భారత్ ఇపుడు మధ్యాదాయ కేటగిరీలో స్థిరంగా ఉంది. చైనాను అధిక –ఆదాయ దేశంగా పరిగణిస్తున్నారు. తలసరి ఆదాయం 14,000 డాలర్ల ఎగువున ఉంటే అలాంటి హోదా దక్కుతుంది. ఆ వాకిలిని కూడా దాటినవాటిని ప్రపంచ బ్యాంక్ అభివృద్థి చెందిన ఆర్థిక వ్యవస్థలుగా గౌరవిస్తుంది. భారత్ 2047 నాటికి ఎలాగైనా ఆ స్థితిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఆ కల సాకారమవడానికి, మనం వచ్చే 20 ఏళ్ళపాటు డాలర్లలో సగటున 7.8 శాతం వృద్ధి వేగాన్ని అందుకుని, అదే రీతిలో కొనసాగవలసి ఉంటుంది. ఇటీవలి సంవత్సరాల్లో, మనం చూపిన 7.3 శాతం వృద్ధి రేటుకన్నా అది కాస్త ఎక్కువ. ఎందుకు వెనకబడ్డాం?భారత్ 1990–2025 మధ్య కాలంలో చైనాతో పోల్చుకుంటే, ఎందుకు వెనుకబడింది? ఎగుమతులు, ముఖ్యంగా శ్రమ శక్తి ద్వారా ఒనగూడే ఎగుమతుల ప్రాబల్యం విషయంలో, ఉన్న సామర్థ్యాన్ని నిర్లక్ష్యం చేయబట్టా? ప్రాథమిక ఆరోగ్య, విద్య రంగాలకు తక్కువ పెట్టుబడులు ఉండబట్టా? మనం 1991లో చాలా వరకు రద్దు చేసు కున్న లైసెన్సుల వ్యవస్థ స్థానంలో ఇన్స్పెక్టర్ల వ్యవస్థ ఏర్పడబట్టా? లేక సాఫీగా వ్యాపారాలు చేసుకోనివ్వకుండా అడ్డుపడుతున్న మన దేశంలోని మూడంచెల పాలనా వ్యవస్థే దీనికి కారణమా? లేక మన దేశంలోని ప్రజాస్వామిక వ్యవస్థకుగాను నత్తనడకన సాగే వృద్ధి రూపంలో మూల్యం చెల్లించుకోక తప్పదా?చైనాతో పోల్చుకుంటే భారత్ పనితీరు పేలవంగా ఉండటానికి సంబంధించి ఇంకా అనేక ప్రశ్నలు తలెత్తుతాయి. ఆ ప్రశ్నలకు జవా బులు అన్వేషించడం వల్ల ఇప్పటికిప్పుడు ఒనగూడే ప్రయోజనం ఏమీ లేదు కనుక వాటినక్కడ వదిలేద్దాం. వృద్ధి రేటును సాధించ డానికి, అది కూడా వచ్చే ఇరవై ఏళ్ళపాటు స్థిరంగా కొనసాగించ డానికి ఏం చెయ్యవలసిన అవసరం ఉందో దానిపై దృష్టి కేంద్రీకరించడం మనందరి తక్షణ కర్తవ్యం. అది సమ్మిళిత వృద్ధి అయితే, తలసరి ఆదాయాలు కూడా పెరుగుతాయి. అంటే, ఉత్పాదకత, వేతనాలు, కుటుంబాల ఆదాయాలు, ఉన్నత–గుణాత్మక ఉద్యోగాలు వృద్ధి చెందాలి. దాన్ని సాధించకపోతే, 2047 నాటికి భారత్ మూడవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా పరిణామం చెందుతుందేమోకానీ, మధ్యా దాయ కేటగిరీలో చిక్కుకుపోతుంది. తలసరి ఆదాయం ఎదుగు బొదుగు లేకుండా 10,000 డాలర్లకు దిగువన ఉండిపోవచ్చు.ప్రపంచ బ్యాంక్ రికార్డులను తిరగేస్తే, గత యాభై ఏళ్ళలో, చాలా దేశాలు అటువంటి గతినే పొందాయని తేలుతుంది. మధ్య– ఆదాయ కేటగిరీ నుంచి అధిక– ఆదాయ కేటగిరీకి 34 దేశాలు మాత్రమే ఎగబాకగలిగాయి. దాదాపు 108 దేశాలు మధ్య– ఆదాయ వలలోనే చిక్కుకుపోయాయి. అమెరికన్ల తలసరి ఆదాయంలో సుమారు పదవ వంతుకి, లేదా ఇప్పటి లెక్కల్లో చెప్పాలంటే, సుమారు 8000 డాలర్లకు మాత్రమే అవి పరిమితమైపోయాయి. ఏం చేయొచ్చు?