breaking news
the Indian players
-
రజత 'వికాసం'
గత మూడు రోజులుగా ఇంచియాన్‌లో ‘పసిడి' కాంతులు విరజిమ్మిన భారత క్రీడాకారులు మంగళవారం మాత్రం రజతానందాన్ని కలిగించారు. మొత్తానికి 11వ రోజు ఏషియాడ్‌లో నాలుగు పతకాలతో భారత ప్రదర్శన కొంచెం మోదం... కొంచెం ఖేదంలా సాగింది. డిస్కస్ త్రోలో కచ్చితంగా స్వర్ణం సాధిస్తాడని భావించిన వికాస్ గౌడ రజతంతో సరిపెట్టుకున్నాడు. ఇక బాక్సింగ్‌లో మిశ్రమ ఫలితాలు లభించాయి. మేరీకోమ్ మెరిపించి ఫైనల్‌కు చేరగా.. సరితా దేవి, పూజా రాణి సెమీఫైనల్లో ఓటమిపాలై కాంస్య పతకాలతో సంతృప్తి పడ్డారు. వికాస్ కృషన్, సతీశ్ కుమార్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్యాలు ఖాయం చేయగా... దేవేంద్రో సింగ్, శివ థాపా క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశారు. ఎవరూ ఊహించని విధంగా సెయిలింగ్‌లో వర్ష, ఐశ్వర్య ద్వయం కాంస్యం నెగ్గి ఆశ్చర్యపరిచింది. ఇంచియాన్: తన చిరకాల ప్రత్యర్థి చేతిలో మళ్లీ ఓడిపోయిన భారత స్టార్ డిస్కస్ త్రోయర్ వికాస్ గౌడ ఆసియా క్రీడల్లో రజత పతకంతో సంతృప్తి పడ్డాడు. మంగళవారం జరిగిన పురుషుల డిస్కస్ త్రో ఫైనల్లో వికాస్ గౌడ రెండో స్థానంలో నిలిచాడు. ఇటీవల గ్లాస్గోలో జరిగిన కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన వికాస్ అదే ప్రదర్శనను ఆసియా క్రీడల్లో పునరావృతం చేయలేకపోయాడు. ఇరాన్‌కు చెందిన ఎహ్సాన్ హదాదీ వరుసగా మూడోసారి స్వర్ణం నెగ్గి ‘హ్యాట్రిక్’ సాధించాడు. 2 కేజీల బరువుండే డిస్క్‌ను హదాదీ 65.11 మీటర్ల దూరం విసరగా... వికాస్ 62.58 మీటర్ల దూరం విసిరి ఆసియా క్రీడల్లో తొలిసారి రజతం కైవసం చేసుకున్నాడు. 2006 దోహా క్రీడల్లో ఆరో స్థానంలో నిలిచిన ఈ కర్ణాటక అథ్లెట్... 2010 గ్వాంగ్జౌ క్రీడల్లో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సాధించాడు. ఇప్పటివరకు హదాదీ, వికాస్ పరస్పరం బరిలోకి దిగిన ఈవెంట్లలో ఒక్కసారి మాత్రమే వికాస్ తన ప్రత్యర్థికంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. 6 అడుగుల 9 అంగుళాల ఎత్తు, 110 కేజీల బరువున్న వికాస్‌కు ఇంచియాన్ వేదిక మరోసారి రజతానందాన్ని మిగిల్చింది. 2005లో ఇంచియాన్లోనే జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ వికాస్‌కు రజతం వచ్చింది. మరోవైపు పురుషుల 110 మీటర్ల హర్డిల్స్ ఫైనల్లో సిద్ధాంత్ 13.73 సెకన్లతో ఆరో స్థానంలో నిలిచాడు. ఫైనల్స్‌కు ఐదుగురు: అథ్లెటిక్స్‌లో నాలుగు ఈవెంట్స్‌లో ఐదుగురు భారత అథ్లెట్స్ ఫైనల్లోకి ప్రవేశించారు. మహిళల 800 మీటర్లలో టింటూ లూకా, సుష్మా దేవి... మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అశ్విని అకుంజి, పురుషుల 400 మీటర్ల హర్డిల్స్‌లో జితిన్ పాల్, పురుషుల 800 మీటర్లలో సాజిష్ జోసెఫ్ ఫైనల్‌కు అర్హత సాధించారు. -
తొలి రోజు నిరాశే
