breaking news
the government employees
-
‘ఇ- పేమెంట్’ నిల్
సాక్షి, ఒంగోలు: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో ఉద్యోగులు, పెన్షన్‌దారుల జీతభత్యాల విడుదల్లో సమస్యలొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని ప్రభుత్వోద్యోగుల్లో చర్చనీయాంశమైన వ్యవహారం ‘ఇ-పేమెంట్స్’. ఈ విధానం ద్వారా ఉద్యోగులు శరవేగంగా జీతాలు తీసుకోవాలనే ఉద్దేశం ఏమోగానీ.. వారికి ఆగస్టు నెల జీతం ఇంత వరకు ఖాతాల్లో జమకాలేదు. ఒకటో తేదీనే జీతం వస్తుందని.. ముందస్తు కుటుంబ ఖర్చుల ప్రణాళిక తయారు చేసుకునే మధ్యతరగతి ఉద్యోగులకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. జిల్లావ్యాప్తంగా 37,647 మంది ప్రభుత్వ ఉద్యోగులుండగా, పెన్షన్‌దారులు మరో 21,398 మంది ప్రభుత్వ ఖజనా శాఖ నుంచి డబ్బు తీసుకుంటుంటారు. వీరికి ఆగస్టు నెల జీతాలు, పెన్షన్‌భత్యం అందకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులు జీతాల బిల్లులు సంబంధిత శాఖ కార్యాలయం నుంచి ట్రెజరీకి అందాక.. అక్కడ బిల్లులు పాస్ చేయించుకుని బ్యాంకుల్లో ఇస్తే వారు ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి డబ్బులు జమచేసేవారు. అయితే కొత్తగా పాలనాపగ్గాలు చేపట్టిన చంద్రబాబు ‘ఇ-పేమెంట్స్’ విధానాన్ని తెరమీదికి తెచ్చారు. ఖజానా శాఖలో మంజూరైన బిల్లులను మళ్లీ బ్యాంకుల ద్వారా ఉద్యోగులు ‘ఇ- పేమెంట్స్’ వెబ్సైట్లో నమోదుచేయాల్సి ఉంది. ఖజానా సిబ్బంది ఆ వివరాలను సరిచూసి బ్యాంకుల ద్వారా నగదును ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి జమ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో ఖజానా సిబ్బందికి ఈ పని పూర్తిగా కొత్త కావడంతో సమస్యలొస్తున్నాయి. సాంకేతికంగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉపయోగించడంలో.. ఉద్యోగుల సంఖ్యతో పాటు వారి సర్వీసు వివరాలను నమోదుచేయడంలో పొరపాటు చేస్తున్నారు. ఈ కారణంగా ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పెన్షన్‌దారులు ఇబ్బందులు పడుతున్నారు. ఉద్యోగులిచ్చిన బ్యాంక్ అకౌంట్ నంబర్లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు కొన్ని విరుద్ధంగా ఉండటం, ఆన్లైన్ సిస్టమ్ సక్రమంగా పనిచేయకపోవడం, ట్రజరీ ఉద్యోగులకు నూతన పని విధానం కావడంతో ఉద్యోగుల జీతాలు వారి వ్యక్తిగత ఖాతాలకు నేటికీ జమచేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ విషయాన్ని గుర్తించిన ఒంగోలు జిల్లా ఖజానాశాఖ కార్యాలయ సిబ్బంది సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నారు. రెండ్రోజుల్లో జీతాలు పడతాయి లక్ష్మీకుమారి, జిల్లా ఖజానాశాఖ అధికారి ‘ఇ-పేమెంట్’ విధానం కొత్తగా అమలు చేస్తున్న క్రమంలో కంప్యూటర్లో ఉద్యోగుల వివరాలను జాగ్రత్తగా నమోదు చేయాల్సి ఉంది. దీంతో జాబితాల్లో చిన్నచిన్న (కామాలు, పుల్‌స్టాప్‌లు తేడాలొచ్చినా) తప్పులున్నా ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమకాదు. ఈ విషయాన్ని ఇప్పటికే గుర్తించాము. మరో రెండ్రోజుల్లో ఉద్యోగులు, పెన్షన్‌దారులకు నగదు ఖాతాల్లో జమవుతుంది. -
ఎన్నికల విధుల్లో మహిళలకు ఊరట!
మారుమూల ప్రాంతాలకు వెళ్లనక్కర్లేదు పక్క పంచాయతీ లేదా నియోజకవర్గంలో విధులు విశాఖ రూరల్, న్యూస్‌లైన్ : వరుస ఎన్నికలతో కలవరపడుతున్న మహిళా ప్రభుత్వ ఉద్యోగులకు స్వల్ప ఊరట. ఈ సారి ఎన్నికల్లో మహిళా ఉద్యోగులు మారుమూల ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉండవని అధికారులు చెబుతున్నారు. మే నెల వరకు వరుసగా మున్సిపల్, జెడ్పీటీసీ, సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మున్సిపల్ ఎన్నికలకు సుమారు 5 వేల మంది, జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు 13 వేల మంది, సాధారణ ఎన్నికలకు 25 వేల మంది వరకు ఉద్యోగులను ఎన్నికల విధులకు వినియోగించనున్నారు. ఇప్పటికే ఉద్యోగుల వివరాలను అధికారులు సేకరించి కంప్యూటర్లో నిక్షిప్తం చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో మహిళలకు మాన్యువల్ పద్ధతిలోనే విధులను అప్పగించే అవకాశాలు ఉన్నాయి. దీనిపై ఎన్నికల సంఘం కూడా కొన్ని మార్గదర్శకాలు చేసింది. దాని ప్రకారం మహిళ ఉద్యోగులకు కొంత ఉపశమనం కలగనుంది. నగర పరిధిలో ఉద్యోగం చేస్తున్న మహిళలు సొంత నియోజకవర్గానికి కాకుండా పక్క నియోజకవర్గాలకు, జిల్లాలో ఉద్యోగం చేస్తున్న మహిళలు సొంత గ్రామం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులను అప్పగించనున్నారు. మాన్యువల్ పద్ధతిన ఈ ప్రక్రియను పూర్తి చేయాలా లేదా సాఫ్ట్వేర్ ద్వారా చేయాలన్న విషయంపై అధికారులు ఆలోచనలు చేస్తున్నారు. ఈ ప్రక్రియకు సంబంధించిన సాఫ్ట్వేర్ సిద్ధంకాని పక్షంలో మాన్యువల్ పద్ధతిలోనే మహిళా ఉద్యోగులకు విధులను అప్పగించనున్నారు. అనంతరం వీరికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.