breaking news
in the general election
-
వైఎస్సార్సీపీలో... నూతనోత్తేజం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : సాధారణ ఎన్నికల తర్వాత సోమవారం మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా విస్తృతస్థాయి సమావేశం పార్టీ యంత్రాంగంలో కొత్త ఉత్సాహం నింపింది. సాధారణ ఎన్నికల తర్వాత వివిధ పార్టీల నుంచి ద్వితీయ, తృతీయశ్రేణి నాయకత్వం అధికార పార్టీలోకి వలస పోతున్నా వైఎస్సార్సీపీ కేడర్ చెక్కు చెదరలేదని సోమవారం జరిగిన సమావేశం నిరూపించింది. నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున సమావేశానికి తరలిరావడం ద్వారా జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పురోగతికి అవకాశముందని ముఖ్య నేతలు అంచనాకు వచ్చారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో వివిధ పార్టీలు తమపై మోపిన ‘బదనాం’ నుంచి బయట పడతామనే ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపించింది. ‘సంక్షేమ కార్యక్రమాలకు చిరునామా దివంగత సీఎం వైఎస్. పింఛన్లు, రేషన్ కార్డుల పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటాన్ని చూస్తూ జనం వైఎస్‌ను గుర్తు చేసుకుంటున్నారు. వైఎస్ హయాంలో లబ్ధిపొందిన అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపచేయటంలో ప్రభుత్వ వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఇదే అంశం రాబోయే రోజుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి దోహదం చేస్తుందని’ పార్టీ కీలక నేత ఒకరు వ్యాఖ్యానించారు. ‘కొత్త రాష్ట్రంలో అనేక సవాళ్లు వున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి సహకరిస్తాం. అదే సమయంలో ప్రభుత్వం అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో ఉద్యమిస్తామని’ నేతలు దిగువస్థాయి కేడర్‌కు పార్టీ వైఖరిపై దిశా నిర్దేశం చేశారు. -
కలెక్టరేట్‌ను కుదిపేస్తున్న అక్రమ బదిలీలు!
సాక్షి, సిటీబ్యూరో: తహశీల్దార్ల అక్రమ బదిలీల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. సాధారణ ఎన్నికల అనంతరం జరిగిన ఈ బదిలీల వ్యవహారం కొద్ది రోజులుగా హైదరాబాద్ కలెక్టరేట్‌ను కుదిపేస్తోంది. ఈ వ్యవహారంపై అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌లో ఇప్పటికే ఓ కేసు నడుస్తోండగా తాజాగా మరో పిటిషన్ దాఖలైంది. అమాత్యుల ఒత్తిళ్ల మేరకు గతనెలలో అక్రమ బదిలీలకు తలూపిన జిల్లా ఉన్నతాధికారులకు అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ నుంచి అక్షింతలు తప్పడం లేదు. జిల్లా యంత్రాగం పనితీరును కిందిస్థాయి అధికారులు కొందరు న్యాయస్థానాల్లో సవాల్ చేస్తున్న నేపథ్యంలో.. పాలనావ్యవస్థపై ఉన్నతాధికారులు పట్టుకోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజా కేసులో మూడు వారాల్లోగా కౌంటరు దాఖలు చేయాలని జిల్లా యంత్రాంగాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ఆదేశించింది. అక్రమంగా బదిలీ చేశారంటూ... బండ్లగూడలో పనిచేస్తున్న తనను నిబంధనలకు విరుద్ధంగా చార్మినార్‌కు బదిలీ చేశార ంటూ తహశీల్దార్ అనిల్‌కుమార్ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఈ కేసులో హైదరాబాద్ కలెక్టర్‌ను, భూపరిపాలన విభాగం ముఖ్య కమిషనర్‌ను, ప్రస్తుత బండ్లగూడ తహశీల్దార్‌ను ప్రతివాదులుగా చేర్చారు. ఎన్నికలకు ముందు నుంచి బండ్లగూడ తహశీల్దార్‌గా ఉన్న అనిల్‌కుమార్‌ను ఎన్నికల అనంతరం (వేరొకరికి పోస్టింగ్ ఇచ్చేందుకు) అక్కడి నుంచి కలెక్టరేట్‌కు బదిలీ చేశారు. తనను పక్కకు నెట్టి పైరవీతో వచ్చిన అధికారికి స్థానం కల్పించడాన్ని అనిల్‌కుమార్ అవమానంగా భావించిన ఆయన ట్రిబ్యునల్ ఆశ్రయించినట్టు సమాచారం. అక్రమార్కులపై చర్యలేవీ? ఎన్నికల మాటున జరిగిన అక్రమ బదిలీల విషయమై జిల్లా యంత్రాంగాన్ని అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ త లంటినా, ఉన్నతాధికారులు మాత్రం అక్రమార్కులపై చర్యలు తీసుకోవడం లేదు. ఎన్నికల విధులు ముగించుకొని వచ్చేలోగా తమ స్థానాలను వేరొకరికి అప్పగించడంపై హైదరాబాద్ జిల్లాకు చెందిన ఐదుగురు తహశీల్దార్లు గత జూన్‌లో ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. ఇతర జిల్లాల నుంచి అక్రమంగా వచ్చిన తహశీల్దార్ల ఉత్తర్వులను సస్పెండ్ చేసిన ట్రిబ్యునల్, జిల్లాకు చెందిన తహశీల్దార్లకు వారి పాత స్థానాల్లోనే పోస్టింగ్‌లు ఇవ్వాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఆ ఉత్తర్వులను పట్టించుకోని అధికారులు.. పదవీ విరమణ పొందిన అధికారుల స్థానాల్లో వారిని సర్దుబాటు చేశారు. ఈ వ్యవహారంపై ట్రిబ్యునల్‌లో ఉన్న కేసు ఇంకా కొలిక్కి రాకముందే, తాజాగా చార్మినార్ తహశీల్దార్ పిటిషన్ వేయడం రెవెన్యూ వర్గాల్లో కలకలం సృష్టించింది.