breaking news
hen egg
-
‘చిక్కుడు’ గుడ్లు
యశవంతపుర: కోడిగుడ్డు ఆకారం అందరికీ తెలిసిందే. కానీ కర్ణాటకలో దక్షిణకన్నడ జిల్లా బెళ్తంగడి తాలూకా లాయ్ల గ్రామంలో ఒక కోడి విచిత్రమైన అకారంలో గుడ్లు పెట్టింది. ఇవి చిక్కుడు గింజ ఆకారంలో ఉండి చూపరులను ఆశ్చర్యపరుస్తున్నాయి. ప్రశాంత్ అనే వ్యక్తి ఇంట్లోని నాటు కోడి ఈ ప్రత్యేక గుడ్లను వారం రోజులుగా పెడుతోంది. ప్రశాంత్ అందరికీ చెప్పడంతో విషయం బయటపడింది. అందరూ ఆయన ఇంటికెళ్లి గుడ్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. -
అబ్బురపరుస్తోన్న మామిడికాయ లాంటి గుడ్డు!
సాక్షి, పిఠాపురం: మామిడికాయ ఆకారంలో ఉన్న కోడి గుడ్డు చూపరులను అబ్బుర పరుస్తోంది. తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన కిరాణా వ్యాపారి బొమ్మిడి సత్తిబాబు తన దుకాణంలో విక్రయించడానికి కోడిగుడ్లు తెప్పించాడు. వాటిలో ఒక కోడి గుడ్డు అచ్చం మామిడికాయలా ఉండడంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. గుడ్డు తెల్లగా ఉన్నప్పటికీ పచ్చి మామిడికాయ ఆకారంలో ఉంది. -
ఇదేం కోడిగుడ్డు? వింత ఆకారాన్ని చూసేందుకు ఎగబడుతున్న జనం
వీఆర్‌పురం( తూర్పుగోదావరి): మండలంలోని రాజుపేట కాలనీలో ఓ కోడు గుడ్డు వింత ఆకారంలో ఆకట్టుకుంది. గ్రామానికి చెందిన ముంజపు సత్యనారాయణకు చెందిన కోడిపెట్ట ఆదివారం ఈ గుడ్డు పెట్టింది. వంపు తిరిగిన ఆకారంలో ఉండడం ఈ గుడ్డు ప్రత్యేకత. తొలుత గంప కింద ఉన్న దానిని ఏదో ఒక వస్తువు అని సత్యనారాయణ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు. తరువాత క్షుణ్ణంగా పరిశీలించగా అది తమ కోడి పెట్టిన గుడ్డుగా గుర్తించి ఆశ్చర్యపోయారు. ఈ గుడ్డు చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. -
భలే ‘గుడ్డు’
అనంతపురం,కనగానపల్లి: సాధారణంగా కోడిగుడ్డు చిన్న పిటికెడు సైజు అయినా ఉండాలి. అయితే మండల పరిధిలోని వేపకుంటలోని రైతు దివిటి సూర్యనారాయణ ఇంటిలోని ఒక కోడి గోలీ సైజులోనే గుడ్డు పెట్టింది. తొలిరోజు సాధారణ సైజులోనే గుడ్డు పెట్టినా రెండోరోజు మాత్రం ఇలా చిన్న గుడ్డు పెట్టిందని రైతు తెలిపాడు. -
గుడ్డు మందా? కోడి మందా?
నిండైన గుడ్డు మనకు నిత్యపోషక నైవేద్యం. మాంసాహారులకు కోడిమాంసం ఒక తప్పనిసరి విందువిలాసం. కోడి ముందా, గుడ్డు ముందా అనే మీమాంసల జోలికి పోవద్దు. కోడిగుడ్డు మీద వెంట్రుకలేరే పని కూడా పెట్టుకోవద్దు. అయితే, గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చి, అది ఎదిగి, ఆపై చవులూరించే వంటకంగా మన పళ్లెంలోకి చేరేలోగా జరిగే పరిణామక్రమాన్ని తెలుసుకోవద్దూ! ఇందులో వింతేముంది, అంతా తెలిసిందే కదా అనుకుంటున్నారా..? అయితే, తప్పులో కాలేస్తున్నట్లే! ఏమీ తెలుసుకోకుండా తిన్నామో, ఏదో ఓరోజు ఆస్పత్రిపాలు కాక తప్పదు. గుడ్డు నుంచి బయటకు వచ్చినప్పుడు గుప్పెడంతైనా లేని కోడిపిల్ల తన మానాన తాను దాణా తింటుంది, నీరు తాగుతుంది, ఎదిగే క్రమంలో అటూ ఇటూ తిరుగుతూ, దొరికిన కీటకాన్నల్లా ముక్కుతో పొడుచుకుని ముచ్చటగా భోంచేస్తుంది. రెండు నెలలయ్యే సరికి నిండుగా ఎదుగుతుంది. ఆ తర్వాత ఏదో ఒకరోజు ప్రాణత్యాగం చేసి, మన పళ్లెంలోకి వేడివేడి కూరగానో, బిర్యానీగానో, కమ్మటి కబాబ్గానో చేరుకుంటుంది. ఇదంతా సహజసిద్ధమైన ప్రక్రియ ప్రకారం అక్షర సత్యమే. కానీ, వాస్తవానికి అలా జరగడం లేదు. కోడి పరిణామ ప్రక్రియ మొత్తం మందులమయంగా మారింది. మనం తినే గుడ్లు, కోడి వంటకాలతో పాటు ఈ మందులు మన శరీరంలోకి చేరుతున్నాయి. ఇవి మనల్ని రోగాలబారిన పడేసి, ఆస్పత్రుల పాలు చేస్తున్నాయి. స్థానిక రైతులు కొందరు ఇంకా సంప్రదాయ పద్ధతుల్లోనే కోళ్లపెంపకం సాగిస్తున్నా, ఇక్కడి పౌల్ట్రీ రంగంపై గుత్తాధిపత్యం సాగిస్తున్న బహుళజాతి కంపెనీలకు చెందిన మందులోళ్లు, మాయగాళ్లు మన పౌల్ట్రీ మార్కెట్‌ను దురాక్రమించుకుని సాగిస్తున్న నిర్వాకాలు తెలుసుకుంటే నివ్వెరపోవలసిందే.. మందుల మాయాజాలం కండరగండళ్లుగా రాణించే క్రీడాకారులు ఎక్కడో ఒక దగ్గర డోపింగ్ పరీక్షల్లో పట్టుబడి, వారి కండర రహస్యమంతా మాయదారి మందుల్లోనే ఉందని బట్టబయలైన సందర్భాల్లో ‘వీళ్లకు ఇదేం పోయే కాలం’ అని తిట్టుకుంటాం. మనం తినే కోళ్ల విషయంలో మాత్రం భిన్నంగా స్పందిస్తాం. సహజంగా రెండు నెలల్లో ఎదగాల్సిన కోడి ముప్పయి ఐదు రోజుల్లోనే నిండుగా కండరపుష్టితో ఎదిగిపోతే, అబ్బో! ఎంత త్వరగా, ఎంత ఏపుగా ఎదిగిపోయిందో అని తెగ ముచ్చటపడిపోతాం. అలాంటి కోడిని వండుకు తింటే, మనకు కూడా బ్రహ్మాండంగా జబ్బపుష్టి కలుగుతుందని అమాయకంగా ఆశపడిపోతాం. అంత తక్కువ వ్యవధిలోనే ఒక కోడి అంత భారీగా ఎలా ఎదిగిందనే విషయంపై మాత్రం దృష్టి సారించం. ‘ఆ కంపెనోల్లిచ్చే