breaking news
firstaid
-
పిడుగు శబ్ధం
ఇంద్రకీలాద్రి: దుర్గగుడి ఘాట్ రోడ్డులో ఓ భక్తురాలు ఆకస్మిక పిడుగు శబ్ధానికి షాక్‌తో తల్లడిల్లింది. వివరాల్లోకి వెళ్తే... శుక్రవారం మహాలక్ష్మీదేవి అలంకరణలో వెలసిన అమ్మవారి దర్శనానికి పెద్దఎత్తున భక్తులు తరలివచ్చారు. అప్పటి వరకు ఎండగా ఉన్న వాతావరణం ఒకసారిగా మేఘాలు కమ్ముకుని చినుకులతో వర్షం మొదలైంది. ఇంతలో పెద్దశబ్ధంతో సీతమ్మ వారి పాదాల వద్ద సబ్‌స్టేçÙన్పై పిడుగు పడింది. ఆ భీకర శబ్దానికి క్యూలైన్లో ఉన్న ఓ యువతి షాక్‌కు గురై కింద పడిపోయింది. పొంగలి షెడ్డు వద్ద ఉన్న ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ప్రేమ్ వెంటనే తేరుకుని తన రెండు చేతులపై ఆ యువతిని ఎత్తుకుని పరుగు పరుగున ఆలయ ప్రాంగణంలోని వైద్య శిబిరానికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించినప్పటికీ ఆమె ఇంకా ఆందోళనలో ఉండటంతో దేవస్థాన ఆంబులెన్స్‌లో ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువతికి సకాలంలో ప్రథమ చికిత్స అందేలా చేసిన సెక్యూరిటీ గార్డు ప్రేమ్‌ను అందరూ అభినందించారు. -
బతికుండగానే శ్మశానానికి తరలించారు
–తిరుమలలో వ్యాధిగ్రస్తుడిని మూటకట్టి శ్మశానంలో వదిలిపెట్టిన టీటీడీ ఔట్సోర్సింగ్ సిబ్బంది –సీఐ వెంకటరవి సహకారంతో –అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించి వైద్యసాయం –తమకు సంబంధం లేదని తేల్చిన హెల్త్ అధికారులు – నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామంటున్న సీఐ సాక్షి,తిరుమల: మానవసేవే మాధవ సేవగా సేవలందించాల్సిన టీటీడీ సిబ్బంది ఏడుకొండల వెంకన్న సాక్షిగా మానవత్వాన్ని మంట కలిపారు. ఆలయానికి కూతవేటుదూరంలోనే బతికుండగానే ఓ వృద్ధుడిని శ్మశానానికి తరలించిన ఘటన సోమవారం తిరుమలలో జరిగింది. పోలీసుల సహకారంతో అతన్ని ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించారు. ఆయననెవరు ? l మహారాష్ట్రలోని శిరిడీ క్షేత్రానికి 20 కిలోమీటర్లదూరంలోని కోపర్గావ్ పట్టణానికి చెందిన ప్రీతమ్ శివాజి బోస్లే (75). శ్రీవారి దర్శనానికి వచ్చాడు. అనారోగ్యంతో కొన్ని రోజులుగా తిరుమలలోనే బతుకుబండిని లాగిస్తున్నాడు. అతని ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆలయానికి కూతవేటు దూరంలోని ∙ రాంబగీచా అతిథిగృహం వద్ద భక్తులు, స్థానికులు ఇచ్చిన ఆహారాన్ని తిని బతుకుతున్నాడు. ఆరోగ్యం క్షీణించటంతో నడవలేని స్థితిలోకి చేరుకున్నాడు. దీంతో అతను నిద్రించే ప్రాంతంలో చీమలు పట్టి, రక్తం, నెత్తురు కారే స్థితిలో దుర్వాసన మధ్య అతను కాలాన్ని సాగిదీశాడు. బతికుండగానే శ్మశానానికి తరలింపు నడవ లేని స్థితిలో మూలుగుతున్న ఆ వృద్ధుడిని టీటీడీ పారిశుద్ధ్య ఔట్సోర్సింగ్ సిబ్బంది సోమవారం చూసారు. చీము, నెత్తురు కారుతూ కనిపించిన ఆయన పరిస్థితి చూసి ఒకటి రెండు రోజుల్లోనే మరణించే అవకాశం ఉందని భావించినట్టున్నారు. మరణించిన తర్వాత కంటే ముందే తీయటం సులభమనే ఉద్దేశంతో భావించినట్టున్నారు. టీటీడీ హెల్త్ అధికారులకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా సొంత నిర్ణయం తీసుకున్నారు. చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించే లారీ తీసుకొచ్చారు. ఓ ప్లాస్టిక్ సంచిలో అతన్ని మూటకట్టారు. లారీలో వేసుకుని ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలోని శ్మశానంలో మూటగా దింపి సమాధులు మధ్య వదిలిపెట్టి వచ్చేశారు. సీఐ వెంకటరవి సహకారంతో 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలింపు ప్రాణాలతో బతికున్న వృద్ధుడిని మూటకట్టి చెత్తలారీలో ఎక్కించటాన్ని అక్కడి ట్యాక్సీ సిబ్బంది చూసి మీడియాకు సమాచారం ఇచ్చారు. దీంతో కొందరు మీడియా సిబ్బంది శ్మశానంలోకి వెళ్లి చూడగా మూటలో మూలుగుతున్న వృద్ధుడిని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సీఐ వెంకటరవి తక్షణమే శ్మశానానికి చేరుకుని మూటవిప్పి బాధితుడిని రక్షించే చర్యలు ప్రారంభించారు. బిస్కెట్లు, నీటి బాటిల్ తెప్పించడంతో వాటిని స్వీకరించి బాధితుడు ఆకలి తీర్చుకున్నాడు. నడవలేని స్థితిలోని బా«ధితుడిని 108 అంబులెన్స్‌లో స్థానిక అశ్విని ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స చేశారు. బాధితుడు కుష్టువ్యాధి గ్రస్తుడని వైద్యులు తెలిపారు. తర్వాత అతన్ని తిరుపతిలోని రుయా ఆస్పత్రి లెప్రసీవార్డుకు తరలించి వైద్యం చేయించారు. ఇదిలా ఉండగా ఈ ఘటనకు తమకు ఎలాంటి సంబంధం లేదని సంబంధిత టీటీడీ హెల్త్ అధికారులు స్పష్టం చేశారు. తమ సిబ్బంది ఎవ్వరిని లారీలో శ్మశానానికి తరలించలేదని వివరణ ఇచ్చినట్టు సీఐ వెంకటరవి మీడియాకు తెలిపారు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, సీసీ పుటేజీ ద్వారా నిందితులు గుర్తించి చర్యలు తీసుకుంటామన్నారు.