మధ్య–ఆదాయ వల నుంచి తప్పించుకునేందుకు, భారత్ బహుశా, దక్షిణ కొరియా (అత్యంత ఆకర్షణీయమైన పరిణామం), చిలీ, పోలెండ్‌ల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చు. ఒక దేశం మధ్య –ఆదాయం నుంచి అధిక–ఆదాయానికి పరిణామం చెందేందుకు మూడు (పెట్టుబడి, ప్రేరణ, నవీకరణ) టానిక్‌లు అవసరమని ప్రపంచ బ్యాంక్ పరిశోధన వెల్లడిస్తోంది. అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థ స్థాయిని అందుకునేందుకు అన్ని రాష్ట్రాలు (సూటిగా చెప్పాలంటే, ఆయా రాష్ట్రాల్లోని అన్ని నగరాలు, గ్రామాలు) కలసికట్టుగా కృషి చేయాలని నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభ్యర్థించారు. ఉద్యోగాలు, ఉత్పత్తి, ఎగు మతులు పెరిగేందుకు దోహదపడగల చిన్నతరహా (సూక్ష్మ సంస్థలు కాదు) సంస్థలకున్న వృద్ధి సామర్థ్యానికి పడిన సంకెళ్ళనన్నింటినీ తెగ్గొట్టాలని కోరారు. ప్రధానంగా, రాష్ట్రాల అంశాల జాబితాలోకి వచ్చే వ్యవసాయ రంగానికున్న ప్రతిబంధకాలన్నింటినీ తొలగించు కోవాలని కూడా ఆ మాటల తాత్పర్యం. స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ)లో 40 శాతానికి భారత్ పెట్టు బడులు పెంచుకోవాలి. మహిళా శక్తి భాగస్వామ్యాన్ని 35 శాతంనుంచి 50 శాతానికి పెంచుకోవాలి. గ్లోబల్ వాల్యూ చైన్లు, వాణిజ్య ఒప్పందాలు, విదేశీ పెట్టుబడులకు అడ్డంకిగానున్న సుంకాలను తగ్గించడం, అవరోధాలను తొలగించడం ద్వారా నూతన టెక్నా లజీల టానిక్‌ను వ్యవస్థలోకి చొప్పించాలి. పరిశోధన, అభివృద్ధి రంగంలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు రెండూ భారీ పెట్టుబడులు పెట్టడం ద్వారా నవీకరణకు దారులు తెరవాలి. నైపుణిని, శిక్షణను, ఉద్యోగ నియామక అర్హతలను ఇబ్బడిముబ్బడిగా పెంపొందించడం ద్వారా మానవ ప్రతిభ వ్యుత్పత్తుల మూలధనాన్ని పోగేసుకోవాలి.భారత్ ఎదుట మరో పెను సవాల్ ఉంది. అది 2070 నాటికి కర్బన ఉద్గారాలను శూన్య స్థితికి తీసుకురావడం. ఈ సవాల్‌ను ఎదుర్కొంటూనే భారత్ లక్ష్య సాధనకు కృషి చేయాలి. అజీత్ రణడే వ్యాసకర్త ఆర్థికవేత్త(‘ద ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
వేవ్‌లతో భారత్ ఎకానమీకి దెబ్బ,11 నుంచి 9.5 శాతానికి తగ్గిన వృద్దిరేటు
