breaking news
HWO
-
అదరగొట్టిన అక్కాచెల్లెళ్లు
సాక్షి, ఆదిలాబాద్: కృషి, పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమిలేదని నిరూపించారు అక్కాచెల్లెళ్లు.. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రభుత్వ కొలువు రావడమే గగనం. కాని గిరిజన కుటుంబానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రభుత్వ కొలువులు సాధించారు. ఇటీవల టీఎస్పీఎస్పీ విడుదల చేసిన హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ (హెచ్‌డబ్ల్యూవో) ఫలితాల్లో వీరు ఉద్యోగాలు పొందారు. ఆదిలాబాద్ పట్టణంలోని టైలర్స్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభుత్వ రిటైర్డ్ టీచర్ గేడాం బాబారావు– శశికళ దంపతుల కుమార్తెలు గేడాం స్వప్న, గేడాం ప్రియలు మొదటి ప్రయత్నంలోనే సత్తాచాటారు. గతేడాది హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల కావడంతో పరీక్ష రాసి ప్రతిభ కనబరిచారు. బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ రెండు ఉద్యోగాలకు ఎంపిక కాగా, ట్రైబల్ వెల్ఫేర్‌ను ఎంచుకున్నారు. కుటుంబ సభ్యుల సహకారంతోనే ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఎంఎస్సీ, బీఎడ్, సెట్ విద్యార్హత ఉన్న గేడం స్వప్న హెచ్‌డబ్ల్యూవో పోటీ పరీక్ష రాసిన అనంతరం ఆదిలాబాద్ పట్టణంలోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఇదివరకే గెస్ట్ లెక్చరర్‌గా పనిచేశారు. అలాగే బీఎస్సీ, బీఎడ్ చేసిన గేడాం ప్రియ ఇటీవల పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం సాధించినప్పటికీ ఉద్యోగంలో చేరలేదు. మొదటి ప్రయత్నంలోనే ప్రభుత్వ కొలువు సాధించడంతో కుటుంబ సభ్యులు, బంధువులు అభినందించారు. -
బాలికల వసతి గృహాల్లో..
భద్రాచలం : జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళాశాల స్థాయి సెల్ఫ్ మేనేజ్మెంట్ హాస్టళ్లలో సమస్యలు గూడుకట్టుకున్నాయి. ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం హడావుడిగా వసతి గృహాలు ప్రారంభించినా.. మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని 10 (బాలురు –5, బాలికలు–5) ఎస్ఎం హాస్టళ్లలో సుమారు 750 మంది విద్యార్థులు ఉంటున్నారు. ఇందులో కొత్తగూడెం మినహా మిగతా ఎక్కడా పక్కా భవనాలు లేవు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 23 ప్రీ మెట్రిక్ వసతి గృహాలు సైతం నిర్వహిస్తుండగా, వీటిలో 1615 మంది ఉంటున్నారు. వసతి గృహాల్లో చాలా చోట్ల సరైన వసతులు లేవు. ఈ సమస్యలను గుర్తించిన కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నిధులు కేటాయించారు. ప్రధానంగా బాలికల వసతి గృహాల్లో అవసరమైన చోట్ల యుద్ధప్రాతిపదికన మౌలిక వసతులు కల్పించేందుకు రూ. 35.50 లక్షలు మంజూరు చేశారు. కానీ వాటిని సవ్యంగా వినియోగించక విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు. మరమ్మతుల పేరిట వసతి గృహాలకు పైపైన రంగులు వేసి నిధులు దుర్వినియోగం చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పనులపై ‘సాక్షి’ పరిశీలన చేయగా, మరమ్మతుల్లో దాగి ఉన్న గమ్మత్తు వెలుగులోకి వచ్చింది. రూ.35.50 లక్షలతో పనులు... వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. ప్రీ మెట్రిక్ హాస్టళ్ల పరిధిలోనే ఎస్ఎం హాస్టళ్లను కూడా నిర్వహిస్తున్నందున, ఇక్కడ మౌలిక వసతులు మెరుగుపరిస్తే అందరికీ బాగుంటుందని భావించారు. సాంఘిక సంక్షేమ శాఖ అధికారుల నివేదికల ఆధారంగా జిల్లాలోని ఏడు బాలికల వసతి గృహాల మరమ్మతుల కోసం రూ.35.50 లక్షలు మంజూరు చేశారు. అధికారులు తెలిపిన ప్రాథమిక వివరాల ప్రకారం భద్రాచలం ఏ హాస్టల్‌కు రూ. 8.50 లక్షలు, బీ హాస్టల్‌కు రూ.4 లక్షలు, బూర్గంపాడుకు రూ.4.50 లక్షలు, మణుగూరుకు రూ.4.50 లక్షలు, పాల్వంచ రూ. 5 లక్షలు, ఇల్లెందు రూ. 4.50 లక్షలు, కొత్తగూడెం హాస్టల్‌కు రూ. 