breaking news
Google anniversary
-
ఊహకందని చరిత్ర: గూగుల్‌కు ఆ పేరు వచ్చిందిలా..
ప్రపంచం టెక్నాలజీ వైపు పరుగులు పెడుతున్న సమయంలో 'గూగుల్' (Google) గురించి తెలియని వారు దాదాపు ఉండరనేది అక్షర సత్యం. ఆవకాయ వండాలన్న.. అమలాపురం గురించి తెలుసుకోవాలన్నా.. అన్నింటికీ ఒకటే సులభమైన మార్గం గూగుల్. ఈ రోజు నభూతో నభవిష్యతిగా ఎదిగిన 'గూగుల్' రెండు దశాబ్దాల క్రితం ఓ సాదాసీదా సెర్చ్ ఇంజన్ మాత్రమే. ఇప్పుడు ఏ ప్రశ్నకైనా సమాధానం అందించే జగద్గురుగా మారింది. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు గూగుల్ ప్రస్థానం గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..చరిత్ర గురించి చదువుకునేటప్పుడు క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చదువుకున్నాం. ఇప్పుడు మాత్రం గూగుల్ పూర్వం యుగం, గూగుల్ తర్వాత యుగం అని చదువుకోవాల్సిన రోజులు వచ్చేసాయి. దీన్ని బట్టి చూస్తే.. గూగుల్ ఎంతలా వ్యాపించిందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.గూగుల్ ప్రారంభం..90వ దశకం చివరిలో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటిలో కంప్యూటర్ సైన్స్ ప్రోగ్రామ్‌లో ప్రావిణ్యం కలిగిన ఇద్దరు PhD స్టూడెంట్స్ ''సెర్గీ బ్రిన్, లారీ పేజ్''లు గూగుల్ ప్రారంభించాలని నిర్విరామంగా శ్రమించి మెరుగైన సర్చ్ ఇంజిన్ కోసం ఒక నమూనాను అభివృద్ధి చేశారు. 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఆ తరువాత 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేసుకుని.. తోటి పీహెచ్డీ స్టూడెంట్ 'క్రెయిగ్ సిల్వర్‌స్టీన్'ను తొలి ఉద్యోగిగా చేర్చుకుని సంస్థను అధికారికంగా ప్రారంభించారు.గూగుల్ అనే పదం ఎలా వచ్చిందంటే..'గూగుల్' అనే పేరు 'గూగోల్' అనే పదం నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. గూగోల్ అనే పదానికి అర్థం ఒకటి తర్వాత వంద సున్నాలు లేదా సరైన శోధన ఫలితాలను అందించేది. ఈ పదాన్ని జేమ్స్ న్యూమాన్ అండ్ ఎడ్వర్డ్ కాస్నర్ రాసిన 'మ్యాథమెటిక్స్ అండ్ ది ఇమాజినేషన్' అనే పుస్తకం నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది.గూగుల్ ప్రస్థానం ఇలా..1998లో అధికారికంగా ప్రారంభమైన గూగుల్ అంచెలంచేలా ఎదుగుతూ కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే కాకుండా.. గూగుల్ మ్యాప్స్, గూగుల్ ఎర్త్, గూగుల్ స్టోర్స్, గూగుల్ క్రోమ్, యూట్యూబ్ మొదలైనవి ప్రారంభించి ప్రపంచాన్ని అరచేతిలో పెట్టేసింది.●1997 - గూగుల్.