మందులల్ల ఏముంటదో ఏమో.. ఒక కోడి నలభై రోజుల్లో 550 కిలోల దాణా తింటుంది. దాని పొట్ట సల్లగుండ’.. రంగారెడ్డి జిల్లాలోని ఒక పల్లెలో పదివేల బ్రాయిలర్ కోళ్లను పెంచుకునే రైతు చెప్పిన మాటలివి. పాపం వారిది.. చేతులు మనవి.. దేశంలోనే అత్యధికంగా గుడ్లు, చికెన్ సరఫరా చేసే ఘనత రంగారెడ్డి జిల్లా రైతులదే. అయితే, రంగారెడ్డి జిల్లా మాత్రమే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ దాదాపు 90 శాతం బ్రాయిలర్ చికెన్ పౌల్ట్రీలు విదేశీ కంపెనీల పెట్టుబడులతోనే నడుస్తున్నాయి. ఒక ఎకరం పొలం ఉంటే చాలు, కోడి పిల్లల దగ్గర నుంచి వాటి దాణా, మందులు, వైద్యం అన్నీ సదరు బహుళజాతి కంపెనీ సూపర్వైజర్లే చూసుకుంటారు. మన రైతులు కేవలం ఆ కోళ్లకు వేళకు తిండి వేసి, వాటికి కాపలా ఉంటారంతే! వాటికి పెట్టే ఆహారం ఏమిటో, వేసే మందులు ఏమిటో.. వాటిపై మన రైతులకు కనీస అవగాహన ఉండదు. కంపెనీ వాళ్లను అడిగితే, ‘బిజినెస్ సీక్రెట్ ఎలా చెబుతాం’ అంటూ రైతులను ముద్దుగా గద్దిస్తారు. కోడిపిల్లలను పెంచినందుకు డబ్బులొస్తున్నాయి కదా అని మన రైతులూ ఎక్కువగా రెట్టించరు. అందువల్ల ఈ తతంగమంతా ఓ ‘దేవరహస్యం’గానే ఉంటోంది. ‘ఏమీ చెప్పరు. కోడి పిల్లలనిస్తరు. నలభైరోజులు పెంచి, అప్పగిస్తే కోడికి ఏడు రూపాయలిస్తరు. ఈ కోళ్లకు మాత్రం చాలా ఖరీదైన మందులేస్తరు. అదేందో తెల్వదు గానీ ఆ మందు చాలా పవర్ఫుల్. ఒక తెల్లసంచిల తెచ్చిస్తరు. కేజీ పదకొండు-పన్నెండు వేలు ఉంటదంట. దాన్ని నీళ్లల్ల కలిపి కోళ్లకు తాపాలి. ఓరోజు ఆ పనిచేసి, చేతులు కడుక్కుని ఇంటికిపోయి అన్నం తిన్న. అంతే! ఎమ్మటే కళ్లు తిరిగినట్టయి, వాంతులయినై. మనకే పాణం ఇట్లయితే, మరి వాటికేమవ్వదా అని కంపెనోళ్లను అడిగితే ‘ఏం కాదు’ అంటరు.. అదొక్కటేనా, ముప్పయి రోజులు దాటిని కోళ్లకు రోజూ మనమేసుకొనే బీ-కాంప్లెక్స్ టాబ్లెట్లు వేస్తం. మధ్య మధ్యలో వేరే దేశం డాక్టర్లు వచ్చి కోళ్లను చూసి పోతరు. సూపర్వైజర్లు ఏవో ఇంజక్షన్లు ఇస్తరు’ అంటూ అమాయకంగా చెప్పే మన రైతులకు నిజంగానే ఏమీ తెలియదు. ‘కిందటి నెల నేను ఏడువేల కోళ్లను పెంచి కంపెనోడికి అప్పగించిన.. నాకు 67 వేల రూపాయలు ఇచ్చాడు. కంపెనీవాడికి పదిలక్షల దాకా వచ్చిందని తెలిసింది. కోళ్లు సచ్చిపోతే నష్టం మామీద ఏస్తరు. అన్నీ బతికి, మంచి లాభం వస్తే ఉత్త చెయ్యి చూపిస్తరు’ మరో రైతు ఆవేదన. మన రైతులకు చిల్లర వెదజల్లుతూ, కోట్లు సంపాదించుకునే బహుళజాతి కంపెనీ కనుసన్నల్లో మన పౌల్ట్రీ వ్యాపారం నడుస్తోంది. దాణా.. మందుల ఖజానా.. కోళ్ల దాణా ఇప్పుడు మందుల ఖజానాగా మారింది. రంగారెడ్డి జిల్లా సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ బహుళజాతి పౌల్ట్రీ కంపెనీ పెట్టుబడులు ఉన్న పౌల్ట్రీఫామ్స్‌లో కోళ్లకు పెడుతున్న ఆహారంలో మందుల శాతం మితిమీరి ఉంటోంది. తక్కువకాలంలోనే ఏపుగా ఎదిగేందుకు హార్మోన్లు, ఆకలి పెంచేందుకు ఒకరకమైన మత్తు పదార్థం, జబ్బులు సోకకుండా ఉండేందుకు అవసరం ఉన్నా, లేకున్నా యాంటీ బయోటిక్స్ విచక్షణారహితంగా వాడుతున్నారు. దీనిపై గత ఏడాది బెంగళూరులోని ‘సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్’ (సీఎస్ఈ) నిర్వహించిన పరిశోధనలో వెల్లడైన ఫలితాలు తెలుసుకుంటే, ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి సేకరించిన 70 పచ్చి బ్రాయిలర్ మాంసం నమూనాలను పరీక్షిస్తే, వాటిలో 40 శాతం నమూనాల్లో ఆరు రకాల యాంటీబయోటిక్స్ మోతాదుకు మించి ఉన్నట్లు తేలింది. ‘తక్కువ వ్యవధిలోనే విపరీతంగా ఆహారం తిని, అసాధారణంగా బరువు పెంచేందుకు కోళ్లకు హార్మోన్స్ మందులు కూడా వేస్తున్నారు. వాటి శరీరంలో పేరుకుపోయిన ఈ ఔషధాలు, వాటిని తిన్న మనుషుల కడుపులోకి నేరుగా వెళుతున్నాయి. ఇదే పద్ధతి మరికొన్నాళ్లు ఎలాంటి నియంత్రణ లేకుండా కొనసాగితే, మనుషులకు వచ్చే జబ్బుల సంఖ్య విపరీతంగా పెరిగే ప్రమాదం ఉంది’ అని సీఎస్ఈ పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. సీఎస్ఈ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకున్న డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా, కోళ్ల పెంపకంలో ఇష్టానుసారం జరిగే హార్మోన్లు, యాంటీబయోటిక్స్ ఔషధాల వాడకాన్ని నిరోధించాలంటూ అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ఎవరూ ఈ ఉత్తర్వులను పట్టించుకున్న దాఖలాలు ఇంతవరకు కనిపించడం లేదు. బిర్యానీ రుచి వెనుక ‘చేదు’ నిజం.. చికెన్ షాపు నుంచి కొనుక్కొచ్చిన లెగ్పీసుకు, రెస్టారెంట్లలో వడ్డించే బిర్యానీ లెగ్పీసుకు తేడాను ఎప్పుడైనా గమనించారా..? బిర్యానీ లెగ్‌పీసులు కొంచెం చిన్నగా, చూడముచ్చటగా ఉంటాయి. ఘుమఘుమలాడే బిర్యానీ భోజనం బల్లమీద ఉన్నప్పుడు ఎవరూ పెద్దగా ఈ విషయాన్ని ఆలోచించరు. దీనిపై మన రైతులు చెప్పిన సమాచారం ఏమిటంటే.. ‘బిర్యానీ కోసమని కంపెనోళ్లు 25-30 రోజుల కోళ్లనే ఎక్కువగా తీస్కపోతరు. కిలోల లెక్కన కొంటరు కాబట్టి, ఎక్కువ బరువున్న కోడిని కొంటే నష్టమొస్తుందని, చిన్నకోళ్లనే తీస్కపోతరు. బిర్యానీలో ఎక్కువగా లెగ్‌పీసులు, రెక్కలే ఏస్తరు కదా’ అని చెప్పే రైతు మాట వింటే, మనకు పెద్దగా ఏమీ అనిపించదు. దీనిపై పశువైద్య నిపుణుల మాటలు తెలుసుకుంటేనే, అసలు సంగతి అర్థమవుతుంది. ‘నిజానికి 45 రోజుల తర్వాతే బ్రాయిలర్ కోడి మాంసాన్ని తినాలి. ఈలోగా తింటే, అప్పటికి కోడి శరీరంలోనే నిల్వ ఉండే నానా ఔషధాల అవశేషాలు మన కడుపులోకి నేరుగా చేరుకుంటాయి. ఇలాంటి మాంసం తింటే పిల్లలకు ఎక్కువ హాని కలుగుతుంది’ అని ఓ పశువైద్య నిపుణుడు చెప్పారు. పౌల్ట్రీ ఫామ్ నుంచి డిన్నర్ ప్లేట్ వరకు పౌల్ట్రీ ఫామ్‌లో గుడ్డు నుంచి కోడిపిల్ల బయటకు వచ్చినది మొదలుకొని, భోజనప్రియుల డిన్నర్ ప్లేట్లోకి చేరడానికి దాదాపు 35-42 రోజులు పడుతుంది. ఈ కాలంలో కోడిపిల్లగా ఉన్నప్పటి నుంచి పూర్తిగా ఎదిగేంత వరకు వివిధ దశల్లో ఉపయోగించే ఔషధాలు, వాటి వివరాలు.. కోడి ‘సౌందర్యం’ కోడికి సౌందర్యం ఏంటనుకుంటున్నారా..? శంషాబాద్ శివార్లలోని గ్రామాల్లో ఉన్న వెటర్నరీ మందుల షాపులకెళ్లి కోళ్ల పెంపకానికి వాడే మందులేవని అడగ్గానే చూపించే మొదటి మందు ‘బొటాక్స్’. ఎక్కడో విన్న పదంలా ఉందనుకుంటున్నారా! అవును ఆ మధ్య బాలీవుడ్, హాలీవుడు భామల తమ సౌందర్యపోషణకు బొటాక్స్ ఇంజెక్షన్లు చేయించుకున్నారనే వార్తలు విన్నాం కదా. చర్మంపై ముడతలు కనిపించకుండా, చెక్కిళ్లు నిగనిగలాడేలా కనిపించేందుకు వాడే ఈ కాస్మొటిక్ మెడిసెన్ని కోళ్లకు కూడా వాడుతున్నారు. దీనివల్ల వాటి మాంసం నిగనిగలాడుతూ కనిపిస్తుందన్నమాట. కోడి చర్మంలో, కండరాల్లో కలిసిపోయి ఉన్న ఈ బొటాక్స్ పదార్థం మనుషుల కడుపులోకి వెళ్లవడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతిని, నానా వ్యాధులు వస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ప్రస్తుతం మన చుట్టుపక్కలున్న ఏ బ్రాయిలర్ కోళ్ల ఫారాలకు వెళ్లినా గేటు దగ్గర ఒక వెడల్పాటి గిన్నెలో నీళ్లు కనిపిస్తాయి. కోళ్ల దగ్గరికి వెళ్లాలంటే ముందు ఆ నీటిలో కాళ్లు పెట్టి అప్పుడు లోపలకు అడుగుపెట్టాలి. దీని వల్ల మన పాదాలకున్న బ్యాక్టీరియా కోళ్లకు సోకకుండా ఉంటుందట. ఒక కోడి పెంపకంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఈ బహుళజాతి కంపెనీలు వాటిని తినే మనిషి ఆరోగ్యంపై ఎందుకింత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయంటూ పలుచోట్ల కొన్ని స్వచ్ఛందసంస్థలు ఉద్యమాలు లేవదీయడానికి విఫల యత్నాలు చేశాయి. - భువనేశ్వరి -
ఏమంత గుడ్డు?
