breaking news
gold missing
-
చైనాలో గోల్డ్ రష్..!
బీజింగ్: ఒకటీరెండూ కాదు..ఏకంగా 20 కిలోల బంగారం, వెండి నగలు...బంగారం, డబ్బు నిండుగా ఉన్న ఇనుప బీరువా..! చైనాలోని ఓ ఊళ్లో జనం వీటిని సొంతం చేసుకునేందుకు తెగ వెతుకుతున్నారు. కొందరు బురద మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. మరికొందరైతే ఏకంగా మెటల్ డిటెక్టర్లను పట్టుకుని తిరుగుతున్నారు. ఇదంతా నిధీ నిక్షేపాల కోసం మాత్రం కాదు..వరదల్లో కొట్టుకుపోయిన సొత్తు కోసం సాగుతున్న ఎడతెగని అన్వేషణ..! ఏం జరిగిందంటే..జూలై 25వ తేదీన షాంగ్జి ప్రావిన్స్‌లోని వుక్వి కౌంటీలో భారీ వర్షాలతో అనూహ్యంగా వరదలు వచ్చాయి. కొన్ని నిమిషాల వ్యవధిలోనే మీటరు ఎత్తున వరద ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తింది. ఆ వరద లావోఫెంగ్ జియాంగ్ దుకాణంలోకి కూడా ప్రవేశించింది. అధికార యంత్రాంగం వరద హెచ్చరికలతో ఆ రాత్రంగా జాగారం చేసిన దుకాణం సిబ్బంది, ఉదయం పూట యథా ప్రకారం దుకాణం తెరిచేందుకు ఉద్యుక్తులవుతున్నారు. బంగారం, ఇతర విలువైన సామగ్రిని సురక్షితంగా భద్రపర్చడం మర్చిపోయారు. సరిగ్గా ఆ సమయంలో ఎవరూ ఊహించని విధంగా ఒక్కసారిగా వేగంగా వరద ప్రవాహం దుకాణంలోకి చేరింది. తేరుకునేలోపే నగలున్న ట్రేలు, కాబిన్లను ఊడ్చిపెట్టుకుపోయింది. నగదు, నగలతోపాటు ఒక ఐరన్ సేఫ్ సైతం వరదతో పాటు మాయమైంది. బంగారం గొలుసులు, ఉంగరాలు, గాజులు, బ్రాస్లెట్లు, వజ్రపు ఉంగరాలు, వెండి ఆభరణాలు, పచ్చలు పోయిన వాటిల్లో ఉన్నాయి. ఐరన్ సేఫ్‌లో పెద్ద మొత్తంలో నగదుతోపాటు, కరిగించిన బంగారం, కొత్త బంగారు వస్తువులు ఉన్నాయి. వెరసి దుకాణదారుకు వాటిల్లిన నష్టం మార్కెట్ ధర ప్రకారం రూ.12 కోట్లని అంచనా. ఈ సొత్తు కోసం దుకాణం యజమాని కుటుంబంతోపాటు సిబ్బంది రెండు రోజులుగా కాళ్లకు బలపం కట్టుకుని మరీ ఆ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నారు. పోయిన వాటిలో సుమారు కిలో బంగారు ఆభరణాలు దొరికినట్లు అధికారులు చెబుతున్నారు. వరదల కారణంగా పట్టణంలో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో, సీసీటీవీ ఫుటేజీ వ్యవస్థ దెబ్బతింది. దీనివల్ల వరద సమయంలో దుకాణంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు సరైన ఆధారమంటూ లేకుండా పోయింది. ఎవరైనా ఈ వస్తువులను తీసుకెళ్లారా? లేక వరదలోనే కొట్టుకుపోయాయా అనేది నిర్థారించడం సైతం కష్టంగా మారింది. తమ నగల దుకాణానికి సంబంధించిన విలువైన వస్తువులను ఎవరైనా ఉద్దేశ పూర్వకంగా తీసుకున్నట్లు తెలిస్తే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని యజమాని హెచ్చరిస్తున్నారు. దుకాణంలోని వస్తువులు వరదల్లో కొట్టుకుపోయినట్లు సమాచారం తెలుసుకున్న స్థానికులు సైతం గాలింపు మొదలుపెట్టారు. వరదలకు కొట్టుకు పోయి న బురద, మట్టిని తవ్వి మరీ చూస్తున్నారు. కొందరు మెటల్ డిటెక్టర్లతోనూ వెదుకుతున్నారు. ఈ గోల్డ్ రష్కు సంబంధించిన వీడియోలు ఆన్లైన్లో ప్రత్యక్షమవుతున్నాయి. అయితే, స్థానికులెవరూ దొరికిన వస్తువులను తమకివ్వలేదని దుకాణం యజమాని చెబుతున్నారు. అలా ఎవరైనా తీసుకుపోయినట్లు తెలిస్తే సమాచారమివ్వాలని స్థానికులను కోరుతున్నారు. తెచ్చిన వారికి ఆ వస్తువు విలువను బట్టి బహుమతులను సైతం ఇస్తామని ఆశచూపుతున్నారు.బీజింగ్‌లో వర్షాలు, వరదల్లో 44 మంది మృతి చైనా రాజధాని బీజింగ్‌ను భారీ వర్షాలు, వరదలు కకావికలం చేశాయి. శనివారం కురిసిన కుండపోత వానలు, వరదల్లో కనీసం 44 మంది చనిపోగా, 9 మంది గల్లంతయ్యారు. గత నాలుగు రోజులుగా బీజింగ్ సహాయక, రక్షణ కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇదే సమయంలో మరోసారి భీకరంగా వాన కురియడంతో రహదారులు తెగిపోవడంతోపాటు, విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లోని జనాన్ని సురక్షిత ప్రాంతాలకు యంత్రాంగం తరలిస్తోంది. బీజింగ్‌లో ఉత్తరాన ఉన్న పర్వతప్రాంత మియున్, యాంగ్వింగ్ జిల్లాల్లో అత్యధిక నష్టం వాటిల్లిందని అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. -
చేయని నేరానికి బలైపోతున్నా..
సాక్షి, వరంగల్ (కమలాపూర్): చేయని నేరానికి బలైపోతున్నానంటూ వాట్సాప్ స్టేటస్ పెట్టి ఓ యువకుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ సంఘటన వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం భీంపల్లిలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. భీంపల్లికి చెందిన చింతల ప్రసాద్ తన వ్యవసాయ పనుల నిమిత్తం అదే గ్రామానికి చెందిన బొంకూరి కుమార్, అతని చిన్నాన్న కొడుకు రమేశ్‌ను తీసుకెళ్లేవాడు. ఈ క్రమంలో గత నెల 30న రాత్రి ప్రసాద్ తన ఇంటికి కుమార్‌తో పాటు రమేశ్‌ను తీసుకువెళ్లాడు. మరో యువకుడు పూర్ణచందర్‌తో కలిసి వీరంతా పార్టీ చేసుకుని రాత్రికి అక్కడే పడుకున్నారు. తెల్లవారాక ప్రసాద్‌తో కలిసి కుమార్, రమేశ్ పొలం వెళ్లారు. అనంతరం పూర్ణ చందర్‌ను దించడానికి ప్రసాద్ వెళ్లి తిరిగి వచ్చేసరికి బీరువాలోని ఏడున్నర తులాల బంగారు నగలు కనిపించలేదు. కుమార్, రమేశ్‌ను అడగ్గా, తెలియదని చెప్పారు. దీంతో ప్రసాద్ జనవరి 1న కమలాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కుమార్, రమేశ్‌ను పోలీసులు రెండు రోజులు విచారించి 2న సాయంత్రం వదిలిపెట్టారు. ఈ క్రమంలోనే చేయని నేరానికి తాను బలైపోతున్నానంటూ కుమార్ వాట్సాప్ స్టేటస్ పెట్టి పురుగుల మందు తాగాడు. కుటుంబసభ్యులు 108 ద్వారా హన్మకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఎస్సై దేశిని విజయ్‌కుమార్ గౌడ్‌ను వివరణ కోరగా, ప్రసాద్ ఫిర్యాదు మేరకు పిలిపించి స్టేట్మెంట్ తీసుకున్నామని, ఎలాంటి వేధింపులకు గురి చేయలేదని చెప్పారు. చదవండి: ('చావైనా.. బతుకైనా నీతోనే లావణ్య..’) -
సీళ్లు సేఫ్.. బంగారం ‘ఉఫ్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎనిమిదేళ్ల క్రితం ఒక ప్రైవేటు సంస్థ నుంచి సీబీఐ సీజ్ చేసిన 400 కిలోల బంగారంలో 103 కిలోల మేర మాయమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. దీంతో ఉలిక్కిపడిన సీబీఐ ఒక ఎస్పీ ర్యాంక్ అధికారి ఆధ్వర్యంలో మొత్తం ఘటనపై అంతర్గత విచారణకు సిద్ధమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మరోవైపు సీబీసీఐడీ(తమిళనాడు) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆరునెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని సూచించింది. స్థానిక పోలీసులు విచారణ జరిపితే తమ పరువు పోతుందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది సీబీఐకి అగ్ని పరీక్ష సమయమని వ్యాఖ్యానించింది. ఏం జరిగింది? చెన్నై ఎన్ఎస్సీ బోస్ రోడ్డులోని సురానా కార్పొరేషన్‌తో కొందరు స్వదేశీ, విదేశీ ఉన్నతాధికారులు, వ్యాపార సంస్థలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఎంఎంటీసీ అధికారుల అండతో ఈ కంపెనీ బంగారం, వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో 2012లో సీబీఐ సదరు సంస్థలో సోదాలు చేసి దాదాపు 400.47 కిలోల బంగారు బిస్కెట్లు, నగలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆ బంగారాన్ని సురానా కార్యాలయంలోని లాకర్లో భద్రం చేసి సీలువేశారు. ఈ లాకరుకు సంబంధించిన 72 తాళం