breaking news
Heavy guarded
-
కరవు, కాంగ్రెస్‌లది అవినాభావ సంబంధం
పచపదరా(రాజస్థాన్): భారీ హామీలు, శంకుస్థాపనలతో ప్రజల్ని మోసగించడం తప్ప కాంగ్రెస్ పార్టీ ప్రజలకు చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రూ. 43,129 కోట్లతో రాజస్థాన్‌లో నిర్మించనున్న బార్మర్ ఆయిల్ రిఫైనరీ ప్రాజెక్టు పనుల్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘పేరు కోసం రైల్వే ప్రాజెక్టుల్ని ప్రకటించేవారు. అవి కనీసం వెలుగు చూడలేదు. రాజస్థాన్‌లో కరవు, కాంగ్రెస్‌లు కలిసికట్టుగా సాగేవి, ఆ పార్టీ తప్పుకున్నాక రాష్ట్రానికి కరవు నుంచి విముక్తి దొరికింది’ అని మోదీ పేర్కొన్నారు. 2014 సాధారణ ఎన్నికలకు ముందు రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ పార్టీ రూ. 500 కోట్లతో హాడావుడిగా ఒకే ర్యాంకు ఒకే పెన్షన్ ప్రకటించిందని, కనీసం లబ్ధిదారుల జాబితాను కూడా సిద్ధం చేయలేదని ప్రధాని తప్పుపట్టారు. వన్ ర్యాంక్ వన్ పెన్షన్ కోసం ఎన్డీఏ ప్రభుత్వం రూ. 12 వేల కోట్లు కేటాయించగా ఇప్పటికే రూ. 10,700 కోట్లు చెల్లించిందని చెప్పారు. కాంగ్రెస్ కేవలం గరీబీ హటావో నినాదాలు మాత్రమే ఇస్తే.. దాన్ని సాధ్యం చేసేందుకు పేద మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు, 4 కోట్ల కుటుంబాలకు ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చామని ఆయన వెల్లడించారు. ఈ ఏడాది రాజస్థాన్‌లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. బార్మర్ ప్రాజెక్టు ఘనత తమదేనంటూ బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రకటించుకున్నాయి. ఈ ప్రాజెక్టుకు 2013లో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ శంకుస్థాపన చేశారని, ఇప్పుడు మరోసారి మోదీ శంకుస్థాపన చేస్తున్నారని కాంగ్రెస్ విమర్శించింది. -
ప్లస్ సైజుల వాళ్లకీ మోడలింగ్..
సాక్షి,వీకెండ్: ర్యాంప్ ఎక్కాలంటే ఓ రేంజ్లో ఉండాలి. మోడలింగ్ అంటే తీరైన కొలతలతో తీర్చిదిద్దినట్టుండాలి. బొద్దుగా, లావుగా, గుండ్రాయిలా... వగైరా‘లా’లతో కలిపి పిలిచే ‘లావు’ రూపులు గ్లామర్ కళ్లలో పట్టరు అనేది కూడా తెలిసిందే. అయితే ఇప్పుడా ట్రెండ్ మారే టైమ్ వచ్చింది. దేశంలోనే తొలిసారిగా లాక్మే నిర్వహిస్తున్న ప్లస్ సైజ్ మోడలింగ్ షో.. ఫ్యాట్‌ని ర్యాంప్‌పై హిట్ చేసే పనికి శ్రీకారం చుట్టనుంది. ఫ్యాషన్ వీక్‌కు దేశవ్యాప్త క్రేజ్ ఉన్న నేపథ్యంతో పాటు ఇటీవల ప్లస్ సైజ్ దుస్తులకు సైతం కేంద్రంగా మారిన మన సిటీ నుంచి ఈ మోడల్ హంట్‌కి ఎంట్రీలు వెల్లువెత్తాయని సమాచారం. – ఎస్.సత్యబాబు స్లిమ్‌గా ఉంటేనే ర్యాంప్ ఎక్కాలనే సూత్రం ఎవరు రాశారు? మనమే అంటే మనుషులమే కదా. మరి దాన్ని తిరగరాస్తే పోలా... ఇప్పుడు అదే జరుగుతోంది. దేశంలోనే తొలిసారి నిర్వహిస్తున్న లావాటి ఐ ఫీస్ట్... సంచలనం సృష్టిస్తోంది. ఆత్మవిశ్వాసం అనేది నడుం చుట్టుకొలత మీద ఆధారపడకూడదనుకునే ఆలోచనాధోరణులే ఈ షో నిర్వహణకు మూలం. ఫ్యాషన్.. అన్‘లిమిటెడ్’ ‘విదేశాల్లో ప్లస్ సైజ్ మోడల్స్ పెద్ద సంఖ్యలో రాణిస్తున్నారు. అయితే మన దగ్గర మాత్రం ఫ్యాట్కి మోడలింగ్ దూరంగానే ఉంది. ఫ్యాషన్ ప్రొఫెషన్ కొందరికి మాత్రమే అనే పరిధులు సరికాదు. ఈ విషయంపై చర్చను లేవనెత్తాలనేదే మా ఆలోచన’ అని అంటున్నారు నిర్వాహకుల్లో ఒకరైన జస్ప్రీత్ చందోక్. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ఆడిషన్స్ ముగిశాయి. ప్రాథమికంగా ఎంపిక చేసిన 160 మందిలో అంతిమంగా 10 మంది ర్యాంప్ అధిరోహించనున్నారు. వీరిలో ఆరుగురు యువకులు, నలుగురు యువతులు ఉన్నారు. పాయల్ సోని, అంజనా బోపట్, తన్వి రవిశంకర్, నేహా పర్లూకర్, వెర్నికా జైన్, అంబర్ ఖురేషి, అనిల్ పమ్మని, కైస్ సంద్రాణి, ఆర్పిత్ హండా, రాజీవ్ బాసిన్లు దేశంలో ఫస్ట్‌టైమ్ జరుగనున్న ప్లస్ సైజ్ షోకి మోడల్స్‌గా మెరవనున్నారు. ‘మన దేశంలోనూ ఫ్యాట్ మోడలింగ్‌కి మంచి ఫ్యూచర్ ఉందని నా అంచనా. దేశవ్యాప్తంగా నిర్వహించిన లావు సైజ్ మోడల్స్ హంట్‌కి మామూలు కన్నా ఎక్కువ సంఖ్యలో యువతులు హాజరయ్యారు. భవిష్యత్తులో మిగిలిన మోడల్స్‌తో సమానంగా వీరు కూడా రాణించే అవకాశాలున్నాయి’ అని జస్ప్రీత్ ఆశాభావం వ్యక్తం చేశారు. సైజ్.. ప్రైజ్ కాదు.. అన్ని రకాల శరీరతత్వాలకీ, తీరుతెన్నులకీ అవసరమైన దుస్తులను, ఉత్పత్తులను అందించే బాధ్యత ఫ్యాషన్ రంగం మీద ఉంది. అటువంటి పరిస్థితుల్లో పర్ఫెక్ట్ సైజ్‌కి మాత్రమే మోడలింగ్ ఒక ప్రైజ్లా మిగిలిపోవడం సరికాదంటున్నారు లిటిల్ శిల్పగా పేరొందిన డిజైనర్ శిల్పా చవాన్. ముంబయిలో ఈ నెల 24 నుంచి 28 వరకూ జరిగే ఫ్యాషన్ వీక్‌లో ఒక భాగమైన ఈ షో కోసం ప్లస్ సై్టల్ దుస్తులను శిల్ప డిజైన్ చేయనున్నారు. ‘తమ షేప్, సైజ్ విషయంలో మహిళలు సిగ్గు పడాల్సిన అవసరం లేదు. ఆత్మవిశ్వాసం మాత్రమే మన ఐడెంటిటీ. డిజైనర్ దుస్తులు అనేవి అన్ని రకాల సైజ్‌లకు రావాల్సిందే. కేవలం కొన్ని రకాల శరీరపు కొలతలకు మాత్రమే పరిమితం కాకూడదు’ అంటున్న బాలీవుడ్ నటి డైరెక్టర్ దివ్యా ఖోస్లా. ‘జీరో సైజ్ నుంచి ప్లస్ సైజ్‌కి ఫ్యాషన్ అడుగులు వేయడం సరైన పరిణామం. ఫ్యాషన్ ప్రతి ఒక్కరికీ అనేది నిర్వివాదం’ అంటున్న బాలీవుడ్ ఫ్యాషన్ కొరియోగ్రాఫర్ లుబ్నా ఆడమ్స్... ఇలా పలువురు ప్రముఖులు ఈ కొత్త ట్రెండ్‌కు మద్ధతుగా నిలవడంతో... రానున్న రోజుల్లో ప్రతి ఫ్యాషన్ షోలో ప్లస్ సైజ్ తప్పనిసరిగా మారినా ఆశ్చర్యం అక్కర్లేదని గ్లామర్ పండితుల జోస్యం చెబుతున్నారు. సో... గెట్ రెడీ ఫర్ ప్లస్ షో.