breaking news
Future strategy
-
ఫ్యూచర్ వీటిదేనా? లాభాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారేనా?
ఇప్పుడు ప్రపంచ కుబేరులు ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేర్లు జెఫ్ బేజోస్, ఎలన్‌మస్క్, జుకర్‌బర్గ్. ఇదే ప్రశ్నకు పదేళ్ల క్రితం వరకు సమాధానం మైక్రోసాఫ్ట్ అధినేత బిల్‌గేట్స్. వ్యాపారంలో రూల్స్ మారుతున్నాయి. సంపద సృష్టికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ స్థానాన్ని టెక్నాలజీ ఆక్రమించింది. దాన్ని నమ్ముకున్న వాళ్లకి కాసులు వర్షం కురిపిస్తోంది. మరీ ఫ్యూచర్ టెక్నాలజీ ఏంటీ.. వేటిపైన పెట్టుబడులు సేఫ్ అనే చర్చ నడుస్తోంది. ఇటీవల స్టాక్ మార్కెట్లోకి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. గణనీయంగా నమోదు అవుతున్న డీమ్యాట్ అకౌంట్లే అందుకు నిదర్శనం. చాలా మంది కొద్ది మొత్తంతో స్టాక్ మార్కెట్లో తమ భవిష్యత్తు ఎలా ఉంటుందో పరిశీలించాలనే ఉత్సాహంతో ఉన్నారు. ఇప్పుడు తక్కువ ధరకు లభించి భవిష్యత్తులో మంచి లాభాలు అందించే స్టాక్స్ ఏంటనే దానిపై వారిలో ఆసక్తి నెలకొంది. 5జీ ఇంటర్నెట్ అనేది ఇప్పుడు నిత్యావసరంగా మారిపోయింది. ముఖ్యంగా మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు అందించే కంపెనీలకు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో 5జీ సర్వీసులు ఆఫర్ చేస్తున్న కంపెనీ స్టాక్‌లు ఫ్యూచర్లో హాట్‌కేకుల్లా మారవచ్చని ట్రేడ్ పండితుల అభిప్రాయం. మన దగ్గర 5జీ ఇంకా అందుబాటులోకి రాకముందే 6జీ టెక్నాలజీ సైతం తెరపైకి వచ్చేసింది. ఈవీలదే రాజ్యమా పెరుగుతున్న పెట్రోలు ధరలు సామాన్యుల పాలిట శాపంగా మారాయి. దీంతో ఎలక్ట్రిక్ వెహికల్స్‌కి మారేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు. ప్రభుత్వం సైతం ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో భవిషత్తులో ఆటో సెక్టార్లో ఈవీ తయారీ కంపెనీల స్టాక్స్ రాకెట్లా దూసుకుపోవచ్చనే అంచనాలు ఉన్నాయి. సంప్రదాయేతర ఇంధనం కర్బణ ఉద్ఘారాలను తగ్గించాలనే డిమాండ్ ప్రపంచ వ్యాప్తంగా రోజురోజుకి పెరుగుతోంది. ఇప్పటికే బొగ్గు వాడకం తగ్గించడంపై దాదాపుగా ఏకాభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో భవిష్యత్తులో కరెంటు ఉత్పత్తి ఎక్కువగా సోలార్, హైడ్రోజన్ టెక్నాలజీలపై జరగవచ్చని అంచనా. ఇప్పటికే రియలన్స్, అదానీ లాంటి బడా కంపెనీలు సంప్రదాయేతర ఇంధన రంగాలపై భారీగా పెట్టుబడులు పెడతామని ప్రకటించాయి. మరిన్ని కంపెనీలు ఈ సెక్టార్‌లోకి రాబోతున్నాయి. ఆర్టిఫిషియల్ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, నానో టెక్నాలజీ రంగంలో అబ్బురపరిచే ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ టెక్నాలజీ సామాన్యులకు ఎక్కువగా అందుబాటులోకి రాలేదు. వచ్చాయంటే ఈ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్న కంపెనీల షేర్లు ఆకాశాన్ని తాకవచ్చనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నియోబ్యాంక్స్ ఫైనాన్షియల్ సెక్టార్లో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆర్థిక అవసరాల కోసం బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఫోన్ వెరిఫికేషన్‌తోనే అప్పులు అందించే సంస్థలు విరివిగా వెలుస్తున్నాయి. ప్రస్తుతం ఈ కంపెనీలన్నీ స్టార్టప్ దశలోనే ఉన్నాయి. అయితే మరో బైజూస్, ఫ్లిప్‌కార్ట్, జోమాటోలుగా మారేందుకు ఈ ఫిన్‌కార్ప్ సంస్థలకు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని మార్కెట్ విశ్లేషకుల అంచనా జాగ్రత్త తప్పనిసరి ఒకప్పుడు ముడి పదార్థాలను ప్రాసెస్ చేసి వస్తువులు తయారు చేసి వాటి అమ్మకాలు జరిపే సంస్థలదే మార్కెట్లో పైచేయిగా ఉండేది. కానీ కంప్యూటర్లు ,ఇంటర్నెట్, స్మార్ట్ఫోన్ల రాకతో పరిస్థితి మారిపోయింది. ఎవరైతే కొత్త టెక్నాలజీని సృష్టిస్తారో, ఎవరైతే దాన్ని సమర్థంగా వాడుతారో వాళ్లపైనే కాసుల వర్షం కురుస్తోంది. దీంతో భవిష్యత్తులో పైన పేర్కొన్న రంగాలకు సంబంధించిన స్టాక్‌లలో పెట్టుబడులు పెడితే గరిష్టంగా లాభాలు పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే పెట్టుబడులు పెట్టేముందు కంపెనీ పని తీరు, భవిష్యత్తు ప్రణాళిక, ఆర్థిక పరిస్థితులు తదితర విషయాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని వారు హెచ్చరిస్తున్నారు. చదవండి: ఇన్వెస్టర్లకు ఐఆర్సీటీసీ షాక్ -
భవిష్యత్ వ్యూహరచనలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిమగ్నం
-
కొత్త జిల్లాలు.. అభివృద్ధి జోన్లు
-
కొత్త జిల్లాలు.. అభివృద్ధి జోన్లు
భవిష్యత్తు వ్యూహంతోనే ఖరారు చేసిన సర్కారు * చిన్న జిల్లా హైదరాబాద్.. పెద్ద జిల్లా కొత్తగూడెం * గిరిజన జిల్లాగా మహబూబాబాద్ * ఆధ్యాత్మిక, ఆలయాల జిల్లాగా యాదాద్రి * ఆదివాసీల జిల్లాగా కొమురం భీమ్ * అటవీ ప్రాంత జిల్లాగా భూపాలపల్లి * కొత్త జిల్లాల్లో కొత్తగా 14 రెవెన్యూ డివిజన్లు సాక్షి, హైదరాబాద్: భవిష్యత్తులో కీలకమైన అభివృద్ధి జోన్లను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల జాబితాను రూపొందించింది. ఆయా ప్రాంతాలకు అనుగుణంగా ప్రజల ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చింది. సౌలభ్యంతోపాటు, సుపరిపాలనకు వీలుగా కసరత్తు చేసింది. తెలంగాణలోని విభిన్న సంస్కృతులు, సంప్రదాయాలతో పాటు వెనుకబడిన ప్రాంతాలు, గిరిజన ప్రాంతాలకు ప్రత్యేకంగా ఉండేలా కొత్త జిల్లాలను రూపొందించింది. గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న మహబూబాబాద్‌ను గిరిజన జిల్లాగా, మంచిర్యాల కేంద్రంగా ఏర్పాటు చేసే కొమురం భీమ్ జిల్లాను ఆదివాసీ జిల్లాగా, భూపాలపల్లిని అటవీ ప్రాంత జిల్లాగా గుర్తించింది. దేవాలయాలతో కూడిన ఆధ్యాత్మిక జిల్లాగా యాదాద్రిని రూపొందించింది. వెనుకబడిన ప్రాంతాల జిల్లాలుగా వనపర్తి, నాగర్‌కర్నూల్‌లను చేర్చింది. కాకతీయుల తొలి రాజధానిగా చారిత్రక ప్రాధాన్యమున్న హన్మకొండను, హైదరాబాద్‌ను హెరిటేజ్ జిల్లాలుగా గుర్తించనుంది. పారిశ్రామిక సెజ్, ఐటీ కారిడార్‌గా అభివృద్ధి చెందుతున్న శంషాబాద్‌కు ఆర్థిక వనరుల కేంద్రంగా ప్రాధాన్యమిచ్చింది. వీటితో పాటు జాతీయ రహదారులపై ఉన్న పట్టణాలను జిల్లా కేంద్రాలుగా మారిస్తే.. శరవేగంగా అభివృద్ధి చెందుతాయని సీఎం భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాలకు ఉన్న ప్రధాన రహదారుల వెంట ఉన్న పట్టణాలకు ప్రాధాన్యమిచ్చారు. ఈ క్రమంలోనే కామారెడ్డి, సిద్ధిపేట, పెద్దపల్లి, వికారాబాద్, మెదక్‌లను జిల్లా కేంద్రాలుగా ప్రతిపాదించారు. తక్కువ జనాభా జిల్లా భూపాలపల్లి ముఖ్యమంత్రి ఆమోదించిన 27 జిల్లాలకు సంబంధించిన విస్తీర్ణం, జనాభా, వాటిలో మండలాల సంఖ్యను ప్రభుత్వం ఖరారు చేసింది. విస్తీర్ణపరంగా చూస్తే కొత్తగూడెం పెద్ద జిల్లాగా, హైదరాబాద్ చిన్న జిల్లాగా నిలవనున్నాయి. 8,044.87 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో కొత్తగూడెం జిల్లా ఉండనుంది. తర్వాత స్థానంలో మంచిర్యాల (కొమురం భీమ్) జిల్లా ఉంది. కేవలం 174.63 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో హైదరాబాద్ అతి చిన్న జిల్లాగా ఉండనుంది. అతి తక్కువ జనాభా ఉండే జిల్లాలుగా భూపాలపల్లి, నిర్మల్, పెద్దపల్లి ఆవిర్భవించనున్నాయి. కేవలం 6.95 లక్షల జనాభాతో ఆచార్య జయశంకర్ (భూపాలపల్లి) జిల్లా ఏర్పాటు కానుంది. 7.09 లక్షల జనాభాతో నిర్మల్, 7.37 లక్షల జనాభాతో పెద్దపల్లి, 7.54 లక్షల జనాభాతో మహబూబాబాద్ జిల్లాలు ఏర్పడనున్నాయి. హైదరాబాద్ జిల్లా అత్యధికంగా 39.43 లక్షల జనాభాతో అగ్రస్థానంలో ఉంటుంది. కొత్త జిల్లాల్లో ఉండే అన్ని ప్రాంతాలు జిల్లా కేంద్రానికి వీలైనంత దగ్గరలో ఉండేలా కసరత్తు చేయడంతో... మండలాల సంఖ్య సైతం జిల్లాకో తీరుగా మారింది. అతి తక్కువగా ఏడు మండలాలతో మల్కాజ్గిరి జిల్లాను, అత్యధికంగా 26 మండలాలతో నల్లగొండ జిల్లా ఏర్పాటుకానున్నాయి. యాదాద్రిలోనే జనగాం జనగాం ప్రాంతాన్ని యాదాద్రి జిల్లాలోనే కలిపేలా కొత్త ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. తొలుత హన్మకొండ కేంద్రంగా ఏర్పడే జిల్లాలో జనగాంను కొనసాగిస్తారనే ప్రచారం జరిగింది. కానీ హన్మకొండ జిల్లాలో వరంగల్ పశ్చిమ, స్టేషన్ ఘన్పూర్, హుజూరాబాద్ నియోజకవర్గాలతో పాటు వర్ధన్నపేటలోని రెండు మండలాలు, హుస్నాబాద్‌లోని రెండు మండలాలు కలిపేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీంతో యాదాద్రి జిల్లాలో మార్పులేమీ చోటు చేసుకోలేదు. కొత్తగా తెరపైకి వచ్చిన పెద్దపల్లిలో పెద్దపల్లి, మంథని, రామగుండం నియోజకవర్గాలుండేలా కసరత్తు చేశారు. మంథని నియోజకవర్గంలోని కొన్ని మండలాలను భూపాలపల్లి జిల్లాలో కలుపనున్నారు. నిర్మల్ జిల్లాలో ముథోల్, నిర్మల్ నియోజకవర్గాలతో పాటు ఖానాపుర్లోని ఒక మండలాన్ని కలుపనున్నారు. ఆగమేఘాలపై ఆఖరి కసరత్తు కొత్త జిల్లాల సంఖ్య ఖరారవడంతో వాటి నైసర్గిక స్వరూపం, సరిహద్దులపై రాష్ట్ర ప్రభుత్వం తుది కసరత్తు చేస్తోంది. ముసాయిదా నోటిఫికేషన్లో పొందుపరిచేందుకు వీలుగా కొత్త జిల్లాలకు సంబంధించిన అన్ని వివరాలను సిద్ధం చేస్తోంది. కొత్త జిల్లాల స్వరూపం, జనాభా, ఏయే మండలాలు అందులో చేరుతాయనే వివరాలను క్రోడీకరిస్తున్నారు. భౌగోళిక స్వరూపం సరిహద్దులను నిర్ధారించుకొని అందుకు అనుగుణంగా మ్యాప్‌లను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర, సీసీఎల్ఏ రేమండ్ పీటర్ గురువారం ఉదయం నుంచి రాత్రి వరకు ఇదే కసరత్తు చేశారు. తొలుత ఉదయాన్నే సచివాలయంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన సీఎస్... ఆ వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కొత్తగా హన్మకొండ, పెద్దపల్లి, శంషాబాద్, మల్కాజ్గిరి జిల్లాలు తెరపైకి రావడంతో.. అప్పటికే ప్రతిపాదనల్లో ఉన్న జిల్లాల స్వరూపం మార్చాల్సి ఉంటుందని, దీనిపై తుది కసరత్తు జరుగుతోందని అధికార వర్గాలు వెల్లడించాయి. కొత్తగా 14 రెవెన్యూ డివిజన్లు కొత్త జిల్లాలతో పాటు కొత్తగా 14 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆ జిల్లాల పరిధిలోకి వచ్చే మండలాలను చేర్చి ఈ డివిజన్లలను ఏర్పాటు చేయనున్నారు.