చెవులను, స్వాధీనం చేసుకున్న బంగారు వివరాల జాబితాను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించారు. సురానా అనేక బ్యాంకుల్లో రూ.1,160 కోట్లను రుణంగా పొంది తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని నిర్వహించేందుకు బ్యాంకుల తరఫున రామ సుబ్రమణియం అనే వ్యక్తిని జాతీయ కంపెనీ లా బోర్డు ప్రత్యేకాధికారిగా నియమించింది. సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని రుణ బకాయి చెల్లింపు కింద తమకు అప్పగించాలని ఆయన కోర్టులో పిటిషన్ వేసి అనుమతి పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాకర్‌ను తెరిచిచూడగా లోపల ఉంచిన మొత్తం 400.47 కిలోల బంగారులో 103.86 కిలోల బంగారం తగ్గింది. ఈఘటనపై ప్రత్యేకాధికారి రామసుబ్రమణియం మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. బం గారం మాయమైన ఘటనపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయాలని రామసుబ్రమణియంకు కోర్టు సూచించింది. ఈ ఫిర్యాదును అనుసరించి ఎస్పీ హోదాకు తక్కువగాని అధి కారి విచారణ చేయాలని పేర్కొంది. సీబీఐ ఏమంటోంది? ఇప్పటికే సీబీఐ ఈ విషయమై అంతర్గత విచారణకు ఎస్పీ స్థాయి అధికారిని నియమించింది. అయితే కోవిడ్ నిబంధనలు, లాక్డౌన్ తదితర కారణాల వల్ల ఈ విచారణ పూర్తికాలేదని సంస్థ వర్గాలు తెలిపాయి. బంగారం తమ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి మాయమై ఉంటే సీబీఐ వెంటనే చర్యలు తీసుకునేదని, కానీ ఇప్పుడు మాయమైన బంగారం సురానా కంపెనీ లాకర్ నుంచి మాయం కావడంతో ఏం జరిగిందో లోతైన విచారణ జరగాలని సీబీఐ అధికారులు చెప్పారు. ఇదే సమయంలో సురానా సంస్థ కోర్టును ఆశ్రయించిందని, తాము ఆదేశించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు చెప్పిందని వెల్లడించారు. 2012లో ఈ రైడ్‌లో పాల్గొన్న అధికారులు కొందరు రిటైరయ్యారని, కోవిడ్ లాక్డౌన్ సమయంలో వారిని విచారించడం కుదరలేదని వివరించారు. బంగారమా? గంజాయా? వేసిన సీళ్లు వేసినట్లుండగానే బంగారం మాయం కావడంపై విచారించిన హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కోర్టు లేదా సీబీఐ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి చోరీ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకునేవారని హైకోర్టు విచారణలో భాగంగా ప్రశ్నించింది. అదే జరిగితే స్థానిక పోలీసు స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయించి పోలీసు దర్యాప్తు జరిపేవారని, సదరు పోలీసులు పట్టుకున్న బంగారం 296.66 కిలోలేనని, తప్పుగా 400.47 కిలోలుగా ఎంటర్ చేశారని నిర్ధారించేవాళ్లని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇంకా ఇలాంటి వాదన రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నది. వ్యత్యాసం కొన్ని గ్రాములైతే ఏదో ఒక సమాధానం చెప్పవచ్చని, కానీ వంద కిలోల బంగారం తేడా రావడం ఎలా జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదని, గంజాయి లాగా బంగారం బరువు కాలంతో పాటు తగ్గదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. -
క్షణాల్లో బంగారం సంచి మాయం!
