breaking news
indian hocky
-
భారత్ డబుల్ ధమాకా
టోక్యో: జపాన్ గడ్డపై భారత పురుషుల, మహిళల హాకీ జట్లు గర్జించాయి. ఒలింపిక్ టెస్టు ఈవెంట్లో భారత జట్లే విజేతలుగా నిలిచాయి. ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌కు ముందు కొత్తగా నిర్మించిన స్టేడియాలని ప్రాక్టికల్‌గా పరిశీలించేందుకు ఈ టోర్నీలను నిర్వహిస్తారు. ఇందులో పురుషుల జట్టయితే లీగ్‌లో కివీస్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది. బుధవారం జరిగిన ఫైనల్లో భారత్ 5–0తో న్యూజిలాండ్‌ను చిత్తుగా ఓడించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (7వ ని.), షంషీర్ సింగ్ (18వ ని.), నీలకంఠ శర్మ (22వ ని.), గుర్సాహిబ్జిత్ సింగ్ (26వ ని.), మన్దీప్ సింగ్ (27వ ని.) తలా ఒక గోల్‌తో భారత్‌కు ఎదురులేని విజయాన్ని అందించారు. మహిళల జట్టు జపాన్‌పై... భారత మహిళల జట్టు ఆతిథ్య జట్టును 2–1తో ఓడించి టైటిల్ గెలుచుకుంది. భారత్ తరఫున నవజ్యోత్ కౌర్ (11వ ని.), లాల్రెమ్సియామి (33వ ని.) ఒక్కో గోల్ చేశారు. జపాన్ తరఫున మినామి (12వ ని.) ఏకైక గోల్ సాధించింది. -
పరారీలో ముఖేష్ కుమార్
సాక్షి, హైదరాబాద్: భారత హాకీ జట్టు మాజీ కెప్టెన్, అర్జున్ అవార్డు గ్రహీత ముఖేష్ కుమార్‌పై కేసు నమోదు అయింది. నకిలీ కుల ధ్రువీకరణ పత్రం పొందినందుకు గాను అతనిపై హైదరాబాద్ బోయినపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు వారాల క్రితమే అతనిపై కేసు నమోదు చేసినప్పటికీ ఆ విషయం అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై బోయినపల్లి సీఐ రాజేశ్ మాట్లాడుతూ.. ‘ఎయిర్‌లైన్స్‌లో ఉద్యోగం కోసం ముఖేష్ పలు పత్రాలు సమర్పించారు. వాటిపై విచారణ జరపగా.. అతడు నకిలీ పత్రాలతో కుల ధ్రువీకరణ పత్రం పొందినట్టు వెల్లడైంది. దీంతో రెండు వారాల క్రితం ముఖేష్‌పై కేసు నమోదు చేశాం. మూడు రోజులుగా ముఖేష్ పరారీలో ఉన్నారు.. అతని కోసం మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడుతున్నాం. ముఖేష్‌తో పాటు అతని తమ్ముడిపైన కూడా కేసు నమోదు చేశామ’ని తెలిపారు. కాగా, కెరీర్లో 307 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ముఖేష్ 80 గోల్స్ చేశాడు. -
మనమ్మాయిలు సాధిస్తారా..!
భారత మహిళా హాకీ జట్టు రియో ఒలింపిక్స్ బెర్త్ సొంతం చేసుకుంది. అదే ఉత్సాహంలో మన అమ్మాయిలు పోడియం ఫినిష్ చేస్తామంటూ మాట కూడా ఇచ్చేశారు. గత ఒలింపిక్స్ రికార్డులు చూస్తే భారత జట్టుకు పతకం గెలిచే సత్తా ఉందా? అనే సందేహం కలగవచ్చు. అయితే జట్టు మాత్రం పతకం సాధించాలనే పట్టుదలతో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. 36ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత భారత మహిళల జట్టు ఒలింపిక్స్ కు అర్హత సాధించిన సంగతి తెలిసిందే. గత రికార్డులను పరిశీలిస్తే భారత మహిళల జట్టు ఒలింపిక్స్‌లో ఒకే ఒక్కసారి పాల్గొంది. 1980 మాస్కో ఒలింపిక్స్ లో ఆడిన మన జట్టు నాలుగో స్ధానంతో ముగించింది. అమెరికా సహా 65 దేశాలు బాయ్ కాట్ చేసిన ఈ మెగా ఈవెంట్లో భారత్.. ఆస్ట్రియా, పోలాండ్ జట్లను ఓడించి.. చెకోస్లోవేకియా చేతిలో ఒక్క గోల్ తేడాతో పరాజయం పాలైంది. క్వార్టర్స్ మ్యాచ్‌లో జింబాబ్వేతో డ్రా చేసుకుంది. మూడో స్ధానం కోసం జరిగిన మ్యాచ్ లో అప్పటి సోవియట్ యూనియన్ (రష్యా) చేతిలో 1-3 తేడాతో పరాజయం పాలైంది. ఆరు జట్లు మాత్రమే పాల్గొన్న ఆ టోర్నీలో నాలుగో స్ధానంతో సరిపెట్టుకుంది. కానీ నెదర్లాండ్స్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, జర్మనీ, కొరియా వంటి అగ్రశ్రేణి జట్లు గైర్హాజరైన ఈ మెగా ఈవెంట్లో భారత్ ప్రదర్శన గొప్పగా చెప్పుకోదగిందేమీ కాదు. ఇక ఇటీవల మన జట్టు ప్రదర్శన చూస్తే.. ప్రపంచ హాకీ సెమీస్ లీగ్ లో మంచి పోరాటమే కనబరిచింది. టాప్ టీమ్ లతో మ్యాచ్ ల్లో ఓడినా.. కీలక మ్యాచ్ ల్లో మనమ్మాయిలు సత్తా చాటారు. జపాన్ తో మ్యాచ్ టోర్నీకే హైలైట్. ఇక ఇతర టోర్నీల విషయానికి వస్తే.. 2013 జూనియర్ ఉమెన్స్ వరల్డ్ కప్ లో కాంస్య పతకం సాధించారు. ఇక గతేడాది జరిగిన ఆసియన్ గేమ్స్ లో సీనియర్ మహిళలు కూడా కాంస్యంతో సత్తా చాటారు. ఇక కెప్టెన్ రీతూరాణి సారధ్యంలో మన టీమ్ సత్తా చాటేందుకు సిద్దమవుతున్నారు. వందనా కటారియా, పూనమ్ రాణి వంటి సీనియర్స్ తో ఫార్వర్డ్ లైన్ బలోపేతంగా ఉంది. మిడ్ ఫీల్డ్ లో రీతు రాణి, సుశీల చాను, నవనీత్ కౌర్, లిలిమా, లిల్లీ చానులు మంచి ఫామ్ లో ఉన్నారు. ఇక ఒడిశా త్రయం గ్రేస్ ఎక్తా, నమిత, సునితాలక్రాల డిఫెన్స్ బలంగా ఉంది. గోల్ కీపర్ లు రజని, సవిత సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. మాజీ క్రీడాకారుణులు సైతం మనమ్మాయిలపై నమ్మకంగా ఉన్నారు. ఒలింపిక్స్ మెడల్ కొట్టేందుకు ఇదే సరైన సమయమని మాజీ కెప్టెన్ సురీందర్ కౌర్ అభిప్రాయపడ్డారు. కఠోర సాధన తోనే మన చిరకాల స్వప్నం సాకారమౌతుందని చెప్పుకొచ్చింది.