కామ్ డొమైన్ రిజిస్ట్రేషన్●1998 - గూగుల్ అధికారికంగా ప్రారంభమైంది●1999 - గూగుల్ పేజీ ర్యాంక్ డెవెలప్●2000 - యాహూ భాగస్వామ్యంతో.. పెద్ద యూజర్ 'ఆర్గానిక్ సెర్చ్'గా అవతరించింది. గూగుల్ టూల్ బార్ లాంచ్. కొత్తగా 10 భాషలను జోడించింది (ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, స్వీడిష్, ఫిన్నిష్, స్పానిష్, పోర్చుగీస్, డచ్, నార్వేజియన్, జపనీస్, చైనీస్, కొరియన్, డానిష్).●2001 - గూగుల్ తన మొదటి ఛైర్మన్ 'ఎరిక్ ష్మిత్'ను స్వాగతించింది. గూగుల్ ఫొటోస్ ప్రారంభమైంది.●2002 - Google AdWords పరిచయం, గూగుల్ న్యూస్ మొదలైంది. గూగుల్ చరిత్రలో ఇది పెద్ద మైలురాయి.●2003 - గూగుల్ AdSense ప్రారంభమైంది, దీనికి మొదట కంటెంట్ టార్గెటింగ్ అడ్వర్టైజింగ్ అని పేరు పెట్టారు.●2004 - జీమెయిల్ ప్రారంభం●2005 - గూగుల్ మ్యాప్స్●2006 - Google YouTubeని కొనుగోలు చేస్తుంది●2007 - ఆన్లైన్ అడ్వర్టైజింగ్ కంపెనీ అయిన డబుల్ క్లిక్‌ను గూగుల్ కొనుగోలు చేసింది●2008 - గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ప్రారంభించింది●2009 - ఫోర్బ్స్ మ్యాగజైన్ సెర్గీ బ్రిన్, లారీ పేజ్‌లను ప్రపంచంలోని ఐదవ అత్యంత శక్తివంతమైన వ్యక్తులుగా పేర్కొంది●2010 - గూగుల్ తన మొట్టమొదటి బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ నెక్సస్ వన్ను విడుదల చేసింది.●2011 - సీఈఓగా లారీ పేజ్ నియామకం, ఎరిక్ ష్మిత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయ్యారు. ●2012 - గూగుల్ మోటరోలా మొబిలిటీని కొనుగోలు చేసింది●2013 - గూగుల్ రీడర్ మూసివేసి.. Chromecast ప్రారంభం●2014 - హమ్మింగ్ బర్డ్ ఆల్గారిథం●2015 - సీఈఓగా సుందర్ పిచాయ్●2016 - గూగుల్ తయారు చేసిన మొదటి ఫోన్.. గూగుల్ పిక్సెల్ లాంచ్●2017 - HTCలో కొంత భాగాన్ని కొనుగోలు చేసింది●2018 - మొబైల్ స్పీడ్ అల్గారిథం అప్డేట్, 20 సంవత్సరాల చరిత్రలో 100 బిలియన్ డాలర్లను అధిగమించింది●2019 - బ్రాడ్ కోర్ అల్గారిథం, గూగుల్ SERPs స్టార్ట్●2020 - నియామకాలను నెమ్మదించడం, మెషీన్లు మరియు డేటాపై ఎక్కువ దృష్టి పెట్టడం (కోవిడ్-19)●2021 - ఆస్ట్రేలియా ప్రభుత్వం తమ కంటెంట్‌ను ఉపయోగించుకునే హక్కు కోసం మీడియా కంపెనీలకు Google చెల్లించాల్సిన చట్టాన్ని ప్రతిపాదించింది.●2022 - క్రోమ్ ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ●2023 - గూగుల్ పిక్సెల్ 8, 8ప్రో లాంచ్, గూగుల్ జెమిని ఏఐ●2024 - 2024 మార్చిలో గూగుల్ కోర్ అప్డేట్లో దాని ప్రధాన ర్యాంకింగ్ సిస్టమ్‌లకు అల్గారిథమిక్ మెరుగుదలలను చేసింది. ఈ అప్డేట్ స్పామ్, లో-వాల్యూ కంటెంట్ వంటి వాటిని పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నాలలో భాగం.●2025: 2025లో గూగుల్ జెమిని 2.5 ఫ్లాష్ & ప్రో లాంచ్ చేసింది. బననా ఏఐ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది.గూగుల్ కంపెనీ ఎన్ని దేశాల్లో ఉంది1998లో ఒక చిన్న సంస్థగా ప్రారంభమైన గూగుల్.. నేడు 50 కంటే ఎక్కువ దేశాలకు విస్తరించింది. ప్రపంచ వ్యాప్తంగా 1.80 లక్షల కంటే ఎక్కువ మంది గూగుల్ సంస్థలో పనిచేస్తున్నట్లు సమాచారం.గూగుల్ ఉపయోగాలుప్రతి ప్రశ్నకు మల్టిపుల్ సమాధానాలు అందిస్తున్న గూగుల్.. ఎన్నెన్నో రకాలుగా ఉపయోగపడుతోంది. ప్రత్యేకంగా విద్యారంగంలో గూగుల్ పాత్ర అనన్య సామాన్యమనే చెప్పాలి.🡆బ్లాగర్, యూట్యూబ్, గూగుల్ అందిస్తున్న సేవలు.. సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. ఒక్క మాటలో చెప్పాలంటే గూగుల్ దెబ్బకు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారిపోయింది.🡆వినోదం కోసం యూట్యూబ్ వినియోగించుకునే వారి సంగతి పక్కన పెడితే.. 10వ తరగతి చదివే ఒక విద్యార్ధి నుంచి.. IAS చదివే వ్యక్తి వరకు యూట్యూబ్ ఎలా ఉపయోగపడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.🡆భౌతిక, రసాయనిక శాస్త్రాలు మాత్రమే కాకుండా శస్త్రచికిత్సకు సంబంధించిన ఎన్నో విషయాలను కూడా గూగుల్ ద్వారా తెలుసుకోవచ్చు. మొత్తం మీద పాఠాలు నేర్చుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా.. పాఠాలు నేర్పే గురువులకు సైతం గురువుగా మారిన గూగుల్ ఉపయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే అని నిస్సందేహంగా చెప్పవచ్చు.గూగుల్ లేకపోతే పరిస్థితి ఎలా ఉండేదిగూగుల్ లేకపోతే ప్రపంచంలో జరిగే విషయాలు అందరికీ చేరటం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రజల సమూహాలుగా చేరినప్పుడు మాత్రమే ఇతర విషయాలను చర్చించుకోవాల్సి వచ్చేది. గూగుల్ లేకుంటే.. స్మార్ట్‌ఫోన్ వినియోగం కూడా ఇంతలా ఉండేది కాదనే చెప్పాలి. ఎందుకంటే ఈ రోజు స్మార్ట్‌ఫోన్ వినియోగించే ప్రతి ఒక్కరూ గూగుల్ ఉపయోగించాల్సిందే.గూగుల్ లేకపోతే చదువుకునే వారికి కూడా.. అన్ని అంశాలు అందుబాటులో ఉండేవి కాదు. ఎందుకంటే గూగుల్ ప్రమేయం లేకుండా ఏదైనా తెలుసుకోవాలంటే తప్పకుండా ఉద్గ్రంధాలను (పుస్తకాలు) తిరగేయాల్సిందే. అంటే మనకు కావలసిన విషయం తెలుసుకోవడానికి కనీసం రోజుల సమయం పట్టేది. మొత్తం మీద గూగుల్ లేని ప్రపంచంలో జీవించడం ఇప్పుడు దాదాపు అసాధ్యమనే చెప్పాలి. -
గూగుల్ దేవోభవ!
సెప్టెంబర్ 4 గూగుల్ వార్షికోత్సవం, సెప్టెంబర్ 5 గురుపూజోత్సవం సందర్భంగా... ఆవకాయను ఎలా తయారు చేయాలి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సచిత్ర పాఠం క్షణాల్లో కళ్ల ముందు ఉంటుంది. అంతరిక్ష విజ్ఞానంలో తాజా పరిణామాలేంటి? ‘గూగుల్’ను అడిగితే చాలు... సమస్త సమాచారమూ సమగ్రంగా చిటికెలో ప్రత్యక్షమవుతుంది. కొరుకుడు పడని పాఠాలేవైనా కావచ్చు, కోరుకున్న విద్యలేవైనా కావచ్చు.. ‘గూగుల్’ను అడిగితే చాలు... యమ ఓపికగా పండు ఒలిచి