న్యూఢిల్లీ: మహమ్మారి తదుపరి వేవ్‌ల నుంచి భారత్ ఎకానమీకి ఇబ్బంది పొంచి ఉందని అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఎస్అండ్పీ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో అవుట్‌లుక్ అనిశ్చితిలో ఉందని హెచ్చరించింది. 2021–22 ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు తొలి (మార్చినాటి) అంచనాల 11 శాతాన్ని తాజాగా 9.5 శాతానికి తగ్గించింది. నివేదికలోని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఏప్రిల్, మే నెలల్లో సెకండ్‌వేవ్ ఆర్థిక వ్యవస్థ క్రియాశీలతను తీవ్రంగా దెబ్బతీసింది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల బ్యాలెన్స్ షీట్స్ తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం వచ్చే రెండేళ్లలో కనబడుతుంది. 2023 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 7.8 శాతానికి పరిమితం అవుతుంది. వ్యాక్సినేషన్ నత్తనడక నడుస్తుండడం ప్రతికూలాంశం. మొత్తం ప్రజల్లో కేవలం 15 శాతం మం దికి మాత్రమే ఇప్పటి వరకూ తొలి విడత వ్యాక్సినేషన్ జరిగింది. అయితే ఇకపై వ్యాక్సినేషన్ మరింత విస్తృతం అవుతుందని భావిస్తున్నాం. మొదటివేవ్‌తో పోల్చితే రెండవ వేవ్‌లో తయారీ, ఎగుమతులు తీవ్రంగా దెబ్బతినకపోయినప్పటికీ, సేవల రంగం మాత్రం తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొంది. వాహన విక్రయాల వంటి కీలక వినియోగ సూచీలు 2021 మేలో తీవ్రంగా పడిపోయాయి. వినియోగ విశ్వాసం తీవ్రంగా దెబ్బతింది. కరోనా కొత్త కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో పలు రాష్ట్రాల ఆంక్షలు, లాక్డౌన్ నిబంధనలు తగ్గుతున్నాయి. రవాణా మెరుగుపడుతోంది. అయితే రికవరీ 2021 తొలి మూడు నెలల నాటి స్థాయిలో వేగంగా ఉండకపోవచ్చు. కుటుంబాల పొదుపు రేట్లు పడిపోతున్నాయి. దీనితో వినియోగానికి మద్దతు లభించడంలేదు. ఒకవేళ ఉన్న కొద్దోగొప్పో డబ్బును కుటుంబాలు పొదుపుచేసుకోవడం మొదలుపెడితే, ఎకానమీ పునఃప్రారంభమైనా కుటుంబాల పరంగా వ్యయాలు అంతగా వేగం పుంజుకోకపోచ్చు. ద్రవ్య, పరపతి విధాన నిర్ణయాలు తగిన సరళతరంగానే కొనసాగవచ్చు. అయితే ఇప్పట్లో తాజా ఉద్దీపన ప్రకటనలు ఏవీ ఉండకపోవచ్చు. రిటైల్ ద్రవ్యోల్బణం కేంద్రం నిర్దేశాల (2–6 శ్రేణి) కన్నా అధికంగా ఆరు శాతంపైగా కొనసాగుతున్న పరిస్థితుల్లో సెంట్రల్ బ్యాంక్ మరో దఫా రెపో రేటు కోతకు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– ప్రస్తుతం 4 శాతం) అవకాశం లేదు. దేశంలో ఆరోగ్య సంక్షోభాన్ని ఎదుర్కొనే ద్రవ్య విధానం విషయంలో ప్రభుత్వానికి పరిమితులున్నాయి. ఇందులో మొదటిది సెకండ్ వేవ్ రావడానికి ముందే– ఫిబ్రవరి 1వ తేదీన 2021–22 బడ్జెట్‌ను పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టింది. ప్రభుత్వ ఆదాయ–వ్యయాలకు సంబంధించి ద్రవ్యలోటు పరిస్థితులు ఇప్పటికే తీవ్రంగా ఉన్నాయి. భారత్ ఎకానమీ వృద్ధి రేటు 2021–22లో రెండంకెలపైనే ఉంటుందని సెకండ్‌వేవ్‌కు ముందు పలు విశ్లేషణా సంస్థలు అంచనావేశాయి. అయితే తరువాత కాలంలో ఈ రేటును ఒకంకెలోపునకు తగ్గించేశాయి. స్వయంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కూడా ఈ నెల ప్రారంభంలో వృద్ధి రేటు అంచనాలను 10.5 శాతం నుంచి 9.5 శాతానికి తగ్గించింది. -
ఈ ఏడాది భారత వృద్ధి రేటు 6 శాతమే: ప్రపంచ బ్యాంక్
వాషింగ్టన్: భారత జీడీపీ వృద్ధి రేటు 2019–20 ఆర్థిక సంవత్సరానికి 6 శాతంగానే నమోదు కావచ్చని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. గతేడాది నమోదైన 6.8 శాతంతో పోలిస్తే గణనీయంగా తగ్గుతుందని పేర్కొంది. అయినప్పటికీ భారత్ ఇప్పటికే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉందని వ్యాఖ్యానించింది. 2021లో 6.9 శాతం, 2021లో 7.2 శాతానికి భారత వృద్ధి రేటు పుంజుకుంటుందని తన తాజా నివేదికలో అంచనా వేసింది. 2018–19లో 6.8 శాతం, 2017–18లో 7.2 శాతంగా జీడీపీ వృద్ధి రేటు నమోదైన విషయం గమనార్హం. ‘ఇటీవల మందగమనం చోటు చేసుకున్నా కానీ.. ఎంతో సామర్థ్యంతో భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉంది. ప్రపంచంలో ఎన్నో దేశాల కంటే భారత వృద్ధి రేటు అధికం.’ అని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా ప్రాంత ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ తెలిపారు. -
వృద్ధి తగ్గుదల తాత్కాలికమే
మధ్య కాలానికి భారత్ వృద్ధి రేటు 8 శాతానికి పైనే.. ⇒ జీఎస్టీ అమలుతో ఇది సాకారం ⇒ అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనా వాషింగ్టన్: పెద్ద నోట్ల రద్దు అనంతర ప్రతికూల ప్రభావాలతో భారత జీడీపీ వృద్ధి రేటు క్షీణత తాత్కాలికమేనని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) అంచనా వేసింది. మధ్య కాలానికి 8 శాతానికిపైనే భారత్ వృద్ధి రేటు సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి తీసుకురావడం ఇందుకు తోడ్పడుతుందని పేర్కొంది. ఈ మేరకు భారత్‌పై వార్షిక నివేదికను ఐఎంఎఫ్ విడుదల చేసింది. దాని ప్రకారం... డీమోనిటైజేషన్ అనంతరం ఎదురైన ఇబ్బందుల కారణంగా జీడీపీ రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2016–17) 6.6 శాతానికి క్షీణిస్తుంది. గతేడాది నవంబర్ 8 తర్వాత నగదు కొరత కారణంగా వినియోగం, వ్యాపార కార్యకలాపాలు కుదేలయ్యాయి. వృద్ధిని నిలబెట్టుకోవడం సవాళ్లకు దారితీసింది. అయితే, ఆర్థిక వ్యవస్థపై పెద్ద నోట్ల రద్దు ప్రభావం తాత్కాలికమే. ఇది తిరిగి వెనుకటి స్థితికి వచ్చేస్తుంది. 