breaking news
height increase operation
-
నిఖిల్ బలమైన కోరికను కాదనలేకపోయా
సాక్షి, హైదరాబాద్: ‘ఎత్తు పెంపు శస్త్రచికిత్సలు సాధారణం. ఆత్మన్యూనతా భావానికి లోనై శస్త్రచికిత్స ద్వారా జీవితాన్ని మెరుగుపర్చుకోవాలని భావించే వారికి ఈ తరహా సర్జరీలు చేయడంలో తప్పులేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో వీటిని చేస్తున్నారు. దేశంలోని షోలాపూర్, మిరాజ్‌లోనూ ఇలాంటివి జరుగుతున్నాయి. ఇటీవల గ్లోబల్ ఆస్పత్రిలో నిఖిల్‌రెడ్డికి చేసిన ఎత్తు పెంపు శస్త్రచికిత్స సైంటిఫిక్ సర్జరీ. అంతకు మించి ఇది సేఫ్’ అని తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, కీళ్ల మార్పిడి నిపుణుడు డాక్టర్ గురువారెడ్డి, ఉస్మానియా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ప్రసాద్, ప్రముఖ వైద్యుడు డాక్టర్ గోపాల్‌రెడ్డి, స్పైన్ సర్జన్ డా క్టర్ జీవీ సుబ్బయ్య, గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ సర్జరీ విభాగం చీఫ్ డాక్టర్ చంద్రభూషణ్ మాట్లాడారు. సంతకం చేసే దాకా కత్తిపట్టబోం ‘నిఖిల్ ఉదంతంపై మీడియా కథనాలు తీవ్ర మనోవేదనకు గురిచేశాయి. నిఖిల్ ఉదంతం వైద్యులకు ఓ గుణపాఠం వంటిదే. ఇక నుంచి కాస్మొటిక్ సర్జరీల్లోనే కాదు ఏ శస్త్రచికిత్సకైనా సరే తల్లిదండ్రులు వచ్చి అంగీకారపత్రంపై సంతకం పెట్టే వరకూ కత్తిపట్టబోం. సైన్స్‌కు ఎమోషన్‌ను ముడిపెట్టి కథనాలు రాయడం బాధాకరం. కాస్మొటిక్ సర్జరీ చేయించుకునే వ్యక్తి మేజరైనప్పుడు తల్లిదండ్రులకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎత్తు పెంపు శస్త్రచికిత్సను కోర్టులే కాదు ఇప్పటి వరకు ఎవరూ తప్పుపట్టలేదు’ అని గురువారెడ్డి స్పష్టం చేశారు. ఎంక్వైరీ చేసినా ఏమీ జరుగదు.. ‘ఆరోగ్య మంత్రి, కోర్టులు, ఎంసీఐ వివరణ అడిగినా ఏమీ జరగదు. ఈ విషయంలో అన్నీ నైతికంగానే జరిగాయి. బాధితుడికి ఆరు మాసాల నుంచే కౌన్సెలింగ్ ఇచ్చాం. ఎంత చెప్పినా వినలేదు. హైట్ పెంచాల్సిందేనని వేడుకున్నాడు. శస్త్రచికిత్స తర్వాత తలెత్తే సమస్యలను వైద్యులు ముందే వివరించారు. అంతా అనుకుంటున్నట్లు ఇది క్లిష్టమైన ప్రక్రియ కాదు. చాలా సులభమైంది. మహారాష్ట్రలోని మిరాజ్లోనే రోజుకు 20 శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. ఇదేదో రాత్రికి రాత్రి మభ్యపెట్టి చేసిన శస్త్రచికిత్స కాదు. నిఖిల్ నొప్పి తగ్గిన తర్వాత వాకర్ సాయంతో నడుస్తాడు. ఇందుకు మరో రెండు మూడు రోజుల సమయం పడుతుంది. మరో ఎనిమిది మాసాల్లో రెండు అంగుళాల పొడవు పెరుగుతాడు. అందరిలాగే నిఖిల్ సాధారణ జీవితం గడుపుతాడు’ అని గురువారెడ్డి చెప్పారు. బలమైన కోరికను కాదనలేకపోయా ‘తల్లిదండ్రులను తీసుకురావాల్సిందిగా నిఖిల్‌కు సూచించా. కానీ వారు అందుబాటులో లేరని చెప్పాడు. అతను మేజర్.. పైగా ఉద్యోగి కావడంతో ఎటువంటి అనుమానం రాలేదు. నిఖిల్ నా వద్దకు వచ్చిన ప్రతిసారి తిప్పిపంపాను. ఆరు మాసాల్లో ఐదారుసార్లు ఇలా చేశాను. అయినా వినిపించుకోలేదు. శస్త్రచికిత్స చేయించుకోవాలన్న అతని బలమైన కోరిక, ఎత్తుపెంపు పట్ల ఆయనకున్న ఫీలింగ్‌ను కాదనలేకపోయాను. ఈ శస్త్రచికిత్సలో విశేష అనుభవం ఉండటం, చికిత్స సులభమైనది కావడం, ఎత్తు పెంపు శస్త్రచికిత్సలను తెలుగు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే ఆలోచనతోనే శస్త్ర చికిత్సకు పూనుకున్నా’ అని గ్లోబల్ ఆస్పత్రి ఆర్థోపెడిక్ చీఫ్ చంద్రభూషణ్ స్పష్టం చేశారు. -
'నిఖిల్ భవిష్యత్ కు ఢోకా లేదు'
హైదరాబాద్: నిఖిల్ రెడ్డి అనే యువకుడికి నిర్వహించిన ఎత్తు పెంపు ఆపరేషన్ కు అనుసరించిన విధానం సరైందేనని ప్రముఖ వైద్యులు తెలిపారు. ఈ వివాదంపై వివరణ ఇచ్చేందుకు వైద్యులంతా కలిపి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. నిఖిల్ రెడ్డికి అందించిన చికిత్సలో గానీ, అనుసరించిన విధానంలో గానీ ఎలాంటి పొరపాటు లేదని స్పష్టం చేశారు. అతడి తల్లిదండ్రులకు తెలియకపోవడం వల్లే వివాదం తలెత్తిందని అన్నారు. తల్లిదండ్రుల ఆవేదన కారణంగానే ఈ వివాదం ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పారు. వైద్యులు, రోగులకు మధ్య అపోహలు సృష్టించే ప్రయత్నం చేయొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశారు. మీడియా సహకారంతో హైదరాబాద్ లో ఆరోగ్య రంగం ఎదిగిందని తెలిపారు. నిఖిల్ రెడ్డి విషయంలో శాస్త్రసాంకేతిక అంశాలను హైలెట్ చేయాలని కోరారు. అతడికి భవిష్యత్ లో ఎలాంటి ఇబ్బందులు రావని డాక్టర్లు హామీయిచ్చారు. ఎత్తు పెరగడానికి చేసిన ఆపరేషన్ అనైతికం కాదని అన్నారు. గురువారెడ్డి, గోపాల్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, చంద్రభూషణ్, ప్రసాద్ తదితర వైద్యులు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. నిఖిల్ తల్లిదండ్రులకు తెలియకుండా అతడికి లక్డికాపూల్ లోని గ్లోబల్ ఆస్పత్రిలో వైద్యులు ఎత్తు పెంపు ఆపరేషన్ చేయడంతో వివాదం తలెత్తింది.