చేతిలో పెట్టినంత చక్కగా వివరిస్తుంది. బెత్తం పట్టుకోదు, గుంజీలు తీయించదు, గోడ కుర్చీలు వేయించదు... ఎలాంటి పాఠాలనైనా ఏమాత్రం కసురుకోకుండా ఫ్రెండ్లీగా బోధిస్తుంది. ఎలాంటి సందేహాన్నైనా ఏమాత్రం విసుక్కోకుండా చిటికెలో తీర్చేస్తుంది. ఈ-తరానికి గురువూ, దైవం గూగుల్. ఈ-తరానికి ఫ్రెండ్, ఫిలాసఫర్ అండ్ గైడ్ గూగుల్. గూగుల్ ఒక జ్ఞాన నిధి, ఒక విజ్ఞాన ఖని. పద్దెనిమిదేళ్ల కిందట సాదాసీదా సెర్చ్ ఇంజన్‌గా ‘గూగుల్’ మొదలైనప్పుడు అది నిరంతర సమాచార ఖనిగా పరిణమించగలదని, అంచెలంచెలుగా విస్తరించి విశ్వవ్యాప్తమై అధునాతన ప్రపంచంలో అనేకానేక ఏకలవ్య శిష్యులకు జగద్గురువుగా అవతరించగలదని ఎవరూ ఊహించలేదు. గూగుల్ ప్రస్థానం అభూత కల్పనల కంటే విడ్డూరమైనది. గూగుల్ సాధించిన విజయాలు ఇంటర్నెట్ ప్రపంచంలోని ఇతరేతర శతకోటి విజయాల కంటే ఘనమైనవి. ‘ఆచార్య దేవో భవ’ అని గురువులను గౌరవించడం మన సంస్కృతి. దాదాపు ఇంటింటికీ ఇంటర్నెట్ విస్తరించడంతో సమాచార విప్లవంలో ‘గూగుల్’ గురుతర పాత్ర పోషిస్తోంది. శాస్త్ర సాంకేతికాలకు మాత్రమే పరిమితం కాకుండా వంటా వార్పు వంటి సామాన్య విషయాలపైనా పాఠాలు బోధిస్తోంది. ఈ-తరానికి గురువుగా మారిన గూగులాచార్యుల కథా కమామిషూ... చదువులెంత సులభం! చదువుల తీరుతెన్నుల చరిత్రను ఇప్పుడు ఎవరైనా రాస్తే, ఆ చరిత్రను గూగుల్ పూర్వయుగం, గూగుల్ అనంతర యుగంగా విభజించుకోవడం అనివార్యం. ఇంటర్నెట్ అనేది ఊహకందని కాలంలో, గూగుల్ అనే సమాచార ఖని అందుబాటులోకి రాని కాలంలో చదువులు బహు కష్టంగా ఉండేవి. పాఠాలు నేర్చుకునే విద్యార్థులకే కాదు, పాఠాలు నేర్పే గురువులకు కూడా! పొల్లు పోకుండా పాఠాలను వల్లె వేయాల్సి వచ్చేది. పరీక్షలకు ముందు అవే పాఠాలను పదే పదే బట్టీ పట్టాల్సి వచ్చేది. అయినా ఒక పట్టాన గుర్తుండి చచ్చేవి కాదు. చాలా అంశాల్లో ఏమిటి? ఎందుకు? ఎలా? అనే మౌలికమైన ప్రశ్నలకు పాఠ్యపుస్తకాల్లో ఉన్న సమాధానాలు అర్థమయ్యీ కానట్లు ఉండేవి. రకరకాల సందేహాలు తలెత్తేవి. వెనువెంటనే వాటిని నివృత్తి చేసుకునే మార్గమే అందుబాటులో ఉండేది కాదు. కొత్త పదాలు వేటికైనా అర్థాలు తెలుసుకోవాలంటే దిండు సైజులో కొండలా ఉండే నిఘంటువుల్లో పేజీలకు పేజీలు ఓపికగా తిరగేస్తూ వెదుక్కోవాల్సి వచ్చేది. కొరుకుడుపడని సబ్జెక్టుల్లో ఏవైనా సందేహాలు తలెత్తినా, టీచర్లను అడగాలంటే భయ సంకోచాలు వెంటాడేవి. ఓపికగా సందేహాలను నివృత్తి చేసే టీచర్లు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. చాలామంది టీచర్లు కోపతాపాలను ప్రదర్శించేవారు. ఇవన్నీ విద్యార్థుల కష్టాలు. అయితే, టీచర్ల కష్టాలు టీచర్లకూ ఉండేవి. తమకే తెలియని విషయాలపై సందేహాలతో నిత్యం విసిగించే విద్యార్థులతో వేగడం అగ్నిపరీక్షలా ఉండేది. అపర చండామార్కుల వంటి టీచర్లు అలాంటి గడ్డు పరిస్థితులను దండోపాయంతో నెట్టుకొచ్చేసేవారు. అయితే, టీచర్లందరూ దండోపాయ దురంధరులగు చండామార్కుల వారసులు కాదు కదా! వాళ్లల్లోనూ అమాయకపు పరమానందయ్యలు ఉంటారు. పాపం అలాంటి వాళ్లకే కష్టాలన్నీ... పైగా విద్యార్థులకు కూడా పరమానందయ్యల వంటి టీచర్ల దగ్గరే కాస్త చనువెక్కువ. అందుకే వాళ్లనే పదే పదే సందేహాలతో సతాయిస్తూ ఉంటారు. ‘గూగుల్’ పుట్టుకకు మునుపు గడచిన సత్తెకాలంలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు చదువులు సవాలుగా ఉండేవి. ‘గూగుల్’ ఆవిర్భావం తర్వాత చాలావరకు కష్టాలు తీరిపోయాయి. చదువులు సులభమయ్యాయి. ఎలాంటి సందేహమైనా సరే, నివృత్తి చేసుకోవడం ఒక క్లిక్కుతో జరిగే పనిగా మారింది. ఇద్దరు మిత్రుల కథ పాతికేళ్ల కిందట ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చింది. బ్రిటిష్ శాస్త్రవేత్త సర్ టిమ్ బెరర్స్ లీ తొలిసారిగా 1989 మార్చి 12న ‘వరల్డ్ వైడ్ వెబ్’ ప్రతిపాదన చేశారు. మొదటి సెర్చ్ ఇంజన్ ‘ఆర్చీ’ 1990లో ఏర్పాటైంది. ఆ తర్వాత 1991 ఆగస్టులో మొట్టమొదటి వెబ్సైట్ ‘ఇన్ఫో.సెర్న్.సీహెచ్’ ఏర్పడింది. కంప్యూటర్ల నుంచి కంప్యూటర్లకు సమాచార మార్పిడి తేలికైంది. ఈ-మెయిల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. వెబ్సైట్లు ఒక్కొక్కటే ఏర్పడసాగాయి. విద్యారంగంలో నెమ్మదిగా హైటెక్కు టమారాలన్నీ మొదలవసాగాయి. అలాంటి కాలంలో... 1996లో ల్యారీ పేజ్, సెర్జీ బ్రిన్ అనే అమెరికన్ కుర్రాళ్లు స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఒకరినొకరు కలుసుకున్నారు. ఇద్దరూ పీహెచ్డీ స్కాలర్లే! పాపం అప్పటికి అబ్దుల్ కలాం వాళ్లకేమీ చెప్పలేదు గాని, వాళిద్దరూ ఒక పెద్ద కల కన్నారు. ఇంటర్నెట్లోని సమస్త సమాచారాన్నీ ఒకేచోట అందుబాటులోకి తేవాలన్నదే వారి కల. దానిని సాకారం చేసుకోవడానికి 1997 సెప్టెంబర్ 15న ‘గూగుల్ డాట్ కామ్’ డొమైన్ పేరును నమోదు చేసుకున్నారు. ఏడాది గడవకుండానే... 1998 సెప్టెంబర్ 4న గూగుల్ కంపెనీని ఏర్పాటు చేశారు. తమ తోటి పీహెచ్డీ సహాధ్యాయి క్రెయిగ్ సిల్వర్స్టీన్ను తొలి ఉద్యోగిగా చేర్చుకున్నారు. అప్పట్లో వాళ్లు కాలిఫోర్నియాలోని మెన్లో పార్కు ప్రాంతంలో సూసాన్ వోజ్సికి అనే స్నేహితురాలి ఇంటి గ్యారేజీలో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలా మొదలైన ప్రస్థానం రెండు దశాబ్దాలైనా గడవక ముందే అనేకానేక మైలురాళ్లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. కేవలం సెర్చ్ ఇంజన్‌గా మాత్రమే పరిమితమైపోకుండా, సమాచార సాంకేతిక పరిజ్ఞానంలో ‘గూగుల్ ఎర్త్’ వంటి వినూత్నమైన సేవలను ప్రారంభించింది. అనూహ్యంగా అసంఖ్యాక