breaking news
independent economy
-
పేద దేశాల వలసలే కొంప ముంచాయి
లండన్: ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ యూరప్ కూటమి నుంచి బ్రిటన్ తప్పుకోవడమే ఉత్తమమని బ్రిటన్ వాసులు తీర్పు ఇవ్వడం స్థానికత వాదానికి బలం చేకూర్చింది. యూరప్ కూటమికి చెందిన పేద దేశాల నుంచి పెరిగిన ప్రజల వలసల కారణంగా తమ ఉపాధి అవకాశాలు మృగ్యమవుతున్నాయని భావించిన శ్వేత జాతీయులు విడిపోవడానికే ఓటు వేశారు. ‘మా ఉద్యోగాలు, మా స్థలం, మా ఆర్థిక వ్యవస్థ మాకే కావాలి’ అన్న డిమాండ్‌కే స్థానికులు, ముఖ్యంగా శ్వేతజాతి కార్మికులు పట్టం గట్టారు. ‘ఇది మాకు స్వాతంత్య్రం వచ్చిన రోజు, ప్రజలకు నిజమైన విముక్తి రోజు’ అంటూ అటు బ్రిటన్ ప్రతిపక్ష పార్టీలు, శ్వేతజాతీయులు అభివర్ణించారంటే వలసల పట్ల వారికున్న వ్యతరేకత ఎంతో స్పష్టమవుతోంది. ఓటింగ్ సరళిని పరిశీలించినట్లయితే ఒకటి, రెండు మినహాయింపులు మినహా వలసప్రజలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే ‘బ్రెక్జిట్’కు వ్యతిరేకంగా ఓటు వేశారు. స్థానికులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అనుకూలంగా ఓటు వేశారు. యూరప్ యూనియన్ నుంచి విడిపోవాల్సిందేనంటూ ఇంగ్లండ్‌లో 73శాతం, వేల్స్లో 72 శాతం మంది తీర్పు చెప్పారు. కలిసే ఉండాలంటూ స్కాట్లాండ్ లాంటి దేశాలు 67 శాతం మంది ఓట్లు వేసినా ఆశించిన ఫలితాలు రాలేదు. 1975లోనూ, ఇప్పుడు కూడా ‘బ్రెక్జిట్’కు వ్యతిరేకంగానే అక్కడి మెజారిటీ ప్రజలు ఓటు వేశారు. బ్రిటన్‌లో విద్యతోపాటు, నేషనల్ హెల్త్ స్కీమ్ కింద వైద్య సేవలు ఉచితం అవడం వల్ల యూరప్‌కు చెందిన పేద దేశాల నుంచి గత రెండు,మూడు ఏళ్లుగా భారీగా పెరిగాయి. దీనికి తోడి ఆర్థిక సంస్కరణల పేరిట ప్రధాన మంత్రి కేమరాన్ నిరుద్యోగ భృతిని, పిల్లల పెంపక భృతిని బాగా తగ్గించడంతో స్థానికుల్లో ఆగ్రహం పెరిగింది. దానికి తోడు సిరియా నుంచి వలసలు భారీగా పెరగడం కూడా వారి ఆగ్రహాన్ని రెట్టింపు చేసింది. ఇక టర్కీలాంటి దేశాలను యూరోపియన్ కూటమిలో చేర్చుకోవాలనే ప్రతిపాదన ముందుకు రావడం కూడా వారి ఆగ్రహానికి ఆజ్యం పోసింది. బ్రిటన్‌లో నిరుద్యోగికి భృతి కల్పించడంతోపాటు అనువైన నివాసం, పిల్లలుంటే వారి పోషణ భారాన్ని కూడా భరించడం బ్రిటన్ ప్రభుత్వం బాధ్యత. ఇప్పటికీ ఈ దేశంలో ఉద్యోగం, సద్యోగం లేకుండా ప్రభుత్వ భృతి కోసం పిల్లలను కనడమే పనిగా పెట్టుకున్న వాళ్లు కూడా లేకపోలేదు. ఇలాంటి భృతులను వ్యతిరేకిస్తున్న పన్ను చెల్లింపుదారులు వలసలను మరింత పెద్ద సమస్యగా భావించారు. యూరోపియన్ కూటిమిలో ఉంటే వ్యాపారవేత్తలకు లాభంగానీ, పన్ను చెల్లించే తమలాంటి వారికి కాదని శ్వేతజాతి కార్మికులు భావిస్తూ వచ్చారు. అలా ప్రజల నుంచి, ప్రతిపక్ష పార్టీల నుంచి ప్రధాన మంత్రి కేమరాన్పై ఒత్తిడి పెరిగింది. యూరోపియన్ కూటమి నుంచి విడిపోవాలంటూ 2014 సంవత్సరంలో ఈ ఒత్తిడి మరింత తీవ్రమైంది. 2015లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో తమ కన్జర్వేటివ్ పార్టీ విజయం సాధించినట్లయితే తప్పకుండా రిఫరెండమ్ పెట్టి నిర్ణయం తీసుకుంటానని అప్పుడు కేమరాన్ హామీ ఇచ్చారు. ఎవరూ ఉహించని విధంగా పార్లమెంట్లో కన్జర్వేటివ్ పార్టీకి భారీ విజయం దక్కడంతో ఆయన ఇప్పుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అయితే వ్యక్తిగతంగా ఆయనకు కూటమి నుంచి విడిపోవడం ఇష్టం లేదు. అందుకని కలిసి ఉండేందుకే ప్రచారం చేసి ఇప్పుడు పదవీ త్యాగానికి సిద్దపడ్డారు. -
బ్రిటన్‌లో అల్లకల్లోలం ఖాయం!
