breaking news
higi court
-
ఏం.. తమాషాలు చేస్తున్నారా?.. పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి,అమరావతి: గుంటూరు పట్టాభిపురం పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘సివిల్ తగాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఆదేశాలు జారీ చేశాం. అయినా ఎందుకు తలదూరుస్తున్నారు’ అంటూ మండిపడింది. మంగళవారం హైకోర్టులో డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు సోదరి వజ్ర కుమారి, వసంత ఇంటి వ్యవహార కేసు విచారణ జరిగింది. విచారణ సందర్భంగా హైకోర్టు ఆదేశించినా.. సివిల్ వ్యవహారంలో పట్టాభిపురం పోలీసులు జోక్యం చేసుకుంటున్నారంటూ వజ్రకుమారి, వసంతల తరఫున న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తమ వ్యతిరేక వర్గానికి పోలీసులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, తమ ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారని చెప్పారు. అనంతరం, తమ ఆదేశాలను ధిక్కరించిన పట్టాభిపురం పోలీసులపై హైకోర్టు న్యాయమూర్తి పై విధంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆదేశాలను కచ్చితంగా అమలు అయ్యేటట్లు చూడాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్‌ను ఆదేశించారు. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే సదరు పోలీసులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసింది. -
101, 535 జీవోలపై హైకోర్టులో పిటిషన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన 101, 535 జీవోలపై సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సోమవారం ఈ పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. అయితే ఈ పిటిషన్ పై వచ్చే వారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఏపీ ప్రభుత్వం జారీ చేసిన తాజా జీవోలపై ఎస్సీ రైట్స్ కమిషన్ పిటిషన్ దాఖలు చేసింది. జీవోల ద్వారా ఏర్పాటు చేసిన కమిటీలు నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎస్సీ లబ్దిదారుల కోసం ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ కమిటీల్లో సోషల్ వర్కర్లు పేరిట అధికార పార్టీ నేతలు చొరబడుతున్నారని తెలిపారు. దీన్ని నియంత్రించకుంటే..పథకాల అమల్లో పక్షపాతంతో పాటు. స్థానిక సంస్థల నిర్వీర్యం జరుగుతుందని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.