ఘనవిజయాలను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చాలా నగరాల్లో గూగుల్ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. ‘గూగుల్’ సంస్థ నికర విలువ ఇప్పుడు 49,800 కోట్ల డాలర్లకు పైమాటే. తాజా లెక్కల ప్రకారం ‘గూగుల్’లో 57,100 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఐటీ విద్యార్థులందరి కలల లక్ష్యం ‘గూగుల్’లో ఉద్యోగమేనంటే అతిశయోక్తి కాదు. ‘గూగుల్’లో ఉద్యోగమంటే రాజ వైభోగమేనని చెబుతారు. గూగుల్ నీడలో విద్యా వేదికలు ‘బ్లాగర్’, ‘యూట్యూబ్’ వంటివి ‘గూగుల్’ నీడలోనివే. ఇవి అందిస్తున్న సేవలు సమాచార విప్లవంలో కొత్త శకానికి నాంది పలికాయి. అంతేనా! చదువు సంధ్యల్లోనూ ఇవి తమదైన ముద్ర వేస్తున్నాయి. ‘గూగుల్’ దెబ్బతో ఇప్పుడు ఇంటర్నెట్ ఒక అనధికారిక ఓపెన్ యూనివర్సిటీలా మారింది. చదువుకోదలచిన వాళ్లకు చదువుకునేంత సమాచారం అందుబాటులో ఉంటోంది. ఔత్సాహిక రచయితలకు ‘బ్లాగర్’ అద్భుతమైన వేదికగా మారింది. తమకు తెలిసిన విజ్ఞానాన్ని పదిమందితో పంచుకోవడానికి, తమ సృజనాత్మకతను లోకానికి చాటుకోవడానికి ‘బ్లాగర్’ చక్కని వెసులుబాటు కల్పిస్తోంది. నిజానికి ‘బ్లాగర్’ను 1999లో పైరా ల్యాబ్స్ ప్రారంభించగా, దీనిని 2003లో ‘గూగుల్’ సొంతం చేసుకుంది. ఇక ‘యూట్యూబ్’ వినోద, విజ్ఞానాల సమ్మేళనంగా ఉపయోగపడుతోంది. వీడియో షేరింగ్ వెబ్సైట్ ‘యూట్యూబ్’ను 2005లో ‘పేపాల్’ ఉద్యోగులు కొందరు ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదిలోనే ‘గూగుల్’ దీనిని సొంతం చేసుకుంది. ‘యూట్యూబ్’లో సినిమాలు, టీవీ సీరియల్ ఎపిసోడ్లు, క్రీడలు, పాటలు వంటివే కాదు, పలు విషయాలకు సంబంధించిన పాఠాల వీడియోలూ రోజూ అసంఖ్యాకంగా చేరుతూనే ఉంటాయి. వినోదం కోసం ‘యూట్యూబ్’ను వినియోగించుకునే వారి సంగతి సరే, చాలామంది ‘యూట్యూబ్’ ద్వారా విలువైన పాఠాలను వ్యయప్రయాసలేవీ లేకుండానే నేర్చుకోగలుగుతున్నారు. గృహాలంకరణ వస్తువుల తయారీ, మొక్కల పెంపకం, వంటల తయారీ మొదలుకొని భౌతిక, రసాయనిక శాస్త్రాల ప్రయోగాలు, శస్త్రచికిత్సా ప్రక్రియల వరకు వివిధ అంశాల్లో పరిజ్ఞానాన్ని, వృత్తి నైపుణ్యాన్ని పెంచుకునేందుకు లక్షలాది మంది ‘యూట్యూబ్’పై ఆధారపడుతున్నారు. ఈ-లెర్నింగ్... ‘గూగుల్’తో ఎలాంటి సంబంధాలు లేని ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు అసంఖ్యాకంగా ఉన్నాయి. అవన్నీ రకరకాల విషయాలను కూలంకషంగా బోధిస్తున్నాయి. ఇంటర్నెట్ మొదలైన కొద్దికాలంలోనే ఈ-లెర్నింగ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. దాదాపు 1999 నుంచే ఈ-లెర్నింగ్‌కు జనాదరణ పుంజుకుంది. అయితే,‘గూగుల్’ లేకుంటే... ఏయే వెబ్సైట్లు ఈ-లెర్నింగ్ సేవవలను అందిస్తున్నాయో, ఏ సబ్జెక్టులను ఏయే వెబ్సైట్లు బోధిస్తున్నాయో జనాలకు తెలిసే అవకాశం ఉండేది కాదు. ‘గూగుల్’ పుణ్యాన చాలా ఈ-లెర్నింగ్ వెబ్సైట్లు జనాలకు చేరువయ్యాయి. మనకు నచ్చిన అంశాన్ని ఎన్నుకుని, ఆన్లైన్లో ఆ అంశాన్ని బోధిస్తున్న సంస్థలేవేవి ఉన్నాయో ‘గూగుల్’ను అడిగితే క్షణాల్లో చెప్పేస్తుంది. అప్పటి వరకు మనం కనీవినీ ఎరుగని వందలాది వెబ్సైట్లను చిటికెలో పరిచయం చేస్తుంది. ఈ-లెర్నింగ్ ప్రక్రియను ప్రజలకు చేరువ చేయడంలో గూగుల్ గురుతర పాత్ర పోషిస్తోంది. గూగుల్ సారథిగా భారతీయుడు ఇద్దరు అమెరికన్ కుర్రాళ్లు ప్రారంభించగా, అంచెలంచెలుగా ఎదిగి, ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ‘గూగుల్’ కంపెనీకి సారథిగా సుందర్ పిచయ్ గత ఏడాది బాధ్యతలు స్వీకరించారు. గత ఏడాది చేపట్టిన కార్పొరేట్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా ‘అల్ఫాబెట్’కు ‘గూగుల్’ అనుబంధ సంస్థగా మారింది. ‘గూగుల్’ వ్యవస్థాపకుల్లో ఒకరైన ల్యారీ పేజ్ ‘అల్ఫాబెట్’కు సీఈవోగా బాధ్యతలు స్వీకరించగా, మరో వ్యవస్థాపకుడు సెర్జీ బ్రిన్ ‘అల్ఫాబెట్’ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. గూగుల్ సీఈవోగా సుందర్ పిచయ్ని నియమించారు. ఖరగ్‌పూర్ ఐఐటీ పట్టభద్రుడైన తర్వాత అమెరికాలో ఉన్నత విద్యలు పూర్తి చేసుకున్న సుందర్ పిచయ్ 2004లో ‘గూగుల్’లో చేరి, వివిధ కీలక బాధ్యతలను సమర్థంగా నిర్వహించారు. ప్రస్తుతం సీఈవోగా ఆయన ‘గూగుల్’ పురోగతిలో కీలక పాత్ర పోషిస్తున్నారు. గూగుల్ గురించి అవీ... ఇవీ... ♦ తొలినాళ్లలో గూగుల్ సెకనుకు 30-40 పేజీలను మాత్రమే ప్రాసెస్ చేయగలిగేది. ఇప్పుడు ఏకంగా కొన్ని మిలియన్ల పేజీలను ప్రాసెస్ చేయగలుగుతోంది. పద్దెనిమిదేళ్ల వ్యవధిలోనే ‘గూగుల్’ తన వేగాన్ని అపరిమితంగా పెంచుకుంది. ♦ ఇంటర్నెట్లో గూగుల్ కంటే ‘యాహూ’ నాలుగేళ్ల సీనియర్ సంస్థ. ‘గూగుల్’ శరవేగంగా ఎదుగుతుండటంతో, దానిని కొనుగోలు చేయాలని ‘యాహూ’ భావించింది. ‘గూగుల్’ కొనుగోలుకు 2002లో 300 కోట్ల డాలర్లు ఇవ్వజూపింది కూడా. అయితే, ‘గూగుల్’ వ్యవస్థాపకులు ఆ ఆఫర్‌ను తోసిపుచ్చారు. ♦ ‘గూగుల్’ స్పెల్లింగ్ ఒక అచ్చుతప్పు. ‘గూగుల్’ అసలు స్పెల్లింగ్ ‘జీఓఓజీఓఎల్’. అంటే, ఒకటి తర్వాత వంద సున్నాలు పెడితే వచ్చే సంఖ్య అన్నమాట. ♦ ‘గూగుల్’ తొలిదశలో రూపొందించిన అల్గొరిథమ్ ‘పేజ్‌ర్యాంక్’ పేటెంట్ ఇప్పటికీ స్టాన్ఫోర్డ్ వర్సిటీ అధీనంలోనే ఉంది. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో ఇప్పుడైతే వివిధ సందర్భాల్లో డూడుల్స్ కనిపించడం మామూలైంది గాని, తొలి రోజుల్లో ‘గూగుల్’ లోగో యథాతథంగానే కనిపించేది. అయితే, గూగుల్ వ్యవస్థాపకులు ల్యారే పేజ్, సెర్జీ బ్రిన్లు నెవడాలో జరిగే ‘బర్నింగ్ మ్యాన్ ఫెస్టివల్’ వేడుకల్లో పాల్గొనడానికి వెళ్లారు. తాము కార్యాలయంలో ఉండటం లేదనే సమాచారాన్ని యూజర్లకు తెలియజేసేందుకు తొలిసారిగా అప్పుడు ‘బర్నింగ్ మ్యాన్’ డూడుల్‌ను హోమ్‌పేజీలో పెట్టారు. దానికి స్పందన బాగుండటంతో ప్రత్యేక సందర్భాల్లో డూడుల్స్ పెట్టడాన్ని అలవాటుగా చేసుకున్నారు. ♦ ‘గూగుల్’ హోమ్‌పేజీలో లోగో, సెర్చ్ బాక్స్ తప్ప మిగిలిన భాగమంతా తెల్లగా ఖాళీగానే ఉంటుంది. మిగిలిన వెబ్సైట్ల హోమ్పేజీల మాదిరిగా అందులో ఎలాంటి రంగులు, చమక్కులు, డిజైన్లు కనిపించవు. ఎందుకంటే, ‘గూగుల్’ వ్యవస్థాపకులిద్దరికీ వెబ్‌పేజీ డిజైనింగ్‌కు అత్యవసరమైన హెచ్‌టీఎంఎల్‌లో పరిజ్ఞానం అంతంత మాత్రమే. ♦ ‘గూగుల్’ భాషపై కూడా తనదైన ముద్ర వేసింది. ఆక్స్ఫర్డ్, వెబ్‌స్టర్ డిక్షనరీలో 2006లో ముద్రించిన ఎడిషన్లలో ‘గూగుల్’ పదాన్ని క్రియాపదంగా గుర్తించాయి. ఇంటర్నెట్లో సమాచారాన్ని వెదుకులాడటానికి ‘గూగులింగ్’ అనడం ఏకపద ప్రత్యామ్నాయంగా మారింది. గూగుల్ పరిమితులు... ‘అన్నీ వేదాల్లోనే ఉన్నాయష’ అనే కాలం పోయి ‘అన్నీ గూగుల్లోనే ఉన్నాయష’ అనుకునే కాలం వచ్చిపడింది. పిడికిట్లోకి ప్రపంచం ఇమిడిపోయే దశలో దూసుకొచ్చిన గూగుల్ చాలామందికి గురువుగా మారింది సరే, గురువులకు పరిమితులు ఉన్నట్లే, గూగుల్ పరిమితులు గూగుల్కూ ఉన్నాయి. వాటిని గుర్తించకుండా గూగుల్ చెప్పిందే వేదమనే భ్రమలో పడితే మాత్రం తంటాలు తప్పవు. అందువల్ల గూగుల్ పరిమితుల్లో కొన్నింటి గురించి క్లుప్తంగా... * గూగుల్ సెర్చ్‌లో ఏదైనా పదం కొడితే, ఆ పదానికి సంబంధించిన సమస్త లింకులూ క్షణాల్లో ప్రత్యక్షమవుతాయి. ఒక్కో లింకు ఒక్కో వెబ్‌పేజీకి దారితీస్తుంది. కొన్ని వెబ్‌పేజీలలో ఇక్ష్వాకులం నాటి సమాచారం ఉంటుంది. పేజీని ప్రారంభించిన తర్వాత అప్డేట్ చేయకుండా ఏళ్ల తరబడి వదిలేసిన పేజీలు ఉంటాయి. అలాంటి సమాచారాన్ని నమ్ముకోలేం. * వెబ్పేజీల్లో పొందుపరచిన విషయాలలోని నాణ్యతను, కచ్చితత్వాన్ని గుర్తించడం గూగుల్‌కే కాదు, ఏ సెర్చ్ ఇంజన్‌కూ సాధ్యం కాదు. వివిధ విషయాల రచనా నాణ్యతను, కచ్చితత్వాన్ని నిర్ధారించడం మానవ మేధస్సుకు మాత్రమే సాధ్యం. * సాంకేతిక పురోగతి ఫలితంగా గూగుల్‌తో పాటు చాలా సెర్చ్ ఇంజన్లు హెచ్‌టీఎంఎల్‌లో లేని అంశాలను కూడా చాలావరకు చదవగలుగుతున్నాయి. అయినప్పటికీ తగిన వ్యాఖ్య, సమాచారం లేకుండా అప్లోడ్ చేసిన ఫొటోలు, ఆడియో, వీడియో సమాచారాన్ని విశ్లేషించడం ఇప్పటికీ వీటికి దుస్సాధ్యంగానే ఉంటోంది. * వివిధ సాంకేతిక కారణాల వల్ల సెర్చ్ ఇంజన్లకు అందని వెబ్‌పేజీలు కూడా చాలానే ఉంటాయి. అలాంటి వెబ్‌పేజీలలో ఏదైనా విలువైన సమాచారం ఉన్నా, వాటి యూఆర్ఎల్ మనకు కచ్చితంగా తెలిస్తే తప్ప వాటిని చూడటం సాధ్యం కాదు. వాటిని వెదుకులాడటానికి సెర్చ్ ఇంజన్లపై ఆధారపడటం కష్టమే. - పన్యాల జగన్నాథదాసు