4.50 లక్షలతో మరమ్మతు పనులు చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ శాఖ పర్యవేక్షణలో చేపట్టిన ఈ పనులన్నీ పూర్తయ్యాయని అధికారులు చెపుతున్నారు. అంతా వారిష్టమే.. హాస్టళ్లలో చేపట్టిన పనులన్నీ ఎస్సీ కార్పొరేషన్ ఇంజనీరింగ్ అ«ధికారులు ఇష్టానుసారమే చేసినట్లుగా తెలుస్తోంది. వసతి గృహాల అధికారుల నివేదికలను పక్కన పెట్టి, వారికి ఇష్టమొచ్చిన రీతిలో పనులు చేశారు. భద్రాచలంలోని బాలికల బీ హాస్టల్లో ప్రహరీ నుంచి హాస్టల్ బిల్డింగ్ వరకు సీసీ రోడ్ వేయాలని హెచ్‌డబ్ల్యూవో నివేదిక ఇవ్వగా, ఇంజనీరింగ్ అధికారులు మాత్రం హాస్టల్ ప్రాంగణంలో పూలమొక్కల మధ్యలో ఫ్లోరింగ్ పనులు చేశారు. అక్కడ అవసరం లేకున్నా, ఏదో రీతిన నిధులు ఖర్చు చేసేందుకు కాంట్రాక్టర్లతో కుమ్మక్కైన ఇంజనీరింగ్ అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. మిగతా చోట్ల కూడా ఇదే రీతిన చేశారనే విమర్శలు ఉన్నాయి. పైపైన పనులు చేసి, చేతులు దులుపుకున్నారని కొందరు హెచ్‌డబ్ల్యూఓలు అంటున్నారు. బిల్లుల చెల్లింపులో జాప్యమెందుకో... వసతి గృహాల్లో మరమ్మతు పనులు పూర్తి చేసి రెం డు నెలలకు పైనే అయిందని ఆ శాఖ అధికారులు చెపుతున్నారు. కానీ ఇప్పటివరకు కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. కాంట్రాక్టర్లకు, ఇంజనీరింగ్ అధికారులకు మధ్య కమీషన్ ఒప్పందాలు కుదరకపో వడమే కారణమనే ప్రచారం జరుగుతోంది. కాగా, రిపేర్ పనులు పూర్తయినట్లు సంబంధిత హాస్టల్ ఇన్చార్జీలు ధృవీకరణ పత్రాలు ఇవ్వాలి. ఆయా ప్రాంతాలకు చెందిన ఏఎస్‌డబ్ల్యూవోలు పనులు తనిఖీ చేసి నిర్ధారించాలి. కానీ ఇప్పటి వరకు హెచ్‌డబ్ల్యూవోలు ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదని సమాచారం. ఈ వ్యవహారంపై కలెక్టర్ పూర్తిస్థాయిలో విచారణ జరిపిస్తే, వాస్తవాలు వెలుగులోకి వస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు మరమ్మతు పనులకు సంబంధించి ఇంజనీరింగ్ శాఖ వారికి ఇంకా ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు. హెచ్‌డబ్ల్యూవోల నివేదిక కూడా నాకు అందలేదు. వారి ధ్రువీకరణ ఆధారంగా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాతే బిల్లుల చెల్లింపునకు సిఫార్స్ చేస్తా. పనులు కూడా ఇంకా కొన్ని అసంపూర్తిగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై పరిశీలన చేస్తా. – నతానియేల్, డివిజనల్ సాంఘిక సంక్షేమ అధికారి -
హాస్టళ్లలో అప్పుకూడు
దేవానంద్ (అసలు పేరు కాదు) ప్రభుత్వ వసతి గృహం హెచ్డబ్ల్యుఓ(హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్). ఇతనికి నెల జీతం రూ. 40 వేలు. కటింగ్‌లు పోను రూ. 27 వేల వరకు చేతికి వస్తుంది. ఇతని హాస్టల్లో 70 మంది విద్యార్థులు ఉన్నారు. వీరి డైట్ ఖర్చుల కోసం నెలకు రూ. 40 వేలకు పైగా అవసరం. మూడు నెలల నుంచి డైట్ బిల్లులు మంజూరు కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాడు. తన జీతం కూడా సరిపోకపోవడంతో అప్పులు చేసి విద్యార్థులకు వండి పెడుతున్నాడు. ఇది జిల్లాలోని హెచ్‌డబ్ల్యుఓల పరిస్థితి. కడప రూరల్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ సంక్షేమశాఖ పరిధిలోని వసతి గృహాల్లోని విద్యార్థులకు సంబంధించిన డైట్ బిల్లులు మూడు నెలలుగా మంజూరు కాలేదు. పిల్లల కడుపులు మాడ్చకుండా చూడాలని పలువురు హెచ్‌డబ్ల్యుఓలు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పులు చేసి చిన్నారుల ఆకలి తీర్చుతున్నారు. అప్పులు పెరుగుతున్నా నాలుగు నెలలుగా బిల్లుల మంజూరు జాడలేదు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ పరిధిలోని 217 వసతి గృహాల్లో సుమారు 20650 మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి బియ్యం, కరెంటు ఛార్జీలు మినహా ఫుడ్ డైట్‌కు సంబంధించి కందిబేడలు, చింతపండు, కూరగాయలు, గుడ్లు, అరటిపండు తదితర ఆహార పదార్థాల కోసం నెలకు ఒక విద్యార్థికి ఏడవ తరగతి వరకు చదివే వారికి రూ. 750, ఆపైన 10వ తరగతి వరకు చదివే వారికి రూ. 810 చొప్పున చెల్లించాలి. ఆ ప్రకారం హెచ్‌డబ్ల్యుఓలకు మూడు నెలలకు ఒకసారి డైట్ బిల్లులు మంజూరు కావాలి. ఆ మేరకు మూడు నెలలకు సంబంధించి అన్ని హాస్టళ్లకు కలిపి రూ.4.46 కోట్లు మంజూరు కావాలి. ఇందుకు సంబంధించిన జులైలో కొంతమందికి మాత్రమే మంజూరు కాగా, మరికొంతమందికి మంజూరు కాలేదు. ఆగస్టు నుంచి ఇంతవరకు ఒక్క పైసా కూడా మంజూరు కాకపోవడంతో హెచ్‌డబ్ల్యుఓలు అవస్థలు పడుతున్నారు.