మహిళలను దేవుడే రక్షించాలి
పోలీసులు అందరినీ రంగంలోకి
దింపినా అత్యాచారాలను అడ్డుకోలేరు
యూపీ గవర్నర్ ఖురేషీ వివాదాస్పద వ్యాఖ్యలు
లక్నో: అత్యాచారాల విషయంలో ఉత్తరప్రదేశ్ తాత్కాలిక గవర్నర్ అజీజ్ ఖురేషీ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మహిళల భద్రత కోసం ప్రపంచంలో ఉన్న పోలీసులు అందరినీ రంగంలోకి దింపినా అత్యాచారాలను ఆపలేరని చెప్పారు. దైవీ శక్తి మాత్రమే వాటికి చెక్ పెట్టగలదని అభిప్రాయపడ్డారు. 22 కోట్ల మంది జనాభా కలిగిన ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న అత్యాచారాలు చాలా తక్కువేనంటూ ఎస్పీ అధినేత ములాయం వివాదాస్పదంగా వ్యాఖ్యానించిన మర్నాడే ఆ రాష్ట్ర గవర్నర్ కూడా అదే విధంగా మాట్లాడడం విమర్శలకు దారితీసింది. అజీజ్ ఖురేషీ సోమవారం ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ... దేవుడు అవతరిస్తే తప్ప నేరాలు నియంత్రణలోకి రావన్నారు. నేరాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన, నేరస్థుల్లో భయం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. తన వ్యాఖ్యలపై విమర్శలు రావడంతో గవర్నర్ ఖురేషీ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. మహిళలపై నేరాలకు తెరపడాలంటే సమాజ దృక్పథంలో మార్పు రావాలని, నేరస్థులపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందని.అన్నానని వివరించారు.
ఈ వ్యాఖ్యలు దురదృష్టకరం: బీజేపీ
గవర్నర్ ఖురేషీ వ్యాఖ్యలపై వివిధ పార్టీల నుంచి తీవ్ర ప్రతిస్పందన వ్యక్తమైంది. గవర్నర్ ఇలాంటి ప్రకటనలు చేయడం దురదృష్టకరమని, ఆయన తన కార్యాలయ గౌరవాన్ని తగ్గించారని యూపీ బీజేపీ అధ్యక్షుడు మనోహర్ సింగ్ అన్నారు. యూపీ గవర్నర్‌గా మంగళవారం బాధ్యతలు చేపట్టబోతున్న రామ్‌నాయక్ స్పందిస్తూ.. నేరాలను రాజకీయం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పారదర్శకమైన దర్యాప్తుతో దోషులను తక్షణమే శిక్షించాలన్నారు.