breaking news
Governor of the Reserve Bank
-
ఆర్థిక సహకారానికి ఆర్బీఐ హామీ
ఏపీ ఆర్థిక మంత్రి యనమల వెల్లడి హైదరాబాద్: రాష్ట్ర విభజన, తుపాన్లు, ప్రకృతి విపత్తులతో నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్‌కు పూర్తి సహకారాన్ని అందించాలన్న తమ విన్నపానికి రిజర్వు బ్యాంక్ గవర్నర్ రఘురాం రాజన్ సానుకూలంగా స్పందించారని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చెప్పారు. రాష్ట్రాభివృద్ధికి, రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషిని ఆయన అభినందించారన్నారు. ఆర్బీఐ గవర్నర్ బుధవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి యనమలతో సమావేశమయ్యారు. వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ఆయన భేటీ కావలసి ఉంది. కానీ విశాఖలో తుపాను సహాయక కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న సీఎం ఈ భేటీ కోసం యనమలను పంపారు. సమావేశంలో రుణమాఫీ నిధుల సమీకరణ కమిటీ చైర్మన్ సుజనాచౌదరి, ప్రభుత్వ సలహాదారు కుటుంబరావు, ఉన్నతాధికారులు పీవీ రమేష్, అజేయ కల్లం, అజయ్ సహాని పాల్గొన్నారు. సమావేశానంతరం యనమల తదితరులు మీడియాతో మాట్లాడారు. ‘రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల గురించి గవర్నర్‌కు చెప్పాం. కొన్ని జిల్లాలను కరువు పీడిస్తుంటే మరికొన్ని జిల్లాలపై తుపాన్ల ప్రభావం ఉంది. ఏటా ప్రకృతి విపత్తులు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా బ్యాంకుల నుంచి కూడా ఆర్థిక సహకార ం కావాలి’ అని కోరినట్టు తెలిపారు. ఈ సందర్భంగా రాజన్ పలు సలహాలిచ్చారని, రైతు సాధికారిత కార్పొరేషన్ ఏర్పాటును, రుణమాఫీకి ఆధార్ అనుసంధానాన్ని మెచ్చుకున్నారని యనమల చెప్పారు. రుణమాఫీ కింద 20 శాతం మొత్తాన్ని కార్పొరేషన్ ద్వారా ముందుగా బ్యాంకులకు చెల్లిస్తామని, మిగతా 80 శాతం మొత్తానికి రైతులకు సర్టిఫికెట్లు ఇస్తున్నట్లు చెప్పామన్నారు. రైతు సాదికారత కార్పొరేషన్ రిజిస్ట్రేషన్ ఒకటీ రెండురోజుల్లో పూర్తవుతుందని, ఆతర్వాత ఆర్థికశాఖ నుంచి మూలధనాన్ని డిపాజిట్ చేస్తామని తెలిపారు.నిధులు సేకరించి కార్పస్‌ఫండ్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇది కేవలం రైతులను ఆదుకునేందుకు రాష్ట్రం అనుసరిస్తున్న పద్ధతి కనుక దీనికీ ఆర్బీఐకి సంబంధం లేదని మంత్రి వెల్లడించారు. స్థలం కేటాయిస్తే విజయవాడలో ఆర్బీఐ రీజినల్ బ్రాంచి ఏర్పాటుకు గవర్నర్ సుముఖత వ్యక్తం చేశారన్నారు. ఆర్బీఐ సెంట్రల్‌బోర్డు సమావేశం విజయవాడలో పెడతామన్నారని తెలిపారు. తుపాను బాదిత ప్రాంతాలకు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారన్నారు. కేంద్ర బీమా కంపెనీలుసానుకూలంగా స్పందిస్తే రైతులకు ఎక్కువ మేలు జరుగుతుందని ఆర్బీఐ గవర్నర్ చెప్పారని, పీఎం కూడా హామీ ఇచ్చిన విషయాన్ని ఆయనకు చెప్పామని మంత్రి తెలిపారు. -
ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడాలి
పీఎస్బీలకు రఘురామ్ రాజన్ సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వ ప్రభావం నుంచి బయటపడితే ప్రభుత్వ రంగ బ్యాంకుల పోటీతత్వం మరింత పెరుగుతుందని రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురామ్ రాజన్ అన్నారు. పోటీ పెరిగితే సామర్థ్యం మెరుగవుతుందని చెప్పారు. న్యూఢిల్లీలో మంగళవారం నిర్వహించిన భారతీయ కాంపిటీషన్ కమిషన్ (సీసీఐ) ఐదో వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించారు. భారత్‌లోని అనేక పీఎస్‌బీల పనితీరు మెరుగుపర్చడానికి పాలనలోనూ, కార్యకలాపాల నిర్వహణలోనూ మార్పులు తేవాల్సిన అవసరం ఉందన్నారు. రూ.8 వేల కోట్ల జరిమానాలు... సీసీఐ చైర్మన్ అశోక్ చావ్లా ప్రసంగిస్తూ, వ్యాపారంలో పోటీతత్వానికి వ్యతిరేకమైన పద్ధతులు పాటించిన పలు సంస్థలపై సీసీఐ ఇప్పటివరకు రూ.8 వేల కోట్ల పెనాల్టీలు విధించిందని పేర్కొన్నారు. వివిధ రంగాలకు చెందిన కేసులు వీటిలో ఉన్నాయని చెప్పారు.