కమ్మగా కడుపుకింత కరెంటు ఫుడ్డు
షడ్రషోపేతమైన భోజనం తిన్నా.. మన శరీరానికి ఒంటబట్టేది మాత్రం కాసిన్ని కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, ప్రొటీన్లే! అంతేనా? మరి ఈ మాత్రానికి బోలెడంత శ్రమకు ఓర్చి వ్యవసాయం చేయాలా? అవసరం లేదంటున్నారు ఫిన్లాండ్కు చెందిన శాస్త్రవేత్తలు. వ్యవసాయం లేకపోతే రుచి మాట దేవుడెరుగు.. అసలు జీవుడు బతికి ఉండేదెలా అంటే.. మేమున్నాం కదా.. ఎంచక్కా కాస్త కరెంటు.. కొంచెం కార్బన్‌డైయాక్సైడ్.. మరికాసిన్ని బ్యాక్టీరియాతో ఒంటికి కావాల్సిన ప్రొటీన్లను తయారు చేసి ఇచ్చేస్తామంటున్నారు వీళ్లు. ఏం..? నమ్మబుద్ధి కావడం లేదా? అయితే పక్క ఫొటో చూడండి. అందులోని చెంచాలో ఉందే.. అది ఇలా తయారైన ప్రొటీనే! కొంచెం ఇబ్బందిగా అనిపించవచ్చుగానీ.. ఇది భలే రుచిగా ఉంటుందట.. పైగా పోషకాలూ ఎక్కువే. ‘ఫుడ్ ఫ్రం ఎలక్ట్రిసిటీ’ అనే ప్రాజెక్టు కింద లాప్పీన్రాంటా టెక్నాలజీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు గత ఏడాది ఆగస్టు నుంచి ఈ కృత్రిమ ప్రొటీన్ తయారీ ప్రయత్నాల్లో ఉన్నారు. ఓ బయోరియాక్టర్‌లోకి కాసిన్ని నీళ్లు, బ్యాక్టీరియా, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్పరస్ వంటివి వేయడం.. దాంట్లోకి కరెంటుతోపాటు కార్బన్‌డైయాక్సైడ్ వాయువును పంపడంతో ప్రొటీన్ తయారీ ప్రక్రియ మొదలవుతుంది.
విద్యుత్తు కారణంగా నీటి నుంచి హైడ్రోజన్ విడుదలైతే.. బ్యాక్టీరియా ఇతర పదార్థాలను వాడుకుని ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ రసాయన చర్యలన్నింటి ఫలితంగా చివరకు పొడిలాంటి సింగల్ సెల్ ప్రొటీన్ తయారవుతుంది. ఉత్పత్తి అయిన పదార్థంలో 50 శాతం వరకూ ప్రొటీనే.. ఇంకో పాతికశాతం కార్బొహైడ్రేట్లు కూడా ఉంటాయి దీంట్లో. మిగిలినది కొవ్వులు, న్యూక్లియిక్ యాసిడ్లు. వాడే బ్యాక్టీరియాను మార్చడం ద్వారా తుది ఉత్పత్తిలోని అంశాల మోతాదుల్లో మార్పులూ చేయవచ్చు. ప్రస్తుతం ఒక గ్రాము ప్రొటీన్ తయారు చేసేందుకు రెండు వారాల సమయం పడుతోందని.. కాఫీకప్పు సైజుండే బయో రియాక్టర్ స్థానంలో పెద్దది వాడటం.. కొన్ని మార్పులు చేర్పులు చేయడం ద్వారా దీన్ని పదిరెట్లు ఎక్కువ సమర్థంగా తయారు చేయవచ్చునని అంటున్నారు.. ఫిన్లాండ్ టెక్నికల్ రీసెర్చ్ సెంటర్‌కు చెందిన జూహా పెక్కా పిట్క్నీన్. ఈ బయో రియాక్టర్ ఇప్పటికిప్పుడు మనుషుల కోసం వాడకున్నా.. సమీప భవిష్యత్తులో పాడిపశువులకు, కోళ్లు ఇతర పౌల్ట్రీ జంతువులకు ఆహారాన్ని అందించేందుకు వాడుకునేందుకు మాత్రం అవకాశముంది.
– సాక్షి నాలెడ్జ్ సెంటర్