బెంగళూరు: ప్రపంచ నంబర్‌వన్ నొవాక్ జొకోవిచ్ లేకపోయినా... భారత్‌కు ఎలాంటి లాభం చేకూరలేదు. సెర్బియాతో శుక్రవారం మొదలైన డేవిస్ కప్ టెన్నిస్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్‌లో తొలి రోజు భారత ఆటగాళ్లు తేలిపోయారు. ఆడిన రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయారు. తమ స్టార్ ప్లేయర్ జొకోవిచ్‌తోపాటు టిప్సరెవిచ్, విక్టర్ ట్రయెస్కీలాంటి మేటి ఆటగాళ్లు ఈ పోటీకి దూరంగా ఉన్నా... వారి గైర్హాజరీని మరిపిస్తూ యువ క్రీడాకారులు దుషాన్ లాజోవిచ్, ఫిలిప్ క్రాజినోవిచ్ అద్భుత విజయాలు సాధించి సెర్బియాకు 2-0తో ఆధిక్యాన్ని అందించారు. తొలి సింగిల్స్‌లో ప్రపంచ 153వ ర్యాంకర్ యూకీ బాంబ్రీ 3-6, 2-6, 5-7తో ప్రపంచ 61వ ర్యాంకర్ లాజోవిచ్ చేతిలో ఓడిపోయాడు. రెండో సింగిల్స్‌లో ప్రపంచ 144వ ర్యాంకర్ సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ 1-6, 6-4, 3-6, 2-6తో ప్రపంచ 107వ ర్యాంకర్ ఫిలిప్ క్రాజినోవిచ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. భారత్ ఆశలు సజీవంగా ఉండాలంటే శనివారం జరిగే డబుల్స్ మ్యాచ్‌లో లియాండర్ పేస్-రోహన్ బోపన్న జోడి తప్పనిసరిగా గెలవాలి. లాజోవిచ్తో రెండు గంటల నాలుగు నిమిషాలపాటు జరిగిన మ్యాచ్‌లో యూకీ మూడో సెట్లో కాస్త పోటీనిచ్చాడు. 59 అనవసర తప్పిదాలు చేసిన ఈ ఢిల్లీ ఆటగాడు లాజోవిచ్ సర్వీస్‌ను రెండుసార్లు బ్రేక్ చేసినా... తన సర్వీస్‌ను ఆరుసార్లు కోల్పోయి మూల్యం చెల్లించుకున్నాడు. సుదీర్ఘ ర్యాలీలు జరగకుండా తక్కువ షాట్లలోనే గేమ్‌లను ముగించాలనే వ్యూహంతో ఆడిన యూకీ ఆరంభంలో విజయవంతమయ్యాడు. కానీ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్న లాజోవిచ్ ఆటతీరుకు యూకీ వద్ద సమాధానం లేకపోయింది. తొలి మ్యాచ్‌లో యూకీ ఓడిపోవడంతో... ఒత్తిడిలో బరిలోకి దిగిన సోమ్‌దేవ్ రెండో సెట్లో మినహా మిగతా మ్యాచ్‌లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. బేస్లైన్వద్ద ఆటను ఎక్కువగా ఇష్టపడే సోమ్‌దేవ్ ఈ మ్యాచ్‌లో దానిని సరిగ్గా అమలు చేయలేదు. క్రాజినోవిచ్ పదునైన సర్వీస్‌లకు తోడు శక్తివంతమైన షాట్లతో భారత నంబర్‌వన్‌కు ఇబ్బందులు సృష్టించాడు. అతను కొట్టిన డ్రాప్ షాట్లు చూడముచ్చటగా ఉన్నాయి. రెండు గంటల 23 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో క్రాజినోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. సోమ్‌దేవ్ ఏడు ఏస్‌లు సంధించి.. ఐదు డబుల్ ఫాల్ట్‌లు, 41 అనవసర తప్పిదాలు చేశాడు. స్విట్జర్లాండ్, ఫ్రాన్స్‌లకు ఆధిక్యం డేవిస్ కప్ సెమీఫైనల్స్‌లో తొలి రోజు స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో నెగ్గి 2-0తో ఆధిక్యంలోకి వెళ్లాయి. ఇటలీతో జెనీవాలో జరుగుతున్న తొలి సెమీఫైనల్లోని సింగిల్స్ మ్యాచ్‌ల్లో ఫెడరర్ 7-6 (7/5), 6-4, 6-4తో సిమోన్ బోలెలి (ఇటలీ)పై, వావ్రింకా 6-2, 6-3, 6-3తో ఫాగ్నిని (ఇటలీ)పై గెలిచారు. చెక్ రిపబ్లిక్‌తో పారిస్‌లో జరుగుతున్న రెండో సెమీఫైనల్ సింగిల్స్ మ్యాచ్‌ల్లో రిచర్డ్ గాస్కే 6-3, 6-2, 6-3తో బెర్డిచ్ (చెక్ రిపబ్లిక్)పై, సోంగా 6-2, 6-2, 6-3తో లుకాస్ రొసోల్ (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు.