breaking news
G sures Babu
-
తెలుగు భక్తి చానెల్స్‌లో నంబర్. 1 ఎస్వీబీసీ
సాక్షి, తిరుపతి: కరోనా మహమ్మారి ప్రభావంతో ప్రపంచ వ్యాప్తంగా మీడియా రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్తే... శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ( ఎస్వీబీసీ) మాత్రం ఆర్ధిక పరంగా లాభాలను గణిస్తూ విస్తృతమైన రేటింగ్‌తో దూసుకుపోతుంది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైభవం, హిందూ ధర్మ ప్రచారం కోసం 2008లో నాటి ముఖ్యమంత్రి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి టీటీడీ భక్తి ఛానల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో జూలై 7, 2008 వ తేదీన అప్పటి రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ ఎస్వీబీసీని ప్రారంభించారు. సరిగ్గా 13సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఎస్వీబీసీ ఇప్పుడు కరోనా విపత్తును ఒక అవకాశంగా మలుచుకుని శ్రీ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అనూహ్యంగా చానల్ ఆర్థిక పరిపుష్టి వైపు అడుగులు వేస్తోంది. (చదవండి: ఇదీ ఆ ఊరు కథ.. నెల్లి అంటే ఉసిరిక, నెల్లు అంటే వడ్లు!) కరోనా సమయంలో తిరుమల సహా టీటీడీకి చెందిన అన్ని ఆలయాల్లోనూ భక్తులకు దర్శనాలు నిలిపివేశారు. ఈ నేపథ్యంలోనే కరోనా నియంత్రణకు వైద్య రంగం లౌకిక సేవలు అందిస్తే, టీటీడీ ఆధ్యాత్మిక కార్యక్రమాలతో కరోనా నియంత్రణ కోసం శ్రీవారిని ప్రార్థిస్తూ అనేక కార్యక్రమాలు ప్రారంభించింది. వీటినే ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజల్లోకి తీసుకు వెళితే ఎలా ఉంటుందని ఆలోచించింది. ఈ మేరకు టీటీడీ అధికారులు కార్యాచరణ సిద్ధం చేసి అమలు చేశారు. ఈ క్రమంలోనే ఎస్వీబీసీ ఏకధాటిగా 17 గంటల పాటు ప్రత్యక్ష ప్రసారం చేసిన కార్యక్రమం సుందరకాండ సంపూర్ణ అఖండ పారాయణ దీక్షకు వీక్షకులు, భక్తుల నుంచి విపరీతమైన స్పందన వచ్చింది. యూట్యూబ్ లో లైవ్‌లో 10 వేలకు పైగా వ్యూస్ లైక్‌లు రావడంతో భగవద్గీత, విరాట పర్వం, కార్తీక మాస విశిష్టత తదితర కార్యక్రమాలను కూడా ప్రత్యక్ష ప్రసారం చేశారు. దీంతో లక్షల్లో వ్యూస్ రావడంతో తెలుగు ఆధ్యాత్మిక భక్తి చానళ్లలో ఎస్వీబీసీ అగ్రస్థాన్థంలో కొనసాగుతుంది. ఆయా కార్యక్రమాలు చూసిన అనేకమంది భక్తులు ఛానల్‌కు విరాళాలు ఇవ్వడానికి ముందుకొచ్చారు. చానల్‌ను ఆర్థికంగా మంచి లాభల్లో దూసుకుపోవాలనే ఆలోచనతో టీటీడీ ఇందుకోసం ప్రత్యేకంగా ట్రస్ట్ ఏర్పాటు చేసింది. ఈ ఏడాది కాలంలోనే ఎస్వీబీసీకి 31 కోట్ల రూపాయల విరాళాలు అందాయి.. మరో రెండు నెలల్లో రెండు చానెళ్ళు మరో రెండు నెలల్లో హిందీ(ఎస్వీబీసీ–3), కన్నడ(ఎస్వీబీసీ–4) ఛానళ్ళు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ అనుమతి లభించిన వెంటనే ఈ చానళ్లు ప్రారంభించేలా సన్నాహాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఇప్పటికే ఉన్న ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో సేవలు మరింత విస్తరించేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని ఎస్వీబీసీ సీఈవో జి సురేష్‌బాబు సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ వెల్లడించారు. (చదవండి: ఏ ఒక్క రైతు ఇబ్బంది పడకూడదు: సీఎం జగన్) -
నిమజ్జనం
కథ- డా॥జి.సురేశ్ బాబు నేనొస్తున్నానని ఆయనకప్పటికే తెలిసుండటంతో నన్ను చూడంగానే రిజిష్టరు తెరిచి లెక్కలు సరిచూశాడు. ఒక మూగ నమస్కారం చేస్తూ, ఆయన ముందు ఆత్మీయ పరిచయ మందహాసం ప్రదర్శిస్తూ చిన్నపిల్లాడిలా నించున్నాను. వంచిన తల ఎత్తకుండానే సొరుగులోంచి నాలుగొందల రూపాయలు తీసి, నా చేతిలో పెట్టి, నేనెక్కడ సంతకం చెయ్యాలో చూపించాడు. అంతా నిమిషంలో జరిగిపోయింది. ఇంక... ఇక్కడ నాకేం పనిలేదు. ఐనా నా కాళ్లు ఆ దుకాణంలోకి నడిచాయి. ఆయన నన్ను పట్టించుకోవడం ఆపి, అప్పటికే అక్కడ నించుని ఉన్న తన కస్టమర్లకు తన ‘ఎక్స్పెర్ట్’ సలహాల్ని ఇవ్వడం కొనసాగిస్తున్నాడు. ‘‘జయుడు శానా బాగుండాది. ఓ పదివెయ్యనా!’’ ‘‘వొడువని ముచ్చట గూడా కలిపి ఇరవై పక్కన పెట్టుండ్రి.’’ ‘‘జ్యోతిరెడ్డిది చదివిన్రా? శానా కాపీలు పోయినయి.’’ ‘‘ఇంతకుముందు ఇచ్చిన్రు గదా, అవి అట్లనే వున్నై. సూర్యదేవర మాడల్ ఒక్కటి వేసుకోండి’’. ఆయన స్టూల్ ఎక్కకుండానే, కనీసం సరిగ్గా చూడకుండానే పైన అటక షెల్ఫులోంచి ‘మాడల్’ని ఒక్క వేలితో లాగి, టేబిల్పైకి విసిరేడు. అన్ని పుస్తకాల మధ్య నావి ఎక్కడున్నాయో వెదికే ప్రయత్నం చెయ్యబోయి ఇంక బైటకి నడిచాను. మెట్రోరైలు స్తంభాల నిర్మాణం పుణ్యమా అని మట్టిని పీల్చి రుచి చూసే అవకాశం లభిస్తోంది రోజూనూ. పోనీ, హెల్మెట్ పెట్టుకుంటే... మెడనెప్పి; మాస్క్ కట్టుకుంటే కళ్లజోడును మసకబార్చే శ్వాస! గుండెల నిండా ఊపిరి పీలుస్తూ గాడీ కా సవ్వారీ చెయ్యాలంటే ఈ హైదరాబాద్ విడిచి వూరెళ్లిపోవాల్సిందే! కానీ వెళ్లం... వెళ్లలేం. వెళ్తే ఆ ఊపిరికి ఉబుసు పోదు, ఆ స్వేచ్ఛకి గమ్యం ఉండదు. జన్మస్థలం కన్నా కర్మస్థలం గొప్పది కదా. పోం. కిలోమీటరు దూరంలో ఉన్న ఇంకో షాపుకెళ్లాను. నేను పొద్దున్నే ఫోన్ చేసిన విషయం ఇతనికి ఠాక్కున వెలిగింది, నన్ను చూడంగానే. ‘‘రండ్రండి, తీసిపెట్టాను. కాయితం తెచ్చారా?’’ అదీ పలకరింపు. నేను నమస్కారం చేసి ఎలా వున్నారు సార్ అనడిగాను. నా అమ్ముడు పోని పుస్తకాలన్నీ గుట్టలుగా పేర్చి ఉండటం గమనించి, నా మనసు కాసేపు మూగబోవడం గమనించినట్టున్నాడు - ‘‘ఏం చేస్తాం సర్?! మీరు రాయాలి, మేం అమ్మాలి, వాళ్లు కొనాలి. భక్తి పుస్తకాలు రాయగూడదూ?’’ అంటూ ఓదార్చబోయాడు. నా పుస్తకాన్నొకదాన్ని చేతుల్లోకి తీసుకుని ఆప్యాయంగా తడిమి, ‘‘ఇది నా బెస్ట్ వర్క్ సర్. మనిషికి భక్తి ఎందుకు అవసరమో సశాస్త్రీయంగా చెప్పాను. ఏడేళ్లు మార్చి మార్చి రాసి మరీ అచ్చేశాను. పత్రికల్లో రివ్యూ కూడా బాగానే ఇచ్చారు. కానీ కేవలం వంద కాపీలు కూడా అమ్మలేకపోయా’’ వాపోయాను. మొన్నామధ్య... రాజారామ్మోహన్రాయ్ స్కీములో గ్రంథాలయ సంస్థవారికి అర్జీ పెట్టుకున్నాను - ఈ పుస్తకాలు కొంటారేమోనని! ‘‘మీరేం అనుకోనంటే నిజం చెబుతాను. ఇది పాత పుస్తకం కదూ?!’’ నా కళ్లలో నీళ్లు సుళ్లు తిరక్కముందే నా కాళ్లకింద ఉన్న థర్డు ఫ్లోరు కంపించింది. ఇంకా నయం, ‘కాపీ’ అనలేదు. ‘‘ఇలాంటివి పరిశీలనలో రిజెక్టవుతాయి నాయనా’’ అన్నాడతను మళ్లీ. నాకింకేం మాట్లాడాలనిపించలేదు. గబగబా గ్రంథాలయం నుండి ఇంటికి పారిపోయాను - నా ఆత్మాభిమానాన్ని మూసీలోకి తోసుకుంటూ. ఇంటికి రాగానే రెండు పెద్ద అట్టపెట్టెల్లో ఇంకా తాళ్లు విప్పని రెండొందల ‘అవే’ పుస్తకాలు దర్శనమిచ్చాయి. ‘‘ఈ డబ్బాలు తీసుకెళ్తారా? లేకపోతే కప్‌బోర్డుల్లో సర్దెయ్యండి. ఇల్లూడ్వడాన్కి అడ్డమొస్తున్నయ్.’’ ‘‘సార్, సార్! ఎటో ఆలోచిస్తున్నారు! ఇదిగోండి మీ పైసలు...’’ అంటూ మూడొందల అరవై నా చేతిలో పెట్టాడు. ‘‘ఇంకా ఏంటి సార్ సంగతులు! ఏం రాశారు కొత్తగా? పాపం - ప్రతి యేడాదీ ఒక్కసారి కలుస్తారు అసలే!’’ ‘‘ఏం రాయమంటారు?’’ ఎదురు ప్రశ్నించాను. ‘‘పెర్సనాల్టీ డెవలప్మెంట్, భక్తి, వంటలు, కెరీర్...’’ ‘‘కథలు వద్దా?’’ ‘‘అవి పోవట్లేదు సార్!’’ పెదవి విరిచి తనే మళ్లీ ‘‘యండమూరి సారే పబ్లిక్ ఏం చదివే మూడ్‌లో ఉన్నారో కనిపెట్టి అవ్వే రాస్తున్నారు. మీరెంత సార్! మీరు కూడా ట్రెండ్‌ని ఫాలో కండి! వాళ్లకే తప్పట్లేదు!!’’ హితబోధ. నిజానికి, పుస్తకాలు చదివి బాగుపడటం, సిన్మాలు చూసి చెడిపోవటం అనేది ప్రచారంలో ఉంది కానీ, అది అబద్ధం. ఆల్రెడీ ఆ దారిలో ఉన్నవాడికి అవి కాస్త సంతోషమో సలహానో ఇస్తాయనేది నిజం! ‘‘నాకేం రాయాలనిపిస్తే అది మాత్రమే రాయగల అసమర్థుణ్ని’’ నా రెజ్యుమిలోని చిన్న వాక్యం వదిలి బైక్ ఎక్కాను. షట్ అప్ మాన్. నువ్వు రైటర్‌గా అవతరించింది లోకంలోని దీనజనోద్ధరణకి కాదా? కాదు! ఐతే నువ్వు డిస్ క్వాలిఫైడ్. యూ ఆర్ ఫైర్డ్. కొంచెం కూడా నటించడం రాదేం? ‘‘హలో - ఇక్కడెవ్వరూ లేరా?’’ చేతిలో రసీదుతో తలుపుమీద తట్టాను లోనికి పరికించి. ఒక గొంతు సవరింపు శబ్దం వినబడి అటువైపు చూశాను. నేలమీద భోజనం చేసి పక్కనే ఉన్న చెత్తబుట్టలో చెయ్యి కడుక్కుంటూ అతను కనబడ్డాడు. నావైపు తిరిగి ఏంటన్నట్టు చూశాడు. నేను నా కన్సైన్మెంట్ కాయితం చూపించాను. పట్టించుకోనట్టుగా వెనక్కి తిరిగి తన లంచ్ బాక్సును మెల్లిగా సర్దాడు. నాకెందుకో అతను అటు వోనర్ లాగానో ఇటు పనోడిలాగానో అన్పించలేదు. కాసేపటికి అతను లేచి నుంచుని మెల్లిగా నావైపు రావడం మొదలెట్టాడు. ఇంతలో ఒక ముసలావిడ, ‘‘బాబూ ఒక స్కేల్ ఇవ్వు నాయినా, పెద్దది!’’ అంటూ వచ్చి నా పక్కన నుంచుంది. ‘‘ఇది పుస్తకాలమ్మే షాపమ్మా. ఇక్కడ స్కేళ్లు అమ్మరు!’ ’చెప్పాన్నేను. ‘‘పుస్తకాల షాపులో స్కేళ్లు దొరక్కపోతే బట్టల షాపులో దొరుకుతయా?’’ అందావిడ వెటకారంగా. నేను నోర్మూశాను. ఇంతలోఆ షాపతను వచ్చి నాకు దగ్గరగా నుంచుని నా చేతిలోని కాయితం లాక్కొని పరీక్షగా చూశాడు. ఆయన మూతికి ఇందాక తిన్న మెతుకులు అలానే ఉన్నాయి. ‘‘బాబూ, స్కేలు’’ ‘‘ముందుకెళ్లు - ఆ టర్నింగ్లో వుంటై!’’ ‘‘అది చెప్పడాన్కి ఇంతసేప్పట్టిందా?’’ వెళ్లిపోయిందావిడ. నాకు ఠక్కున వెలిగింది - నేనొచ్చి దాదాపు ఇరవై నిమిషాలు. ‘‘సార్, మా వోనర్ వూరెళ్లాడు. రానీకే వారం పడ్తుంది’’ ఇది చెప్పడానికి ఇంకో ఐదు నిమిషాలు! ‘‘మీ రసీదు నెంబరు రాసుకుని ఆయనొచ్చాక...’’ ఇంకా ఏదో సర్దుబాటు వివరణ. నా రసీదు నా చేతికొచ్చింది. అహ, లాక్కున్నాను. ఈ కాయితంతో ఈ షాపుకు గత యేడాది నుండీ నెలకోసారి చొప్పున వచ్చి వాకబు చేసినప్పుడల్లా - రకరకాల జవాబులు, మారే మనుషులు. నాకు రావాల్సిన డబ్బు కేవలం ఆరొందలే. రోడ్డెక్కి నా బైక్ పార్కింగ్ చేసిన ప్రదేశం వైపుకి తిరిగి నడుస్తున్నాను. ఆ సందులో గణపతి విగ్రహాన్ని ట్రాక్టర్లోకి ఎక్కిస్తున్నారు. కొద్ది గంటల్లో ఈయన టాంక్బండ్లో సగం తేలుతూ... మళ్లీ ఏడాదికి ట్రాక్టరెక్కి వస్తాడు! మళ్లీ నిమజ్జనం! వీళ్లే తెస్తారు. వీళ్లే తోస్తారు. నా లోపలి రచయితక్కూడా ఇదే తంతు. ప్రతిసారీ జన్మిస్తాడు, రాస్తాడు... ఇంక రాయకూడదని ఓ గట్టి నిశ్చయానికి వచ్చి, వాణ్ని నిమజ్జనం చేస్తాను. కానీ... నాకు తెలుసు - వాడు మళ్లీ లేస్తాడని!