సీళ్లు సేఫ్..‌ బంగారం ‘ఉఫ్‌’

Madras High Court orders CBCID inquiry after 103 kgs of gold missing - Sakshi

సీబీఐ కస్టడీ నుంచి 103 కేజీల బంగారం మాయం

మార్కెట్‌ విలువ రూ. 45 కోట్లు

సీబీసీఐడీ విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశం

సీబీఐకి అగ్ని పరీక్షంటూ వ్యాఖ్యలు

సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎనిమిదేళ్ల క్రితం ఒక ప్రైవేటు సంస్థ నుంచి సీబీఐ సీజ్‌ చేసిన 400 కిలోల బంగారంలో 103 కిలోల మేర మాయమైన సంఘటన కలకలం సృష్టిస్తోంది. దీంతో ఉలిక్కిపడిన సీబీఐ ఒక ఎస్‌పీ ర్యాంక్‌ అధికారి ఆధ్వర్యంలో మొత్తం ఘటనపై అంతర్గత విచారణకు సిద్ధమైంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై మరోవైపు  సీబీసీఐడీ(తమిళనాడు) విచారణకు మద్రాసు హైకోర్టు ఆదేశించింది. ఆరునెలల్లో విచారణ పూర్తి చేసి చార్జిషీటు దాఖలు చేయాలని సూచించింది. స్థానిక పోలీసులు విచారణ జరిపితే తమ పరువు పోతుందన్న సీబీఐ వాదనను కోర్టు తోసిపుచ్చింది. ఇది సీబీఐకి అగ్ని పరీక్ష సమయమని వ్యాఖ్యానించింది.   

ఏం జరిగింది?
చెన్నై ఎన్‌ఎస్‌సీ బోస్‌ రోడ్డులోని సురానా కార్పొరేషన్‌తో కొందరు స్వదేశీ, విదేశీ ఉన్నతాధికారులు, వ్యాపార సంస్థలు లోపాయికారి ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని, ఎంఎంటీసీ అధికారుల అండతో ఈ కంపెనీ బంగారం, వెండిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటోందని ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించడంతో 2012లో సీబీఐ సదరు సంస్థలో సోదాలు చేసి దాదాపు 400.47 కిలోల బంగారు బిస్కెట్లు, నగలను సీబీఐ స్వాధీనం చేసుకుంది. ఆ బంగారాన్ని సురానా కార్యాలయంలోని లాకర్‌లో భద్రం చేసి సీలువేశారు. ఈ లాకరుకు సంబంధించిన 72 తాళం చెవులను, స్వాధీనం చేసుకున్న బంగారు వివరాల జాబితాను చెన్నైలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు అప్పగించారు.

సురానా అనేక బ్యాంకుల్లో రూ.1,160 కోట్లను రుణంగా పొంది తిరిగి చెల్లించకపోవడంతో ఆ సంస్థ ఆస్తులను స్వాధీనం చేసుకుని నిర్వహించేందుకు బ్యాంకుల తరఫున రామ సుబ్రమణియం అనే వ్యక్తిని జాతీయ కంపెనీ లా బోర్డు ప్రత్యేకాధికారిగా నియమించింది. సీబీఐ స్వాధీనం చేసుకున్న బంగారాన్ని రుణ బకాయి చెల్లింపు కింద తమకు అప్పగించాలని ఆయన కోర్టులో పిటిషన్‌ వేసి అనుమతి పొందారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో లాకర్‌ను తెరిచిచూడగా లోపల ఉంచిన మొత్తం 400.47 కిలోల బంగారులో 103.86 కిలోల బంగారం తగ్గింది. ఈఘటనపై ప్రత్యేకాధికారి రామసుబ్రమణియం మద్రాసు హైకోర్టులో వేసిన పిటిషన్‌ శుక్రవారం విచారణకు వచ్చింది. బం గారం మాయమైన ఘటనపై సీబీసీఐడీకి ఫిర్యాదు చేయాలని రామసుబ్రమణియంకు కోర్టు సూచించింది. ఈ ఫిర్యాదును అనుసరించి ఎస్పీ హోదాకు తక్కువగాని అధి కారి విచారణ చేయాలని పేర్కొంది.  

సీబీఐ ఏమంటోంది?
ఇప్పటికే సీబీఐ ఈ విషయమై అంతర్గత విచారణకు ఎస్పీ స్థాయి అధికారిని నియమించింది. అయితే కోవిడ్‌ నిబంధనలు, లాక్‌డౌన్‌ తదితర కారణాల వల్ల ఈ విచారణ పూర్తికాలేదని సంస్థ వర్గాలు తెలిపాయి. బంగారం తమ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి మాయమై ఉంటే సీబీఐ వెంటనే చర్యలు తీసుకునేదని, కానీ ఇప్పుడు మాయమైన బంగారం సురానా కంపెనీ లాకర్‌ నుంచి మాయం కావడంతో ఏం జరిగిందో లోతైన విచారణ జరగాలని సీబీఐ అధికారులు చెప్పారు. ఇదే సమయంలో సురానా సంస్థ కోర్టును ఆశ్రయించిందని, తాము ఆదేశించే వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని కోర్టు చెప్పిందని వెల్లడించారు. 2012లో ఈ రైడ్‌లో పాల్గొన్న అధికారులు కొందరు రిటైరయ్యారని, కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో వారిని విచారించడం కుదరలేదని వివరించారు.

బంగారమా? గంజాయా?
వేసిన సీళ్లు వేసినట్లుండగానే బంగారం మాయం కావడంపై విచారించిన హైకోర్టు పలు ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఒకవేళ కోర్టు లేదా సీబీఐ సొంత వాల్టుల(మల్ఖనా) నుంచి చోరీ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకునేవారని హైకోర్టు విచారణలో భాగంగా ప్రశ్నించింది. అదే జరిగితే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించి పోలీసు దర్యాప్తు జరిపేవారని, సదరు పోలీసులు పట్టుకున్న బంగారం 296.66 కిలోలేనని, తప్పుగా 400.47 కిలోలుగా ఎంటర్‌ చేశారని నిర్ధారించేవాళ్లని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ కేసులో ఇంకా ఇలాంటి వాదన రాకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నది. వ్యత్యాసం కొన్ని గ్రాములైతే ఏదో ఒక సమాధానం చెప్పవచ్చని, కానీ వంద కిలోల బంగారం తేడా రావడం ఎలా జరుగుతుందో ఎంత ఆలోచించినా అర్ధం కావడం లేదని, గంజాయి లాగా బంగారం బరువు కాలంతో పాటు తగ్గదని ఘాటు వ్యాఖ్యలు చేసింది.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top