2017–18లో 7.2 శాతానికి చేరుకుంటుంది. అనంతరం భారత జీడీపీ వృద్ధి రేటు కొన్ని సంవత్సరాలపాటు 8 శాతానికి పైనే నమోదవుతుంది. నగదు సరఫరా సులభతరం అయితే బలమైన వినియోగదారుల విశ్వాసం స్వల్ప కాలంలో వినియోగానికి కలసి వస్తుంది. పెట్టుబడుల రికవరీ అన్నది మధ్యస్థంగా ఉంటుంది. అది కూడా రంగాల వారీగా హెచ్చు, తగ్గులు ఉండొచ్చు. భారత చర్యలకు మద్దతు అక్రమ నగదు చలామణిని అరికట్టేందుకు కేంద్ర సర్కారు తీసుకున్న చర్యలకు ఐఎంఎఫ్ డైరెక్టర్లు మద్దతు పలకడం విశేషం. అయితే, నగదు చెల్లింపుల పరంగా అవాంతరాలు లేకుండా చూడాలని, తగినంత నగదు లభ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలని ఐఎంఎఫ్ కేంద్ర సర్కారును కోరింది. భారత్ గత కొన్ని సంవత్సరాలుగా బలమైన ఆర్థిక పనితీరు చూపించడానికి పటిష్టమైన విధాన చర్యలు, ద్రవ్య స్థిరీకరణకు కట్టుబడి ఉండడం, ద్రవ్యోల్బణ నియంత్రణ విధానాలను కారణాలుగా పేర్కొంది. సరఫరా సమస్యలను తొలగించడంతోపాటు, ఉత్పత్తి పెంపు, ఉద్యోగావకాశాల కల్పన, సమగ్రాభివృద్ధికి వీలుగా సంస్కరణలు ఉండాలని పేర్కొంది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో ఆటుపోట్లు, అమెరికా వడ్డీరేట్ల పెంపును వెలుపలి సవాళ్లుగాపేర్కొంది. కార్పొరేట్, ప్రభుత్వ రంగ బ్యాంకుల బ్యాలన్స్ షీట్లు బలహీనపడడంపై అందోళనం వ్యక్తం చేసింది. జీఎస్టీ బలంగానే ఉండాలి జీఎస్టీతో ఆశించినదానికంటే అధిక ప్రయోజనాలు, నిర్మాణాత్మక సంస్కరణలు బలమైన వృద్ధి రేటుకు దారితీస్తాయని ఐఎంఎఫ్ అంచనా వేసింది. జీఎస్టీ కారణంగా మధ్య కాలంలో భారత వృద్ధి 8%కి పైగా నమోదవుతుందని, దేశాన్ని ఒకే మార్కెట్‌గా మార్చి వస్తు, సేవల రవాణా పరంగా సమర్థతకు దారితీస్తుందని తెలిపింది. అయితే, జీఎస్టీ రూపు రేఖలు, దాని అమలు విషయంలో అనిశ్చితిని ప్రస్తావించింది. ‘‘భారత జీడీపీలో పన్నుల వాటా 17%. ఇది వర్ధమాన దేశాలతో పోలిస్తే తక్కువ. బలమైన జీఎస్టీ చట్టం అమలు అన్నది మా బలమైన వృద్ధి అంచనాలకు మూలం. కనుక జీఎస్టీలో మినహాయింపులు పరిమితంగా ఉండాలి. అన్ని రాష్ట్రాల్లో రేట్లు ఒకే తీరులో ఉండాలి. కార్పొరేట్ పన్ను తక్కువ ఉండేలా ప్రత్యక్ష పన్నుల విధానంలో హేతుబద్ధీకరణ జరగాలి. విద్యుత్తు, రియల్టీ రంగాలను ఒకే ట్యాక్స్ రేటు పరిధిలో ఉంచాలి’’ అని సూచించింది. -
8.2 శాతం నుంచి 7.5 శాతానికి..!
2016 భారత్ వృద్ధి రేటు అంచనాకు ఐక్యరాజ్యసమితి కోత న్యూఢిల్లీ/బ్యాంకాక్: భారత్ 2016 ఆర్థికాభివృద్ధి రేటు అంచనాను ఐక్యరాజ్యసమితి తగ్గించింది. ఇంతక్రితం అంచనా 8.2 శాతంకాగా దీనిని 7.5 శాతానికి తగ్గించింది. సంస్కరణల అమల్లో జాప్యమే తమ అంచనా కోతకు కారణమని పేర్కొంది. యూఎన్ ఎకనమిక్ అండ్ సోషల్ కమిషన్ (ఆసియా-పసిఫిక్) ఈ నివేదికను రూపొందించింది. దీని ప్రకారం భూ సేకరణ, కార్మిక చట్టాలు, వస్తు, సేవల పన్ను... వంటి అంశాలు ఉన్నాయి. ఆయా సంస్కరణల పథంలో ముందడుగు పడితే... దేశం వృద్ధి బాటన మరింత పురోగతి సాధించే అవకాశం ఉంది. -
భారత్ వృద్ధి అంచనాకు ఫిచ్ కోత
7.8 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గింపు న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం భారత్ వృద్ధి రేటు అంచనాను రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ బుధవారం 7.8 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించింది. అయితే ఆర్థిక సంస్కరణల అమలుతో వచ్చే ఆర్థిక సంవత్సరం 8 శాతం వృద్ధి సాధించే సత్తా దేశానికి ఉందని ఫిచ్ తన తాజా నివేదికలో పేర్కొంది. తన తాజా రేటు కోతకు బలహీన రుతుపవన పరిస్థితులను కారణంగా ఫిచ్ పేర్కొంది. భారత్ స్థూల దేశీయోత్పత్తి క్యూ1లో 7 శాతంగా నమోదయిన నేపథ్యంలో పలు రేటింగ్, విశ్లేషణా సంస్థలు దేశ వృద్ధికి సంబంధించి తమ అంచనాలకు కోతపెట్టాయి. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ కూడా అంచనాను 7.6 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించింది. ఐఎంఎఫ్, ప్రపంచబ్యాంక్, ఎన్సీఏఈఆర్లు ఈ రేటును 7.5 శాతంగా అంచనావేస్తున్నాయి. ఏడీబీ, డీఎస్బీ 7.4 శాతంగా అంచనావేస్తున్నాయి. యూబీఎస్ అంచనా 7.1 శాతం. అయితే మూడీస్ అంచనా అతి తక్కువగా 7 శాతంగా ఉంది. కాగా ఆర్థిక మంత్రిత్వశాఖ మాత్రం ఇప్పటికీ 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో తన అంచనాను కొనసాగిస్తోంది. -
చైనాను మించనున్న భారత్ వృద్ధి
ఈ ఏడాది వృద్ధి రేటుపై ఏడీబీ అధ్యక్షుడి అంచనా న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్ వృద్ధి రేటు చైనాను మించే అవకాశాలు ఉన్నాయని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ (ఏడీబీ) ప్రెసిడెంట్ తకహికో నకావో అభిప్రాయపడ్డారు. 2015-16 ఆర్థిక సంవత్సరంలో భారత్ వృద్ధి రేటు 7.8 శాతంగాను, చైనా వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు నకావో పేర్కొన్నారు. మంగళవారం ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, పట్టణాభివృద్ధి మంత్రి ఎం వెంకయ్య నాయుడుతో భేటీ అనంత రం విలేకరులతో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2018 నాటి కల్లా భారత్‌కిచ్చే రుణాలు దాదాపు 50 శాతం పెంచి 12 బిలియన్ డాలర్లకు చేర్చనున్నట్లు నకావో చెప్పారు. -
ఈ ఏడాది వృద్ధి 8.1 శాతం: ఐరాస
