breaking news
gangu bhanumurthy
-
సీఎం ఇచ్చిన హామీ నెరవేర్చాలి
సాక్షిప్రతినిధి, ఖమ్మం: అర్చక ఉద్యో గులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీని రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు అమలు చేయడంలో విఫలమవుతున్నారని అర్చక ఉద్యోగ జేఏసీ కన్వీనర్ గంగు భానుమూర్తి విమర్శించారు. ఈ నెల 10వ తేదీలోగా సీఎం ఇచ్చిన హామీ మేరకు వేతనాలు చెల్లించకపోతే మరోసారి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. గుంటు మల్లన్న దేవస్థాన ఆవరణలో ఖమ్మం జిల్లా అర్చక ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి అర్చక ఉద్యోగుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 5,625 మంది అర్చక ఉద్యోగులకు ట్రెజరీ ద్వారా వేతనాలు చెల్లించాలని గతేడాది సీఎం చెప్పారని గుర్తుచేశారు. కేవలం 738 మందికే డిసెంబర్, జనవరి వేతనాలను సగం ట్రెజరీ నుంచి మిగతా సగాన్ని దేవాలయాల నుంచి తీసుకోవాలని దేవాదాయ అధికారులు చెప్పారని తెలిపారు. సీఎం హామీని నెరవేర్చకపోతే జనవరి 11న కార్యాచరణ ప్రకటించి ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో వివిధ జిల్లాల అర్చక ఉద్యోగ జేఏసీ నేతలు పాల్గొన్నారు. -
నేటి నుంచి అర్చకుల సమ్మె
హైదరాబాద్: తెలంగాణ దేవాదాయ శాఖ దేవాలయాల అర్చక, ఉద్యోగుల సంఘం (తెలంగాణ మతైక అర్చక, ఆలయ ఉద్యోగుల ఐక్యకార్యాచరణ సమితి) గురువారం (ఈ నెల 4) నుంచి తలపెట్టిన సమ్మె యథావిధిగా కొనసాగుతుందని ఐకాస కన్వీనర్ గంగు భానుమూర్తి స్పష్టం చేశారు. తమకు ప్రభుత్వం నుంచి చర్చలకు ఎలాంటి పిలుపు రాలేదన్నారు. డిమాండ్లపై పలుమార్లు వినతులు ఇచ్చినా స్పందించని అధికారులు.. ప్రస్తుతం ఒక వర్గాన్ని చేరదీసి సమ్మెను నీరుగార్చేందుకు చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె.వి. రమణాచారి కొందరితో జరిపిన చర్చలు కుట్రపూరితమని, దాన్ని పూర్తిగా ఖండిస్తున్నట్లు తెలిపారు.