breaking news
humans of mumbai
-
వాడి కన్నీళ్లకు మనసు ద్రవించిపోయింది..
ఇతరుల అవసరాలు గుర్తించి.. వారు అడగకుండానే తోచిన సహాయం చేయడంలో ఆత్మసంతృప్తి ఉంటుంది. అయితే ఈ సాయాన్ని దానం చేయడం అనడం కంటే.. మనల్ని మనం సంతోషంగా ఉంచుకోవడం కోసం చేసే మానసిక వ్యాయామం అంటే బాగుంటుంది కదా అంటోంది ఓ యువతి. ప్రఖ్యాత హ్యూమన్స్ ఆఫ్ బాంబే ఫేస్బుక్ పేజీలో తన అనుభవాలు పంచుకుంది. ‘‘చాలా ఏళ్ల క్రితం.. స్కూళ్లో జరిగిన ఫ్యాషన్ షోలో నాకు బహుమతిగా 2000 రూపాయలు లభించాయి. రైళ్లో కూర్చుని వాటిని ఎలా ఖర్చు పెట్టాలా అని తీవ్రంగా ఆలోచిస్తున్నా. అప్పుడే ఓ పిల్లాడు ఏడుస్తూ నా కంటపడ్డాడు. తను నా వైపు చూస్తు నీళ్లు కావాలని అడిగాడు. అయితే అప్పుడు నా దగ్గర వాటర్ బాటిల్ లేదు. దీంతో అతడు మనసు చిన్నబుచ్చుకున్నాడు. వెంటనే తన దగ్గరికి వెళ్లి ఏం జరిగింది.. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాను. తాను తల్లితో పాటు రైల్వే స్టేషను దగ్గర కలరింగ్ పుస్తకాలు అమ్ముతానని.. అయితే కొద్దిసేపటి క్రితం పోలీసులు వచ్చి వాళ్లను వెళ్లగొట్టారని చెప్పాడు. అందుకే ఇప్పుడు రైళ్లో పుస్తకాలు అమ్మాలని ప్రయత్నిస్తున్నామని.. కానీ ఒక్కరు కూడా వాటిని కొనడం లేదని తన బాధను చెప్పుకొన్నాడు. వాడి కన్నీళ్లు చూస్తే నాకు దుఃఖం ఆగలేదు. మనసు ద్రవించిపోయింది. అందుకే వెంటనే నా దగ్గరున్న డబ్బు తీసి వాడి చేతిలో పెట్టాను. ఇంతలో మరికొందరు ఆడవాళ్లు నా చుట్టూ చేరారు. వాడి తల్లి దగ్గర ఉన్న బ్యాగులో 10, 20 రూపాయల నోట్లు వేయడం మొదలుపెట్టారు. నేను, ఆ పిల్లాడు అలా చూస్తుండిపోయాం. కొద్ది నిమిషాల్లోనే వాళ్ల అమ్మ చేతిలోని సంచీ నిండిపోయింది. వాడి కన్నీళ్లు చెరిగిపోయాయి. ఆశ్చర్యంతో ముఖం వెలిగిపోయింది. వాడు కూడా నేను దిగే స్టేషనులోనే దిగిపోయాడు. ఎందుకో తనను వదిలి వెళ్లాలనిపించలేదు. నాతోపాటు తీసుకువెళ్లి వడా పావ్ తినిపించాను. కానీ ఒక్కమాట కూడా మాట్లాడుకోలేదు. తినడం అయిపోగానే వాడు నాకు గుడ్ బై చెప్పి వాళ్ల అమ్మ దగ్గరికి పరిగెత్తాడు. సంతోషంతో నిండిపోయిన వాడి ముఖం చూసినప్పుడే నాకు అర్థమైంది.. ఇవ్వడంలో ఇంత ఆనందం ఉంటుందా అని.. నా హృదయం సంతృప్తితో నిండిపోయింది’’ అంటూ సదరు యువతి తన అనుభవాన్ని పంచుకుంది. ఇప్పటికే వేలల్లో లైకులు సాధించిన ఈ పోస్టు.. నెటిజన్ల మనసును దోచుకుంటోంది. చిన్న చిన్న విషయాల్లో ఉండే ఆనందం గురించి మరోసారి గుర్తు చేసినందుకు ధన్యవాదాలు అంటూ నెటిజన్లు సదరు యువతిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. -
ఓ బెల్లీ డాన్సర్ గాథ
అవమానం, ఆకలి అనే ఆయుధాలతో కాలం జీవితాన్ని తరుముతుండగా.. కోల్పోతున్న అందమైన జీవితాన్ని తిరిగి పొందటం ఏ మనిషికైనా సాధ్యమేనా? ఆ మనిషి.. ప్రేమ మత్తులో మతాంతరం చేసుకుని, ఇద్దరూ ఆడపిల్లల్నే కని, ఆ కారణంగా భర్త చేతిలో హింస, అత్తమామలతో చీత్కారాలు ఎదుర్కునేదైతే, ఏ నమ్మకంతో బతుకీడ్చాలి? అందుకే మా అమ్మ గురించి మీకు చెప్పాలి. మీరు తప్పక చదవాలి. నాన్న తాగొచ్చి అమ్మను కొట్టేటప్పుడు, ఏడిస్తే చెల్లి, నేనూ ఎక్కడ భయపడతామోనని మౌనంగా భరించేది. అయితే దెబ్బ బలంగా కొట్టడం వల్ల వచ్చే శబ్ధాన్ని మాత్రం ఆపలేకపోయేది. ఆ రోజులు చాలా భయంకరంగా ఉండేవి. ఇప్పటికీ నాకు సిగ్గనిపించేది ఎందుకంటే.. ఆ దృశ్యాలను నేను ఊరికే చూస్తూ కూర్చున్నా. ఎప్పటిలాగే ఒక రోజు మానాన్న బాగా తాగి ఇంటికొచ్చాడు. అంతకుముందు కంటే గట్టిగా కొట్టాడు. అమ్మ స్పృహతప్పి పడిపోయింది. మేం కూడా అమ్మ పక్కనే వాలిపోయాం. తెల్లవారుజామున రెండింటి తర్వాత అమ్మ స్పృహలోకి రాగానే, చెల్లిని నన్నూ తీసుకుని బయటికి నడిపించింది.. మా ముగ్గురిలో ఎవరి కాళ్లకూ చెప్పులు లేవు. మేముండే వీధి నుంచి మెయిన్ రోడ్డుకు చేరుకున్నాం. నిండా వెలుగులతో గుంపులు గుంపులుగా జనం ఉన్న ఓ నైట్ బార్ లోకి వెళ్లాం మేము. 'అన్నా.. ఒక్క ఫోన్ చేసుకుంటా' అని కౌంటర్ మీద కూర్చున్నవ్యక్తిని అడిగింది అమ్మ. ఫోన్ తోపాటు మా ముగ్గురికీ భోజనం కూడా అందించాడాయన. తెల్లవారేదాకా బార్ పరిసర ప్రాంతాల్లోనే ఎదురుచూశాం. అమ్మమ్మా తాతయ్య వచ్చి మమ్మల్ని వాళ్లతో తీసుకొచ్చేశారు. బస్సులో కిటికీ పక్కన కూర్చుని.. ఉదయిస్తున్న సూర్యుడ్ని చూశాన్నేను.. అమ్మా, అమ్మమ్మలు మమ్మల్ని కొత్త స్కూల్లో చేర్పించారు. ఇంకా గొప్ప సంగతేమంటే నాకు, చెల్లికి పేర్లు కూడా మార్చేశారు. స్కూల్లో పాఠం వింటుండగా అప్పుడప్పుడు మా నాన్న గుర్తొచ్చేవాడు. భయం, బాధతో ఏడ్చేదాన్ని. ఇది గమనించిన అమ్మ నన్ను బిజీగా ఉంచేందుకు భరతనాట్యం క్లాసులకు పంపేది. డాన్స్‌లో పడ్డాక నా పాదాలతోపాటు జీవితం కూడా పరుగెత్తింది. కొన్నేళ్లకు నాన్న చనిపోయాడని తెలిసింది. కొన్ని చావులు బాధను కలిగించవు. అమ్మ.. సాధ్యమైనదాని కంటే ఎక్కువ పనిచేసేది. కాలికి గజ్జెలు, బ్యాగ్ నిండా పుస్తకాలు, కడుపునిండా అన్నం.. అన్నింటికీ మించి మనసునిండా ప్రేమను పంచేది. ఆ చివరిదంటే నాకు చాలా ఇష్టం. భరతనాట్యం నేర్చుకున్న నేను మంచి కెరీర్ కోసం బెల్లీ డాన్సర్‌గా మారాలనుకున్నప్పుడు, కాంపిటీషన్లో పాల్గొనేందుకు ఒంటరిగా చైనాకు, ఇండియాలోని మిగతా ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చినప్పుడు అమ్మ అడ్డుచెప్పలేదు. మిగతా ఉద్యోగాలకంటే డాన్సర్ జీవితం కాస్త ప్రమాదకరమనే భయాలేవీ నూరిపోయలేదు. తన ప్రేమ కవచం నన్నెప్పుడూ కాపాడుతుందని అమ్మ బలంగా విశ్వసిస్తుందని నా నమ్మకం. చెల్లి చదువుకుంటోంది. బెల్లీ డాన్సర్‌గా ఇప్పుడిప్పుడే నాకు పేరొస్తోంది. తప్పకుండా ముంబైలో ది బెస్ట్ డాన్సర్‌ను అవుతా. అమ్మ మాత్రం ఇంకా పనిచేస్తూనే ఉంది. రెస్ట్ తీసుకోమని చెప్పడం నాకూ ఇష్టం లేదు. ఎందుకంటే తను మాకోసమే కష్టపడుతోందన్ని ఫీలింగ్‌ను వదులుకోవటం ఇష్టంలేదు నాకు. (ఫొటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి ముంబైకి చెందిన డాన్సర్. 'హ్యూమన్ ముంబై' ఫేస్బుక్ పేజీ ద్వారా తన కథను షేర్ చేసింది. ప్రస్తుతం ఇంటర్నెట్లో ఆమె నిజనీవిత గాథ సంచలనం సృష్టిస్తోంది)