breaking news
Indian soldiers killing
-
గీత దాటలేదు.. భారత సైనికులను చంపలేదు: పాకిస్థాన్
చేయాల్సిందంతా చేయడం, తర్వాత తమ తప్పేమీ లేదని చెప్పడం.. ఇలాంటివన్నీ పాకిస్థాన్‌కు అలవాటే. అలాగే ఈసారి కూడా ఇదే మాట చెప్పింది. తమ దళాలు అసలు నియంత్రణ రేఖను దాటనే లేదని, భారత సైనికులను హతమార్చలేదని తెలిపింది. అసలు నియంత్రణ రేఖ వద్ద అలాంటి సంఘటన ఏదీ జరగనే లేదని, తమ దళాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించలేదని పాక్ సైనికాధికారి ఒకరు తెలిపారు. సుమారు 20 మంది పాకిస్థానీ సైనికులు భారత భూభాగంలోకి చొచ్చుకుని వచ్చి, సర్లా పోస్టు వద్ద భారత సైనికులపై దాడి చేసి ఐదుగురిని కాల్చి చంపినట్లు భారత రక్షణశాఖ వర్గాలు తెలిపాయి. మృతులలో 21 బీహార్ యూనిట్‌కు చెందిన ఒక సుబేదార్, నలుగురు జవాన్లు ఉన్నారు. ఈ సంఘటన మంగళవారం తెల్లవారుజామున రెండు గంటల సమయంలో నియంత్రణ రేఖకు 450 మీటర్ల దూరంలో సంభవించింది. కాగా, పూంచ్ సెక్టార్లో ఐదుగురు భారత సైనికులను పాకిస్థానీ దళాలు హతమార్చడం దురదృష్టకరమని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపర్చుకోడానికి ఇది మార్గం కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ తెలిపారు. రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ, విదేశాంగ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ ఈ సంఘటనపై ఈరోజు మధ్యాహ్నం పార్లమెంటులో ఓ ప్రకటన చేస్తారని ఆయన చెప్పారు. పాకిస్థాన్‌తో చర్చలు నిలిపివేసేది లేదని కాంగ్రెస్ నాయకుడు మణిశంకర్ అయ్యర్ తెలిపారు. మరోవైపు, సైనికులను హతమార్చిన సంఘటన నేపథ్యంలో పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియ ఆపేయాలని బీజేపీ డిమాండ్ చేసింది. సరిహద్దుల్లో ఒక్క బుల్లెట్ పేలినా చర్చలు జరపకూడదని, ఒకవైపు మన సైనికులను చంపేస్తూ మరోవైపు చర్చించడం సరికాదని బీజేపీ సీనియర్ నాయకుడు షానవాజ్ హుస్సేన్ అన్నారు. ఇక ఈ సంఘటన పార్లమెంటును కూడా కుదిపేసింది. లోక్‌సభ సమావేశం కాగానే సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లి, పాకిస్థాన్ దుశ్చర్య అంశాన్ని ప్రస్తావించారు. బీజేపీ సభ్యులు తమ స్థానాల్లోనే లేచి నిలబడి, భారత సైనికుల హత్యను లేవనెత్తారు. సమాజ్‌వాదీ అద్యక్షుడు ములాయం సింగ్ యాదవ్, పార్టీ ఎంపీ శైలేంద్రకుమార్ దీనిపై వాయిదా తీర్మానం లేవనెత్తారు. ఈ గందరగోళంతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా పడింది. -
పాక్ దాడి 'దుర్మార్గపు చర్య': మోడీ
సరిహద్దులో భారత సైనికులను పాకిస్థానీ బలగాలు కాల్చి చంపడాన్ని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ, జమ్మూకాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తీవ్రంగా ఖండించారు. పాక్ దురాగతాన్ని 'దుర్మార్గపు చర్య'గా మోడీ పేర్కొన్నారు. పాకిస్థాన్ చర్య ఇరు దేశాల మధ్య సంబంధాలను దెబ్బతీసే ప్రమాదముందని ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ బలగాలు ఐదుగురు భారత జవాన్లను హత్య చేయడాన్ని ఖండిస్తూ మోడీ, ఒమర్ అబ్దుల్లా తమ వ్యాఖ్యలను ట్విటర్లో పోస్ట్ చేశారు. భారత సైనికులపై దాడి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని మోడీ స్పష్టం చేశారు. చైనా చొరబాట్లు, పాకిస్థాన్ దుశ్చర్యల నుంచి సరిహద్దులను రక్షించడంలో యూపీఏ ప్రభుత్వం విఫలమయిందని ఆయన విమర్శించారు. యూపీఏ పాలకులు మేలుకోవాల్సిన తరుణం ఆసన్నమయిందని అన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు సంతాపం తెలిపారు. వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. జమ్ము కాశ్మీర్లో నియంత్రణ రేఖను దాటి వచ్చిన పాకిస్థానీ దళాలు భారత సైనికులపై కాల్పులు జరిపి, ఐదుగురు జవాన్ల ప్రాణాలు బలిగొన్నాయి. పూంచ్ జిల్లా చకన్ దా బాగ్ సెక్టార్ ప్రాంతంలో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఎల్ఓసీలోని కర్మాడ్ గ్రామంలో గల తమ సైనిక పోస్టుపై వాళ్లు దాడి చేసి, తమ సైనికుల్లో ఐదుగురిని కాల్చి చంపారని, తర్వాత మళ్లీ పాకిస్థాన్ భూభాగంలోకి పారిపోయారని సైన్యానికి చెందిన ఓ అధికారి తెలిపారు.