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు 2015లో 8.1% ఉండొచ్చని ఐక్యరాజ్యసమితి అంచనా వేసింది. తక్కువ స్థాయిలో ఉన్న ద్రవ్యోల్బణం, పటిష్ట వినియోగ డిమాండ్, మౌలిక ప్రాజెక్టుల అమలు, ప్రభుత్వ సంస్కరణల చొరవలు వంటి అంశాలు దీనికి కారణమని పేర్కొంది. ‘ఆసియా, పసిఫిక్ ప్రాంతంలో 2015లో ఆర్థిక, సామాజిక పరిస్థితులు’ అన్న అంశంపై విడుదల చేసిన ఒక సర్వే నివేదికలో ఐక్యరాజ్యసమితి ఈ వివరాలను తెలిపింది. 2016లో భారత్ వృద్ధి రేటును 8.2 శాతంగా నివేదిక పేర్కొంది. భారత్‌కు వస్తున్న ఎఫ్ఐఐ, ఎఫ్‌డీఐ, ఈసీబీల వంటి పెట్టుబడుల్లో ఒడిదుడుకులు అలాగే అమెరికాలో వడ్డీరేట్లు పెంచే అవకాశాలు వంటివి భారత్ ఆర్థిక వ్యవస్థకు సవాళ్లను విసిరే అవకాశం ఉందని సైతం నివేదిక పేర్కొంది. భారత్‌సహా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో వడ్డీరేట్లు తగ్గే అవకాశం ఉందని వివరిస్తూ, ఇందుకు ద్రవ్యోల్బణం తక్కువ స్థాయిలో ఉండడం కారణమని వివరించింది. భారత్‌లో సగానికి పైగా ప్రజలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో ఉత్పాదకత మరింత పెరగాల్సిన అవసరం ఉందని వివరించింది. ఇందుకు తగిన వ్యూహాలు రూపాందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. -
ఈ ఏడాది వృద్ధి 6.2%: ఈ అండ్ వై
న్యూఢిల్లీ: భారత్ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) 6.2% ఉంటుందని ట్యాక్స్ కన్సల్టెన్సీ సంస్థ ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈ అండ్ వై) తాజాగా అంచనావేసింది. రానున్న మూడేళ్లలో వృద్ధి 8 శాతాన్ని అందుకోగలదని కూడా పేర్కొంది. మారుతున్న దేశీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలు ఇందుకు దోహదపడతాయని విశ్లేషించింది. 2013-14లో భారత్ జీడీపీ వృద్ధి రేటు 4.7%. వరుసగా రెండవ యేడాది 5% దిగువన జీడీపీ కొనసాగింది. రూ. 4 లక్షలకు ఐటీ పరిమితి పెంచాలి... కాగా వృద్ధికి ఊపునిచ్చే క్రమంలో భాగంగా ఆదాయపు పన్ను (ఐటీ) పరిమితిని రూ. 4 లక్షలకు పెంచాలని ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీకి సంస్థ విజ్ఞప్తి చేసింది. అలాగే జూలైలో రానున్న బడ్జెట్లో చిన్న ఇన్వెస్టర్లకు ప్రయోజనం చేకూర్చడానికి అదనపు పన్ను ప్రయోజనాలను కల్పించాలని కోరుతున్నట్లు సంస్థ విధాన వ్యవహారాల ప్రధాన సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. మూలధన వ్యయాలను పెంచి తద్వారా డిమాండ్‌కు ఊతం ఇవ్వాలని కోరారు. చిన్న పొదుపులకు ప్రోత్సాహం, జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల విభాగాల్లో సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రభుత్వ వ్యయాల్లో పునర్వ్యవస్థీకరణ కూడా అవసరమని సూచించారు. సీఎస్‌ఆర్‌పై భారీ వ్యయం: కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలు అమలులోకి వస్తే, భారత్ కార్పొరేట్ రంగం వార్షికంగా తమ కార్పొరేట్ సామాజిక బాధ్యతల(సీఎస్ఆర్) కింద రూ.22,000 కోట్లు వెచ్చించాల్సి రావచ్చని ఈ అండ్ వై అంచనావేసింది. వార్షిక నికర లాభంలో 2 శాతం సీఎస్ఆర్ కార్యకలాపాలపై వెచ్చించాల్సిన పరిధిలో దేశంలో దాదాపు 16,500 కంపెనీలు ఉన్నట్లు పేర్కొంది