breaking news
house vandalised
-
సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై దాడి
డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిపై సోమవారం దుండగులు దాడి చేసి, నిప్పు అంటించారు. ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్లో ఉన్న తన ఇంటిపై దాడి జరిగిందని, సంబంధిత ఫొటోలు, వీడియోలను ఆయన సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు. ఇటీవల ఆయన ఆయోధ్యపై రచించిన పుస్తకంలో ‘హిందూత్వ’కు, తీవ్రవాద సంస్థలకు సారూప్యత ఉందంటూ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. కాగా, ఇంటిపై దాడి చేసిన వ్యక్తుల చేతుల్లో బీజేపీ జెండాలు ఉన్నాయని ఖుర్షీద్ పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆయన ఇంటి కిటికీలు ధ్వంసం అయ్యాయని, ఓ డోర్‌కు దుండగులు నిప్పు పెట్టారని నైనిటాల్ ఎస్పీ జగదీశ్ చంద్ర వివరించారు. ఈ దాడితో సంబంధం ఉన్న 21 మంది దుండగులను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడిలో ఖుర్షీద్ కుటుంబసభ్యులకు ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని పేర్కొన్నారు. ఇంటిపై జరిగిన దాడిని కాంగ్రెస్ సీనియర్ నేతలు శశిథరూర్, దిగ్విజయ్ సింగ్ తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ఇంటి పైకప్పు కూలి మహిళ మృతి
రసూల్‌పుర (హైదరాబాద్): పాత ఇల్లు కూల్చివేత పనులకు వెళ్లిన ఓ మహిళా కూలీ అక్కడే సజీవ సమాధి అయ్యింది. హైదరాబాద్ నగరం బోయిన్‌పల్లిలోని ఏడుగుళ్ల సమీపంలో శనివారం ఈ ప్రమాదం జరిగింది. ముత్యాలు అనే వ్యక్తికి సంబంధించిన ఇల్లును కూల్చివేస్తున్న సమయంలో నేడు సాయంత్రం ఒక్కసారిగా ఇంటి పైకప్పు కూలి అక్కడే ఉన్న రజిత (23) అనే కూలీపై పడిపోయింది. ఈ ఘటనలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. రజిత అల్వాల్‌లోని ఖానాజీగూడ నివాసి అని తెలిసింది. పోలీసులు ప్రమాద స్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీయించి పోస్టుమార్టమ్ కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇంటి యజమాని ముత్యాలుపై కేసు నమోదు చేయనున్నట్టు పోలీసులు తెలిపారు.