ఆగస్ట్ 15.. భారత స్వాతంత్ర్య దినోత్సవం. ఆగస్ట్ 14 పాకిస్థాన్ కు. జులై 4 యూఎస్ఏ ఇండిపెండెన్స్ డే. ఈ మూడు దేశాలనేకాక ఒకప్పుడు దాదాపు భూగోళాన్ని ఏలిన బ్రిటన్ కు అసలు స్వాతంత్ర్యదినోత్సవం అనేదే లేదు. కానీ ఇవ్వాళ జరిగిన బ్రెగ్జిట్ (బ్రిటన్+ఎగ్జిట్) రెఫరెండాన్ని ఆ దేశ ముఖ్య నాయకులు 'ఇండిపెండెన్స్ డే'గా అభివర్ణిస్తున్నారు. 52 శాతం బ్రిటిషర్లు తమ దేశం యురోపియన్ యూనియన్(ఈయూ) నుంచి వెలుపలికి రావడాన్ని సమర్థించారు. అయితే ఈయూ నుంచి బ్రిటన్ వేర్పాటు.. రెఫరెండం ఫలితాలు వెలువడినంత సులువేమీ కాదు. అనేక ఆర్థిక కష్టాలు, పాత మిత్రుల నుంచి తలపోట్లు ఎదుర్కోవాలి. మరోవైపు స్వదేశంలో తలెతత్తే వేర్పాటువాదాన్ని సమర్థవంతంగా తట్టుకోగలగాలి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటే స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యానికి అలవాటుపడిన బ్రిటన్ లో బ్రెగ్జిట్ అల్లకల్లోలం సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ(ఈఈసీ) నుంచి విడిపోయిన గ్రీన్ లాండే పైన మనం చెప్పుకున్న సోదాహరణకు ఉదాహరణ. డెన్మార్క్‌లో అంతర్భాగమైన గ్రీన్లాండ్ 1973లో ఈఈసీలో చేరి తిరిగి 1985లో నిష్ర్కమించింది. కేవలం 50,000 వేల జనాభాతో, పూర్తిగా చేపల వాణిజ్యంపైనే ఆధారపడ్డ గ్రీన్ లాండ్.. ఈఈసీ నుంచి వెలుపలికి వచ్చిన తర్వాత ఆర్థికంగా(అన్నివిధాలా) కోలుకోవడానికి మూడేళ్ల కాలం పట్టింది. మరి 6.5 కోట్ల జనాభాతో, ఈయూలో అతిపెద్ద ఎగుమతిదారుగా ఉన్న బ్రిటన్.. కూటమి నుంచి వేరుపడి కోలుకోవడానికి ఎటులేదన్నా ఆరేళ్లకాలం పడుతుంది. ఈలోగా వేల్స్, స్కాట్ లాండ్, ఐర్లాండ్ లలో వేర్పాటువాదం విజృంభిస్తే.. రవి అస్తమించని సామ్రాజ్యపు పునాదులు కూకటివేళ్లతోసహా కదలడం ఖాయం. బ్రిగ్జిట్ నిర్ణయంతో బ్రిటన్ వ్యాపార, వాణిజ్యానికి సంబంధించి వచ్చే నాలుగైదు నెలల కాలంలో భారీ మార్పులు చోటుచేసుకోనున్నాయి. వీటిలో ప్రధానమైనవి ఈయూతో ఆ దేశం కుదుర్చుకున్న 53 ఒప్పందాల రద్దు నిర్ణయం. ఈయూ సభ్యురాలిగా మిగిలిన 27 దేశాలతో ఇన్నాళ్లూ స్వేచ్ఛా వాణిజ్యం చేసిన బ్రిటన్ ఇక ముందు ఏదేశానికి ఆ దేశంతో విడివిడిగా ద్వైపాక్షిక ఒప్పందాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది అంత సులువుగా అయ్యేపనేమీకాదు. ఒప్పందాల పేరుతో జరిగే కాలయాపన బ్రిటన్ ఆర్థిక వెన్ను విరిచినా ఆశ్చర్యంలేదు. జోరుమీదున్న సేవల రంగం ఒక్కసారిగా కుదేలు కానుంది. ఈయూ ఆర్థిక వ్యవస్థలో 80శాతం వాటా సేవల రంగానిదే. అందులోనూ 40 శాతం వాటా బ్రిటన్ దే. ఒక్క లండన్ నగరం కేంద్రంగా లక్షకు పైగా సంస్థలు ఈయూ వ్యాప్తంగా సేవలు అందిస్తున్నాయి. బ్రిగ్జిట్ నిర్ణయంతో ఈ కంపెనీలన్నీ ఉన్నపళంగా కుప్పకూలే ప్రమాదం ఉంది. తద్వారా బ్రిటన్‌కు లభిస్తోన్న ఆదాయానికి భారీగా గండిపడటమేకాక లక్షల మంది ఉద్యోగులు వీధినపడతారు. ఈ ప్రమాదాన్ని ముందే ఊహిచాయి కాబట్టే ఇంగ్లాండ్ సెంట్రల్ బ్యాంక్ సహా బ్రిటన్ లోని ఇతర బ్యాంకులన్నీ బ్రగ్జిట్ ను తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ ప్రజల నిర్ణయం అందుకు వ్యతిరేకంగా వెల్లడైంది.