breaking news
The foundation stone of the capital
-
బాబు పాలన విమాన ప్రయాణాలతోనే సరి
సొంతింటి కార్యక్రమంలా రాజధాని శంకుస్థాపన సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల ధ్వజం మంగళగిరి రూరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన మొత్తం ఇతర దేశాలకు విమానాల్లో తిరగడానికే సరిపోతోందని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు విమర్శించారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఆదివారం తెనాలి డివిజన్ శాఖ కార్యదర్శుల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు రాజధాని నిర్మాణ శంకుస్థాపన కార్యక్రమాన్ని సొంత ఇంటి కార్యక్రమంగా మార్చారని ఆరోపించారు. రాజధాని అమరావతి అయిదుకోట్ల ఆంధ్రుల సొత్తు అని చెప్పారు. కానీ రాజధానిని ముఖ్యమంత్రి తన సొంత సొత్తులా మార్చారని దుయ్యబట్టారు. ప్రధాని నరేంద్ర మోదీని శంకుస్థాపన కార్యక్రమానికి ఆహ్వానిస్తే గుప్పెడు మట్టి, మురికి నీళ్లు తెచ్చారని, చంద్రబాబు అదేదో మహా ప్రసాదంలా స్వీకరించడం హాస్యాస్పదంగా వుందన్నారు. సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్, నాయకులు జెల్లి భాగ్య శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్దండరాయునిపాలెంలో సందడే సందడి
రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో సందర్శకుల తాకిడి సెల్ఫీలు, ఫొటోలతో సందడి 3 వేదికలు, 2 వేల సోఫాలు, 29 వేల కుర్చీలకు ఏర్పాట్లు లక్షమంది కూర్చునేందుకు వీలుగా టెంట్లు {పభుత్వ సలహాదారు పరకాలకు వివరించిన అధికారులు విజయవాడ బ్యూరో : అమరావతి రాజధాని శంకుస్థాపన కోసం ఒకపక్క శరవేగంగా ఏర్పాట్లు జరుగుతుండగా, ఆ జ్ఞాపకాలను పదిలంగా దాచుకునేందుకు పలువురు ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్దండరాయునిపాలేనికి సందర్శకుల తాకిడి మొదలైంది. ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రత్యేకంగా పలు ప్రాంతాల నుంచి కార్లపై కుటుంబసమేతంగా వచ్చిన చాలా మంది అక్కడ సరదాగా గడిపారు. యువతీ యువకులు బైక్‌లపై వచ్చి సెల్ఫీలు తీసుకున్నారు. శంకుస్థాపన జరిగే ప్రాంతం, ప్రత్యేకంగా సభావేదిక పనులు జరుగుతున్న ప్రాంతాల్లో సెల్ఫోన్లు, చిన్న కెమెరాలతో ఫొటోలు దిగారు. పలు కుటుంబాలు తమ వెంట తెచ్చుకున్న కేక్‌లు కట్ చేసుకుని తింటూ సరదాగా గడిపారు. అలాగే హైదరాబాదులోని నవభారత్ బ్యాంకులో తొమ్మిదేళ్లపాటు సేవలు అందించిన ఓ ఉద్యోగికి ఆ యాజమాన్యం ప్రత్యేకంగా శంకుస్థాపన ప్రాంతంలో జ్ఞాపిక అందజేయడం విశేషం. సమయం సమీపిస్తోంది.. వేగం పెంచండి : పరకాల అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన సమయం దగ్గరపడుతోందని, ఏర్పాట్లు వేగంగా పూర్తి చేయాలని ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. శంకుస్థాపన ప్రాంతంలో జరుగుతున్న వేదిక, ఇతర ఏర్పాట్లను ఆదివారం రాత్రి ఆయన పరిశీలించారు. సీఆర్డీఏ డెరైక్టర్ చెన్నకేశవరావు, అధికారులను ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. మూడు వేదికలు సిద్ధం చేస్తున్నామని, అందులో ఎత్తుగా నిర్మించిన వేదికను ప్రధాన అతిథులకు సిద్ధం చేస్తున్నామని చెన్నకేశవరావు వివరించారు. మిగిలిన రెండు వేదికలు సాంస్కృతిక కార్యక్రమాలు, అనౌన్స్మెంట్లకు కేటాయించనున్నట్లు చెప్పారు. వేదిక ఎదురుగా రెండువేల సోఫాలు, ఆరువేల సౌకర్యవంతమైన కుర్చీలు, 23 వేల ప్రత్యేక కుర్చీలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పబ్లిక్ గ్యాలరీలో లక్షమందికి పైగా కూర్చునేలా రెయిన్ అండ్ సన్ఫ్రూఫ్ ప్రత్యేక టెంట్లు వేస్తున్నట్టు వివరించారు. వేదిక, టెంట్లు తదితర ఏర్పాట్ల మ్యాప్‌లను పరిశీలించిన పరకాల మట్టి, కాంక్రీట్ పనులను త్వరితగతిన పూర్తిచేసి అప్పగిస్తే వేదిక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుందని చెప్పారు. వేదిక ఏర్పాట్లు పూర్తయితే ఈ నెల 19, 20, 21 తేదీల్లో వాటిపై రిహార్సల్స్ పూర్తిచేసి పరీక్షించనున్నట్లు తెలిపారు. పరకాల ముంగిటే పేచీ.. ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ సమక్షంలో ఆ ప్రాంత రైతులు పేచీ పడ్డారు. తమను విస్మరిస్తున్నారంటూ లింగాయపాలేనికి చెందిన రైతు అనుమోలు సత్యనారాయణ పరకాల వద్ద వాపోయారు. అనంతరం అక్కడికి చేరిన రైతులను ఆ ప్రాంతానికి చెందిన పలువురు పరిచయం చేస్తుండగా మా ఖర్మ ఇలా తగలడిపోయింది, భూములు త్యాగాలు చేసిన రైతుల్ని ఎవరెవరో పరిచయం చేయాల్సి వస్తోందంటూ అనుమోలు సత్యనారాయణ ఘాటుగా వ్యాఖ్యానించడంతో స్థానిక టీడీపీ నేతలు ఆయనపై వాగ్వాదానికి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని వారిని సముదాయించారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఎంపీ రాయపాటి సాంబశివరావు ఆదివారం రాత్రి ఆ ప్రాంతాన్ని సందర్శించారు.