గుడ్డు వెరీగుడ్డంటారు. ‘సండే యా మండే.. రోజ్ ఖావ్ అండే..’ అంటూ ప్రకటనల్లో ఊదరగొడతారు. మనం తినే గుడ్డు ఏ మేరకు ‘గుడ్డో’ ఆ వైనాన్ని తెలుసుకుందాం.. గుడ్ల ఉత్పాదనలో రికార్డుల మీద రికార్డులు బద్దలుకొడుతున్న బహుళ జాతి కంపెనీల విజయ రహస్యమేమిటని ప్రశ్నిస్తే, ‘అంతా మోల్టింగ్ దయ’ అంటారు. బలవంతపు బతుకు... కోడి గుడ్డు పెట్టే దశకు రావడానికి కనీసం నాలుగు నెలల సమయం పడుతుంది. ఆ తర్వాత నుంచి గుడ్లు పెట్టడం మొద లుపెడుతుంది. మొదటి రెండు మూడు నెలలూ చిన్న సైజు గుడ్లు పెడుతుంది. వాటి సైజు పెంచడం కోసం కొన్ని రకాల హార్మోన్లు కోడి శరీరంలోకి పంపిస్తున్నారు. గుడ్ల ఉత్పత్తికి నాలుగు నెలల వరకు ఎదురు చూడటం ఎందుకనుకునే ఆత్రగాళ్లు కొందరు కోళ్లకు ఈస్ట్రోజన్ హార్మోన్ ఇస్తున్నారు. దీని మోతాదు ఎక్కువైతే దుష్ఫలితాలు తప్పవనే వైద్యుల హెచ్చరికలను వీరు ఏమాత్రం పట్టించుకోరు. నిర్బంధ నిరాహార పథకం.. ఫోర్స్డ్ మోల్టింగ్.. ఇదొక నిర్బంధ నిరాహార పథకం. ఏడాదికాలం నిర్విరామంగా గుడ్లుపెట్టి పెట్టి.. చివరకు బలమైన గుడ్లు పెట్టలేని స్థితికి చేరుకున్న కోళ్లను మిగిలిన గుంపు నుంచి వేరుచేసి, వాటిని పదిరోజులు కటిక ఉపవాసంలో ఉంచుతారు. చనిపోకుండా ఉండేందుకు, రోజుకు రెండుసార్లు నీళ్లు పట్టిస్తారంతే! నిర్బంధ నిరాహార పథకాన్ని తట్టుకోలేని కొన్ని కోళ్లు ఈ దశలోనే కన్నుమూస్తాయి. మిగిలిన వాటికి వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, చూడటానికే భయంకరంగా తయారవుతాయి. వాటి బరువు కూడా ఈ కాలంలో సగానికి సగం తగ్గిపోతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అసలు చికిత్స. ఆకలితో ఆవురావురుమంటున్న కోడి ముందు చిన్నసైజు రాతిపొడి కుప్పపోస్తారు. అదే ఆహారం అనుకుని, కోడి ఆబగా తినేస్తుంది. కొన్నిరోజులు అలా రాళ్లు తింటూనే మనుగడ సాగిస్తుంది. తర్వాత మెల్లగా అసలు ఆహారం ఇవ్వడం మొదలుపెడతారు. గుడ్లుపెట్టే కోడి ఆహారంలో రోజూ కొంత మోతాదులో రాతిగుండ కలుపుతారు. కోడి శరీరంలో క్యాల్షియం స్థాయిని పెంచి, అది పెట్టే గుడ్ల పెంకు గట్టిగా ఉండేలా చూడటం కోసం పౌల్ట్రీ యజమానులు ‘మోల్టింగ్’ పేరిట కొన్నిరోజుల పాటు కోళ్లకు ప్రత్యక్ష నరకాన్ని చవిచూపిస్తారు. మోల్టింగ్ తర్వాత కోడికి పునరుజ్జీవం కల్పించడానికి రకరకాల హార్మోన్స్, యాంటీ బయోటిక్స్, చివరకు బోటాక్స్ వంటివి వాడుతున్నారు. పిల్లల ఆరోగ్యం జాగ్రత్త.. మోల్టింగ్ తర్వాత కోడి శరీరంలోకి వెళ్లే మందుల పరిమాణం చాలా ఎక్కువ. కోళ్లకు ఇచ్చే మందుల ప్రభావం, అవి పెట్టే గుడ్లపైనా ఉంటుంది. ఇవి ముఖ్యంగా పసిపిల్లలకు చాలా హానికరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ శివార్లలోని కొన్ని లేయర్ చికెన్ పౌల్ట్రీలకు వెళ్లినపుడు అక్కడి ఓ మహిళా కూలీ... ‘ఫారం కోడి చల్లగుండ. ఏడాది గుడ్డు పెట్టి ఊకోనీకి లేదు. దాన్ని ఉపాసం పెట్టి, రాళ్లు తినిపించి, ఎంట్రుకలు పోయి, ఇంజక్షన్లు పొడిపించుకుని... వామ్మో ఓ నెలదాకా పిచ్చి కోడి నరకం జూస్తది’ అని చెబుతుంది. పావురాలకు చిన్న హానిచేసినా, చట్టపరంగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో, ముసలి కోళ్లకు ప్రత్యక్ష నరకం చూపిస్తున్న వారిని పట్టించుకునే నాథులే లేరు.