సాక్షి, హైదరాబాద్: సేల్స్‌మన్ నిర్లక్ష్యం కారణంగా కిలోన్నర బంగారం మాయమైన సంచలన ఘటన బంజారాహిల్స్‌లో సోమవారం రాత్రి జరిగింది. బంజారాహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బషీర్‌బాగ్‌లోని వీఎస్ నగల దుకాణం నిర్వాహకులు జూబ్లీహి ల్స్ లోని కృష్ణ పెరల్స్ ఆభరణాల షాపులో ఓ కస్టమర్ కోసం ఆభరణాలు తీసుకొచ్చారు. వాటిని ప్రదీప్ అనే సేల్స్‌మన్ స్కూటీపై తిరిగి వీఎస్ నగల దూకాణానికి తీసుకెళుతున్న క్రమంలో బంగారం సంచి మిస్సయింది. బంజారాహిల్స్‌లో రోడ్డుపై వరదనీటిని దాటే క్రమంలో కాళ్ల మధ్యలో పెట్టుకున్న బంగారు నగల బ్యాగు కిందపడిపోయింది. కొద్ది దూరం వెళ్లిన తర్వాత దీనిని గుర్తించిన ప్రదీప్ వెనక్కి వచ్చి చూడగా బ్యాగు కనిపించలేదు. వీఎస్ గోల్డ్ యజమాని ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని సేల్స్‌మన్ ప్రదీప్‌ను విచారిస్తున్నారు. సేల్స్‌మన్ ప్రదీప్ బ్యాగ్ పడిపోయిందని చెప్పిన చోట పోలీసులు వెతకగా.. ఆ వరద నీటిలో కొట్టుకుపోయిన బ్యాగు పక్క బిల్డింగ్‌లో ఉన్న చెత్త బుట్ట వద్ద దొరికింది. కానీ దాంట్లో బంగారు ఆభరణాలు మాత్రం లేవు. బంగారు ఆభరణాలు ఎవరు తీసుకెళ్లారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (చదవండి: ‘మీ ఒక్కరోజు రాబడి..నాకు మూడునెలల ఆదాయం’) -
టీటీడీలో ఆభరణాలు మాయం
-
మల్లన్న హుండీ లెక్కింపులో చేతివాటం
సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో సిబ్బంది చేతివాటం బయటపడింది. లెక్కింపు జరగుతున్న సమయంలో అందులో పాల్గొన్న ఓ మహిళా చేతివాటం చూపించింది. లెక్కింపు చేస్తున్న క్రమంలో ఎవరి కంటాపడకుండా కొంత బంగారు, వెండి ఆభరణాలను తీసుకెళ్లడానికి యత్నించింది. ఆలయ ముఖమండపంలో హుండీ లెక్కింపులు నిర్వహిస్తూ మధ్యాహ్నం భోజనానికి వెళ్తున్న ఖాత శాంతమ్మ 5.77 గ్రాముల బంగారు, 5.29 గ్రాముల వెండి ఆభరణాలను తీసుకెళ్తుండంతో మండపం వద్ద తనిఖీలు చేస్తున్న సిబ్బంది ఈ విషయాన్ని గుర్తించారు. ఆమెను పోలీసులకు అప్పగించారు. -
ఆలయాలను వదలట్లేదు..
నాగాయలంక : దోపిడి దొంగలు ఇళ్లు, షాపులే కాదు...చివరకు ఆలయాలను వదలట్లేదు. తాజాగా కృష్ణా జిల్లా నాగాయలంకలో రెండు ఆలయాల్లో జరిగిన దొంగతనాలతో స్థానికంగా కలకలం రేపింది. కృష్ణా నదీ తీరంలో ఉన్న వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలోకి దొంగలు చోరబడి అమ్మవారి మంగళసూత్రం, స్వామివారి నామాలు ఎత్తుకుపోయారు. అలాగే, తూర్పుబజార్‌లోని కోదండరామాలయంలోనూ వారు చోరీకి పాల్పడ్డారు. ఆదివారం ఉదయం దేవాలయంలో చోరీ జరిగినట్టు గుర్తించిన ఆలయ కమిటీ సభ్యులు స్థానిక పోలీసుస్టేషన్లోఫిర్యాదు చేశారు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కేసులు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. -
266 కిలోల బంగారం మాయం
తిరువనంతపురం: శ్రీ పద్మనాభస్వామి ఆలయం నుంచి 266 కిలోల బంగారం మాయమయినట్టు మాజీ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్(కాగ్) వినోద్ రాయ్ వెల్లడించారు. సుప్రీంకోర్టుకు సమర్పించిన ఆడిట్ నివేదికలో ఈ విషయం పేర్కొన్నారు. ఆలయానికి చెందిన 893 కేజీల బంగారం వివిధ పనుల నిమిత్తం బయటకు ఇచ్చారని, ఇందులో 627 కిలోల బంగారం మాత్రమే తిరిగొచ్చిందని ఆయన తెలిపారు. మిగతా బంగారం ఏమైందన్నది నిగ్గుతేలాల్సివుందని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు వినోద్ రాయ్ ఆడిట్ నిర్వహించారు. ఆలయ సంపద సహా ఆదాయ వ్యయాలపై మదింపు చేయాలని గతేడాది సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే.