breaking news
Huge Honorarium
-
ఇక పారితోషికం ఇవ్వడానికి రెడీ!
దక్షిణాదిన భారీ పారితోషికం తీసుకునే తారల్లో నయనతార ఒకరు. కోటికి పైగా డిమాండ్ చేస్తున్న ఈ మలయాళ మందారం ఇప్పుడు రివర్స్‌లో పారితోషికాలు ఇవ్వడానికి రెడీ అయిపోతున్నారు. ఆశ్చర్యంగా ఉంది కదూ. విషయం ఏంటంటే.. నయనతార నిర్మాతగా మారనున్నారని చెన్నై కోడమ్బాక్కం వర్గాల సమాచారం. నచ్చిన కథలు దొరికితే, వాటిని నిర్మించడానికి ఈ మధ్య కొంత మంది కథానాయికలు రెడీ అవుతున్నారు. బాలీవుడ్లో అనుష్కా శర్మ ఇప్పటికే నిర్మాతగా మారి, ఓ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రియాంకా చోప్రా కూడా ప్రొడ్యూసర్ అయ్యారు. మన తెలుగులో చార్మి ‘జ్యోతిలక్ష్మి’ నిర్మించిన విషయం తెలిసిందే. ఇక, నయనతార విషయానికి వస్తే.. ఆ మధ్య ఆమె కథానాయికగా నటించిన తమిళ చిత్రం ‘నానుమ్ రౌడీదాన్’ (తెలుగులో ‘నేనూ రౌడీనే’) చిత్రానికి దర్శకత్వం వహించిన విఘ్నేశ్ శివన్ ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. శివకార్తికేయన్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కథానాయికగా నయనతార ఖరారయ్యారు. ఈ సినిమా కథ నచ్చడంతో కేవలం నటించడం మాత్రమే కాదు, నిర్మించాలని కూడా ఆమె నిర్ణయించుకున్నారట. -
నాకలా కనిపించాలంటే భయం!
‘‘ఇలాంటివి నీకు నప్పవు అని ఎవరైనా అన్నారనుకోండీ... అలాంటి వాటి జోలికే వెళ్తా. ఇప్పుడే కాదు... చిన్నప్పట్నుంచీ నా మెంటాలిటీ అంతే’’ అంటున్నారు సమంత. వినాయక్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఆమె నటించిన ‘అల్లుడు శీను’ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తనకు మంచి మాస్ ఇమేజ్‌ని తీసుకొచ్చిందని సమంత ఆనందం వెలిబుచ్చుతూ మీడియాతో ముచ్చటించారు. ‘అల్లుడు శీను’లో కాస్త స్పైసీగా కనిపించినట్లున్నారు? ఏమాయ చేశావె, ఈగ, మనం లాంటి పాత్రలు చేస్తే... సమంత ఇవి తప్ప మరొకటి చేయలేదు అని రాస్తారు. కాస్త భిన్నంగా స్పైసీగా కనిపిస్తే... సమంత మరీ ఇలా చేసేస్తుందా అని రాస్తారు. నిజానికి నాకు గ్లామర్‌గా కనిపించడం అంటే భయం. అందరూ ధైర్యం చెప్పి ఈ పాత్ర చేయించారు. తమన్నా, కాజల్, శ్రుతీహాసన్‌ల పోటీ తట్టుకోవడానికే ఇలా గ్లామర్ డోస్ పెంచారా? ఒక పోటీ రంగంలో ఉన్నప్పుడు తోటి తారల్ని పరిశీలించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాకు మొదట్నుంచీ నీట్ ఇమేజ్ ఉంది. ‘నీకు అలాంటి పాత్రలే సరిపోతాయి, గ్లామర్ పాత్రలు నీకు నప్పవు’ అని ఎవరైనా అన్నారనుకోండీ... నేను వాటి వైపే వెళ్తా. చేసి నా సత్తా నిరూపిస్తా. అవునూ... ఈ సినిమాకు పారితోషికం భారీగా ముట్టిందట కదా? ఈ సినిమాకు పారితోషికంగా ఇల్లు రాసిచ్చారనీ, రెండు కోట్లు తీసుకున్నానని ఇలా చాలా రూమర్లు వచ్చాయి. నిజానికి కేవలం నిర్మాత బెల్లంకొండ సురేశ్‌గారి మీదున్న అభిమానంతో ఈ సినిమా చేశాను. భారీ పారితోషికం తీసుకున్న మాట అవాస్తవం. అయినా... ఇన్ని విజయాల తర్వాత కూడా నా పారితోషికం పెరగలేదు. దానికి కారణం ఏంటి? అనేది నాకు ఇప్పటికీ తెలీని విషయం. హీరోలకు పారితోషికాల కింద నిర్మాతలు ఏరియాలను రాసిచ్చేస్తుంటారు. కానీ... మా హీరోయిన్లకు ఎందుకు రాసివ్వరు? అందుకే మాక్కూడా ఓ ఏరియా రాసిస్తే బావుటుంది. ఏ ఏరియా తీసుకుంటే కరెక్టో మీరే చెప్పండి (సరదాగా) మీ ‘రభస’, ‘సికిందర్’ సినిమాలు ఒకే రోజు విడుదల అవుతున్నాయి. మీ అంచనా ఏంటి? ‘రభస’ విజయంలో నాకు టెన్షన్ లేదు. ‘సికిందర్’ విషయంలోనే టెన్షన్ అంతా. తమిళంలో నేను చేస్తున్న తొలి భారీ చిత్రమది. ఇప్పటిదాకా తమిళంలో నాకు సరైన విజయం లేదు. ఈ సినిమాతో అక్కడ కూడా నా ఫేట్ మారుతుందని ఆశిస్తున్నా. బాలీవుడ్లో స్త్రీ ప్రాధాన్యత చిత్రాలు వస్తున్నాయి. అలాంటి పాత్రలు మీరెందుకు చేయరు? ఉన్న వాటిల్లో మంచి పాత్రలే చేస్తున్నాను. ఇప్పుడున్న హీరోయిన్లలో మెచ్చదగ్గ పాత్రలు దక్కింది నాకే. ముఖ్యమైన విషయం ఏంటంటే... ఇక నుంచి ప్రాధాన్యత, విలువలు, అభినయానికి ఆస్కారమున్న పాత్రలే చేయాలనుకుంటున్నాను. అందుకే.. చాలా సినిమాల్ని వదులుకున్నాను కూడా. ఇక నుంచి పాత్రల విషయంలో జాగ్రత్తగా వెళ్తాను.